
అనుకున్నట్టే అయింది. సోమవారం కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరేయబోతున్నదని ఫలితాల సరళి తెలియజెబుతోంది. 343 స్థానాలున్న పార్లమెంటులో ఆ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందా, లేక వేరే పార్టీల ఆసరా కావాల్సివస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. గత మూడేళ్లుగా అధికార లిబరల్ పార్టీ అసంతృప్తిని మూట గట్టుకుంది.
ఈసారి దాని ఓటమి ఖాయమని అన్ని సర్వేలూ జోస్యం చెప్పాయి. మొన్న జనవరిలో సైతం కన్సర్వేటివ్‌ల కన్నా లిబరల్స్ 20 పాయింట్లు వెనకబడివున్నారు. ఈ దశలో అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావటం, ఆయన మతిమాలిన ప్రకటనలు, ఎడాపెడా సుంకాల విధింపు లిబరల్ పార్టీకి వరంలా మారాయి.
ఇతరేతర సమస్యలవీ మాయమై కెనడాను అమెరికా కబళిస్తుందన్న భయాందోళనలు ఆవహించి కన్సర్వేటివ్ పార్టీని కాదని జనం ఎప్పటిలా లిబరల్ పార్టీవైపే మొగ్గు చూపారు. ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో తప్పుకోవటం కూడా లిబరల్స్‌కు కలిసొచ్చింది. ఆయన స్థానంలో గత నెల మొదట్లో ప్రధానిగా వచ్చిన మార్క్ కార్నీ చకచకా చక్రం తిప్పారు. ట్రంప్‌తో సాన్నిహిత్యమున్న కన్సర్వేటివ్ పార్టీ వస్తే దేశాన్ని అమెరికా పాదాక్రాంతం చేయటం ఖాయమన్న ప్రచారం పనికొచ్చింది. కన్సర్వేటివ్ పార్టీ జాతకం తలకిందులైంది.
ప్రపంచ సంపన్న రాజ్యాల్లో ఒకటిగా, అమెరికా సన్నిహిత మిత్ర దేశంగా, వాణిజ్య భాగస్వా మిగా దశాబ్దాలపాటు వెలుగులీనిన కెనడా కొన్నాళ్లుగా కష్టాల్లో కూరుకుపోయింది. అయిదేళ్ల నాడు విరుచుకుపడిన కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. జీవనవ్యయం అపారంగా పెరిగింది. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరగటంతో శివారు ప్రాంతాలకు జనం తరలిపోయారు.
గృహ కొనుగోలుదారులు ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. ఇళ్లు లేని పౌరుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీటన్నిటి పర్యవసానంగా పుట్టుకొచ్చిన సామాజిక అశాంతి మాదకద్రవ్యాల వాడకాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. దాంతోపాటే నేరాల సంఖ్య ఎక్కువైంది. నిజానికి ఇది కెనడాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. సంపన్న దేశాలన్నీ ఈ మాదిరే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కానీ కెనడా పౌరులు దీన్నంతటినీ లిబరల్ పార్టీ చేతగానితనంగా పరిగణించారు. గత మూడేళ్లుగా కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పొయ్‌లేవ్ దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తమకే సాధ్యమని ప్రచారం చేశారు. ఆవరించిన ఈ సంక్షోభం బహుశా చాలా దేశాల మాదిరే కెనడాలో కూడా మిత వాదపక్షాన్ని అందలం ఎక్కించివుండేది.
కానీ ట్రంప్ అధిక సుంకాలు విధించటం, కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవటం ఖాయమని తరచు చెప్పటం కన్సర్వేటివ్‌ల ఆశల్ని అడియాసలు చేసింది. పౌరుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారు గెలిస్తే అదే జరగొచ్చునన్న సంశయం బలపడింది. తమ సహజ వనరులు, ఆర్థిక సంపద దోచుకోవటానికి అమెరికా తహతహలాడు తున్నదని, దీన్ని నిలువరించగల పార్టీ లేకుంటే ట్రంప్ అన్నంతపనీ చేస్తారని వోటర్లు భావించారు.
ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వాటి ధరలు దిగొచ్చేలా చేస్తామని రెండు ప్రధాన పక్షాలూ వాగ్దానం చేశాయి. కొత్త భవనాల నిర్మాణంపైవున్న ఆంక్షల్ని ఎత్తేస్తామని కన్సర్వేటివ్‌లు హామీ ఇస్తే... ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కార్నీ వాగ్దానం చేశారు. అమెరికా నిజ స్వరూపం తెలిసింది గనుక ఇకపై భద్రతకు ఆ దేశంపై ఆధారపడకుండా సొంతంగా సైన్యాన్ని రూపొందించుకోవాలని రెండు పార్టీలూ ప్రతిపాదించాయి.
అధిక సుంకాల విషయంలో కూడా ఆ రెండు పక్షాలదీ ఒకే మాట. కెనడా ఎగుమతుల్లో 80 శాతం అమెరికాకే చేరతాయి. అధిక సుంకాలు విధిస్తే కెనడా తీవ్రంగా నష్టపోతుంది. తాము కూడా అధిక సుంకాల ప్రక్రియ మొదలెట్టామని,దాంతో ఆ దేశం గత్యంతరం లేక చర్చలకు దిగొచ్చిందని కార్నీ చెప్పారు. అయితే కన్సర్వేటివ్‌లు ఇంత బలంగా ట్రంప్‌పై విరుచుకుపడలేకపోయారు.
ఇక అధిక వలసలపై కూడా ప్రజల్లో ఆగ్రహం వుంది. లిబరల్స్ ఏలుబడిలో వలసలు పెరిగాయని వారు నమ్మారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొత్తగా ఖనిజాలు, శిలాజ ఇంధనాల వెలికితీతను నిలిపేయటంవల్ల ఆ రంగాల్లో ఉపాధి అవకా శాలు అడుగంటాయని, తామొస్తే దీన్ని సరిదిద్దుతామని కన్సర్వేటివ్‌లు హామీ ఇచ్చారు. నిజానికి ఈ సమస్యలే అమెరికాలో మితవాద రిపబ్లికన్ పార్టీని అందలం ఎక్కించాయి. కానీ ట్రంప్ రాకతో ఆ సమస్యలన్నీ మరుగునపడి కెనడాలోని మితవాద పక్షాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి.
కార్నీ ఏలుబడిలో మనతో కెనడా సంబంధాలు మెరుగుపడతాయన్న అభిప్రాయం అందరిలో వుంది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే దారి దొరక్క, ఆ అసంతృప్తిని కప్పిపుచ్చటానికి ట్రూడో భారత్‌తో కోరి వైరాన్ని తెచ్చుకున్నారు. తీరా జగ్‌మీత్ సింగ్ ఆధ్వర్యంలోని ఖలిస్తానీ అను కూల న్యూడెమాక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీ)కే ఈసారి దిక్కులేకుండా పోయింది. బలపడిన జాతీయ వాదం ఎన్‌డీపీని దెబ్బతీసింది. సిక్కువోటర్లు లిబరల్స్ వైపే మొగ్గారు.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా, కెనడా సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా కార్నీకి ఆర్థిక రంగంలో అపార అనుభవం వుంది. దేశ ఆర్థికవ్యవస్థకు నూతన జవసత్వాలు తెచ్చేందుకు ఆయన సహజవాయు నిక్షేపాల, ఖనిజాల వెలికి తీతకు ప్రాధాన్యమిస్తారని అంచనాలున్నాయి. మొత్తానికి ఇరుగుపొరుగు దేశాల్లో మితవాదులుంటే వారిలో ఒకరికి మాత్రమే గెలుపు దక్కుతుందని... ఒకచోట మితవాదుల దూకుడు మరొక దేశ మితవాదులకు ప్రాణాంతకమవుతుందని కెనడా ఫలితం నిరూపించింది.