
న్యూఢిల్లీ: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’’(Chhaava)ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.
మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యూస్18 తన కథనంలో పేర్కొంది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్‌గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది.
ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు.