భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా.. | Environmental Friendly Method For The Extraction Of Coir Fiber | Sakshi
Sakshi News home page

Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్‌ ఐదేళ్లలో..

Published Wed, Apr 9 2025 9:26 AM | Last Updated on Wed, Apr 9 2025 10:51 AM

Environmental Friendly Method For The Extraction Of Coir Fiber

మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కొబ్బరి చాపలనే కాయర్‌ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్‌ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది. 

భూవస్త్రాల మన్నిక ఎంత?
కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. 

‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్‌ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం. టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్‌ ఎక్కువగా ఉంది. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయి. 

90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్‌ బున్‌దేసంత్‌ ఫర్‌ మెటీరియల్‌ టెస్టింగ్‌ ఆన్‌ నేచురల్‌ ఫైబర్స్‌’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉంది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది. అయితే, ఆ భూమి తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులు, యువి రేడియేషన్, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఏ విధంగా వాడారు అన్న విషయాలపై కూడా మన్నిక ఆధారపడి ఉంటుంది.

కూరగాయ పంటల్లో భూవస్త్రంతో ఆచ్ఛాదన
పంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్‌ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఈ షీట్‌ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుంది. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్‌ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్‌ చేస్తున్నారు. అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. 

కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్‌.ఎం.(గ్రామ్స్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) నుంచి 2,000 జి.ఎస్‌.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్‌ షీట్‌గా 600 జి.ఎస్‌.ఎం.(సుమారుపావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో భూమిలో కలిసి΄ోతుంది.  ఫంక్షన్‌ హాల్స్, స్టార్‌ హోటళ్లలో కార్పెట్ల అడుగున కుషన్‌ ఎఫెక్ట్‌ కోసం 2,000 జి.ఎస్‌.ఎం. భూవస్త్రాలను వాడుతుంటారు. 

రోడ్ల మన్నిక పెరుగుతుంది
కొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అ్ర΄ోచ్‌రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదు.  

కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

భూవస్త్రాల ధర..?
కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్‌ను తయారు చేస్తారు. 

ఇవే భూవస్త్రాలు (కాయిర్‌ జియో టెక్స్‌టైల్స్‌). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్‌), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్‌ వోవన్‌). నాన్‌ వోవన్‌ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్‌ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 

అనేక దశాబ్దాలుగా కేరళ తదితర రాష్ట్రాల్లో సహకార సంఘాలు, వ్యాపారులు కొబ్బరి ఉప ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. కేరళలో కొబ్బరి పీచు ఉత్పత్తుల తయారీ కోట్లాది మంది (వీరిలో 80% మంది మహిళలు)కి ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ఫ్రాన్స్‌ వంటి దేశాలు భూవస్త్రాలతో భూమి కోతకు గురికాకుండా జలవనరుల పరిసరాల్లో వినియోగిస్తున్న తీరును చూసి ఇటీవల మన అధికారులు నోరువెళ్ల బెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.   

(చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement