84 వసంతాలు | Bhakta Prahlada telugu talki movie 84 years | Sakshi
Sakshi News home page

84 వసంతాలు

Published Fri, Feb 5 2016 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

84 వసంతాలు

84 వసంతాలు

సందర్భం: తెలుగు సినిమా పుట్టినరోజు

కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ - ఇలా అన్నిటిపైనా తనదైన ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు. సినీప్రియులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు చలనచిత్రం ‘భక్తప్రహ్లాద’ 84 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది.
 
సినిమా అంటే ఒకప్పుడు భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు). తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదల కావడంతో ఆ యా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలో, ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ! ప్రధానంగా తమిళ మాటలు - పాటలు, కొంత తెలుగు మాటలు, పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’.

ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే!
 
నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘కాళిదాస్’ కన్నా ముందే, 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధార రహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే ప్రారంభించడం మొదలై, ఇవాళ్టితో 84 ఏళ్ళు పూర్తయ్యాయి.
 
మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు.

అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్‌లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెర మీద బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆద్యంతం మాట్లాడడం విడ్డూరమైంది.

దాంతో, ఈ టాకీ విడుదల హంగామా సృష్టించింది. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగు నాట అప్రతిహతంగా సాగుతూనే ఉంది. కాకపోతే, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే తప్ప సినిమా ప్రింటే లేకుండా పోయింది. పోయినవెలాగూ పోగా, ఇప్పటి కైనా మన సినీపెద్దలు, తెలుగు ప్రభుత్వాధి నేతలు కళ్ళు తెరిచి, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన 1930-40ల నాటి కొద్దిపాటి తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా?!  
 
తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’
దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి
చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో
సినిమా నిడివి: 9,762 అడుగులు
సెన్సారైంది: 1932 జనవరి 22న, సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6, బొంబాయిలో కృష్ణథియేటర్
 
ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు, తల్లి లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, తండ్రి హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య
 
ప్రజల్లోని మార్పులకు ప్రతిబింబం ఇది!
- ఎ. రమేశ్ ప్రసాద్, ప్రసాద్స్ సంస్థల అధినేత

‘‘తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ - మూడింటిలోనూ నటించిన, పనిచేసిన అరుదైన ఘనత మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్‌ది. ఆయన, నేను, మా కుటుంబ సభ్యులం ‘ప్రసాద్’ సంస్థ ద్వారా ఫిల్మ్ ప్రింటింగ్, ప్రాసెసింగ్, రికార్డింగ్ వగైరా అన్నిటా ముందుండి, పరిశ్రమ పురోగతికి తోడ్పడ్డాం. ఈ 84 ఏళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది.

ఒక్క మాటలో, ప్రజల వైఖరిలో వస్తున్న మార్పుల్ని సినిమాల్లో చూడవచ్చు. విలువలు, కథలు మారాయి.నిర్మాణం, పోటీ పెరిగాయి. ఫిల్మ్ పోయి డిజిటలొచ్చింది. ఎంత టెక్నాలజీ వచ్చినా నాన్న గారన్నట్లు ప్యాషన్, పేషెన్స్ (సహనం), పర్‌సెవరెన్స్ (నిరంతర శ్రమ), అందరి మంచి కోరే ప్యూరిటీ ఆఫ్ థాట్ - ఈ నాలుగు ‘పి’లుంటే ముందుకెళతాం!’’
 
డబ్బు సంపాదనే ధ్యేయమైతే ఎలా?
- దాసరి నారాయణరావు, దర్శక,నిర్మాత  

‘‘దాదాపు 50 ఏళ్ళుగా తెలుగు సినిమాతో కలసి నడిచే అదృష్టం నాకు కలిగింది. మనందరం దృష్టి పెట్టాల్సిన కొన్ని ప్రతి కూల అంశాలు చెబుతా. ఒకప్పుడు సిని మాలు కొద్ది రోజుల్లో, తక్కువ బడ్జెట్‌లో తయారయ్యేవి. అప్పటితో పోలిస్తే, ఇప్పుడెంతో టెక్నాలజీ వచ్చింది. కానీ, దాన్ని వాడుకొనే నైపుణ్యం ఉందా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. కమిట్‌మెంట్, కళ పట్ల గౌరవం తగ్గి ఇవాళ సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ అని పొరపడుతున్నాం.

నిజానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌లో సినిమా భాగమే తప్ప, సినిమానే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. అలాగే, ఎంతో శక్తిమంతమైన మీడియా అయిన సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. డబ్బులు సంపాది స్తూనే, సమాజానికి అద్దం పట్టే సినిమాలు కొన్నేళ్ళ క్రితం దాకా వచ్చేవి. కానీ, ఇవాళ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమా ద్వారా అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపించడం లాంటివే చూపిస్తు న్నాం.

అదేమంటే, ‘ఇదేనండీ ట్రెండ్’ అంటున్నాం. జనానికి మనం ఏది చూపించి, అలవాటు చేస్తే అదే చూస్తారు. కాబట్టి వాళ్ళను తప్పు పట్టకూడదు. గమనిస్తే ఇప్పుడు చాలామంది మంచి టెక్నీషి యన్లు, నటులు వస్తున్నారు. కానీ, వారి ప్రతిభకు సరైన దోవ లేక పక్కదారి పడుతోందేమోనని నా అనుమానం, బాధ.’’
 
కథ అదే..! టెక్నిక్కే మారుతోంది!
- డి. సురేశ్‌బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు  

‘‘మా నాన్న గారు డి. రామానాయుడు, మా కుటుంబం కలసి 50 ఏళ్ళపైగా సినీరంగం లోనే కృషి చేయడం అదృష్టం. సినిమా అంటే అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నిక్ వాడి, వెండితెరపై కథ చెప్పడం! నవ్వు, ఏడుపు లాంటి ప్రాథమిక ఉద్వేగాలు, కథ ఒకటే. వాడే టెక్నిక్, చెప్పే విధానం కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు జానపదాల్లో మినియేచర్లు వాడితే, ఇప్పుడు ‘బాహుబలి’కి గ్రాఫిక్స్, యానిమేషన్, డిజిటల్ ఎఫెక్ట్స్ వాడుతున్నాం. అప్పట్లో కొన్ని కోవల సిన్మాలే ఉండేవి.

ఇప్పుడు రొమాంటిక్ కామెడీ, హార్రర్, క్రైమ్ ఇలా రకరకాల కోవల ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. వచ్చేరోజుల్లో సిని మాల్ని చూసే వేదికలు, విధానమూ మారతాయి. హాళ్ళు, టీవీల్లోనే కాక కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లలో సినిమాలు చూడడం పెరుగుతుంది. రోజులోని సమయాన్ని బట్టి చూసే వేర్వేరు రకాల సినిమాలు వస్తాయి.’’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement