సిరిసిల్ల ఎవరి ఖిల్లా
పవర్‌లూం పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో నేత కార్మికుల ఓట్లే కీలకం. సిరిసిల్లతో పాటు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలున్న ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. బరిలో పదిమంది అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ మాత్రం నలుగురి మధ్యే ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ రెండో సారి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన కేటీఆర్, 2010 ఉపఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని సాధించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వెల్ముల శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో నిలిచారు. గతంలో మావోయిస్టు పార్టీ దళ నాయకుడిగా పని చేసిన కొట్టాల మోహన్‌రెడ్డి భార్య ఆకుల విజయ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మారడి మల్లికార్జున్, సిరిసిల్ల
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నేరెళ్ల రద్దయి, సిరిసిల్ల ఏర్పడింది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్ టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డి మీద అతి కష్టంగా గెలి చారు. ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ అంతగా లేకపోవడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ ఇచ్చిందే తమ పార్టీఅని, అభివృద్ధి కూడా తమతోనే సాధ్యమని కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావు చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందని, ఆయన విజన్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ చెబుతున్నారు.
బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ మహిళా ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మహిళల ఆత్మగౌరవం పేరుతో ఉద్యమాన్ని చేపట్టిన ఆమె మహిళల మీదే ఆశలు పెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెల్ముల శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానంతో ఓట్లు వస్తాయని ఆశిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రెండు సార్లు సిరిసిల్లకు వచ్చి నేతన్నల సమస్యలపై స్పందించారని శ్రీధర్‌రెడ్డి పేర్కొంటున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గం
సిరిసిల్ల: ఎవరెన్నిసార్లు గెలిచారు:
కాంగ్రెస్ - 4, టీడీపీ -2, జనతా పార్టీ-1, ఇండిపెండెంట్-2, టీఆర్‌ఎస్-1
ప్రస్తుత ఎమ్మెల్యే: కల్వకుంట్ల తారకరామారావు (టీఆర్‌ఎస్)
రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గ ప్రత్యేకతలు: పవర్‌లూం పరిశ్రమలతో విస్తరించి ఉంది. ఉద్యమాల ఖిల్లా.
బీసీ ఓటర్లు ఎక్కువ. మెట్ట ప్రాంతం.
ప్రస్తుతం బరిలో నిలిచింది: 10
ప్రధాన అభ్యర్థులు వీరే..
వెల్ముల శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ)
కల్వకుంట్ల తారకరామారావు (టీఆర్‌ఎస్)
కొండూరి రవీందర్‌రావు (కాంగ్రెస్)
ఆకుల విజయ (బీజేపీ)
- నేత పరిశ్రమ ఆధునికీకరణ, శాశ్వత ఉపాధి
- ఊరూరా ప్యూరీఫైడ్ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తా. సాగునీటిని అందిస్తా.
- మధ్యమానేరు నిర్వాసితులకు పునరావాసం
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసి పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తా.
- మహిళా అభివృద్ధి, స్వయం ఉపాధికి కృషి చేస్తా.
- వెల్ముల శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ)
- నేత పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తా. మరమగ్గాల ఆధునీకరిస్తాను.
- ఎగువమానేరు ఆధునీకరిస్తా.
- అటవీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తా.
- యువతకు ఉపాధి కల్పించేందుకు
పరిశ్రమలను ఏర్పాటు చేస్తా.
- మహిళా సంఘాలకు మరిన్ని రుణాలు అందించి వ్యవసాయాధార పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తా.
- కొండూరి రవీందర్‌రావు (కాంగ్రెస్)
- సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తా.
- టెక్స్‌టైల్ జోన్‌గా ఏర్పాటు చేసి కార్మికులకు శాశ్వత ఉపాధి, భద్రత కల్పిస్తా.
- సాగునీరు, తాగునీరు అందిస్తా.
- పరిశ్రమల ఏర్పాటుకు చేస్తా.
- మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది, ఆత్మగౌరవంతో కూడిన భద్రత పొందేలా చర్యలు తీసుకుంటా.
- ఆకుల విజయ (బీజేపీ)
- పవర్‌లూం కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తా.
- ఉత్పత్తయిన వస్త్రానికి మార్కెటింగ్ వసతి కల్పించి, కోఆప్టెక్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తా.
- ప్రాణహిత-చేవెళ్ల 9వ ప్యాకేజీని పూర్తి చేసి మూడేళ్లలో 85 వేల ఎకరాలకు నీరందిస్తా.
- ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తా.
- పక్కా ఇళ్లనిర్మాణం, రోడ్లు,
మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు నిర్మిస్తా.
- కల్వకుంట్ల తారకరామారావు (టీఆర్‌ఎస్)