కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం
ఏపీలో కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి తేడా
రెచ్చిపోయి దారుణ వ్యాఖ్యలు చేసిన జనసేన, టీడీపీ నేతలు
అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. అన్న ఎమ్మెల్యే బొలిశెట్టి
ఎక్స్ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎద్దేవా
నువ్వు ఒక కమెడియన్ అన్న చలమలశెట్టి రమేష్ బాబు
పుష్ప–2 అడ్డుకుంటామని హెచ్చరికలు
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందనపై సినీ వర్గాల్లో చర్చ
ప్రస్తుత పరిణామాల వెనుక వీరి హస్తం ఉండొచ్చని అనుమానం
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది.
ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎన్నో అనుమానాలు..
వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
ముందు నుంచే దుష్ప్రచారం
‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు.
‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్‌మెంట్ మాకు చాలా బాగా పని చేసింది.
ఆ సెంట్‌మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment