General election
-
‘ఎన్నికల’ పెండింగ్ బిల్లులకు రూ.286.36 కోట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు నాయకులను, ఓటర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను పరిశీలించాలని కోరుతూ ఈసీ నిర్దేశించిన రూ.5,66,400 రుసుము చెల్లించారు. నగరంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్లలోని సింబల్ స్లిప్‌లతో సరిచూడాలని ఫిర్యాదులో కోరారు. పరిశీలనకు 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతో ఈసీ ఈవీఎంల చెకింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బాలినేని కోరిన విధంగా కాకుండా పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను డిలీట్ చేసి, కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే చెక్ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు కొత్తగా వచ్చినపుడు ఫస్ట్‌లెవల్ చెకింగ్, కమిషన్ చెకింగ్ చివరికి పోలింగ్ రోజు కూడా అన్నీ పార్టీల ఏజెంట్ల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహిస్తారని మరళా ఇప్పుడు మాక్‌పోలింగ్ నిర్వహించడం అర్థం లేదన్నారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లతో సరిచేస్తే సందేహాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. అయితే కలెక్టర్ ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు ఈవీఎంల చెకింగ్ మాత్రమే చేస్తామని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే జిల్లా అధికారులు మాక్ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్దకు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. మాక్‌పోలింగ్ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని బాలినేని తరఫున హాజరైన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాక్‌పోలింగ్‌ను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీం తీర్పు ఏం చెబుతోందంటే...ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్‌ల్లో ఉన్న స్లిప్‌లతో సరిపోల్చాలని ఎన్నికల్లో పోటీ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈసీని కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 శాతం ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు గాలికొదిలేశారు. అభ్యర్థి కోరిన పోలింగ్ బూతుల్లో వినియోగించిన ఈవీఎం ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈవీఎంల అవకతవకలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను తొలగించి మాక్‌పోలింగ్ నిర్వహించి ఉంటే కోర్టు ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే అధికారులు ఏం చేసి ఉండేవారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాక్‌పోలింగ్ ప్రక్రియ ఎవరి మెప్పు కోసం నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాక్‌పోలింగ్ కాకుండా ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్లతో సరిచూడాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం, అధికారులు పోలింగ్ రోజు ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామనడంపై బాలినేని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఓట్లను తొలగిస్తే నిజాలు నిగ్గు తేలేది ఎలా..?ఎన్నికల సంఘం, అధికారులు ఈవీఎంల్లో అవకతవకలు ఉన్నాయని వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలను పరిశీలించాల్సిందిపోయి ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు ఓట్లను ఈవీఎంల్లో తొలగిస్తామని, ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు కేవలం డమ్మీ బ్యాలెట్‌తో యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తామనడంలో అర్థంలేదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ తప్పులు జరగకుంటే పోలైన రోజు ఈవీఎం ఓట్లను, వీవీ ప్యాట్లోని స్లిప్‌లతో పరిశీలించవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బాధ్యత లేని ‘బోగస్’ గెలుపు!
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ) అనే వేదిక తయారైంది.వీఎఫ్‌డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్‌డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.ఈవీఎమ్‌ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్‌లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్‌లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్‌డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్‌ల బదులు కౌంటింగ్‌లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్‌డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్‌డీ తెలియజేసింది.వీఎఫ్‌డీ సంస్థ బోగస్‌గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్‌డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.వీఎఫ్‌డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్‌గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.వీఎఫ్‌డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్‌షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్‌లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్‌ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్‌తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్‌ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్‌బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Britain general elections: బ్రిటన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్‌గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్‌లోని క్యామ్‌డెన్ విల్లింగ్‌హామ్ హాల్ పోలింగ్‌కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్‌లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
బ్రిటన్‌లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK general election 2024: స్టార్మర్... సరికొత్త ఆశాకిరణం
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్‌లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్నిరుపేద నేపథ్యం..దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్‌గా బదులిస్తారు స్టార్మర్. కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్‌దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్‌మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం. ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్‌గా నిలిచేందుకు సాయపడిందంటారు. 50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం 50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్‌గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్‌కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి. విజయమే లక్ష్యంగా... కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.కొసమెరుపు లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్‌కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!ప్రస్తుత బలాబలాలుబ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.పార్టీ స్థానాలుకన్జర్వేటివ్ 344లేబర్ 205ఎస్ ఎన్ పీ 43లిబరల్ డెమొక్రాట్స్ 15ఇతరులు 43 -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
సోషల్ మీడియా దన్నుగా...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు -
జనరల్ ఎన్నికల ఫలితాలు 2024
-
Telangana: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది. -
ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, ఢిల్లీలో ఒకట్రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ విడతలో కూడా బెంగాల్లోనే అత్యధికంగా 79.40 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో 63.76 శాతం, ఒడిశాలో 69.32, హరియాణాలో 60.06, ఢిల్లీలో 57.67, బిహార్‌లో 55.24, యూపీలో 54.03 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ లోక్‌సభ స్థానంలో 54.15 శాతం పోలింగ్ జరగడం విశేషం. అక్కడ గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యధికం. దీంతో జమ్మూ కశీ్మర్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడి 5 లోక్‌సభ స్థానాల్లో కలిసి 58 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికమని ఈసీ పేర్కొంది. అక్కడి బారాముల్లా (59 శాతం), శ్రీనగర్ (34.4 శాతం) స్థానాల్లోనూ ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. శనివారంతో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఓటేసిన ప్రముఖులు రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దాంతో ప్రముఖులంతా ఓటింగ్‌కు తరలివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్సింగ్ పురి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా దంపతులు, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ తదితరులు ఓటు వేశారు. ప్రియాంక కూతురు మిరాయా తొలిసారి ఓటేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆప్‌కు ఓటేయగా... ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కాంగ్రెస్‌కు ఓటేయడం విశేషం. సోనియా, రాహుల్ ఓటేసిన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఆప్, కేజ్రీవాల్‌కు ఓటున్న చోట చాందినీచౌక్ స్థానంలో కాంగ్రెస్ బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తుండటం తెలిసిందే.బెంగాల్లో బీజేపీ అభ్యరి్థపై దాడి! బెంగాల్‌లోని ఝార్గ్రాంలో తృణమూల్ కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఆరోపించారు. తనతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. బీజేపీ ఖుర్దా అసెంబ్లీ అభ్యర్థి, చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ తన అనుచరులతో పాటు ఓ పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ అధికారిని తీవ్రంగా గాయపరిచారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్!
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్‌గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్‌సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్‌లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్‌లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్‌ను ఆయన కుమారుడు కుల్దీప్ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి ఈ పారిశ్రామిక హబ్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్‌పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్‌ను కాదని అశోక్ తన్వర్‌కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో ఆరో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో ప్రచారం గురువారంతో ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్ శనివారం జరగనుంది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హరియాణాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు. -
Lok Sabha Election 2024: ఐదో విడతలో 62.2% పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అత్యధికంగా పశి్చమబెంగాల్లో 78.48%, అత్యల్పంగా బిహార్‌లో 56.76% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. మే 20న 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగడం తెలిసిందే. అయిదో విడతలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. మహిళలు 63 శాతం, పురుషులు 61.48 శాతం, థర్డ్ జెండర్ 21.96 శాతం మంది ఓటేశారని ఈసీ పేర్కొంది. -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
అందరి కన్నూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. -
దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ పూర్తి
-
పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ సహాయం కోరారు. తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్‌లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్‌లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు. వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్‌కు వృద్ధుడు ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్‌లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్‌వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు. అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్‌కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్‌కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్‌కు వేసిన ఓపీఓపల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్‌లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు.