న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టం ప్రకారం జరగాలని పేర్కొంది. బుల్డోజర్ల చర్యపై మూడు రోజుల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా నూపుర్ శర్మవ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలంటూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో హింసాత్మక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఇకపై కూల్చివేయకుండా ఉండేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యోగీ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు పిటిషనర్ ఆరోపణలు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు. ఏ మత వర్గాన్ని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. కూల్చివేత సమయంలో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.
అలాగే బుల్డోజర్ల చర్యకు ముందు నోటీసులు అందించలేదనే ఆరోపణను కొట్టిపారేస్తూ.. ప్రయాగ్ రాజ్, కాన్పూర్‌లో కూల్చివేతలకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పింది. ఈ మేరకు యూపీ సర్కారు తరఫున అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
ఇక ప్రభుత్వానికి తన అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తమపై ఉందని, వారు కూడా సమాజంలో భాగమేనని తెలిపింది. చట్టం ప్రకారం మాత్రమే కూల్చివేతలు జరగాలని, ప్రతికారాత్మకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
చదవండి: చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment