పోస్టల్ బ్యాలెట్ల వైపు చూపు
ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థుల పాట్లు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల చూపు పోస్టల్ బ్యాలెట్లు పొందిన ఉద్యోగస్తులపై పడింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ నువ్వా, నేనా అన్నట్టుగా ఎన్నికలు జరగడంతో ప్రతి ఓటూ కీలకమైంది. దీంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థు లు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరిలో ఎన్నికల విధులు నిర్వహించే సుమారు 16 వేల మంది పోస్టల్ బ్యాలెట్లు పొందారు.
ఇప్పటికే వీరి ఇళ్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు చేరాయి. దీంతో అభ్యర్థులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇళ్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ చేసి మరీ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సామాజిక కులాలు, బంధుత్వాల పేరుతో భోజనాలు పెడుతూ ఒక్కో ఓటుకు *500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తున్నట్లు భోగట్టా. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘ నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల చుట్టూ అభ్యర్థులు, మద్దతుదారులు చక్కర్లు కొడుతున్నారు.