లెక్కింపు..తీరిదీ..! | All waiting for elections..! | Sakshi
Sakshi News home page

లెక్కింపు..తీరిదీ..!

Published Thu, May 15 2014 3:03 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

All waiting for elections..!

కలెక్టరేట్, న్యూస్‌లైన్: అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటలకు జిల్లా కేంద్రంలోని జేపిఎన్‌సి కళశాలలో చేపట్టనున్నారు. ఇందుకుగాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేశారు.  బ్యారికేడ్లను నిర్మించారు. ఈ సారి లెక్కింపు పక్రియ అంతటిని ఆన్‌లైన్‌లో పరిశీలించేలా ప్రతీ టేబుల్‌కు ఆన్‌లైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇక మినిట్ టూ మినిట్‌ను అభ్యర్థులకు ఏజెంట్లను తెలియజేస్తూ, పక్రియ అంతటిని రికార్డు చేయనున్నారు.
 తొలుత పోస్టల్ బ్యాలెట్లు...
 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు  ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలుత వీటిని లెక్కిం చాక ఈవీఎంల ద్వారా గణన ప్రారంభమవుతుంది. ఇది 7రౌండ్లలో  చేపడ్తారు. ఇందుకు సంబంధించి నియమించిన ప్రత్యేక సిబ్బందికి గురువారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు.
 
 ఫలితాలు ఆలస్యమయ్యేనా...
 గతంలో మాదిరి కాకుండా ఈమారు లెక్కింపు ప్రక్రియను 14టేబుళ్ల నుంచి 7టేబుళ్లకు కుదించడంతో ఫలితాల వెల్లడి అలస్యం కానుంది. ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గాలకు 7, పార్లమెంట్‌కు 7టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం ప్రతీ నియోజకవర్గానికీ  34నుంచి 36రౌండ్లు రానున్నాయి. ప్రతీ రౌండ్‌ను 15 నిముషాల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
 
 ఈ ప్రకారం 6గంటల తరువాతే తుది ఫలితాలు వెల్లడవుతాయి. గతంలో అయితే 14టేబుళ్లు ఉండడంతో మూడు గంటల్లో ఫలితాలు వెల్లడయ్యేవి. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన రాజకీయ పార్టీ నేతల సమావేశంలో నేతలంతా అభ్యంతరాల్ని వ్యక్తం చేసినా ఎన్నికల కమిషన్ ఆదేశాలంటూ అధికారులు సర్ది చెప్పారు.  లెక్కింపు వేళలను దృష్టిలో ఉంచుకొని  అక్కడకు  అభ్యర్థులు, ఏజెంట్లతోపాటు, ఇతర సిబ్బంది అందరికి అధికారులు టిఫిన్, బోజన సదుపాయాలను కల్పించనున్నారు.
 
 సిబ్బంది కేటాయింపు ఇలా..
 ప్రతీ టేబుల్‌కు  కౌంటింగ్ సూపర్‌వైజర్‌తోపాటు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్‌వైజర్లు,  మైక్రో అబ్జర్వర్, ఈవీఎంల ప్రత్యేక ఇంజనీర్లు (ఈసిఐఎల్)కు చెందిన వారితోపాటు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇలా మొత్తం 250మందికి పైగా నియమించారు. వీరికి ఇటీవలే  శిక్షణ పూర్తిచేశారు.
 
 ఎప్పటికప్పుడు నివేదికలు..
 ప్రతీ రౌండ్‌లో చేపట్టిన లెక్కింపు వివరాలను  అభ్యర్థులకు,  పాల్గొన్న ఏజెంట్లకు అందించ నున్నారు. దీనికోసం జిరాక్స్ మిషన్లు, కంప్యూటర్లను సిద్దం చేశారు.
 కౌంటింగ్‌కు సహ కరించండి
 ఈనెల 16న చేపట్టే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తన చాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పక డ్బందీగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, నేర చరిత్ర కలిగిన వారు కౌంటింగ్ ఏజెంట్లుగా లేకుండా చూసుకోవాలన్నారు. ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకోవాలని, సమయానికి స్ట్రాంగ్ రూంల్లోంచి ఈవీఎంలను బందోబస్తు మధ్య లెక్కింపు కేంద్రాలకు తరలిస్తామన్నారు. లెక్కింపు సమయంలో ముందుగా పోలైన ఓట్లను తనిఖీ చేసుకోవాలన్నారు.
 
   సిబ్బందికి అన్ని విధాలుగా అవగాహనలు కల్పించామని, ఏజెంట్లకు కూడా పూర్తిగా అవగాహన కల్పించి కౌంటింగ్‌కు పంపించాలని సూచించారు. ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్‌కు ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశామని, 30 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఏజెంట్లు బయటకు వెళ్లేది లేదన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్వో రాంకిషన్, అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement