ఏపీలో ఇటీవల పర్యటించిన నీతి ఆయోగ్, ఐసిఎఆర్ ఉన్నత స్థాయి బృందం
ప్రకృతి వ్యవసాయదారులకు సబ్సిడీ, మద్దతు ధర ఎలా ఇవ్వాల్లో ఆలోచిస్తాం
వ్యవసాయ విస్తరణ, పరిశోధన, బోధనల్లో ప్రకృతి సేద్యానికి చోటు కల్పిస్తాం
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఊహించలేదు: నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
వినూత్న ఆవిష్కరణలు
ఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు.
ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్‌పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.
విభిన్నమైన దృష్టికోణం
పంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సబ్సిడీ ఎలా ఇవ్వగలం?
ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment