
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది.
తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ అగర్వాల్.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోలేం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం.వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది.
ఇక.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. తన క్లయింట్ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.
మరోవైపు సమీపంలోని స్థలంలో తోటలు వేసుకునేందుకు అగర్వాల్ అనుమతి కోరగా.. అతనిపై దాఖలైన ధిక్కార పిటిషన్‌ను విచారణ తర్వాతే ఆ అంశంపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా.. జోన్‌లోని అటవీయేతర, ప్రైవేట్ భూములలోని చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసుకుంది.
తాజ్ ట్రాపిజెమ్ జోన్‌ను కేంద్రం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటు చేసింది. కాలుష్య కోరల్లోంచి తాజ్ మహల్‌తో పాటు ఇతర వారసత్వ సంపదలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ జోన్‌ను తీసుకొచ్చారు. మొత్తం 10,400 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో కొంత భాగం కూడా ఉంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న టీటీజెడ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. అయితే..
2019లో సుప్రీం కోర్టు టీటీజెడ్‌లో చెట్లను తొలగించడం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎత్తేసింది. వ్యవసాయ, పశుపోషణ సంబంధిత కార్యకలాపాల కోసం చెట్లను తొలగిండచంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. అయితే తర్వాతి రోజుల్లో ఆ ఉత్తర్వులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం 2019 నాటి ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.