న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమను తాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని, మనం పెత్తందారీ వ్యవస్థలో లేమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర అటవీ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఏకపక్ష ధోరణితో ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని రాజాజీ టైగర్ రిజర్వు డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని సీఎంను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రనా ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
’ఈ దేశంలో జన విశ్వాస సిద్ధాంతం లాంటిది ఉంది. కార్యనిర్వాహక అధిపతులుగా ఉన్న సీఎం పాత రోజుల్లో రాజుల మాదిరిగా వ్యవహరించకూడదు. ఆ కాలంలోవారు ఏం చేప్తే అది చేసేశారు. కానీ మనం ఫ్యూడల్ యుగంలో లేము. కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా చేయగలరా? బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందని, అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ఎందుకు అంత ప్రత్యేక ప్రేమ?
ఆయన్ను నియమించొద్దంటూ ప్రత్యేక నోట్ ఉంది. దాన్ని డిప్యూటీ సెక్రటరీ నుంచి మంత్రి దాకా అంతా ఆమోదించారు. అయినా సీఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు’ అని ధర్మాసనం మండిపడింది. దీంతోసెప్టెంబర్ 3నే రాహుల్ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాహుల్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు అధిపతిగా ఉండేవారు. అయితే, పులులు సంచరించే అడవిలో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనుమతించారన్న ఆరోపణలతో రెండేండ్ల కిందట ఆయన్ని పదవీచ్యుతుణ్ని చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అదే రాహుల్‌ను రాజాజీ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌గా ధామీ నియమించారు. దీనిని సీనియర్ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment