నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్‌లో, పొరుగునున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.
ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు.
కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు.
కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్‌లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా?
కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.
ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు.
కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?
ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్‌లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.
ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది?
Comments
Please login to add a commentAdd a comment