2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఈ ఓట్లలో ఐదో వంతు చెల్లనివే
అప్పట్లో 2.95 లక్షల పోస్టల్ ఓట్లు నమోదైతే అందులో 56,545 చెల్లని ఓట్లు
ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4.44 లక్షల మంది ఓటు
అందులో చాలాచోట్ల గెజిటెడ్ అధికారి సంతకం లేకుండా ఓట్లు వేసినట్లు అనుమానాలు
దీంతో చెల్లని ఖాతాలోకి ఎన్ని వెళ్తాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు.
అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment