మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణకు సుప్రీం ‘నో’
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది.
తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది.
అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్‌లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు.
ఫుట్‌పాత్ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment