..ఏమంటారు?
బాబు డైరీ: ఎలక్షన్ సెల్: సాయం చేసిన చేతిని కసిగా కాటేసేవాడిని
నమ్మించి నట్టేట ముంచినవాడిని కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకునేవాడిని
మనసులో విషం పెట్టుకుని మాటల్లో అమృతం కురిపించేవాడిని
ఒళ్లంతా కుళ్లు పెట్టుకుని తుళ్లుతూ మాట్లాడేవాడిని
ఆదరించిన గుండెల్లో చిచ్చుపెట్టినవాడిని
..ఏమంటారు?
అధికారం కోసం అల్పమైన పనులు చేసేవాడిని
కుట్రలు పన్ని కుహనా రాజకీయాలు చేసేవాడిని
ప్రజలు వేసిన ఓటును పరిహసించినవాడిని
జనం విశ్వసించిన ఆశయాలకు తూట్లు పొడిచినవాడిని
వారు మెచ్చిన ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చినవాడిని
డబ్బిచ్చి ముఠాకట్టి దళారీని తలపించేవాడిని
..ఏమంటారు?
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్యచేసినవాడిని
అవకాశవాదంతో అధినేతనే గద్దె దించినవాడిని
రాజుల పాలనను తలపించే అరాచక శిఖామణిని
పేరు ఉచ్ఛరించడానికే అనర్హుడైనవాడిని
అందలాలు ఎక్కిస్తే అధఃపాతాళానికి తొక్కినవాడిని
చేరదీసినవాడికే వెన్నుపోటు పొడిచినవాడిని
దేవుడు కూడా క్షమించలేని ఘాతుకానికి పాల్పడినవాడిని
తెలుగుజాతికి ద్రోహం చేసినవాడిని
..ఏమంటారు?
దుర్మార్గుడు... మేకవన్నె పులి... తేనెపూసిన కత్తి....గాడ్సేనే మించిన వాడు.
అభినవ ఔరంగజేబు... గూడుపుఠాణీకి గురువు...కుట్రకు కొలువు.
మోసానికి మూలస్తంభం... వెన్నుపోటుదారుడు
ఇది ‘అన్న’ మాట. ఎన్టీఆర్ నోట పలికిన మాట!!
మరి.. మీరేమంటారు?