Bhakta Prahlada
-
తెలుగు సినిమాల్లో సరిగ్గా 91 ఏళ్ల కిందట..
తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 91 ఏళ్లు నిండాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబరాలు జరుపుకొంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా‘‘ రెంటాల జయదేవ ఎన్నో యేళ్ళు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా ధియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి, విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. ఆ రోజుల్లో.. చిత్ర నిర్మాణా నికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన ‘సురభి’ కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథా నాయిక’. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ దినాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో పుణేలో ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. ఉచిత ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. (‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 91 ఏళ్లు) ::: నరవ ప్రకాశరావు; గౌరవ కార్యదర్శి, వైజాగ్ ఫిలిం సొసైటీ -
పరిశ్రమ ఇకనైనా కళ్లు తెరవాలి!
‘తెలుగు సినిమాతల్లి బర్త్‌డే’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెచ్.ఎం.రెడ్డి తీసిన మన తొలి పూర్తితెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ బొంబాయి కృష్ణా థియేటర్లో 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని ప్రముఖ జర్నలిస్ట్ – పరిశోధకుడు రెంటాల జయదేవ నిరూపించారు. అప్పటి నుంచి ‘కళా మంజూష’ ఏటా ఫిబ్రవరి 6న ‘తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు’ జరుపుతోంది. ఈసారి ‘తెలుగు సినిమా వేదిక’, ‘నేస్తం ఫౌండేషన్’ తోడయ్యాయి. ‘‘స్వచ్ఛంద సంస్థలు కాకుండా, సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పెద్దలు, ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటివి ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు జరపాలి’’ అని సభలో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ‘‘అరుదైన పాత సినిమాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించి, సినీచరిత్ర నూ, సమాచారాన్నీ భద్రపరిచే పనిని రాష్ట్ర ఆర్కైవ్స్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికైనా చేయించాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, ఏ.ఎం.రత్నం, విజయ్‌కుమార్ వర్మ, నటి కవిత, కెమెరామ్యాన్ ఎం.వి. రఘు అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు గురురాజ్, విజయ వర్మ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ మాట్లాడారు. దివంగత నిర్మాత వి.దొరస్వామిరాజు పేరిట సీనియర్ నిర్మాతలు ఎన్.ఆర్. అనురాధాదేవి, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణరాజు, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలకు పురస్కారాలు అందించారు. జయదేవ, పరుచూరి, వెంకట్, కవిత, తుమ్మలపల్లి, తమ్మారెడ్డి, ఎన్. శంకర్, గురురాజ్, బాబ్జీ, రామ్ రావిపల్లి -
తెలుగు సినిమాకు 89 వసంతాలు
వెండితెర పూర్తి స్థాయిలో తెలుగు మాటలు నేర్చుకొని, ఈ రోజుతో 89 వసంతాలు నిండాయి. మూగ సినిమాలైన ‘మూకీ’లకు మాటొచ్చి, పూర్తి తెలుగు ‘టాకీ’లుగా మారింది సరిగ్గా 89 ఏళ్ళ క్రితం ఇదే రోజున! మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932లో ఫిబ్రవరి 6న థియేటర్లో తొలిసారిగా రిలీజైంది. అలా ఆ నాటి నుంచి పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు ప్రేక్షకులను వెండితెరపై పలకరించడం ప్రారంభమైంది. ఆ లెక్కన మన తెలుగు సినిమాకు ఇవాళ హ్యాపీ బర్త్ డే! మన తెలుగు సినిమా పరిశ్రమ 89 ఏళ్ళు నిండి, 90వ ఏట ప్రవేశిస్తున్నందున సినిమాను ప్రేమించేవారికీ, సినిమా రంగం మీద ఆధారపడినవారికీ ఇదో మెమరబుల్ డే!! దేశంలో ఇవాళ ప్రధాన సినీ పరిశ్రమలలో ఒకటిగా ఉన్నత స్థానానికి చేరుకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేసిన తొలి అడుగు అది. అయితే, తెలుగు సినిమా పెద్దలు, ప్రభుత్వాలు మాత్రం మన సంపూర్ణ తెలుగు టాకీ పుట్టినరోజును మర్చిపోయినట్లుంది. పరిశ్రమకు పండుగగా జరుపుకొనే ఈ సందర్భాన్ని విస్మరించి, నిర్లక్ష్యం చూపుతున్నట్టున్నాయి. మన తెలుగు టాకీ అలా తయారైంది! తొలి దక్షిణ భారతీయ టాకీ ‘కాళిదాస్’ రిలీజై, సక్సెసయ్యాక పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తొలి భారతీయ టాకీ, తొలి దక్షిణాది టాకీలతో అనుభవం గడించిన హెచ్.ఎం. రెడ్డికే దర్శకత్వ బాధ్యత ఇచ్చారు. అప్పుడు పూర్తి తెలుగు మాటలు, పాటల ‘భక్త ప్రహ్లాద’ తయారైంది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, ఫస్ట్ రిలీజ్ కూడా బొంబాయిలోనే జరగడం గమనార్హం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ప్రసిద్ధ ’ప్రహ్లాద’ నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె వి. సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రధారులు. ఇందులో టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. ఇక, ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’ చిత్రాలలో కూడా పనిచేసిన తరువాతి కాలపు ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో మొద్దబ్బాయిగా నటించారు. ఈ సినిమాకు చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. అలా ఆయన తొలి తెలుగు సినీ కవి అయ్యారు. పరిశోధనలో బయటపడ్డ మన సినిమా పుట్టినరోజు! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ – ఏకంగా ‘కాళిదాస్’ కన్నా ముందే – 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొన్నేళ్ళ పాటు ఆధారాలు లేని వినికిడి ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళు శ్రమించి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. 100% సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం మొదలై, నేటితో 89ఏళ్ళు పూర్తయ్యాయి. మన మాటలు రికార్డ్ చేసింది హాలీవుడ్ వాడే! పెట్టుబడి, సాంకేతిక సౌకర్యాలు, ఖర్చు – అన్నీ అతి తక్కువగా ఉన్న రోజులవి. ‘ఆలమ్ ఆరా’ కోసం ఆ రోజుల్లోనే హాలీవుడ్ నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ అనే అమెరికన్ సౌండ్ ఇంజనీర్‌ను ఇండియాకు రప్పించారు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. సౌండ్ ప్రూఫ్ స్టేజీలు లేని ఆ రోజుల్లో కేవలం స్టూడియోల్లో, అదీ బయటి శబ్దాలు ఉండని రాత్రి పూట షూటింగ్ చేశారు. అప్పట్లో పిక్చర్కీ, సౌండ్‌కీ వేర్వేరు నెగటివ్‌లు కూడా ఉండేవి కావు. కేవలం సింగిల్ సిస్టమ్‌లో ‘తానార్ రికార్డింగ్ ఎక్విప్మెంట్’తో మాటలు రికార్డు చేసేవారు. చివరకు షూటింగ్ స్పాట్లోనే ఏకకాలంలో యాక్టింగ్‌తో పాటు, మాటలు చెబుతూ, పాటలు పాడుతుంటే రికార్డింగ్ చేసేయాల్సిందే! అప్పట్లో చివరకు ఇవాళ్టిలా మాటలు రికార్డు చేసే బూమ్ లు కూడా ఉండేవి కావు. కెమేరా కంట్లో పడకుండా మైకులు రకరకాల చోట్ల దాచిపెట్టి, ఈ తొలి టాకీల్లో డైలాగ్స్, సాంగ్స్ రికార్డ్ చేసేవారు. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన జనానికి... తెర మీద బొమ్మలు మాట్లాడడం, పాటలు పాడడం ఓ వింత. అదీ మన సొంత తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడడం మరీ విడ్డూరం. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ దేశమంతటా, మరీ ముఖ్యంగా మన తెలుగునాట విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కానీ, మన తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలూ చాలానే ఉన్నాయి. ఈ తొమ్మిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా చాలానే పురోగమించింది. బాక్సాఫీస్ వేటలో పేటలు దాటి, దేశాల కోటలు దాటి ముందుకు ఉరికింది. అప్పటి ‘భక్త ప్రహ్లాద’ రోజుల నుంచి ఇప్పటి ‘బాహుబలి’ కాలం దాకా మన తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో తయారై, ఆ మాత్రం ఖర్చు వస్తేనే మహాద్భుతం అనుకొనే పరిస్థితి నుంచి ఇవాళ అనేక పదుల కోట్ల రూపాయల బడ్జెట్, వందల కోట్లల్లో వ్యాపారం, వసూళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చూసే కోట్లమంది జనంతో తెలుగు సినిమా అంకెల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల దగ్గర తడబడుతోంది. ఈ ప్రశ్నకు బదులేది? ఓ తెలుగు సినీ కవి అన్నట్టుగా... ‘పుట్టినరోజు పండగే అందరికీ! మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ మన సినిమా చరిత్రను భద్రపరిచే విషయంలో పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్లు, ప్రభు త్వాలు చేస్తున్నది చాలా తక్కువే. మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు మన తొలి తెలుగు సినిమా ప్రింటే లేకుండా పోయింది. టాకీలకే దిక్కు లేదు... ఇక మూకీల చరిత్ర మాట చెప్పనే అక్కర్లేదు. మన తొలి తెలుగు సినిమాల్లో మిగిలిన కొన్నింటి ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల ఉన్నాయి. కానీ, మిగిలిన ఆ కొద్ది 1930 – 40ల నాటి తెలుగు చిత్రాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించడానికి సినీపెద్దలు, ప్రభుత్వాలు చేçపడు తున్న చర్యలు శూన్యం. చరిత్రపై తమిళ, మల యాళ, బెంగాలీ చిత్రసీమలకున్న శ్రద్ధ మనకేది? మరోపక్క కొత్త కథాంశాలతో సినిమా తీయడానికి మలయాళ, తమిళ చిత్రసీమలలా మనమెందుకు ముందుకు రాలేకపోతున్నాం? ఒకప్పుడు థియేటర్ల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్న మనం ఇప్పుడు తెలుగు రాష్టాలు రెండూ కలిపినా 1600 హాళ్ళు కూడా లేని పరిస్థితిలో పడ్డామెందుకు? భారీ రెమ్యూనరేషన్లు, భారీ బడ్జెట్ల విషవలయంలో పడి ప్రేక్షకుడి నడ్డి విరిచేలా పన్ను పెంచుదాం, టికెట్ రేట్లు పెంచుదాం లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? ఇలా పరిశ్రమ వేసుకోవాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా, ఒకప్పుడు వీధి దీపాల మధ్య టెంట్లో టూరింగ్ టాకీసుల్లో నడిచిన సినిమా ఇవాళ ఏసీ హాళ్ళు, మల్టీప్లెక్సుల మీదుగా ఓటీటీ దాకా వచ్చేసింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుడు టీవీలు, కంప్యూటర్ల మీదుగా ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లలో ఓటీటీలో వినోదాన్ని వెతుక్కుంటున్నాడు. కరోనా వచ్చింది... మనల్ని విడిచి వెళ్ళకుండా ఇంకా ఉంది. ఏడు నెలల పైచిలుకు తరువాత థియేటర్లు తెరిచారు. మరో మూడున్నర నెలల తరువాత ఇప్పుడు హాళ్ళలో అన్ని సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాలులో జనం తగ్గారేమో కానీ, సినిమా పట్ల మన మనసుల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడికి సినిమా ఒక మోహం. తెరపై కొత్త బొమ్మ చూడడం తీరని దాహం. ఆ దప్పిక తీర్చడానికి హాలైనా, మరొకటైనా మనకొకటే. అందుకే కాలంతో పాటు మారుతున్న వెండితెర మాయాజాలానికి జేజేలు. లాంగ్ లివ్ సినిమా! మన తెలుగు సినిమా!! ఫస్ట్ ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’ తొలి రోజుల్లో సినిమా అంటే... భాషతో సంబంధం లేని మూగచిత్రాలు (మూకీలు). తర్వాత కాలంలో మూగకు మాటొచ్చింది. వెండితెర మాటలు నేర్చింది. పాటలు పాడసాగింది. మన తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. మాస్టర్ విఠల్, మిస్ జుబేదా నటించిన ఆ చిత్రానికి దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. తెలుగువాడైన హెచ్.ఎం. రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కడి నుంచి మన దేశంలోని విభిన్న ప్రాంతాలు, వివిధ భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మొదలైంది. తొలి భారతీయ టాకీ నిర్మించిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ సంస్థే ఆ తరువాత తొలిసారిగా దక్షిణాది భాషల్లో టాకీల రూపకల్పన మొదలుపెట్టింది. ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’ ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పనిచేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. బొంబాయిలోనే ‘ఆలమ్ ఆరా’కు వేసిన సెట్స్ ఉపయోగించుకుంటూ ఆ సినిమా తీశారు. ప్రధానంగా తమిళ మాటలు – పాటలు, కొంత తెలుగు డైలాగులు – కొన్ని త్యాగరాయ కీర్తనలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో ఆ ‘కాళిదాస్’ తయారైంది. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న తొలిసారిగా మద్రాసులోని సినిమా థియేటర్ ‘కినిమా సెంట్రల్’ (తర్వాత ‘మురుగన్ టాకీస్’గా మారింది)లో రిలీజైంది. ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ఆ దర్శక, నిర్మాతలే ప్రకటించిన ఆ సినిమా – మన దక్షిణాది భాషల్లో వచ్చిన ఫస్ట్ టాకీ! టాలీవుడ్ అంటే తెలుగు కాదు... బెంగాలీ! మొదట్లో బొంబాయి ఇంపీరియల్ స్టూడియోలో పనిచేసిన హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ విల్ఫోర్డ్ డెమింగ్ అక్కడ సౌండ్ రికార్డింగ్ మిషన్ పెట్టి, శబ్దగ్రహణమంతా తానే చూసేవారు. ‘ఆలమ్ ఆరా’ సహా బొంబాయిలో 5 చిత్రాలకు ఆయనే వర్క్ చేశారు. ఇంపీరియల్ స్టూడియోలో తయారైన ఫస్ట్ సౌతిండి యన్ టాకీ ‘కాళిదాస్’కు కూడా బహుశా ఆయనే సౌండ్ ఇంజనీర్. అంటే మన తెలుగు మాటల్ని, త్యాగరాయ కీర్తనల్నీ తెరపై వినిపించిన సౌండ్ ఇంజనీర్ ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న ఆ హాలీవుడ్ టెక్నీషియనే కావచ్చు. ఆ తరువాతి కాలంలో ఆయన కలకత్తాకు మకాం మార్చి, బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ సంస్థలో 2 చిత్రాలకు పని చేశారు. కలకత్తాలోని టాలీగంజ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన బెంగాలీ చిత్రసీమకు ‘టాలీవుడ్’ అని పేరు పెట్టిందీ ఆయనే! 1932లో ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ పత్రికకు కలకత్తా సినీ పరిశ్రమ గురించి రాసిన వ్యాసంలో ఆయనే మొదట ఆ పేరు వాడారు. అంటే తెలుగు చిత్రసీమను మనోళ్ళు ‘టాలీవుడ్’ అనడమే పెద్ద తప్పు అన్న మాట! మన తొలి సినిమా విశేషాలు తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సెన్సార్ సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6న, బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి; తొలి 3 టాకీల్లో దర్శక నిపుణుడు చందాల కేశవదాసు, తొలి తెలుగు సినీ కవి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తొలి 3 టాకీల్లో పని చేసిన వ్యక్తి – రెంటాల జయదేవ -
‘దిల్’రాజుకి అవార్డ్
తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ దర్శక-నిర్మాత హెచ్.యం.రెడ్డి (హనుమంతప్ప మునియప్ప రెడ్డి) పేరుతో, సాంస్కృతిక సంస్థ ‘ఆకృతి’ గత 23 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన దర్శక-నిర్మాతలకు పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ‘దిల్’ రాజు ప్రతిష్టాత్మక హెచ్.యం.రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈ నెల 28న హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అవార్డు ప్రదానం చేయనున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
84 వసంతాలు
సందర్భం: తెలుగు సినిమా పుట్టినరోజు కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ - ఇలా అన్నిటిపైనా తనదైన ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు. సినీప్రియులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు చలనచిత్రం ‘భక్తప్రహ్లాద’ 84 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. సినిమా అంటే ఒకప్పుడు భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు). తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదల కావడంతో ఆ యా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలో, ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ! ప్రధానంగా తమిళ మాటలు - పాటలు, కొంత తెలుగు మాటలు, పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘కాళిదాస్’ కన్నా ముందే, 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధార రహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే ప్రారంభించడం మొదలై, ఇవాళ్టితో 84 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెర మీద బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆద్యంతం మాట్లాడడం విడ్డూరమైంది. దాంతో, ఈ టాకీ విడుదల హంగామా సృష్టించింది. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగు నాట అప్రతిహతంగా సాగుతూనే ఉంది. కాకపోతే, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే తప్ప సినిమా ప్రింటే లేకుండా పోయింది. పోయినవెలాగూ పోగా, ఇప్పటి కైనా మన సినీపెద్దలు, తెలుగు ప్రభుత్వాధి నేతలు కళ్ళు తెరిచి, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన 1930-40ల నాటి కొద్దిపాటి తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా?! తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6, బొంబాయిలో కృష్ణథియేటర్ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు, తల్లి లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, తండ్రి హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య ప్రజల్లోని మార్పులకు ప్రతిబింబం ఇది! - ఎ. రమేశ్ ప్రసాద్, ప్రసాద్స్ సంస్థల అధినేత ‘‘తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ - మూడింటిలోనూ నటించిన, పనిచేసిన అరుదైన ఘనత మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్‌ది. ఆయన, నేను, మా కుటుంబ సభ్యులం ‘ప్రసాద్’ సంస్థ ద్వారా ఫిల్మ్ ప్రింటింగ్, ప్రాసెసింగ్, రికార్డింగ్ వగైరా అన్నిటా ముందుండి, పరిశ్రమ పురోగతికి తోడ్పడ్డాం. ఈ 84 ఏళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఒక్క మాటలో, ప్రజల వైఖరిలో వస్తున్న మార్పుల్ని సినిమాల్లో చూడవచ్చు. విలువలు, కథలు మారాయి.నిర్మాణం, పోటీ పెరిగాయి. ఫిల్మ్ పోయి డిజిటలొచ్చింది. ఎంత టెక్నాలజీ వచ్చినా నాన్న గారన్నట్లు ప్యాషన్, పేషెన్స్ (సహనం), పర్సెవరెన్స్ (నిరంతర శ్రమ), అందరి మంచి కోరే ప్యూరిటీ ఆఫ్ థాట్ - ఈ నాలుగు ‘పి’లుంటే ముందుకెళతాం!’’ డబ్బు సంపాదనే ధ్యేయమైతే ఎలా? - దాసరి నారాయణరావు, దర్శక,నిర్మాత ‘‘దాదాపు 50 ఏళ్ళుగా తెలుగు సినిమాతో కలసి నడిచే అదృష్టం నాకు కలిగింది. మనందరం దృష్టి పెట్టాల్సిన కొన్ని ప్రతి కూల అంశాలు చెబుతా. ఒకప్పుడు సిని మాలు కొద్ది రోజుల్లో, తక్కువ బడ్జెట్లో తయారయ్యేవి. అప్పటితో పోలిస్తే, ఇప్పుడెంతో టెక్నాలజీ వచ్చింది. కానీ, దాన్ని వాడుకొనే నైపుణ్యం ఉందా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. కమిట్మెంట్, కళ పట్ల గౌరవం తగ్గి ఇవాళ సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అని పొరపడుతున్నాం. నిజానికి, ఎంటర్టైన్మెంట్లో సినిమా భాగమే తప్ప, సినిమానే ఎంటర్టైన్మెంట్ కాదు. అలాగే, ఎంతో శక్తిమంతమైన మీడియా అయిన సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. డబ్బులు సంపాది స్తూనే, సమాజానికి అద్దం పట్టే సినిమాలు కొన్నేళ్ళ క్రితం దాకా వచ్చేవి. కానీ, ఇవాళ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమా ద్వారా అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపించడం లాంటివే చూపిస్తు న్నాం. అదేమంటే, ‘ఇదేనండీ ట్రెండ్’ అంటున్నాం. జనానికి మనం ఏది చూపించి, అలవాటు చేస్తే అదే చూస్తారు. కాబట్టి వాళ్ళను తప్పు పట్టకూడదు. గమనిస్తే ఇప్పుడు చాలామంది మంచి టెక్నీషి యన్లు, నటులు వస్తున్నారు. కానీ, వారి ప్రతిభకు సరైన దోవ లేక పక్కదారి పడుతోందేమోనని నా అనుమానం, బాధ.’’ కథ అదే..! టెక్నిక్కే మారుతోంది! - డి. సురేశ్‌బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ‘‘మా నాన్న గారు డి. రామానాయుడు, మా కుటుంబం కలసి 50 ఏళ్ళపైగా సినీరంగం లోనే కృషి చేయడం అదృష్టం. సినిమా అంటే అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నిక్ వాడి, వెండితెరపై కథ చెప్పడం! నవ్వు, ఏడుపు లాంటి ప్రాథమిక ఉద్వేగాలు, కథ ఒకటే. వాడే టెక్నిక్, చెప్పే విధానం కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు జానపదాల్లో మినియేచర్లు వాడితే, ఇప్పుడు ‘బాహుబలి’కి గ్రాఫిక్స్, యానిమేషన్, డిజిటల్ ఎఫెక్ట్స్ వాడుతున్నాం. అప్పట్లో కొన్ని కోవల సిన్మాలే ఉండేవి. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ, హార్రర్, క్రైమ్ ఇలా రకరకాల కోవల ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. వచ్చేరోజుల్లో సిని మాల్ని చూసే వేదికలు, విధానమూ మారతాయి. హాళ్ళు, టీవీల్లోనే కాక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లలో సినిమాలు చూడడం పెరుగుతుంది. రోజులోని సమయాన్ని బట్టి చూసే వేర్వేరు రకాల సినిమాలు వస్తాయి.’’ -
తెలుగు దర్శకులపై గ్రంథం
1932లో పురుడు పోసుకుంది తెలుగు సినిమా. మన తొలి చిత్రం ‘భక్తప్రహ్లాద’ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి మొదలుకుని ఇప్పటి వరకూ ఎంతో మంది దర్శకులు తమ సృజనతో తెలుగు సినిమాకు ఖ్యాతిని ఆర్జించిపెట్టారు. ఈ దర్శకుల ప్రస్థానాన్ని, సృజనాత్మకతను భావితరాలకు తెలియజెప్పే ఉద్దేశంతో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఓ ప్రయత్నం చేస్తోంది. దర్శకుల సమాచారాన్ని సేక రించి ‘తెలుగు దర్శకుల సంక్షిప్త చరిత్ర’ పేరుతో ఓ పుస్తకం తీసుకు రానుంది. ఈ విశేషాలను దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ తెలియజేస్తూ-‘‘1932 నుంచి 2007 వరకూ అందరి వివరాలూ సేకరించగలిగాం. కానీ, ఆ తర్వాత దర్శకులుగా పరిచయమైన వారి వివరాలు మాకు లభ్యం కావడం లేదు. అలాంటి దర్శకులు తమ వివరాలను tfda08@gmail.com కు మెయిల్ చేయాలి. త్వరలోనే ఈ గ్రంథాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
నేడు తెలుగు సినిమా పుట్టినరోజు
మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సురభి నాటక కళాకారులే అధిక పాత్రలు పోషించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయి, మాస్టర్ కృష్ణారావు, ఎల్వీ ప్రసాద్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రధారులు. ‘తెలుగు సినిమా పుట్టినరోజు’ని ప్రతి ఏటా పరిశ్రమ ఓ వేడుకగా ఘనంగా నిర్వహిస్తే బావుంటుంది.