General election polling
-
ఎన్నికల ఖర్చు రూ.250 కోట్లు!
- జిల్లాలో కరెన్సీ వర్షం.. మద్యం వరద - ఈ విషయంలోనే ముందున్న టీడీపీ - ఓట్ల కొనుగోలుతోనే గెలుపు అనే రీతిలో బరితెగింపు - డబ్బు మూటలు గుమ్మరించిన కార్పొరేట్ నేతలు, సంస్థలు - ఫలితంగా కరెన్సీని కరపత్రాల్లా పంచిన దేశం అభ్యర్థులు శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం వెల్లువెత్తింది. మద్యం కూడా దానితో పోటీ పడింది. వెరసి నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.250 కోట్ల మార్కు చేరిందంటే.. సామాన్యుల గుండె జారిపోతుందేమో.. కానీ ఇది వాస్తవం. గత రెండు ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష పాత్రతో సరిపెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అందలం ఎక్కాలని అన్ని రకాల మాయోపాయాలు ప్రయోగించింది. ముఖ్యంగా మందు.. మనీతో ఓట్ల కొనుగోలుపైనే ప్రధానంగా ఆధారపడింది. దీనికి బడా కార్పొరేట్ సంస్థలు, నేతలు దన్నుగా నిలిచారు. టీడీపీలో హవా చెలాయిస్తున్న కార్పొరేట్ నేతలతోపాటు ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం టీడీపీ తరఫున నోట్ల మూటలు కుమ్మరించారని తెలుస్తోంది. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు వారం రోజుల్లో టీడీపీ పక్కా ప్రణాళికతో కరెన్సీ నోట్లను కరపత్రాల్లా పంచిపెట్టింది. నిబంధనలకు మించి.. అన్ని రకాల ధరలు పెరిగిన నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. సవరించిన నిబంధన ప్రకారం అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షల వరకు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయాలి. అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించేందుకు వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. అయినా సరే.. అభ్యర్థులు, పార్టీలు ఎక్క డా తగ్గలేదు. అధికారుల కళ్లుగప్పి.. ఓటర్లను మద్యం, నగదుతో ముంచెత్తారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మొత్తం 84 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షలు చొప్పున లెక్కవేస్తే రూ.23.52 కోట్లు ఖర్చు కావాలి. అందరూ నిర్ణీత మొత్తం ఖర్చు చేస్తేనే ఇంతవుతుంది. అలాగే ఎంపీ బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరి ఖర్చు 2.80 కోట్ల రూపాయలు దాటకూడదు. విజయనగరం, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నందున వాటిని లెక్కలోకి తీసుకున్నా రూ.5 కోట్లు దాటే పరిస్థితి లేదు. అంటే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి జిల్లాలో ఎన్నికల ఖర్చు 30 కోట్ల రూపాయలకు మించకూడదు. కానీ వాస్తవంగా అయిన ఖర్చు దీనికి ఎనిమిది రెట్లు మించిపోవడం విశేషం. చివరి నాలుగు రోజుల్లో వరదే ఎన్నికల వ్యయంలో అత్యధిక శాతం చివరి నాలుగు రోజుల్లోనే ఖర్చయ్యింది. అన్ని నియోజకవర్గాల్లోనూ మద్యం ఏరులై పారింది. ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన టీడీపీ ఈ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో ఉంది. జిల్లాలోని మద్యం షాపులన్నింటి నుంచీ అడ్వాన్సులు చెల్లించి కోట్ల రూపాయల మద్యాన్ని ముందుగానే గ్రామాలకు తరలించి రహస్యంగా నిల్వ చేసింది. ఇది చాలదన్నట్లు ఆ పార్టీ నాయకులు ఒడిశా మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున తెప్పించి విచ్చలవిడిగా పంపిణీ చేశారు. దీనికితోడు ఓటుకు 300 నుంచి 1000 రూపాయల వరకు ఆ పార్టీ నాయకులు చెల్లించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రేటును, పట్టణ ప్రాంతాల్లో ఒక రేటును అమలు చేశారు. తమకు ఓట్లు తక్కువగా వస్తాయనుకున్న ప్రాంతాలను పచ్చనోట్లతో ముంచెత్తారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ తదితర నియోజకవర్గాల్లో సొమ్ము భారీగా ఖర్చు చేశారు. ఇంత చేసినా.. వందల కోట్ల రూపాయలు వదిలించుకున్నా.. ఓటరు మాత్రం కరుణించిన దాఖలాలు లేకపోవడంతో ఆ పార్టీలో నిరాశానిస్పృహలు అలుముకున్నాయి. -
పోస్టల్ బ్యాలెట్ల వైపు చూపు
ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థుల పాట్లు విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల చూపు పోస్టల్ బ్యాలెట్లు పొందిన ఉద్యోగస్తులపై పడింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ నువ్వా, నేనా అన్నట్టుగా ఎన్నికలు జరగడంతో ప్రతి ఓటూ కీలకమైంది. దీంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఓట్లు పొందడానికి అభ్యర్థు లు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరిలో ఎన్నికల విధులు నిర్వహించే సుమారు 16 వేల మంది పోస్టల్ బ్యాలెట్లు పొందారు. ఇప్పటికే వీరి ఇళ్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు చేరాయి. దీంతో అభ్యర్థులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇళ్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ చేసి మరీ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సామాజిక కులాలు, బంధుత్వాల పేరుతో భోజనాలు పెడుతూ ఒక్కో ఓటుకు *500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తున్నట్లు భోగట్టా. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘ నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల చుట్టూ అభ్యర్థులు, మద్దతుదారులు చక్కర్లు కొడుతున్నారు. -
ఓటు వేయలేదని టీడీపీ వర్గీయుల దాడులు
ఇనిమెళ్ళలో వైఎస్సార్ సీపీ వర్గీయులు ఇళ్లపై రాళ్ల వర్షం వినుకొండ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపిన ఆదరణను చూసి ఓటమి భయంతో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ వ ర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని భౌతిక దాడులకు దిగుతున్నారు. అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారని అందువలనే వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారని అంటున్నారు. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు. సైకిల్‌కు ఓటు వేయలేదన్న అక్కసుతో అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఇంత జరిగినా ప్రశ్నించేవారు లేకపోవడంతో వారి ఆగడాలకు అద్దూ ఆపులేకుండా పోయింది. దీంతో నియోజవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల రోజు ఈపూరు మండలంలోని ఇనిమెళ్ళలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ వర్గానికి చెందినవారిపై రాళ్ల వర్షం కురిపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని రెచ్చిపోతున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందోనన్న భయంతో గ్రామంలో ఉన్న మహిళలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే మండలానికి చెందిన చిట్టాపురం, గోపువారిపాలెం, ముప్పాళ్ళ, శ్రీనగర్ తదితర గ్రామాల్లో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. బొల్లాపల్లి మండలంలోని పలుకూరు, రేమిడిచర్ల, వడ్డెంగుంట గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేకున్నాయి. పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసుల హెచ్చరికలను భేఖాతర్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావణం నెలకొల్పాలని అంటున్నారు. -
దేశంలో నైరాశ్యం
సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ డీలా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూసి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పైకి మాత్రం తమదే గెలుపంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో జిల్లా నాయకులు కూడా అదే పంథా అనుసరిస్తున్నారు. నిజానికి జిల్లాలో ఒకరిద్దరు నేతలు తమ గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారం దక్కేలా లేదని తెలిసి మదనపడుతున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఓటమి భయంతో వణికిపోతున్నారు. కంచుకోటల్లోనూ ఎదురీత.. ఈ నెల 12, 13 తేదీల్లో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతల్లో కలకలం మొదలయింది. ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ఎదురీదిన విధానాన్ని బట్టి ఇక మిగతా చోట్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థమౌతుందని స్వపక్ష నేతలు వాపోతున్నారు. అసలు టికెట్లు కేటాయించడంలో అధిష్టానం చేసిన తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని కొందరు అధినేత తీరునే తప్పుబడుతున్నారు. ఎంపీలుగా స్థానికులకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి గుంటూరు, నరసరావుపేట స్థానాలను కేటాయించారని మండిపడుతున్నారు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీకి నష్టం చేకూర్చిందని ద్వితీయశ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. విజయంపై వైఎస్సార్ సీపీ ధీమా.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఫుల్‌జోష్‌తో ఉన్నాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందనే ధీమాగా ఉన్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై తమను పెట్టిన ఇబ్బందులకు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పారని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కంచుకోటల్లో సైతం తమ పార్టీ విజయం సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’పై గల్లా ఫైర్.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు తమ అధినేత చంద్రబాబులాగే ‘సాక్షి’ పత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. గురువారం రాత్రి గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ ‘సాక్షి’ మీడియాపై తమ ఆక్రోశం, అక్కసును వెళ్లగక్కారు. ఎల్లో మీడియాను వెనకేసుకు తిరుగుతున్న ఆ పార్టీ నేతలు తమ అసలు రంగు బయటపెడుతున్న సాక్షి వల్ల ప్రజల్లో తాము దోషులుగా నిలబడాల్సి వస్తోందని భావిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ‘సాక్షి’పై చర్యలకు సిఫార్సు చేస్తామంటూ అడ్డగోలు ప్రకటనలు చేశారు. ఇదంతా గమనిస్తున్న సొంత పార్టీ నేతలే వీరి తీరును తప్పుబడుతున్నారు. ఆ నేతల అసహనం ఓటమిని అంగీకరించినట్లుగా ఉందంటున్నారు. -
‘గ్రేటర్’ గులాబీ దళపతి ఎవరో?
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య సాక్షి, హైదరాబాద్:‘గ్రేటర్’లో ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ వీడడంలేదు. ఈ పదవిలో కొనసాగిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రెండు నెలలు కావస్తున్నా ఈ పదవీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికీ కట్టబెట్టకపోవడంతో నగరంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఊపుతో ఉన్న గులాబీ దళం గ్రేటర్ పరిధిలోనూ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఉన్న ఆపార్టీ శ్రేణులు నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని పటిష్టం చేసేందుకు యువకుడు,సమర్థులైన వారికే ఈ పదవిని కేటాయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ పదవిపై కన్నేసిన పలువురు నాయకులు ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో పార్టీ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేష్, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహేందర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌కు చెందిన ఆళ్లకుంట హరి ముందున్నారు. మురుగేష్ వైపే అధిష్టానం మొగ్గు.. ఇప్పటికే గ్రేటర్ టీఆర్ఎస్ కార్యవర్గంలో చురుకుగా పనిచేస్తున్న అధికార ప్రతినిధి మురుగేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల అధినేత కేసీఆర్‌ను కలిసి తాను పార్టీ పటిష్టతకు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై వివరించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు సైతం ఆయనకే మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌తో అనుబంధం ఉన్న నాయకుడు, అందరికీ సుపరిచితుడైన వివాదరహితుడినే ఈ పదవికి ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
సేమ్ డే..
- పదహారుపైనే అభ్యర్థుల ఆశలు - 2009లో ఇదే తేదీన కౌంటింగ్ ఇప్పుడు కూడా.. - జాతకం కోసం పంతుళ్ల వద్దకు పరుగులు హన్మకొండ, న్యూస్‌లైన్ : టికెట్ ఖరారు అయింది. బీఫాం చేతికొచ్చింది. నామినేషన్ దాఖలు చేయాలి... అప్పుడు పుజారుల వద్దకు అభ్యర్థుల ఉరుకులు, పరుగులు. ఇదంతా సాధారణమే. కానీ, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు పూజారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. 2009 ఎన్నికల్లో గెలిచి ఇప్పటిదాకా ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు మరింత ముందుగా అయ్యగార్ల వద్దకు వెళ్తున్నారు. ఎందుకంటే.. దానికో సెంటిమెంట్ ఉంది. అప్పుడు.. ఇప్పుడు సాధారణ ఎన్నికల కౌంటింగ్ ఒకేరోజు వచ్చింది. అదే ఈసారి స్పెషల్. మే 16వ తేదీపై అభ్యర్థులు అడ్డగోలుగా ఆశలు పెట్టుకున్నారు. గంపెడాశలు 2009లో ఏప్రిల్ 16న సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అంటే.. మే 16న ఓట్లను లెక్కించారు. ఈ ఫలితాల్లో జిల్లా నుంచి పలువురు కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు రాజకీయ అనుభవం లేని చాలా మంది నేతలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఏప్రిల్ 30న ఎన్నికలు జరగగా.. మే 16న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. యాదృచ్ఛికంగానే అయినా.. లెక్కింపు సమయం, రోజు మాత్రం ఒకేసారి వచ్చాయి. గతంలో పలుమార్లు ఎన్నికలు జరిగినా.. లెక్కింపు తేదీలు కలిసి రాలేదు. కానీ.. ఈసారి అనుకోకుండానే ఓట్ల లెక్కింపు ఒకేరోజున వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఒకేసారి రావడంతో 2009లో గెలిచిన అభ్యర్థులు ఈసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. మరి కొందరు ఈసారి తమకు జాతకపరంగా కలిసొస్తుందనే ఆశతో ఉన్నారు. 2009లో మే 16న సమయం తమకు కలిసొచ్చిందని, ఆ ఎన్నికల్లో విజయం సాధించామని, ఈసారి కూడా అదే తేదీ రావడంతో తామే గెలుస్తామం టూ జాతకాలు చూపించుకుంటున్నారు. తెలుగు పం చాంగాలు ముందేసుకుని తమ అదృష్టాన్ని క్యాలెండర్ కాగితాల్లో మరీ వెతుకులాడుకుంటున్నారు. విరోధి నా మ సంవత్సరంలో కలిసొచ్చిన అదృష్టం.. జయనామ సంవత్సరంలో కూడా తమకే ఉంటుందనే ధీమాతో పంతుళ్ల వద్దకు వెళ్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ దాటి, పోలింగ్ ముగిసినా.. జాతకాలు చూస్తున్న పూజారులకు మాత్రం ఇంకా డిమాండ్ ఉంది. అంతేకాక అప్పుడు కొద్దోగొప్పో ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు, కొత్తగా పోటీకి దిగిన అభ్యర్థులు సైతం మే 16పై ఉత్కంఠతో ఉన్నారు. 2009లో అదృష్టం కలిసి రాలేదని, 2014 మే 16న మాత్ర అదృష్టం తమనే వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009లో సాధారణ ఎన్నికల్లో చాలా మంది గెలిచారని, ఈసారి కూడా కొత్తగా వచ్చిన తమకూ మే 16 పదవిని తెస్తుందని సంబురపడుతున్నారు. మే 16 మాత్రం ఎవరిని కుర్చీలో కూర్చోబెడుతుందో మరో 9 రోజులు ఆగాల్సిందే. -
పోలింగ్‌కు సర్వం సిద్ధం
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంపీ బరిలో 10 మంది, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 84 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. 2009 ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ జరగగా ఈ దఫా 88 శాతానికి పెరిగేలా చూసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 19,85,239 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 9,93,032 మంది, పురుషులు 9,92,031, ఇతరులు 176 మంది ఉన్నారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో 14,07,659 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 7,05,872 కాగా పురుషులు 7,01,787 మంది. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,68,126 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 85,394 మంది కాగా పురుషులు 82,722 మంది. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,09,454 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 2,01,766, పురుషులు 2,07,688 మంది ఉన్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 10 మంది, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 12 మంది, నరసన్నపేటలో ఏడుగురు, ఆమదాలవలసలో 9 మంది, టెక్కలిలో ఆరుగురు, పలాసలో 11 మంది, పాతపట్నంలో ఆరుగురు, ఇచ్ఛాపురంలో 9 మంది, రాజాంలో 9 మంది, ఎచ్చెర్లలో 8 మంది, పాలకొండలో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2559 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని 1961 పాఠశాల భవనాల సమదాయాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 1336 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో సున్నితమైనవి 807, అతి సున్నితమైనవి 493, తీవ్రవాద ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 26 ఉన్నాయి, 10 పోలింగ్ కేంద్రాలకు రవాణా సౌకర్యం లేదు. 2559 పోలింగ్ కేంద్రాల్లో 6330 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలను వినియోగిస్తున్నారు. వీటిలో నోటా ఆప్షన్ ఉంది. పోలింగ్ స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా 792 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 430 మంది వీడియెగ్రాఫర్లు పోలింగ్‌ను చిత్రీకరించనున్నారు. 450 మంది సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, పోలింగ్ అనంతరం నిర్దేశిత స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకోవడానికి 314 రూట్లు ఏర్పాటు చేశారు. దీనిని 351 మంది రూట్ ఆఫీసర్లు, 351 మంది జోనల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం 294 ఆర్టీసీ బస్సులు, 126 మినీ బస్సులు, 41 వ్యాన్, లారీ, టాటామాజిక్ వాహనాలు, 330 కార్లు, జీపులు వినియోగిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా టెక్కలి నియోజకవర్గంలో 199 ఉండగా, పాతపట్నంలో 139, నరసన్నపేటలో 141, ఇచ్చాపురంలో 147, పాతపట్నంలో 137 ఉన్నాయి. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఎచ్చెర్లలోని శివానీ ఇం జనీరింగ్ కళాశాల భవన సముదాయాల్లో భద్రపరచనున్నా రు. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ నియోజకవర్గ ఓటింగ్ యంత్రాలను తొలుత పాలకొండ ఏఎంసీ భవనంలో భద్రపరుస్తారు. అనంతరం విశాఖకు తరలిస్తారు. -
వందేళ్ల ఓటరు చైతన్యం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్... ఓటర్లు వరుసలో నిలబడి ఓట్లు వేసి బయటకు వస్తున్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. విశేషం ఏమిటంటే, ఆ ముగ్గురూ మూడు తరాల ప్రతినిధులు.101 ఏళ్ల నారాయణ స్వామి, ఆయన కుమారుడు, మనుమరాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి దాకా విడవకుండా ఓటు వేస్తున్న శతాధిక చైతన్యశీలి నారాయణ స్వామిని కదిలిస్తే... సామాజిక అభివృద్ధి! స్వాతంత్య్రం తరవాత భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. రిజర్వేషన్లు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. సమాజంలో అన్ని వర్గాల్లోనూ విద్యాప్రమాణాలు, జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా చిన్నతనంలో భూస్వాములు... పనివాళ్లను ఓటు వేయనివ్వకుండా కొట్టాల్లో దాచేసేవారు. ఎస్.సి. లకు కేటాయించిన స్థానాల్లో తమ పాలేర్లను నిలబెట్టి వారిని నామమాత్రంగా ఉంచేసేవారు. ఆ స్థితి నుంచి ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో స్వేచ్ఛ వచ్చింది. మేము హైస్కూల్‌కి ఏడు మైళ్లు నడిచివెళ్లాం. ఈ తరం ఇంటర్నెట్ సాయంతో ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చూసేస్తోంది. జ్ఞానం మన అరచేతిలోకే వచ్చేసింది. రవాణా సులువైంది. అప్పటితో పోలిస్తే చాలానే అభివృద్ధి జరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్లో నాయకుల కామెంట్లకు లైక్‌లు కొట్టే యువత పోలింగ్‌బూత్ వైపు అడుగు వేయట్లేదు. అలాంటిది ఈ వందేళ్ల పౌరుడు ఓటేయడానికి వచ్చాడు. తనతోపాటు కొడుకును తీసుకురావడం సరే... మనుమరాలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ప్రేరణగా నిలిచారీయన. ఈ సందర్భంగా మువ్వా నారాయణస్వామి పంచుకున్న అనుభవాలు... గ్రామంలో చైతన్యం! ‘‘మాది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నరసాయపాలెం. మా గ్రామంలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఇందుకు ఓ ఉదాహరణ... 1952- 55 మధ్య సంగతి ఇది. జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజకీయ విధానాల గురించి గ్రామస్థులకు వివరించే ప్రయత్నంలో మేధావులు ఊరూరికీ వచ్చారు. మా ఊరికీ ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. వాళ్లు ఊరిపొలిమేరలో పశువుల కాపర్లతో మాటలు కలిపారు. అప్పుడు మా గ్రామంలో పశువులు కాసుకునే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆ లాయర్లు బదులు చెప్పలేకపోయారు. నిరక్షరాస్యుల్లోనే ఇంత చైతన్యం ఉంటే చదువుకున్న వాళ్లతో చర్చించడం తమకు సాధ్యమయ్యే పని కాదని ఊళ్లోకి రాకుండానే వెనక్కివెళ్లారు. అదే చైతన్యంతో మేము గ్రామంలో పాతుకొని పోయి ఉన్న మారెమ్మ జాతరలో జంతుబలిని ఆపేశాం. వేదాలు చదివిన త్రిపురనేని రామస్వామి చౌదరి, కొల్లూరి రాఘవయ్యలతో గ్రామంలో తర్కం నడిపి పొత్తర్లు వంటి క్రతువులను ఆపేశాం’’ అన్నారు నారాయణస్వామి. యోధుల ప్రసంగాలు... రచనలు! జాతీయోద్యమం దిశగా తనను ప్రభావితం చేసిన అంశాలనూ గుర్తు చేసుకున్నారాయన. ‘‘వీర సావర్కర్ రాసిన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ చదివాను. మార్క్స్, వివేకానందుని రచనలు చదివాను. మా చిన్నప్పుడు వేసవిలో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. చండ్రరాజేశ్వరరావు గారి దగ్గర డ్రిల్ నేర్చుకోవడం నాకు బాగా గుర్తుంది. కమ్యూనిస్టు నాయకులు వచ్చి విప్లవాల గురించి బోధించేవారు. వివిధ దేశాల విప్లవాలను చదివాను. ఆ ప్రభావంతో ఇంటర్ చదివేటప్పుడు బందరులో ఎన్నికల్లో చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాం’’ అన్నారు. ప్రజా జీవితం నుంచి అజ్ఞాతం లోకి... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులకు పోరాటం తప్పలేదు. 1947లో మనకు ప్రకటించింది సంపూర్ణ స్వాతంత్య్రం కాదు, అధినివేశ ప్రతిపత్తి మాత్రమేనని, భారతీయులు బ్రిటన్ రాణి పాలనలో ఉన్నట్లేనని ఊరూరా ప్రచారం చేశాం. 1948వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మా నరసాయపాలెంలో నేను ప్రసంగిస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాను. వీటన్నింటినీ దాటుకుని 1950లలో మా బాపట్లలో స్వయంగా ఎన్నికలు నిర్వహించిన బృందం మాది. మా ఊరి గ్రంథాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చింది ప్రభుత్వం. అప్పుడు మేము మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. మా నాన్న ప్రజాఉద్యమాలు, రాజకీయాల్లో ఎంత చొరవగా ఉన్న ఫర్వాలేదు, కానీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయవద్దు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, ఆ మాట ప్రకారం నేను పోటీ చేయలేదు’’ అన్నారు. ఎందుకు ఉద్యమించామో! ప్రజల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదంటారు రాజనీతిజ్ఞులు. ఆ స్తబ్ధత పోవాలంటే ఓ నిశ్శబ్ద విప్లవం రావాల్సిందే. కానీ మనదేశంలో విప్లవం వచ్చే అవకాశాల్లేవంటారు నారాయణస్వామి. ‘‘పాశ్చాత్యులు వచ్చిన వందల యేళ్లకు కానీ జాతీయోద్యమం మొదలు కాలేదు. అప్పట్లో పోలీసులు వస్తే మా ఇంటి కుక్క వాళ్లను అడ్డుకుంది. దానిని తుపాకీతో మోది చంపారు. వెనుకవైపు నుంచి వచ్చిన పోలీసులను మా ఎడ్లు ఢీ కొన్నాయి. పోలీసుల విధ్వంసంతో ఒక ఎద్దుకు పిచ్చిపట్టింది, మా నాన్న పక్షవాతంతో మంచం పట్టారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అప్పుడు మేము ఉద్యమించినది ఎందుకో అర్థం కావట్లేదు’’ అన్నారు కొంత నిర్లిప్తంగా. క్రియాశూన్య జ్ఞానంతో సున్నా! గ్రామాలు రాజకీయంగా చైతన్యవంతం అయ్యాయి. గ్రామీణులు ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. కానీ ఊళ్లో అరుగుల మీద కూర్చుని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదు అని తూర్పారబట్టడానికే పరిమితమవుతున్నారు. సొంతూళ్లో పాల డెయిరీ ఎలా నడుస్తోంది? చౌక దుకాణంలో సరుకులు సరిగా ఇస్తున్నారా? పంచాయితీ ఎలా నడుస్తోంది... అని చూడడం లేదు. క్రియాశూన్యమైన కొండంత జ్ఞానంతో ఏదీ సాధించలేం, క్రియాశీలకంగా గోరంత జ్ఞానం చాలు... అనేటప్పుడు ఆయన మాటల్లో సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం కనిపించింది. నాటి జ్ఞాపకాలతోనే... ‘‘రెండవ ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల సైన్యం మనదేశంలోకి చొచ్చుకు వస్తోందనే సమాచారంతో మాకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. చేతి రుమాలులో కొండరాళ్లు కట్టే వాళ్లం. శత్రువులు వస్తే ఆ రాళ్ల మూటను వడిసెలాగా తిప్పి విసిరితే అక్కడికక్కడే కింద పడిపోతారు. అలా ఏవేవో నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థం కాని పుస్తకం తీసుకుని కుస్తీ పట్టడమే నా వ్యాపకం’’ అన్నారాయన నవ్వుతూ. ప్రతిరోజూ ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలు చదువుతారు నారాయణస్వామి. ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌ను క్రమం తప్పరు. వీటితోపాటు ప్రాచీన భారతీయ సంస్కృతి, సామాజిక రచనలనూ చదువుతారు. ప్రజాస్వామ్యం అంటే... ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగడం అని మాత్రమే మనకు పుస్తకాలు తెలిపాయి. అయితే ఆ ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యేవారే అయి ఉండాలని మరో భాష్యం చెప్పారు నారాయణస్వామి. ఈయన చదివిన పుస్తకాలన్నీ చదవడం ఎందరికి సాధ్యమవుతుందో కానీ, ఆయనే ఓ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు : ఎస్ ఎస్ ఠాకూర్ మనలో ఒకరైతే! ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వారైతే ఓటు వేయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలోని ప్రజల కోసం పనిచేసిన వాళ్లు, కనీసం మాటసాయానికి అందుబాటులో ఉండే వాళ్లు నిలబడితే అందరూ ఓటు వేస్తారు. అలా కాకపోతే ఎన్నికల పట్ల ఆసక్తి చూపించలేరు. ఇందుకు బాధ్యత అంతా రాజకీయ పార్టీలదే. - మువ్వా నారాయణస్వామి -
‘గుర్తింపు’ కార్డేనా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లా గతంలో ఎన్నడూ లేనంతగా అధమ రికార్డును సొంతం చేసుకుంది. విద్యావంతులు, మేధావులు, ఉన్నతవర్గాలు ఓటుహక్కు వినియోగంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారులు, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటుహక్కుపై జిల్లావాసుల్లో స్పందన ఆశించినంతగా కనిపించ లేదు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు చేసిన కృషి నిష్ఫలమైంది. ఎవరెంత చెప్పినా తామింతే అని జిల్లా ఓటర్లు మరోసారి రుజువు చేశారు. ఓటరు కార్డును కేవలం గుర్తింపు పత్రంగానే భావిస్తున్నారు తప్ప దాని ప్రయోజనాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. గతం కంటే భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఫొటో గుర్తింపు కార్డు కూడా పొందారు. కానీ వారిలో అధిక శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అటు పురుషులది, ఇటు మహిళలదీ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఓటు చైతన్యం వెల్లివిరిసినా జిల్లాలో ఓటింగ్ శాతం మాత్రం తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇద్దరూ సమానం జిల్లాలో మొత్తం 53,48,927 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 28,65,211 మంది. ఇందులో 16,03,257 మంది ఓటేశారు. 24,83,110 మంది మహిళా ఓటర్లలో 13,89,340 మంది ఓటేశారు. మొత్తం కలిపి 29,92,597 మంది మాత్రమే ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక 606 మంది ఇతరుల్లో ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, పరిగి నియోజకవర్గాల్లో ఈసారి మహిళలు స్వల్ప సంఖ్యలో పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌లో 48.24 శాతం మంది పురుషులు ఓటేయగా, మహిళలు 49.11 శాతం మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో 50.10 శాతం పురుషులు, 50.70 శాతం మహిళలు ఓటేశారు. ఎల్బీనగర్లో 46.93 మంది పురుషులు, 47.59 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిగిలో 69.59 పురుషులు 72.16 శాతం మహిళలు ఓటును సద్వినియోగపరుచుకున్నారు. మిగిలిన అన్ని స్థానాల్లో మహిళల కంటే పురుషులే అత్యధికంగా ఓటేసినా జిల్లా వ్యాప్తంగా వచ్చేసరికి ఇరువురూ సమానంగా 55.95 శాతం ఓటేశారు. కాగా 2009 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 40,18,140 మందిలో 23,37,163 మంది ఓటేశారు. మల్కాజిగిరి అధమం ఇక లోక్‌సభ స్థానాల పోలింగ్ విషయంలో మల్కాజిగిరి పరిధిలో రాష్ట్రంలోనే కనిష్ట ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 51.19శాతం మందే మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. జనాభా పరం గా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజి గిరిలో పోలింగ్ శాతం ఇంత అధమంగా ఉండటం నిరాశ కలిగించేదే. మరో లోక్‌సభ స్థానం చేవెళ్లలో కాస్త మెరుగ్గా 60 శాతంపైగా పోలింగ్ నమోదైంది. -
ఓటేయని బద్ధకస్తులు 4,88,693
పెరిగిన పోలింగ్ శాతం - జిల్లాలో 80శాతానికి పైగా పోలింగ్ -అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్ల జోరు జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 80.66శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 25,41,607మంది ఓటర్లు ఉండగా.. 20,37,613 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 4,88,693 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. తక్కువ ఓటుహక్కు వినియోగించిన వారిలో నల్లగొండ నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 2,21,836మంది ఓటర్లుండగా.. 1,63,913మందే ఓటేశారు. ఇంకా 57,923మంది ఓటును వినియోగించుకోలేదు. అదేవిధంగా ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో భువనగిరి నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 1,86,607మంది ఓటర్లుండగా.. 1,58,595మంది ఓటేశారు.కేవలం 28,012మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకోలేదు సాక్షి, నల్లగొండ, జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీలు.. దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీ లున్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. విద్యావంతులు, మేధావుల సంఖ్య కూడా ఎక్కువే. అయినా సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అన్ని నియోజకవర్గాల్లో 80శాతానికి పైగా పోలైతే.. నల్లగొండలో 73.89శాతం, సూర్యాపేటలో 78.89, మిర్యాలగూడలో 79.15శాతం పోలింగ్ జరగడం ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరి సింది. ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం ముందు బారులు దీరారు. ఓటుపై జిల్లా యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు ఎంత ప్రచారం చేసినా నగరాలు, పట్టణాల్లో ఫలితమివ్వలేదు. -
కొత్త రాష్ర్టంలో సరికొత్త రికార్డు
నర్సంపేట, న్యూస్‌లైన్ : మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు చేసి నర్సంపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 87.59 శాతం ఓటింగ్‌తో తెలగాణ కొత్త రాష్ట్రం లో సరికొత్త రికార్డును సొంతం చేసుకుని నంబ ర్-1 స్థానంలో ఉంది. సమష్టి కృషి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు, 95 రెవెన్యూ గ్రామాలు, 106 గ్రామ పంచాయతీలు, 2,85,360 మంది జనాభా, 2,05,516 మంది ఓటర్లున్నారు. ప్రజలు ఓటు విలువ తెలుసుకోవడంలో అధికారుల కృషితోపాటు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల పట్టుదల కూడా తోడైంది. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోం ది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. అందులోనూ రోడ్డు, ర వాణా సౌకర్యం అంతంత మాత్రమే. అయినా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కాలినడకన పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ప్రశాంత వాతావరణం నర్సంపేటకు కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. ఇక్కడ హత్యా రాజకీయాలూ ఉండే వి. ప్రతీ ఎన్నికల్లో కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చేవారు. ఓడించేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు జరిగేవి. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో హత్యలకు దారితీసేది. ఒకానొక దశలో ఓటు వేయడానికి ప్రజలు భయపడే వారు. ఓంకార్ ఎంసీపీఐ స్థాపించిన తర్వాత గెలుపు కోసం ఆయన ప్రతి ఒక్కరితో ఓటు వేయించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కృషికి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేక చొరవ తీసుకుంది. అధికారుల సహకారంతో క్రమేణా ప్రజల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడమే కాకుండా రికా ర్డు సాధించి ఆదర్శంగా నిలవడానికి పునాదు లు పడ్డాయి. ఉద్దండుల పోటీ ఓ కారణం నియోజకవర్గం జనరల్ కేటగిరికి రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో ఇక్కడి నాయకుల పాత్ర కీలకంగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసే వారే ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పోలింగ్ బూత్‌ల వరకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించ డం ఓటింగ్ అత్యధికంగా నమోదు కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 జిల్లాల్లో నర్సంపేటలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం గర్వంగా ఉందని ఆయా నాయకులు ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు -
స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిన ఈవీఎంలు
16న తేలనున్నఅభ్యర్థుల భవితవ్యం ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు బుధవారం ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఈవీఎంలు సెయింట్ జోసఫ్, మౌంట్‌ఫోర్ట్ హైస్కూళ్లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఖమ్మం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. భారీ బందోబస్తు మధ్య ఆయా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. మే 16న కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు వరకు ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధులు నిర్వహించనున్నారు. 16న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ఉన్నాయి. వీరి భవితవ్యం తేలాలంటే ఈనెల 16 వరకు ఆగాల్సిందే. ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటని బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. -
యువహో..
- సార్వత్రిక ఎన్నికల్లో యువత జోష్.. - పోలింగ్‌లో భారీగా పాల్గొన్న యూత్ - జిల్లాలో 11,30,127 మంది... ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువ జోష్ కనిపించింది. ఈ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేస్తున్నామనే సంతోషంతో ఉదయం 7 గంటలకే పలువురు యువతీ యువకులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసి వచ్చాక వారి ఆనందం ఆకాశాన్నంటింది. మొదటిసారి ఓటు వేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని పలువురు యువ ఓటర్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లకు గాను 11,30,127 మంది యువతీ యువకులే ఉన్నారు. పోలింగ్‌కు ఆసక్తి చూపిన యువత.. 18 -19 సంవత్సరాల వయసు కలిగిన యువతకు మొదటిసారి ఓటు హక్కు రావడంతో వారిలో అత్యధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 20 - 39 మధ్య వయసున్న వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎక్కువ శాతం యువత ఓటు హక్కు వినియోగించుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సత్ఫలితాలిచ్చిన సదస్సులు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కళాశాలల్లో యువతను ఓటర్లుగా చేర్పించడంతో పాటు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిజాయితీతో పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎన్నికల సంఘం పలు చోట్ల అవగాహన సదస్సులు, కళాజాతాలు నిర్వహించింది. ఈ సదస్సులు సత్ఫలితాలు ఇవ్వడంతో యువత ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే కొన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. తమ మేనిఫెస్టోల్లో సైతం యువతకు పెద్దపీట వేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించాయి. యువ ఓటర్లే కీలకం... సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను నిర్ణయించేది యువతే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఉన్న ఓటర్లలో సగం మంది వారే కావడం గమనార్హం. తమ భవితవ్యం యువత చేతిలో ఉందని గుర్తించిన ఆయా పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించారు. కొన్నిచోట్ల క్రికెట్ కిట్లను కూడా పంపిణీ చేశారు. అయితే యువ ఓటర్లు మాత్రం నిజాయితీ కలిగిన, పనిచేసే అభ్యర్థులకే ఓటు వేశామని చెబుతున్నారు. -
80శాతం పోలింగ్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల యంత్రాంగం అందించిన సమాచారం ప్రకారం....బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో మొత్తం 80 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 82 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లాలో అత్యధికంగా పాలేరు, మధిర నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదైంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ 89 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇక, జిల్లాలో అత్యల్పంగా ఇల్లెందు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కేవలం 72 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సత్తుపల్లిలో 85 శాతం, వైరాలో 81.2, పినపాకలో 80, అశ్వారావుపేటలో 85.52, భద్రాచలంలో 73, కొత్తగూడెంలో 72.61శాతం పోలింగ్ నమోదైంది. -
సార్వత్రికం ప్రశాంతం
- ఉదయం 7 గంటల నుంచే ఈవీఎంల మొరాయింపు - గంటల తరబడి క్యూలో నిల్చున్న ఓటర్లు - రోళ్లపాడు, బేతాళపాడులో పోలింగ్ - బహిష్కరణ.. అధికారుల బుజ్జగింపులు సాక్షి, ఖమ్మం, తెరవడంతోనే ఈవీఎంల మొరాయింపు.. ఉదయమే భారీ క్యూలైన్లు... పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు, నాయకుల ఘర్షణ.. వసతుల లేమి.... సమస్యలు పరిష్కరించలేదని పలు గ్రామాల్లో ఓటు బహిష్కరణ.. అధికారుల బుజ్జగింపులు...ఇలాంటి ఘట్టాల నడుమ సార్వత్రిక సమరం బుధవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మండుటెండను దృష్టిలో ఉంచుకుని ఉదయమే ఓటు వేద్దామని వచ్చిన ఓటర్లకు ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఇబ్బందులు తప్పలేదు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. గొల్లగూడెం, రఘునాథపాలెం, యూపీహెచ్‌కాలనీ, పాండురంగాపురం, రోటరీనగర్ ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పాండురంగాపురంలో కేంద్రానికి ఏజెంట్లు రాకపోవడంతో ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కాడా కార్యాలయం, రమణగుట్ట, వేపకుంట్ల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మిబండ బజారులో పోలింగ్‌కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి రవిమారుత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో సీపీఐ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేసిన ఘటనలో ఆ పార్టీకి చెందిన నలుగురికి, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలింగ్ బూత్‌లో సీపీఐకి చెందిన ఏజెంట్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లకు చెబుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, ఎంవీపాలెం, తిరుమలాయపాలెం మండలంలోని తాళ్లచెర్వు, కొక్కిరేణి, జూపెడ, కూసుమంచి మండలం గంగబండతండా, గురవాయిగూడెం, జీళ్లచెర్వు గ్రామాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో నామా నాగేశ్వరరావు కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ నామా పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట, జమ్మిగూడెం, మామిళ్లవారిగూడెం, నారంవారిగూడెం, నారాయణపురం, దమ్మపేట మండలం దమ్మపేట, మందలపల్లి, నాగుపల్లి, ఆర్లపెంట, అకినేపల్లి, ముల్కలపల్లి మండలం పూచిగూడెం, మాదారం, పాతగంగారం, చంద్రుగొండ మండలం చంద్రుగొండ, మద్దుకూరు, తుంగారం, రావికంపాడు, కుక్కునూరు మండలం మారేడుబాక, వేలేరుపాడు మండలం పాతపూచిరాల గ్రామాల్లో పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే ఈవీఎంలను అమర్చారు. అయితే అన్నిచోట్లా పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అశ్వారావుపేట మండలం కొత్తమామిళ్లవారిగూడెంలో 119, 120 బూత్‌లలో ఈవీఎంలపై ఫ్యాను గుర్తు బటన్లు లోనికి ఇరుక్కొని పోవడంతో వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి టెక్నీషియన్లను పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అనంతరం పోలింగ్ మొదలైంది. ఇల్లెందు నియోజకవర్గంలో 14 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ ఈవీఎంలను మార్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. కామేపల్లి మండలంలో కొమ్మినేపల్లి, బండిపాడు, ముచ్చర్ల, జాస్తిపల్లి గ్రామాల్లో మొదట ఈవీఎంలు పని చేయకపోవడంతో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. టేకులపల్లి మండలం రోళ్లపాడు పోలింగ్ స్టేషన్ పరిధిలోని 438 మంది ఓటర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 9 గంటల వరకూ ఏజెంట్లు కూడా రాలేదు. పోలింగ్ మొదలు కాలేదు. దీంతో సీఐ రాజిరెడ్డి, తహశీల్దార్ ఉప్పలయ్య గ్రామస్తులతో మాట్లాడడంతో ఉదయం 9,30 గంటలకు గ్రామస్తులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బొమ్మనపల్లి ఓటర్లు శంభునిగూడెంలో, శంభునిగూడెం ఓటర్లు బొమ్మనపల్లిలో ఓటు వేశారు. కొత్తగూడెం మండలంలోని రేగళ్ల, రుద్రంపూర్ ఐటీఐ, గౌతంపూర్, చాతకొండ, పోలింగ్ స్టేషన్లలో, కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామచంద్ర గర్ల్స్ హైస్కూల్, బాబుక్యాంప్, పాల్వంచ రాతిచెరువు బంజర, ఆశ్రమ పాఠశాల, ఇందిరా కాలనీలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 11 గంటల నంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా, హమాలీ కాలనీలో సుమారు 300 మందికి ఓటరు గుర్తింపు కార్డులున్నా జాబితాలో పేర్లు లేవని, స్లిప్పులు లేవని అధికారులు వారిని ఓటు వేయనివ్వలేదు. జయమ్మ కాలనీలో గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని 100 కుటుంబాలు ఓటును బహిష్కరించాయి. భద్రాచలంతో పాటు చింతూరు, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల్లో ఏజెం ట్లు సకాలంలో రాకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభించారు. భద్రాచలం మండలం లక్ష్మీపురంలో ఈవీఎం మెరాయించడంతో అరగంటకు పైగా పోలింగ్ నిలిచిపోయింది. భద్రాచలం- చింతూరు రహదారిలో బండిరేవు సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా చెట్టు వేశారు. వీటిని మావోయిస్టులు వేసినట్లుగా అనుమానిస్తున్నారు. భద్రాచలంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు యశోద రాంబాబు డబ్బు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదైంది. బూర్గంపాడు మండల కేంద్రంలోని పినపాక పట్టినగర్, కృష్ణసాగర్, సారపాకలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ సుమారు 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అశ్వాపురం మండలంలోని వెంకటాపురం, మల్లెలమడుగు, కుమ్మరిగూడెం, అశ్వాపురంలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పినపాక మండలంలోని ఆరు గ్రామాల్లో, మణుగూరు మండలంలో ఐదు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సత్తుపల్లి పట్టణంలోని 183, 155, 175 పోలింగ్ కేంద్రాలు, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల 121, లంకపల్లి 143, వేంసూరు మండలం పల్లెవాడ పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. వెంటనే అధికారులు వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు బారులుదీరారు. పలు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే క్యూలో నిల్చొని ఓటు వేశారు. ఏన్కూరు మండలం రాజులపాలెం, జూలూరుపాడు మండలంలోని భేతాళపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డి మాండ్ చేస్తు గ్రామస్తులు గ ంటన్నరపాటు పోలింగ్‌ను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎస్పీ రంగనాధ్, ఎఎస్పీ ఏసుబాబు, ఇతర అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించి ఓటు వేశారు. వైరా మండల కేంద్రంలోని 159వ పోలింగ్ కేంద్రం, గరికపాడు, గొల్లపూడి, విప్పలమడక గ్రామాలతో పాటు, తాటిపూడి గ్రామాలలో ఈవీఎంల వైర్లు ఊడిపోవడంతో పనిచే యలేదు. జూలూరుపాడు మండలం పాపకొల్లు, కోయకాలనీ, అనంతారం, వెంగన్నపాలెం, కొణిజర్ల మండలం కొండవనమాల, చిన్నమునగాల, చిన్నగోపతి, కారేపల్లి మండలంలోని గేట్‌కారేపల్లి, ఉసిరికాయలపల్లి, గుంపెలగూడెం గ్రామాల్లో గంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమయింది. ఏన్కూరు మండలంలోని తూతక్క లింగన్నపేట, ఆరికాయలపాడు, శ్రీరామగిరి, గ్రామాల్లో పోలింగ్ గంట ఆలస్యమైంది. మధిర మండలం ఆత్కూరు, దెందుకూరు, ఎస్ఎఫ్ఎస్, చింతకాని మండలంలోని చిన్నమండవ, బోనకల్ మండలంలోని గోవిందాపురం, బోనకల్, ఎర్రుపాలెం మండలంలోని సత్తెనవీడు, ముదిగొండ మండలంలోని వల్లభి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడెంలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే సీపీఐ అభ్యర్థి నారాయణ కంకి కొడవలి గుర్తుకు ఓటు పడింది. దీన్ని గమనించిన ఓటర్లు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ అధికారులు వేరే ఈవీఎంను ఏర్పాటు చేశారు. టీంవర్క్‌కు నిదర్శనం: ఎస్పీ రంగనాథ్ ‘జిల్లా ప్రజలందరి సహకారంతో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించుకోగలిగాం. ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా, పోలింగ్ సిబ్బంది... ఇలా అన్ని వర్గాలు మాకు సహకరించాయి. గత రెండునెలలుగా విపరీతమైన పని ఒత్తిడి ఉన్నా మన జిల్లా పోలీసులతో పాటు ఇతర జిల్లాల పోలీసులు కూడా బాగా పనిచేశారు. వరుస ఎన్నికల విధులు, రాజకీయ నాయకుల పర్యటనలకు బందోబస్తుతో పోలీసు యంత్రాంగం రెండు నెలలుగా విరామం లేకుండా పనిచేస్తోంది. ఎలాంటి సంఘటనా జరగకుండా ఎన్నికలు పూర్తి చేయడం టీంవర్క్‌కు నిదర్శనం. జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.’ - ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్.. -
విలేకరిని కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలి
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను కవరేజీ చేస్తున్న విలేకరినికొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. బుధవారం మండలంలోని బేగంపేటలో ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటర్లకు పార్టీ గుర్తు చూపిస్తూ ఓట్లు అభ్యర్థించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విలేకరులు ఫొటోలు తీస్తూ, వివరాలు తెలుసుకుంటున్నారు. గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూనే అక్కడ ఉన్న విలేకరి మల్యాల సురేశ్‌పై చేయిచేసుకున్నారు. మిగితా లేకరులను కూడా దుర్భాషలాడారు. దీంతో విలేకరులు సీఐపై చర్యలు తీసుకోవాలని సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ శ్రీధర్, కమాన్‌పూర్ ఎస్సై సతీశ్ వచ్చి విలేకరులను సముదాయించారు. విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని గోదావరిఖని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పూదరి సత్యనారాయణ, పీవీ రావు, బబ్బార్ఖాన్, బుర్ర తిరుపతి, పోసు భిక్షపతి, బండ సాయిశంకర్, గాదె బాలయ్య, బొల్లవరం వాసు, విజయ్, మాటేటి కుమార్, చేతి రవి, ఆరెపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాక్సుల్లో భవితవ్యం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ తొలి అసెంబ్లీ పట్టాభిషేకానికి జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగగా కొత్త రాష్ట్రంలో తొలి చట్టసభ సభ్యులయ్యేందుకు అభ్యర్థులు సర్వశక్తులొడ్డారు. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నమోదు చేయగా... ఈ నెల 16న కౌంటింగ్ జరిగే వరకూ అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లోనే భద్రంగా ఉండనుంది. సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. ఏ నియోజకవర్గంలో చూసినా... ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే చర్చే సాగుతోంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా... దాదాపు అన్నిచోట్లా త్రిముఖ, చతుర్ముఖ పోటీలే. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పోలింగ్ సరళిని ఎవరికి వారే తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు తమవే అంటూ ఢంకా భజాయిస్తున్నారు. ఎక్కడెక్కడ విజయావకాశాలున్నాయనే అంశంపై లెక్కలు కడుతున్నారు. బయటకు ధీమాగా ఉన్నా... లోలోపల మాత్రం అన్ని పార్టీల అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. వీళ్లంతా తమ అదృష్టాన్ని తలుచుకుంటూ మే 16న కౌంటింగ్ జరిగి, ఫలితాలు వెలువడేవరకూ నిరీక్షించక తప్పదు. పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. జిల్లాలో మొత్తం 3419 పోలింగ్ కేంద్రాల్లో 20492 ఈవీఎంలను వినియోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో ముందస్తు జాగ్రత్తగా రిటర్నింగ్ అధికారుల వద్ద ఉంచిన యంత్రాలు ఉపయోగించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈ యంత్రాలను పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా వేర్వేరు చోట్ల భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారితోపాటు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గదులకు తాళాలు వేసి సీలు వేశారు. మే 16న అందరి సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూంలను తెరిచి ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. బాక్సులను భద్రపరిచింది ఇక్కడే కరీంనగర్ ఎంపీ - కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి - ఎస్సారార్ డిగ్రీ కళాశాల పెద్దపల్లి ఎంపీ - పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి - అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల నిజామాబాద్ ఎంపీ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఈవీఎంలను సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల -
టీఆర్ఎస్ కార్యకర్తలపై విరిగిన లాఠీ
కరీంనగర్, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రం సమీపంలో శిబిరం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు. ఓటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే పోల్‌చిట్టీలు పంపిణీ చేయడం నిబంధనలకు విరుద్ధమని లాఠీచార్జి చేశా రు. బుధవారం నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద త్రీటౌన్ సీఐ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల ను లాఠీలతో చితకబాదారు. పోలింగ్‌కేంద్రానికి దూరంగానే శిబిరం ఉన్నా పో లీసులు కావాలనే తమ కార్యకర్తలను కొ ట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గం గుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కార్యకర్తలను కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చొక్కా విప్పి రోడ్డుపై బైఠాయించారు. నిబంధనల ప్రకారమే శిబిరాన్ని పోలింగ్ కేంద్రానికి దూరంగా ఏర్పాటు చేశామని, పోలీసు లు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఒక్కసారిగా శిబిరాన్ని తొలగిస్తూ, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తమ కార్యకర్తలు ఉదారపు మారుతి, బొగ్గుల మల్లేశం, సిగిరి శ్యాం, మహ్మద్ అలీ, బాబు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. సీఐ స్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ఏదైనా తప్పు చేస్తే తనను కొట్టాలని, కార్యకర్తలను కొట్టడమేమిటని గంగుల తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ సంఘటన స్థలానికి వచ్చి సముదాయించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గంగుల ఆందోళన విరమించారు. -
వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎస్పీ శివకుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. అంతా ప్రశాంతం మానకొండూర్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొమ్మిదివేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట కరీంనగర్ రూరల్ సీఐ కమలాకర్డ్డి ఉన్నారు. -
ఎన్నికల భత్యంపై సిబ్బంది ఆందోళన
- డబ్బులు తక్కువ ఇచ్చారని ఆవేదన - వెట్టిచాకిరీ అని వాపోయిన వెబ్‌కాస్టింగ్ సిబ్బంది - పలుచోట్ల ఇదే తీరు.. సిరిసిల్ల, న్యూస్‌లైన్ : తమకిచ్చే భత్యంలో వ్యత్యాసాలున్నాయని ఎన్నికల సిబ్బంది సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్‌తో బుధవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. భత్యం పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని, టీఏ ఇవ్వట్లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో తమ స్థాయి సిబ్బందికి రూ.రెండువేలకు పైగా భత్యం చెల్లించారని, తమకు మాత్రం రూ.1500 ఇచ్చారని వా పోయారు. అయితే మెమో ప్రకారం నిబంధనలు అనుసరించి భత్యం చెల్లించామని ఆర్వో శ్రీనివాస్ స్పష్టం చేశారు. వెబ్‌కాస్టింగ్ సిబ్బందికి రోజుకు రూ.1000 చొప్పున ఇస్తామని, ఇప్పుడు కేవలం రూ.750 ఇస్తామంటున్నారని, భోజనం కూడా పెట్టలేదన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సైతం చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని తగ్గించారని పేర్కొన్నారు. విధుల్లో పాల్గొన్న సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిరిసిల్ల ఎన్నికల రిసెప్షన్ సెంటర్లో గందరగోళం నెలకొంది. చివరకు చేసేదేంలేక సిబ్బంది ఆగ్రహంతో ఇంటిదారి పట్టారు. గోదావరిఖనిలో.. గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన అదనపు ఎన్నికల అధికారులు (ఓపీవో)లు తమకు రెమ్యూనరేషన్ తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల్లో ఓపీవోలకు రూ.800 చెల్లిస్తే తమకు రూ. 650 ఇవ్వడమేమిటని వారు ప్ర శ్నించారు. దీంతో రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ కలెక్టర్‌తో మాట్లాడి అంతటా ఇచ్చే విధంగానే ఇస్తామని హామీ ఇవ్వడంతో రెండు గంటల తర్వాత వారు తమ ఆందోళన విరమించారు. వెబ్‌కాస్టింగ్ సిబ్బంది కూడా రెమ్యూనరేషన్ పెంపుదల కోసం కొంతసేపు ఆందోళన చేపట్టారు. ఆర్వో నచ్చచెప్పడంతో విరమించారు. హుజూరాబాద్‌లో.. హుజూరాబాద్ : తమకు ప్రయాణ భత్యంతోపాటు ఇత ర ఖర్చులు ఇవ్వడం లేదని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించిన పలువురు సిబ్బంది ఎన్నికల కౌంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి, మెప్మా పీడీ విజయలక్ష్మీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని ఆమె చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. హుస్నాబాద్‌లో.. హుస్నాబాద్ : దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు అదనంగా రూ. 150 టీఏ చెల్లించాలంటూ పలువురు ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదనంగా టీఏ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆ దేశాలు జారీచేసినా ఇవ్వడంలేదంటూ మండిపడ్డారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. -
75.20% జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
పెరిగిన పోలింగ్ - 2009 ఎన్నికల్లో 67.05 శాతం - మంథనిలో అత్యధికం - కరీంనగర్లో అత్యల్పం - ఉత్సాహం చూపిన యువ ఓటర్లు - జిల్లా కేంద్రానికి ఈవీఎంలు - ఈ నెల 16న ఫలితాలు - అభ్యర్థుల్లో టెన్షన్ సాక్షి, కరీంనగర్ : చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎనిమిది శాతం పోలింగ్ పెరిగింది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సరాసరి పోలింగ్ శాతం 67.05 నమోదు కాగా.. ఈసారి 75.20 శాతం పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంథని నియోజకవర్గంలో మిగతా సెగ్మెంట్ల కంటే గంట ముందే పోలింగ్ ముగిసినా.. జిల్లాలో అత్యధికంగా 86.13 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. విద్యావంతులు, అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంలో మాత్రం జిల్లాలోనే అత్యల్పంగా 56.28 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగడం, జిల్లా యంత్రాంగం, స్వచ్చంద సంస్థలు ఓటుహక్కుపై విస్తృత ప్రచారం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగింది. దీనికి తోడు అభ్యర్థులు సైతం ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. మంథని నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 6గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపగా, పట్టణ ప్రాంత ఓటర్లు కాస్త బద్ధకించారు. దీంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలిం గ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటరు చైతన్యం కొట్టిచ్చినట్టు కన్పించింది. ఉదయం 7గంటల ప్రాంతంలోనే గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల వల్ల కొన్ని సెగ్మెంట్లలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మందకొడిగా పోలింగ్ జరిగింది. జగిత్యాల, మంథని, ధర్మపురి, సిరిసిల్ల, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయమే పోలింగ్ వేగంగా సాగింది. పలుచోట్ల పోలీసులు, కొంతమంది ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత, పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీకి తరలించారు. ఈనెల 16న ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పలువురు అభ్యర్థులు విజయవకాశాలపై ఆరా తీస్తుండగా, ఇంకొందరు ఏకంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల పోలింగ్ మధ్యలో మొరాయించడంతో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్‌కు అరగంట నుంచి రెండు గంటల వరకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, కనగర్తి, పొత్కపల్లి, కాసులపల్లి, పందిల్ల గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ధర్మపురి నియోజకవర్గంలో 17 చోట్ల, రామగుండం నియోజకవర్గంలో 11, మంథని నియోజకవర్గం పరిధిలో 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక ఇబ్బంది కలిగింది. సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఏడు గ్రామాల్లో, చొప్పదండి నియోజకవర్గంలో 13 గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కోరుట్ల నియోజకవర్గంలో ఐదు, వేముల వాడ నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల్లో, జగిత్యాల పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని రాయికల్, సారంగాపూర్‌లలో, మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, శంకరపట్నం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఓట్లు గల్లంతు.. ఓటరు జాబితా తప్పుల తడక ఉండటంతో పాటు భారీగా ఓట్లు గల్లంతు కావడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఓటు వేయకుండానే వెనుదిరిగారు. కరీంనగరంలోని విద్యానగర్, జ్యోతినగర్, కార్ఖనాగడ్డ, సుభాష్‌నగర్‌తో పాటు పలు కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఓటేయలేదు. నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి గ్రామంలో పోల్‌చిట్టీలు లేకపోవడంతో సిబ్బందిని ఓటర్లను లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. సిరిసిల్ల పట్టణంలో తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ వంద మంది ఫిర్యాదు చేశారు. ఈవీఎంలో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తు కనిపించడం లేదని ఆ పార్టీ అభ్యర్థి వెలుముల శ్రీధర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. జమ్మికుంట పట్టణంలో పలువురు ఓట్లు గల్లంతు కాగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన తెలిపారు. ఓటేసిన ప్రముఖులు జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు వారి గ్రామాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యతో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు వేశారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎం.సత్యానారాయణరావు దంపతులు, ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పారమిత పాఠశాలలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నగేశ్ క్రిష్టియన్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓటు వేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు దంపతులు వావిలాలపల్లిలోని తేజ స్కూల్లో, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ జ్యోతినగర్‌లోని కెన్‌క్రెస్ట్ పాఠశాలలో ఓటు వేశారు. పెద్దపల్లి టీడీపీ అభ్యర్థి సిహెచ్.విజయరమణారావు శివపల్లెలో, టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లిలోని ఐటీఐలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్రావు స్వగ్రామం గజసింగవరంలో ఓటు వేయగా, కోరుట్ల సెగ్మెంట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొమొరెడ్డి రాములు మెట్పల్లి పట్టణంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎలాల సంతోష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు కోరుట్లలో ఓటువేశారు. కోరుట్ల సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి 4వ వార్డులో, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ 18వ , టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ 8వ, వైఎస్సార్సీపీ అభ్యర్ధిణి కట్ట సంధ్యారాణి 23వ వార్డులో ఓటు వేశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలాపూర్ మండల కేంద్రంలో, కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి హుజూరాబాద్ మండలం జూపాకలో, టీడీపీ అభ్యర్థి ముద్దసాని కశ్యప్‌రెడ్డి వీణవంక మండలం మామిడాలపల్లిలో, వైఎస్సార్సీపీ అభ్యర్థి సందమల్ల నరేశ్ హుజూరాబాద్ మండలం కొత్తపల్లిలో ఓటు వేశారు. హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్‌బాబు, ఆయన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఓటు వేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోహెడ మండలం కూరెళ్లలో, సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ రాష్ట్ర కన్వీనర్ చాడ వెంకటరెడ్డి చిగురుమామిడి మండలం రేకొండలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
ఓటింగ్ అంతంతే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మొత్తం 14 శాసనసభ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఈవీఎంలు మొరాయించడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అధికారులు వెంటనే తేరుకుని సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపి సమస్యలను పరిష్కరించారు. జిల్లాలో 53,48,927 మంది ఓటర్లుండగా.. బుధవారం నాటి పోలింగ్ ప్రక్రియలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లాలో 60 శాతం ఓటింగ్ నమోదైందని అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఈవీఎంలు మెరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ స్తబ్ధుగా సాగింది. దీంతో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాత్రి పొద్దుపోయేవరకు పోలింగ్ సాగింది. అధికారుల తుది గణాంకాలు కొలిక్కి వస్తే పోలింగ్ శాతంలో కొంత మార్పు రావచ్చు. కనిపించని జోరు.. సార్వత్రిక పోలింగ్ జిల్లాలో మందకొడిగా సాగింది. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేయడంతోపాటు గంటపాటు పోలింగ్ సమయాన్ని పెంచింది. అంతేకాకుండా ప్రత్యేక ప్రకటనలు, కళాజాతలతో క్షేత్రస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ భారీ కార్యక్రమాలనే చేపట్టింది. అంతేకాకుంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాను ఎంపికచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చేట్టింది. ఈనేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదయ్యారు. కానీ బుధవారం నాటి సార్వత్రిక పోలింగ్‌లో మాత్రం ఆ జోరు కనిపించలేదు. ఫలితంగా జిల్లాలో ఓటింగ్ సమయం ముగిసేనాటికి 60శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 58.16శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఓటింగ్ కాస్త పుంజెకుందని తెలుస్తోంది. పోలింగ్ సాగిందిలా.. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9గంటల ప్రాంతంలో 12.5% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండు గంటల అనంతరం 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 26%కు చేరింది. ఒంటి గంట ప్రాంతంలో పోలింగ్ 39.6%, మధ్యాహ్నం 3గంటలకు 50.4%, సాయంత్రం 5గంటలకు 56.7% నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 60శాతం నమోదైనట్లు కలెక్టర్ బీ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 7.30 వరకు పోలింగ్.. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామంలో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో జనం ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్‌కు తరలివచ్చి క్యూలో నిల్చోవడంతో వారందరికీ ఓటువేసే అవకాశం కల్పించారు. దీంతో ఆ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
- మూగబోనున్న మైకులు - పంపకాలకు సిద్ధమవుతున్న నేతలు - తుది దశకు చేరిన ‘సార్వత్రిక’ సమరం హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. దాదాపు రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఇప్పటివరకు ప్రచార రథాలు... మైకుల మోతలు.. కళాకారుల ఆటపాటలు... పార్టీల అధినేతల పర్యటనలతో సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు నిశ బ్దంగా మారనున్నాయి. ఈనెల 30న జరుగనున్న ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారంతో ముగుస్తుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. పగలంతా ప్రచారం చేస్తున్న నేతలు... రాత్రిపూట ఓటర్లకు తాయిలాలు అందిస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల అధికారులు కూడా ఇప్పుడు అభ్యర్థులు, వారి పెట్టే ఖర్చు, ఓటర్లకు ప్రలోభాల అంశంపైనే దృష్టి పెట్టారు. నిన్నటి వరకు అక్కడా... ఇక్కడా తిరిగిన అధికారులు ఇప్పుడు నియోజకవర్గాల్లో మకాం పెట్టారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పరిశీలకులు సెగ్మెంట్లకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెగ్మెంట్లలో ఇన్ని రోజులు ప్రచారం చేసిన స్థానికేతర నేతలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్థానికేతర నేతలు సెగ్మెంట్లలో ఉంటే అభ్యర్థులదే పూర్తి బాధ్యత అని, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికల నోటీసులు జారీ చేశారు. ఓటర్లకు వల.. ఎన్నికలు దగ్గర పడడంతో అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ఓట్లు రాబట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకున్న నేతలు... ఇప్పుడు గంపగుత్త ఓట్ల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాత్రిపూట గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాలనీలు, గ్రామ పెద్దలతో సమావేశమై తమకు పడే ఓట్లు ఎన్ని.. వాటికి ఎంత ఖర్చు చేయాలనే విషయంపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత ప్రలోభాల మూటలను పంపిస్తూ హామీలను లిఖిత పూర్వకంగా రాసిస్తూ ఓట్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎన్నికల అధికారులకు చిక్కకుండా అభ్యర్థులు ప్రలోభాల పాట్లు పాట్లు పడుతున్నారు. ఎన్నికల పరిశీలకులు డేగకళ్లతో నిఘా పెట్టినా... ప్రలోభాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి క్రీడా సామగ్రి, చీరెలు, వస్తువులను కాకుండా... నగదు రూపంలోనే ఓటర్లకు ఎక్కువ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కాగా, కొన్ని ప్రాంతాల్లో కుల, యువజన సంఘాలకు లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. వారి సంఘం పేరిట నగదును మధ్యవర్తుల వద్ద పెడుతున్నారు. పోలింగ్ తర్వాత వారికి పడిన ఓట్లను అంచనా వేసుకుని వాటిని వారికి అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఈసారి ఒక్కో సెగ్మెంట్లో అదనంగా 40 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుం దని పార్టీల అభ్యర్థులే బాహాటంగా చెబుతుండడం గమనార్హం. -
మహిళా ఓటర్లకు గాలం
బోధన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అధిక్యత సాధించే దిశలో అన్ని అస్త్రాలను సందిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై పడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బోధన్ నియోజక వర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో వైపు మహిళా ఓటర్ల ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన మహిళా సంక్షేమ పథకాలను వల్లెవేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు భార్యలు కూతుర్లు ఎన్నికల ప్రచార రంగంలో దించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై మళ్లీంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 97,389 మంది ఉండగా, ఇందులో లక్షా 11,179 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళల ఆశీస్సు లు పొందకలిగితే గెలుపు సునాయసం అవుతుం దని ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అంచన వేస్తున్నారు. క్రమ పద్ధతిలో సంఘటితంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు గాలం వేసేందుకు ఆయా రాజకీయ పార్టీల మండల నాయకులు పావులు కదువుపుతున్నారు. ప్రలోబాలకు గురి చేసే అవకాశాలున్నాయి. మహిళలు కూడా రాజకీయ చతురత ప్రదర్శించే అవకాశాలున్నాయి. అన్ని పార్టీలకు సరే అంటునే, తమ విజ్ఞతో ఓటు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎవరిని ఓటు వేయమన్నా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని, అందరికి సరే అని తమ పని తాము కానిచ్చేస్తే అయిపోతోందని మహిళల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
ఎన్నికలపైనే మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్లలో పరిమితస్థాయి కదలికలే నమోదుకావచ్చునని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. సోమవారం(7) నుంచి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలుకానున్న నేపథ్యంలో భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడే అవకాశమున్నదని తెలిపారు. గత కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తూ సాగిన ర్యాలీ చివర్లో కొంతమేర చల్లబడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. వీటికితోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్న బీజేపీ పార్టీ 7న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. పోలింగ్ సరళితోపాటు, బీజేపీ మేనిఫెస్టోపై ట్రేడర్ల దృష్టి ఉంటుందని నిపుణులు తెలిపారు. అస్సాం, త్రిపురల్లో గల ఆరు లోక్‌సభ స్థానాల కోసం పోలింగ్ మొదలుకానున్న రోజునే వెలువడనున్న బీజేపీ మేనిఫెస్టో ఓటర్లను ఆకట్టుకునే బాట లో సాగవచ్చునని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్యాడ్ ప్రభావం: ఈ గురువారం(10న) వాణిజ్య(ఎగుమతి, దిగుమతుల) గణాంకాలు వెలువడనుండగా, 11న పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) కట్టడితోపాటు, ఐఐపీ పుంజుకుంటే సెంటిమెంట్‌కు బలమొస్తుందని నిపుణులు తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగా గత 2 వారాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటం తెలిసిందే. దేశీ కరెన్సీ సైతం 8 నెలల్లో తొలిసారి 60 దిగువకు చేరింది. కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏదొక రాజకీయ పార్టీకి తగిన మెజారిటీ లభిస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను పెంచుతుందని గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. వచ్చే వారం కీలకం: ఈ వారం వాణిజ్య, పారిశ్రామికోత్పత్తి గణాంకాలే వెలువడనుండగా, వచ్చే వారం రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ట్రెండ్‌పై ప్రభావం చూపగల ఆర్థిక ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాలను విడుదల చేయనున్నాయి.