తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి | Celebritys talk about Hyderabad Literary Festival | Sakshi
Sakshi News home page

తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి

Published Sat, Jan 25 2025 5:46 AM | Last Updated on Sat, Jan 25 2025 5:46 AM

Celebritys talk about Hyderabad Literary Festival

సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ నగరానికి  కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో  అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.

ప్రపంచమే ఒక రంగస్థలం
భారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్‌ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్‌ తల్లి రోషన్‌ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్‌. ఆమె తండ్రి ఇబ్రహీమ్‌ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్‌. సౌదీ అరేబియా, కువైట్‌ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్‌ మాత్రం ఇండియాలో కొనసాగారు.

 ఆ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు అమల్‌. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి  అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్‌.  

అవి గోల్డెన్‌ డేస్‌! 
రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్‌ డిజైనింగ్, సీన్‌ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్‌ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్‌ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్‌ ఇండియన్‌ కాస్ట్యూమ్, మిడివల్‌ ఇండియన్‌ కాస్ట్యూమ్‌’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్‌ టైమ్‌ క్యాప్టివ్‌’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్‌ డేస్‌. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్‌ అల్లానా.

భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది
బెంగాల్‌కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్‌ సలీం: ఏ రీటెల్లింగ్‌ ఆఫ్‌ ముఘల్‌ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్‌ లాస్ట్‌ సెల్యూట్‌: ద స్టోరీ ఆఫ్‌ ద రాణీ ఆఫ్‌ ఝాన్సీ అండ్‌ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్‌సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్‌ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్‌ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్‌ లాస్ట్‌ క్వీన్‌ ఈజ్‌ ద సోల్‌ ఆఫ్‌ ద సిటీ’ పేరుతో ప్రచురించారు.
  
హైదరాబాద్‌వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్‌ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్‌ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్‌ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. 

ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్‌ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్‌ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్‌ వ్యాపారుల రికార్డుల్లో భాగ్‌నగర్‌ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్‌లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. 

ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.

ఫెమినిస్ట్‌ అయితే తప్పేంటి?
షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్‌. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. 

‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్‌ మాత్రమే కాదు కమ్యూనిస్ట్‌ పార్టీ మెంబర్‌ కూడా. ఆయన అండర్‌ గ్రౌండ్‌ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్‌ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్‌  వాతావరణం ఉండేది. 

ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్‌ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! 

‘అంకురం’తో సొంతూరు పర్యటన
నా మొదటి సినిమా శ్యామ్‌ బెనెగల్‌ తీసిన ‘అంకురం’ షూటింగ్‌ హైదరాబాద్‌ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్‌ బెనెగల్‌ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్‌ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్‌! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్‌ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్‌ స్టూడెంట్స్‌ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్‌ అవుతోందట కదా! హీరోయిన్‌ ఏది’ అనడిగారు. 

‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్‌ బెనెగల్‌.. ఆ స్టూడెంట్స్‌ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్‌ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్‌ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్‌!  హాలీవుడ్‌లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్‌ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్‌ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్‌ లేకుండా జస్ట్‌ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్‌ఫెక్ట్‌ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.

పారలల్‌ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసం
పారలల్‌ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్‌ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్‌ మూవీస్‌ నుంచి కమర్షియల్‌ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్‌ విషయంలో! ప్యార్లల్‌ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్‌ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్‌ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

పురుషులను ఎడ్యుకేట్‌ చేయాలి
అన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్‌ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్‌ రైటర్, డైరెక్టర్‌ ఫర్హాన్‌ అఖ్తర్‌) ‘మర్ద్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్‌నెస్‌ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ.          

సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్‌ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్‌ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్‌ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్‌ చేయొచ్చు కదా!

గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. 
‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’
– హుమా ఖురేషీ

చిత్‌చోర్‌ ఏమన్నాడు
‘గోరి తేరా గావ్‌ బడా ప్యారా’ అంటూ అమోల్‌ పాలేకర్‌ హైదరాబాద్‌ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్‌ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్‌ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్‌ పాలేకర్‌... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్‌ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్‌ఫోన్‌లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్‌ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్‌ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్‌ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. 

– వాకా మంజులారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement