ఎన్నికల భత్యంపై సిబ్బంది ఆందోళన
- డబ్బులు తక్కువ ఇచ్చారని ఆవేదన
- వెట్టిచాకిరీ అని వాపోయిన వెబ్‌కాస్టింగ్ సిబ్బంది
- పలుచోట్ల ఇదే తీరు..
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : తమకిచ్చే భత్యంలో వ్యత్యాసాలున్నాయని ఎన్నికల సిబ్బంది సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్‌తో బుధవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. భత్యం పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని, టీఏ ఇవ్వట్లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో తమ స్థాయి సిబ్బందికి రూ.రెండువేలకు పైగా భత్యం చెల్లించారని, తమకు మాత్రం రూ.1500 ఇచ్చారని వా పోయారు. అయితే మెమో ప్రకారం నిబంధనలు అనుసరించి భత్యం చెల్లించామని ఆర్వో శ్రీనివాస్ స్పష్టం చేశారు.
వెబ్‌కాస్టింగ్ సిబ్బందికి రోజుకు రూ.1000 చొప్పున ఇస్తామని, ఇప్పుడు కేవలం రూ.750 ఇస్తామంటున్నారని, భోజనం కూడా పెట్టలేదన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సైతం చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని తగ్గించారని పేర్కొన్నారు. విధుల్లో పాల్గొన్న సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిరిసిల్ల ఎన్నికల రిసెప్షన్ సెంటర్‌లో గందరగోళం నెలకొంది. చివరకు చేసేదేంలేక సిబ్బంది ఆగ్రహంతో ఇంటిదారి పట్టారు.
గోదావరిఖనిలో..
గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన అదనపు ఎన్నికల అధికారులు (ఓపీవో)లు తమకు రెమ్యూనరేషన్ తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల్లో ఓపీవోలకు రూ.800 చెల్లిస్తే తమకు రూ. 650 ఇవ్వడమేమిటని వారు ప్ర శ్నించారు. దీంతో రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ కలెక్టర్‌తో మాట్లాడి అంతటా ఇచ్చే విధంగానే ఇస్తామని హామీ ఇవ్వడంతో రెండు గంటల తర్వాత వారు తమ ఆందోళన విరమించారు. వెబ్‌కాస్టింగ్ సిబ్బంది కూడా రెమ్యూనరేషన్ పెంపుదల కోసం కొంతసేపు ఆందోళన చేపట్టారు. ఆర్వో నచ్చచెప్పడంతో విరమించారు.
హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్ : తమకు ప్రయాణ భత్యంతోపాటు ఇత ర ఖర్చులు ఇవ్వడం లేదని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించిన పలువురు సిబ్బంది ఎన్నికల కౌంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి, మెప్మా పీడీ విజయలక్ష్మీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని ఆమె చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
హుస్నాబాద్‌లో..
హుస్నాబాద్ : దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు అదనంగా రూ. 150 టీఏ చెల్లించాలంటూ పలువురు ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదనంగా టీఏ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆ దేశాలు జారీచేసినా ఇవ్వడంలేదంటూ మండిపడ్డారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.