
93 వసంతాల ‘భక్త ప్రహ్లాద’
సమాజంపై అమితంగా ప్రభావితం చూపుతున్న మాధ్యమం సినిమా! అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ఇప్పటికి 93 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం శ్రీకారం చుట్టుకుంది. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది.
అంతకు ముందు దాకా భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు) వచ్చేవి. 1931 మార్చి 14న తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలతో క్రమంగా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే,
‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ తీశారు! ఆ ‘కాళిదాస్’ కేవలం 4 రీళ్ళ లఘు చిత్రం. నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, పాటలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! తీరా పూర్తిగా తెలుగు డైలాగులతో తీసిన ఆ ‘కాళిదాస్’ చిత్రం నిడివి తక్కువైంది. దాంతో ‘కాళిదాస్’ ఫిల్ముకు ముందు 3 రీళ్ళ తమిళ దేశభక్తి గీతాలు – ప్రణయ గీతాలు – తెలుగు త్యాగరాయ కీర్తనల లఘుచిత్రం జోడించారు. అలాగే ‘కాళిదాస్’ ఫిల్మ్ తర్వాత 2 రీళ్ళ తమిళ కురత్తి (కురవంజి) డ్యాన్స్ లఘు చిత్రాన్ని కలిపారు.
అలా మొత్తం మూడు చిన్న నిడివి చిత్రాలనూ కలిపి, ఒకే కదంబ కార్యక్రమ ప్రదర్శన (ప్రోగ్రామ్)గా ‘కాళిదాస్’ అనే టైటిల్‌తోనే రిలీజ్ చేశారు. అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు దర్శక – నిర్మాతలు అప్పట్లో తెలివిగా ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు.
అయితే, మొత్తం తెలుగు డైలాగుల ‘కాళిదాస్’ చిత్రాన్ని తెలుగువాళ్ళం వదిలేస్తే, అది తమ తొలి టాకీ అంటూ తమిళులు దాన్ని తమ చరిత్రలో కలిపేసుకోవడం విడ్డూరం. మరుగునపడ్డ ఈ వాస్తవాలన్నీ జర్నలిస్టు, పరిశోధకుడు రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, ఆ చిత్ర హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆ సినిమా సమీక్ష, పాటల పుస్తకం తదితర సాక్ష్యాలతో ఆ మధ్య నిరూపించారు.
అప్పట్లో ‘కాళిదాస్’ విజయవంతం కావడంతో, పూర్తి నిడివి తెలుగు చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఏకంగా 10 రీళ్ళ తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకొచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 93 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ తేదీని కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా
దినోత్సవం’గా చేస్తున్నారు.
మన ‘భక్త ప్రహ్లాద’ కేవలం 18 వేల రూపాయలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు.
తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోనే కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అక్కడ రెండు వారాలు ఆడాక, అటుపైన తెలుగు నేల పైకొచ్చింది. విజయవాడ (శ్రీమారుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది.
అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటి, అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా వెళ్లింది. ఇలా మన ఘన చరిత్ర అప్రతిహతంగా సాగడం అందరికీ గర్వకారణం.
Comments
Please login to add a commentAdd a comment