సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజా తీర్పు మరికొన్ని గంటల్లో రానుంది. 213 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనుంది. తొలుత మడకశిర నియోజకవర్గ ఫలితం రానుండగా.. చివరి ఫలితం కదిరి నియోజకవర్గం కానుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 25 మంది, 14 అసెంబ్లీ స్థానాలకు 188 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 29,81,904 ఓటర్లు ఉండగా.. 23,75,318 మంది ఓటు వేశారు. పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ పార్టీల నేతలు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం అనంతపురం లోక్‌సభ, ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. హిందూపురం లోక్‌సభ, ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఎస్కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు.
ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. శాసనసభ స్థానాలతో పాటు వాటికి సమాంతరంగా లోక్‌సభ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కించనున్నారు. రౌండ్‌లవారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితం ప్రకటిస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్‌ను అందిస్తారు. ఓట్ల లెక్కింపులో ఒక్కో టేబుల్‌కు ఒక్కో కౌంటింగ్ సూపర్‌వైజర్ (గెజిటెడ్ అధికారి), ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి) ఉంటారు. మొత్తం 1344 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఓట్ల లెక్కింపును ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు : డీఎస్
లోకేష్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారి
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా చేపడతాం. మధ్యాహ్నం రెండు గంటల్లోగా పూర్తి చేస్తాం. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. ఈవీఎంలు మొరాయిస్తే సరిచేయడానికి సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచాం. అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిబంధనలను పాటించాలని సూచిస్తున్నాం.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు :
సెంథిల్‌కుమార్, ఎస్పీ.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి ప్రతినిధులు మినహా ఎవరినీ అనుమతించం. పాసులు ఉన్న వారు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు రావాలి. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాం. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించాం. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
తీర్పు నేడే
Published Fri, May 16 2014 1:54 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement