amol palekar
-
ఆమెపై చెయ్యెత్తడమా?
‘స్త్రీలపై హింస చేయడం తప్పు’ అని భావించేవారు కూడా సినిమాల్లో హీరోయిన్ని హీరో లాగిపెట్టి కొడితే క్లాప్స్ కొడతారు. ఇలా కొట్టే సన్నివేశాలు యువత మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో హీరోలు పెద్దగా ఆలోచించరు– కథకు అవసరమైనా కాకపోయినా. కాని అమోల్ పాలేకర్ మాత్రం నలభై ఏళ్ల క్రితం కొట్టిన చెంపదెబ్బకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ లో తన పుస్తకం ‘వ్యూఫైండర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆ ఉదంతాన్ని ప్రస్తావించాడు.‘నేను ప్రధానంగా చిత్రకారుణ్ణి. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని నా కాబోయే భార్య చిత్ర ఆ రోజుల్లో నాటకాలు వేస్తుంటే తోడుగా రోజూ వెళ్లేవాణ్ణి. అప్పుడు నాటక గురువు సత్యదేవ్ దూబే నాతో ‘నా తర్వాతి నాటకంలో వేషం ఇస్తాను చెయ్. నీలో ఏదో టాలెంట్ ఉందని ఆఫర్ చేయడం లేదు. బాగా ఖాళీగా ఉంటున్నావని ఇస్తున్నాను’ అన్నారు. అలా నాటకాల్లోకి... తర్వాత సినిమాల్లోకీ వెళ్లాను. నాటకాల్లో చేయడం వల్ల రిహార్సల్స్ చేసి నటించడం నాకలవాటు. అయితే ‘భూమిక’ (1977) సినిమాలో ఒక సన్నివేశంలో తనకు కావలసిన ఎక్స్ప్రెషన్ స్మితాపాటిల్ ఇవ్వడం లేదని దర్శకుడు శ్యామ్ బెనగళ్ నన్ను పక్కకు పిలిచి– టేక్‌లో ఆమెను లాగిపెట్టి కొట్టు అన్నారు. అలాగే సార్.. రిహార్సల్‌కు ఆమెను రమ్మన మనండి అన్నాను. ఆమెకు ఈ సంగతి నేను చెప్పలేదు... నువ్వు నిజంగా కొట్టాలి అన్నారు. నేను షాక్ అయ్యాను. లేదు సార్... అలా చేయను. స్త్రీలపై చెయ్యెత్తడమే తప్పు. యాక్టింగ్ కోసం చేయొచ్చు. కాని నిజంగా చేయమంటే చేయను అన్నాను. ఆయన ఊరుకోలేదు. ‘‘ఇది నా ఆర్డర్. చేస్తావా చేయవా’’ అన్నారు. ఇక నేను ధైర్యం కూడగట్టుకున్నాను. టేక్ మొదలైంది. స్మితాపాటిల్ అద్భుతంగా నటిస్తోంది. సరిగ్గా దర్శకుడు కోరిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన సమయంలో ఆమెను లాగిపెట్టి కొట్టాను. స్మిత స్థాణువయ్యింది. ఆ పని నేను చేయగలనని ఆమె ఊహించలేదు. దాంతో ఎక్స్ప్రెషన్స్ ఒకదాని వెంట ఒకటి ఆమె మొఖంలో పరిగెత్తాయి. మొదట అపనమ్మకం, తర్వాత కోపం, తర్వాత అవమానం, ఆఖరుకు దుఃఖం... డైరెక్టర్ కట్ అనే వరకు నేనూ ఆమె నటిస్తూనే ఉన్నాం. కట్ అన్నాక ఒక్కసారిగా నేను ఏడ్చేశాను. స్మితాను దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. ఆ రోజుల్లో నేను కొత్తనటుణ్ణి. అలా చేశాను. పేరు వచ్చాక అలా చేయలేదు. ఎప్పుడూ చేయను. అసలు స్త్రీల మీద చెయ్యెత్తుతారా ఎవరైనా? ఆమె మీద గొంతెత్తడమే తప్పు. నేనైతే పెద్దగొంతుతో స్త్రీలతో మాట్లాడి కూడా ఎరగను’ అన్నాడు హర్షధ్వానాల మధ్య.స్త్రీలతో పురుషులు– వారు భర్త/తండ్రి/సోదరుడు స్థానంలో ఉన్నాగాని వ్యవహరించవలసిన తీరు ఏమిటో ఆమోల్ ఉదంతంతో బేరీజు వేసుకుని పరిశీలించుకోవాలి. -
సక్సెస్ కోసమే సినిమా..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సినిమా వాణిజ్యపరమైన అంశమని, ఈ కారణం చేత సక్సెస్ కోసమే కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నారని ప్రముఖ భారతీయ నటులు, దర్శకులు అమోల్ పాలేకర్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో సినిమా దర్శకుడు ఇతర సినిమా బృందం కన్నా సాంకేతికత పైనే ఎక్కువ ఆధారపడుతోందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో భాగంగా ప్లీనరీలో అమోల్ పాలేకర్ తన సతీమణి సంధ్య గోఖలేతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకులు మోహనక్రిష్ణ ఇంద్రగంటితో తాను రాసిన నూతన పుస్తకం ‘వ్యూ ఫైండర్’ పై చర్చించారు.‘నా వరకూ సినిమా అంటే అందరిలా కాకుండా విభిన్నంగా తీయడమే నచ్చుతుందన్నారు. మెయిన్ స్ట్రీంలో సినిమా రంగానికి నియమాలు, నిబంధనలు, పరిమితులు వంటి సంస్కృతిలో ఇమడలేకపోయానన్నారు. ఎంత పెద్ద విజయం సాధించినా, నిర్మించగలిగినా ఆ క్రెడిట్ మొదట రచయితకే చెల్లుతుంది. ప్రస్తుత సినిమా వందల కోట్ల అంశంగా మారింది. ఒక పెద్ద నిర్మాత నాతో ఇలాంటి సినిమాలే తీయాలని సంప్రదించాడు, అలాంటి పది సినిమాల్లో 9 రిజక్ట్ చేసేవాడిని’ అని అన్నారు. ‘ఒక సినిమా షూట్లో భాగంగా తోటి నటి స్మితను నిజంగా కొట్టాల్సి వచ్చింది, దర్శకుడి ప్రోద్భలంతో ఆ సీన్ బాగా పండించడానికి ఇష్టం లేకున్నా కొట్టాల్సి వచ్చింది. ఆ సీన్లో స్మిత మంచి నటన కనబర్చింది. అనంతరం క్షమాపణ కోరినా, నేను కొట్టడం వల్లే మరింత వాస్తవంగా నటించగలిగానని ఆమె చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అన్నారు. ‘70లలో అద్భుతమైన మధ్య తరగతి సినిమాల ప్రస్తావన రావడంతో.. నాటి జీవితాలకు, ప్రస్తుత జీవన శైలికి తేడా ఉందని, ఇప్పుడు అలాంటి కథలను ఊహించలేం. కానీ ఈ మధ్య అలాంటి కథే ‘సత్యం సుందరం’ నన్నెంతో హత్తుకుంది. నా సినీ మిత్రుడు ఉత్పల్ దత్ ఎంత మంచివాడో నాకే తెలుసు, కానీ దేశంలోనే మొట్టమొదటి సెడేటివ్ కేసుతో అరెస్టు అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు. నాస్తికులుగా బతకడం కష్టం.. ‘నా భార్యను కలవక ముందు జీవితం, ఆ తరువాతి జీవితం అనేంత ప్రభావం చూపించింది. సతీమణి సంధ్యను కలువక ముందు ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే, ఆమెను కలిశాక ఏడాదికో సినిమా తీయగలిగాను. తన పుస్తకం వ్యూ ఫైండర్ మా ఇద్దరి ప్రయాణం క్లైమాక్స్ వంటిది’ అని మోహన క్రిష్ణ ఇంద్రగంటితో చమత్కరించారు. ‘నా చివరి ఎనిమిది సినిమాలకూ నా భార్యే రైటర్. మేమిద్దరమూ నాస్తికులమే, సామాజికంగా నాస్తికులుగా సాగడం అంత సులువు కాదు’ అన్నారు.. ‘నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదు, 2000 సంవత్సరంలో అమోల్ పాలేకర్ సినిమాకు మొదటి సారి పనిచేశాను’ అని సంధ్య తెలిపారు. -
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
నెట్ కు లేనిది.. సినిమాకు ఎందుకు?
న్యూఢిల్లీ: భారత్ లో సెన్సార్ షిప్ చట్టాలను మార్చాలంటూ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 47 సంవత్సరాలుగా సెన్సార్ షిప్ ను ఎవరూ ప్రశ్నించలేదని.. మారుతున్న కాలంతో పాటు అందులోని నిబంధనలు కూడా మారాలని పాలేకర్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఎక్కువ మొత్తం కట్స్ లో పోతున్నాయని, కొన్ని సినిమాలైతే సర్టిఫికేషన్ కు నోచుకోవడం లేదని గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఎక్కువగా ఇవ్వమని కోరడం లేదని అయితే సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కాలంలో మాస్ మీడియా పలు రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పుకొచ్చిన ఆయన.. నిబంధనలు కూడా ప్రజల అవసరాలకు తగిన విధంగా ఉండాలన్నారు. కాగా టీవీలు, ఇంటర్నెట్ లో కంటెంట్ పై సెన్సార్ షిప్ లేదని.. అదే సమాచారంతో రూపొందే సినిమా దగ్గరకు వచ్చేసరికే మాత్రం సెన్సార్ షిప్ పేరుతో కట్స్ ఎక్కువగా చేస్తున్నారని పిటిషన్ లో పాలేకర్ వాదించారు. ఈ మధ్య కాలంలో విడుదల కోసం తిప్పలు పడిన సినిమాలను గురించి పిటిషన్ లో వివరించారు. జాలీ ఎల్ఎల్బీ2 సినిమాలో కట్స్ విధించాలంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన డిమాండ్ ను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలపై శ్యాం బెనగల్ కమిటీ సూచనలను అమలయ్యేలా చూడాలని పిటిషన్ లో కోరారు. -
భారతీయ సినిమా అంటే... బాలీవుడ్డేనా !?
1970లలో దేశమంతటా మధ్యతరగతిని అమితంగా ఆకట్టుకున్న హీరో అంటే... అమోల్ పాలేకరే. ఆయన నటించిన ‘గోల్మాల్’, ‘చిత్‌చోర్’, ‘ఛోటీ సీ బాత్’ - ఇలా ప్రతి చిత్రం అప్పట్లో ఒక క్రేజ్. అందుకే, మరాఠీ గడ్డ మీద పుట్టిన ఈ మరపురాని నటుడికి ఆ నాటి నుంచి ఈ నాటి దాకా ఒక వర్గంలో చెరగని అభిమానం. ఉత్తమ నటుడిగా ఆరుసార్లు ప్రభుత్వ అవార్డులు అందుకున్న ఆయన ఆ తర్వాత మనసుకు నచ్చిన పాత్రలే చేస్తూ, అరుదుగా తెరపైకొస్తున్నారు. అయితే, దర్శకుడిగా, మంచి చిత్రాల ఉద్యమశీలిగా సినిమా రంగంతోనే మమేకమై జీవితం సాగిస్తున్నారు. ‘యాదృచ్ఛి కంగా నటుణ్ణయ్యా. తప్పనిసరై నిర్మాతనయ్యా. ఏరికోరి దర్శకుడినయ్యా...’ అనే అమోల్‌తో సంభాషణ ఒక ఆలోచనాంతరంగ యానం. రంగస్థలం, సినిమా, టీవీ - ఇలా అన్నిటిలో తనదైన ముద్ర వేసిన ఈ కళాకృషీవలుడికి సినీ మీడియవ్‌ు మీద అతి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అటు కళాత్మక చిత్రాలకూ, ఇటు కమర్షియల్ చిత్రాలకూ మధ్య వారధిగా... నేటి మార్కెట్ చోదిత సినీ సృజనపై అమితమైన ఆవేదన ఉంది. ‘చిల్డ్రన్స ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’కు సారథ్యం వహిస్తూ, దేశంలో బాలల చలనచిత్రోత్స వానికి నాంది పలికిన వ్యక్తిగా... బాలల సినిమా భవిష్యత్తుకు చేయాల్సిన పనిపై అవగాహన ఉంది. అమోల్ పాలేకర్‌ను కదిలిస్తే... ఆ భావాల జల్లులో తడవాల్సిందే. ఆలోచనలో మునగాల్సిందే. నేటితో ఏడుపదులు నిండిన అమోల్ అంతరంగ ఆవిష్కరణ... అభిమాన పాఠకులకు ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్. నటుడిగా, దర్శకుడిగా నేనెప్పుడూ ప్రధాన స్రవంతి చిత్రాల్లో భాగం కాదు. 47 ఏళ్ళుగా ఏటికి ఎదురీదుతూనే ఉన్నా. ప్రధాన స్రవంతికి దూరంగా ఇన్నేళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతున్నందుకు హ్యాపీ. నిజానికి, బాసు ఛటర్జీ, హృషీకేశ్ ముఖర్జీల చిత్రాలు అప్పట్లో ఆడాయంటే కారణం - అవి ప్రధాన స్రవంతివి కాకపోవడమే. బస్సులో, లోకల్ ట్రెయిన్లో తిరిగే హీరోగా తెరపై కనిపించిన మొదటివాణ్ణి నేనే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1960ల నుంచి ’80ల వరకు రంగస్థలం, సంగీతం, నృత్యం, శిల్పకళ, సినిమా - ఇలా అనేక రంగాల్లో మన ప్రభ వెలిగింది. ఆ కాలఘట్టంలో మన భారతీయ ఉనికినీ, గుర్తింపునూ చాటుకోగలిగాం. ఆయా రంగాల్లో ఉద్దండులైన మహామహులు చుట్టూ ఉండేవారు. దాంతో మన భారతీయ సమాంతర చలనచిత్ర ఉద్యమం కూడా పరిఢవిల్లింది. కానీ, క్రమంగా ఆ వెలుగు తగ్గింది. వాణిజ్య విజయమే గీటురాయా? భారతీయ సినిమా శతవసంతాలు జరుపుకొన్నా, ఇప్ప టికీ అమ్మాయి, అబ్బాయిల ప్రేమకథల చుట్టూనే తిరుగు తున్నాం. వాటి నుంచి బయటకు రావడం లేదు. ఇవాళ మన సినిమాలు ‘వంద కోట్ల క్లబ్’లో చేరడం ఆనందమే అయినా, అంతకు మించి ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించి మాట్లాడు కోవడానికి ఏమీ లేదన్నది బాధగా ఉంది. ఇక, నాన్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల గురించేమో మనమసలు మాట్లాడడమే లేదు. మరోపక్క ప్రాంతీయ భాషల్లోనూ హీరోలకు కోట్లలో పారితోషికాలిచ్చే స్థాయికి సినీ పరిశ్రమ చేరింది. ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా పదుల కోట్లలో వసూలు చేస్తున్నాయి. ఆ మధ్య ‘దునియా దారీ’ అనే మరాఠీ చిత్రం రూ. 35 కోట్లు వసూలు చేసింది. వ్యాపార రీత్యా అది శుభపరిణామమే. కానీ, సినిమాకు సంబంధించి అది ఒక కోణమే! కళాత్మకత గురించి పట్టింపు లేకుండా, ఎంతసేపూ కమర్షియల్ విజయాన్నే గీటురాయిగా పెట్టుకోవడం తప్పు అంటాను! సినిమా ఫర్నిచర్లో భాగమైన కథానాయిక ఇవాళ మనదేశంలో మహిళా ప్రధాన చిత్రాలు ఎన్నొస్తున్నాయి చెప్పండి! ప్రస్తుతం మన హీరోయిన్లు సినిమాలో ఉపయోగించే ఫర్నిచర్లో భాగంగా కనిపిస్తున్నారు. అంతే! దురదృష్టవశాత్తూ మన సినీ సంస్కృతి అలాంటిది. అందుకే, బలమైన స్త్రీ పాత్రలే లేకుండా మన చిత్రాలొస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇవాళ మీడియా కూడా మారింది. మీడియా అడుగుతున్న తొలి ప్రశ్న - ఇవాళ సినిమా ఎంత వసూలు చేసిందనే! మన దృష్టి అంతా ఎన్ని స్క్రీన్స్‌లో రిలీ జైంది, ఎంత వసూలు చేసిందనే అంశాల మీదే! అలాంటి ఆలోచనా ధోరణిలో ఉంటే, మంచి సినిమాలెలా వస్తాయి! అలాంటి చిత్రాలకు ప్రచారమేదీ? అప్పట్లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో నేను, విద్యాసిన్హా నటించిన ‘రజనీగంధా’ (1974) అందరికీ తెలుసు. ’67లోనే మరాఠీలో సినీనటుణ్ణి అయిన నాకు అది తొలి హిందీ చిత్రం. విద్యాసిన్హా తెరపైకి రావడం అదే మొదలు. ఆ చిత్రంలో వాణిజ్యాంశాలు లేవు. నాటకీయ దృశ్యాలూ లేవు. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడం వల్లే ఆ సినిమా విజయవంత మైంది. అదే తర్కాన్ని ఇవాళ మన సినిమాలకు, కనీసం బాలల చిత్రాలకైనా ఎందుకు వర్తింపజేయం? అయితే, పాతవన్నీ మంచివి. కొత్తవన్నీ చెత్తవనే భావన నాకు లేదు. ఇవాళ మనం గురుదత్ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఆ సమయంలోనూ చెత్త సినిమాలొచ్చా యని మర్చిపోకూడదు. ఇవాళ్టి తరంలోనూ మంచి సినిమాలు తీసే రాజ్‌కుమార్ హిరానీ, అనురాగ్ కాశ్యప్, ఆశుతోష్ గోవా రీకర్, జోయా అఖ్తర్ లాంటివాళ్ళున్నారు. ప్రస్తుత కమర్షియల్ వాతావరణంలోనూ కొన్ని మంచి చిత్రాలొస్తున్నాయి! ‘పాన్ సింగ్ తోమార్’, ‘ఉడాన్’, ‘కహానీ’ లాంటివి మంచివేగా! అయితే, వాటికి తగినంత ప్రచారం రావడం లేదు. 4 కోట్లతో తీసి, రూ. 12 కోట్లు వచ్చినవాటి గురించి మనం మాట్లాడం. వంద కోట్లు రాకపోతే, ఫ్లాప్ అనేస్తున్నాం. అది తప్పు. ఇరానియన్ సినిమాల్లో ఐటమ్ సాంగులున్నాయా? నిజానికి, కళాత్మక సినిమా తీయాలంటే, వసూళ్ళ గురించి మర్చిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది వట్టి అపప్రథ. అప్పట్లో నాలాంటి వాళ్ళతో దర్శ కుడు బాసూ ఛటర్జీ తీసినవి నాటకీయత లేకపోయినా, సక్సెస్ సాధించాయి. అంతెందుకు, ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే ఇరానియన్ చిత్రాలు సైతం ఇటు కళాత్మకంగా ఉంటూనే, అటు వాణిజ్య విజయం సాధిస్తున్నాయి. మనం వాణిజ్య ఫార్ములా అనుకొనే ఐటమ్ సాంగులు, ఫైట్లు లేకుండానే ఆ చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి, మనవాళ్ళు ‘వాణిజ్యపరంగా సేఫ్‌గా ఉండడాని’కంటూ ఏవేవో లెక్కలేసుకొని మాట్లాడడం, స్టార్లతోనే సినిమాలు తీయాలనుకోవడం తప్పు. అయినా, స్టార్లతో తీసినా సక్సెస్ వస్తుందన్న నమ్మకం ఏముంది! స్టార్లున్నా నూటికి 90 సినిమాలు ఫెయిలవుతున్నాయిగా! ఒక చిన్న ఉదాహరణ. మన అనేక రాష్ట్రాల కన్నా చిన్నది - చెక్ రిపబ్లిక్. ఇవాళ అక్కడి సినిమాలు ప్రపంచమంతటా చెప్పుకొనే స్థాయిలో ఉంటున్నాయి. మంచి చిత్రాలు రావడానికి డబ్బుల కన్నా కొత్త ఆలోచన ముఖ్యం. సాధారణ చిత్రాల మధ్య వినూత్నంగా ఉంటూ, ఆకర్షించాలి. అదే కీలకమంత్రం. సాహిత్యానికి దూరమవడం దెబ్బే! ఇప్పటికీ భారతీయ సినిమా అంటే, ఎప్పుడూ సోకాల్డ్ ‘బాలీవుడ్’ గురించే మాట్లాడుతున్నాం. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, బెంగాలీ, మరాఠీ తదితర భాషా చిత్రాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రతి పాంతానికీ తనదైన ప్రత్యేక భాష, సంస్కృతి, వ్యక్తిత్వం ఉన్నాయి. అవన్నీ కలిస్తేనే - మన భారతీయ సినిమా. అది గ్రహించకుండా ఎంతసేప టికీ ‘బాలీవుడ్’నే ప్రస్తావిస్తున్నాం. సాహిత్యం నుంచి మన సినిమాలు దూరం కావడం మరో పెద్ద దెబ్బ. నిజానికి, మన భాషల్లో అద్భుతమైన రచనలున్నాయి. సంప్రదాయం, సంస్కృతి ఉన్నాయి. వాటిని తెరపైకి తీసుకొస్తే ఇంకేం కావాలి! సాంకేతిక యుగంలో వచ్చిన తంటా గమ్మత్తేమిటంటే, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. పాత తరాలకు వాటిని చూసి భయం కానీ, పిల్లలకది ఈజీ. అయితే, మరింత తెలుసుకోవాలనే కోరిక ఈ తరంలోని కొందరిలో ఆ తొలి దశలోనే ఆగిపోతోంది. దేని గురించైనా తెలుసుకోవాలంటే వికీపీడియాలో చూసి వచ్చే స్తారు. అది సరైనదో కాదో చూసుకోవడం మానేస్తున్నారు. దాంతో, అసలు తంటా వస్తోంది. ఒకప్పుడు లైబ్రరీలకు వెళ్ళి, పుస్తకాలు వెతికి, చదివి, తెలుసుకొని, లోతుగా అధ్యయనం చేసేవాళ్ళం. ఇప్పుడది మానేశాం. ఇవాళ ఎవరైనా సులభంగా సినిమా తీసే డిజిటల్ యుగం వచ్చింది. కానీ, ఏం లాభం! ఉదాహరణకు, మనం కెమేరాలో తీసింది కేవలం ‘బొమ్మ’, అంతేతప్ప ‘ఫోటో’ కాదు. సరైన ఎక్స్పోజర్, సరైన ప్రింటింగ్ లాంటి వన్నీ ఉంటేనే ఏది ‘మంచి ఫోటో’ అనేది తెలుస్తుంది. అలాగే, సినీ రూపకల్పన కూడా! ముఖ్యంగా, ఇవాళ పిల్లల సినిమా తీయాలంటే, వాళ్ళకు ఏది ఆసక్తికరం, ఏది బాగుంటుందని ఆలో చించాలి. దానికి మళ్ళీ మనం ప్రాథమిక అంశాల దగ్గర కెళ్ళాలి. కానీ, అందుకు టైమ్ లేదంటాం. చిక్కంతా అదే! బాలల చిత్రాల్లోనూ... చూపు అటే! నిజంగా, ఇవాళ బాలల చిత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయంటే విచారం కలుగుతుంది. ఇన్ని కోట్ల మంది యువ జనాభా ఉన్నప్పటికీ మనం ఏమీ చేయడం లేదంటే తప్పు మనదే! ఎంతసేపటికీ ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఏం చేస్తోంది, భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అని విమర్శలు గుప్పిస్తే సరిపోదు. మన పిల్లలకు మనం చేయా ల్సింది చేస్తున్నామా అన్నది ముఖ్యం. అది మనం ఆత్మ పరి శీలన చేసుకోవాలి. ఇవాళ్టికీ బాలల చిత్రం అనగానే చాలా మంది మాయలు, దయ్యాల కథ లాంటివనుకుంటున్నారు. అవే తీస్తున్నారు. అది తప్పు. అంతకు మించి అంశాలెన్నో ఉన్నాయి. కానీ, వాటికి మార్కెట్లో అండ కావాలి. నా స్వీయ అనుభవమే చెప్పాలంటే, ఆరేళ్ళ క్రితం ‘దుమ్ కటా’ అనే హిందీ చిత్రం పిల్లల కోసం తీశా. అది మిస్టరీ కథాంశం కాదు. దయ్యాల కథ కాదు. దానికి గుల్జార్ గీత రచయిత. ప్రసిద్ధ శంకర్ -ఎహ్సాన్- లాయ్ త్రయం సంగీతమిచ్చింది. ఓంపురి లాంటి ప్రముఖులు నటించారు. కానీ, ఏం లాభం! ప్రచారం రాలేదు. ఎవరికీ తెలియదు. స్టార్ వ్యాల్యూ ఉన్నా, వాణిజ్య అంశాలు లేవని ఆ సినిమాను మార్కెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదీ దుఃస్థితి. ఈ విషవలయంతో అంతా మార్కెట్ నడిపించిన వైపు నడిచేస్తున్నారు. కొత్త భాష, భావవ్యక్తీకరణ అవసరం! నిజానికి, కొంతకాలంగా ‘జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ’ (ఎన్.ఎఫ్.డి.సి) చాలా మంచి సినిమాలు అందిస్తోంది. సహ నిర్మాణమైన ‘ది లంచ్ బాక్స్’, స్వయంగా నిర్మించిన ‘ది గుడ్ రోడ్’ లాంటి వాటితో ఇవాళ భారతీయ సినిమా ముఖచిత్రాన్నే అది మార్చేసింది. ఒక గౌరవాన్ని తెచ్చింది. మనందరం గర్వించేలా చేసింది. కానీ, వాటికి మనం అండదండగా నిలవడం లేదు. ఎంతసేపటికీ ‘ఎంతో డబ్బు వృథా అయింది’ అంటూ నెగటివ్ కోణం గురించే చెబుతు న్నాం. పాజిటివ్ కోణం గురించి మాట్లాడడం లేదు. అలాగే, కాఫీ మొదలు సినిమా దాకా ప్రతి ఒక్కటీ ఇన్‌స్టంట్‌గా ఉండాలని ఇవాళ్టి తరం భావిస్తోంది. అదే వాళ్ళ మంత్రం. కానీ, జీవితానికి అది సరిపడదని నా భావన. ప్రతి సమస్యకూ మనం త్వరితగతి పరిష్కా రాలు, సమాధానాలు ఆశిస్తున్నాం. కానీ, అలాంటివి ఉండవు. పిల్లలను తీర్చిదిద్దేందుకూ, వారిలో సున్నిత మైన భావోద్వేగాల స్పృహ కలిగించేందుకూ మంచి సాహిత్యం అవసరం. మంచి రంగస్థలం అవసరం. అలాగే, మంచి సంగీతం, మంచి సినిమా కూడా అవసరం. అప్పుడే పిల్లలు - మంచి పెద్దలుగా, మంచి మనుషులుగా తయారవుతారు. అయితే, పిల్లలు సైతం పరస్పరం ఎస్.ఎం.ఎస్.ల ద్వారా, ఇంటర్నెట్లో ఇ-మెయిల్స్ ద్వారా మాట్లాడుకుంటున్న రోజులివి. అందుకే, వాళ్ళను ఆకట్టుకోవాలంటే, ఈ తరం సినీ రూపకర్తలు తమదైన కొత్త భాషనూ, భావ వ్యక్తీకరణనూ ఆవిష్కరించు కోవాలి. అది కీలకం. ఇప్పుడు మళ్ళీ అన్ని రంగాల్లో ఆ పాత వైభవాన్ని పునరుద్ధరించాలంటే, తగిన కృషి చేయాల్సిన బాధ్యత యువతరానిదే! ఈ సమాజంలోని ఆలోచనాపరులం, బాధ్యతాయుతమైన పౌరులమైన ప్రతి ఒక్కరం ఆలోచించి, ఆ విషయంలో ఏ కొద్దిగానైనా మద్దతుగా నిలిస్తే ఎంతో చేయవచ్చు! అది నా ఆశ, ఆకాంక్ష మాత్రమే కాదు... అభ్యర్థన కూడా!! - సంభాషణ: రెంటాల జయదేవ -
పుస్తకావిష్కరణకు ద్రావిడ్, అమోల్!
-
పుణేలో రీపోలింగ్ జరపాలి
ముంబై: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరపాలని బోంబే హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నటుడు, దర్శకుడు అయిన అమోల్ పాలేకర్, అతడి భార్య సంధ్యా గోఖలే కలిసి ఈ పిల్‌ను వేశారు. ఏప్రిల్ 17వ తేదీన పుణేలో జరిగిన లోక్‌సభ ఎన్నిక సమయంలో తమ ఓట్లు గల్లంతుపై వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నామని, అప్పుడు ఓటర్ల లిస్టులో ఉన్న తమ పేర్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో గల్లంతు కావడంపై వారు కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసు మే 6వ తేదీన విచారణకు రానుంది. లోక్‌సభ ఎన్నికల్లో పుణే నియోజకవర్గం నుంచి ప్యూపుల్స్ గార్డియన్ పార్టీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ భాటియా పోటీచేశారు. అయితే పుణేలో వేలాది మంది నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. పుణేలో తిరిగి పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆ పిల్లో కోరారు. కాగా, భాటియా వేసిన పిటిషన్‌కు అమోల్ పాలేకర్ పిటిషన్‌ను జతపరిచేందుకు జస్టిస్ అభయ్ ఓకా అంగీకరించారు. కాగా, ఓటర్ల జాబితానుంచి పేర్లు గల్లంతైన పలువురికి ఓటర్ కార్డులున్నాయని, ఇటీవలే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారందరూ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని, కాని ఏప్రిల్ 17న జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో వారి పేర్లు గల్లంతు కావడం ఆశ్చర్యమేసిందని భాటియా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టు తయారీ సమయంలో ఎన్నికల అధికారులు నియమ నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆయన ఆరోపించారు. పేర్లు గల్లంతైన ఓటర్లలో చాలామంది కొన్నేళ్లుగా అవే ఇళ్లల్లో నివాసముంటున్నవారేనని ఆయన నివేదించారు. జనాభా గణన సమయంలో అధికారులు ఎటువంటి నియమనిబంధనలు పాటించారో, పేర్లు తొలగించేటప్పుడు సదరు ఓటర్లకు వారు సమాచారమిచ్చారా లేదా వంటి విషయాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికైనా ప్రస్తుతం గల్లంతైన ఓటర్ల పేర్లను సవరించి తిరిగి ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇదిలా ఉండగా, ఇటువంటి కేసులే ఒకటి ముంబై నుంచి, మరొకటి పుణే నుంచి హైకోర్టులో విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. -
ప్రాంతీయ చిత్రాలపై నిర్లక్ష్యం
= బాలీవుడ్ దర్శకుడు అమోల్ పాలేకర్.. = మంచి ప్రాంతీయ చిత్రాలూ ఫెయిల్ అవుతున్నాయి = చిన్న చిత్రాలకు వేదిక అవసరం = రాజకీయాలకు నేను దూరం = మోడీపై లతా మంగేష్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించను = అనేక విజయాలను చూశాననే ఆత్మ త ృప్తి చాలు = వన్డే మ్యాచ్‌ను తిలకించడానికి ఇక్కడికి వచ్చా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ప్రాంతీయ చిత్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారని బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. విజయవంతమైన వాణిజ్య చిత్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రాంతీయ చిత్రాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య ప్రాంతీయ సినిమా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు. జన జీవన స్రవంతిలో కలసిపోయే 90 శాతం సినిమాలు విజయాన్ని సాధించలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో చిన్న చిత్రాలకు వేదికను నిర్మిస్తే, ప్రేక్షకులు తమంతట తాముగా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో సంబరాలు భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహారాష్ర్టలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కె మహారాష్ట్ర వారు కావడంతో పాటు బాలీవుడ్‌కు ముంబై కేంద్రం కావడం దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు తానెంతో దూరమని చెప్పారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. అయితే బాధ్యత కలిగిన పౌరుడుగా తానేం చేయాలో బాగా తెలుసునన్నారు. 45 ఏళ్ల రంగ స్థల, సినిమా జీవితంలో ఎన్నో విజయాలను చూశానని అన్నారు. ఆత్మ తృప్తి ఉందన్నారు. ఇప్పుడు తన మూల వృత్తి చిత్ర కళపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. కాగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన చివరి వన్డేను తిలకించడానికి ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ప్రఖ్యాత క్రికెటర్ జీఆర్. విశ్వనాథ్‌తో కలసి మ్యాచ్‌ను చూడడాన్ని ఎప్పటికీ మరువలేనని చెప్పారు. తొలి నుంచీ తాను క్రికెట్ అభిమానిని, మ్యాచ్‌లను చూడడానికి షూటింగ్‌లకు కూడా ఆపేసే వాడినని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పలు సార్లు తన భార్య చేత చీవాట్లు తిన్నానని గుర్తు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా కన్నడ నట దిగ్గజాలు అనంత్ నాగ్, అరుంధతీ నాగ్, గిరీశ్ కర్నాడ్‌లతో కలసి కాలక్షేపం చేసే అవకాశం రావడం తనకెంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.