
బాలీవుడ్ హిట్ సినిమా ఛావా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్‌గా హిందీ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
ఛావా సినిమాకు బాలీవుడ్‌లో హిట్ టాక్ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 11న హిందీ వర్షన్ మాత్రమే విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.. తాజాగా తెలుగు భాషలోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో టాలీవుడ్ అభిమానులు తమ సంతోషాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఈ వీకెండ్‌లో ఒక యోధుడి కథ గురించి తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.
ఛావా కథేంటంటే..
ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.