Snake Fruit: స్నేక్‌ ఫ్రూట్‌! | Heard about Snake Skin fruit? Read to learn about it | Sakshi
Sakshi News home page

Snake Fruit: స్నేక్‌ ఫ్రూట్‌!

Published Thu, Sep 26 2024 11:59 AM | Last Updated on Thu, Sep 26 2024 11:59 AM

Heard about Snake Skin fruit? Read to learn about it

‘స్నేక్‌ ఫ్రూట్‌’ లేదా సలక్‌ ఫ్రూట్‌. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్‌ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్‌ ఫ్రూట్‌ లేదా స్నేక్‌ స్కిన్‌ ఫ్రూట్‌ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్‌ ఫ్రూట్‌ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. 

పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ద హెల్త్‌ అని, సూపర్‌ హీరోస్‌ ఆఫ్‌ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్‌కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్‌ అని పిలుస్తున్నారు. 

న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్‌లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్‌ (కారోలిన్‌ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్‌ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.

20 అడుగుల ఎత్తు
స్నేక్‌ ఫ్రూట్‌ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్‌ ఫ్రూట్‌ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్‌ ఫ్రూట్‌ చెట్లలో (ఉదా.. సలక్‌ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.

తీపి కాదు, వగరు
సలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్‌.గ్లాబెరెసెన్స్, ఎస్‌. ఎడ్యులిస్, ఎస్‌.సుమత్రాన. ఎస్‌. గ్లాబెరెసెన్స్‌ను లోకల్‌ సలక్‌గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు.  ఎస్‌. ఎడ్యులిస్, ఎస్‌.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్‌. జటక్క, ఎస్‌. ఎడ్యులిస్, ఎస్‌.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్‌కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్‌రెంకంగ్, సైడెంపుయన్‌ వంటి అనేక రకాల స్నేక్‌ ఫ్రూట్‌ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్‌ ఫ్రూట్‌ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్‌కాక్‌ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.

పుష్కలంగా పోషకాలు
స్నేక్‌ ఫ్రూట్‌లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్‌ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్‌ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్‌ సుగర్‌ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్‌ డైటరీ ఫైబర్‌ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్‌ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. 

సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్‌ ఫ్రూట్‌ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్‌ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్‌ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్‌ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్‌ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్‌ ఆసిడ్‌ (400 ఎంజి/కేజీ), కెరోటిన్‌ (5 ఎంజి/కేజీ), థయామిన్‌ (20 ఎంజి/కేజీ), నియాసిన్‌ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్‌ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్‌ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. 

స్నేక్‌ ఫ్రూట్‌లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్‌ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్‌ సలక్‌) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్‌ ఫ్రూట్‌ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.

50 ఏళ్ల పాటు దిగుబడి
స్నేక్‌ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్‌ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్‌ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్‌ – అక్టోబర్‌ మధ్యలోనే పండ్లు వస్తాయి. 

మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. 

కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్‌ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్‌ సక్సెస్‌ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. 

పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్‌లో విక్రయించటంతో పాటు స్నేక్‌ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్‌ కలిపి వైన్‌ తయారీలో కూడా స్నేక్‌ ఫ్రూట్స్‌ వాడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement