అద్దంకి, న్యూస్‌లైన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో తలెత్తిన వివాదం శనివారం ఉపాధ్యాయుల ధర్నాకు దారితీసింది. అధికారులు రోజుకో మాట మార్చడంతో సుమారు 300 పోస్టల్ ఓట్లు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఏ మండలంవారు ఆ మండలంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని అధికారులు తొలుత సూచించారు. దీంతో సుమారు 1000 వరకూ ఆయా మండలాల్లో పోలయ్యాయి.
ఇంకా 300 పోస్టల్ ఓట్లు పోలవ్వాల్సి ఉన్నాయి. వీటిని అద్దంకిలోనే వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు శుక్రవారం అద్దంకి రాగా వారికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాలెట్ ఓట్లు చేతికి ఇవ్వమని, పోస్టులో పంపిస్తామని అధికారులు సెలవిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు తహసీల్దార్ జీ సుజాత దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఉదయం వస్తే బ్యాలెట్ పేపర్లు చేతికిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఉపాధ్యాయులు కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు కనిపించలేదు. ఉన్నతాధికారులకు ఫోన్ చేయగా బ్యాలెట్ పేపర్లు పోస్టులోనే పంపుతామ ని సెలవిచ్చారు.
దీంతో ఆగ్రహించిన ఉ పాధ్యాయులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సుజాతతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్వో ఆదేశాలు అలానే ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో శని, ఆదివారాలు సెలవులు కావడంతో పోస్టల్ బ్యాలెట్‌లు అందే అవకాశం లేదని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఓట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఓట్లు చెల్లకుండా పోతే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు వెనుదిరిగారు. గంగాధర్, బాబూరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్లపై రగడ
Published Sun, May 11 2014 1:57 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement