
సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించాం
పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశం
సీఎంను అభినందించేందుకు అపాయింట్‌మెంట్ కోరాం: అల్లు అరవింద్
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్‌మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు.