నేటితో ప్రచారానికి తెర
- మూగబోనున్న మైకులు
- పంపకాలకు సిద్ధమవుతున్న నేతలు
- తుది దశకు చేరిన ‘సార్వత్రిక’ సమరం
హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. దాదాపు రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఇప్పటివరకు ప్రచార రథాలు... మైకుల మోతలు.. కళాకారుల ఆటపాటలు... పార్టీల అధినేతల పర్యటనలతో సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు నిశ బ్దంగా మారనున్నాయి. ఈనెల 30న జరుగనున్న ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారంతో ముగుస్తుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. పగలంతా ప్రచారం చేస్తున్న నేతలు... రాత్రిపూట ఓటర్లకు తాయిలాలు అందిస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు.
ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల అధికారులు కూడా ఇప్పుడు అభ్యర్థులు, వారి పెట్టే ఖర్చు, ఓటర్లకు ప్రలోభాల అంశంపైనే దృష్టి పెట్టారు. నిన్నటి వరకు అక్కడా... ఇక్కడా తిరిగిన అధికారులు ఇప్పుడు నియోజకవర్గాల్లో మకాం పెట్టారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పరిశీలకులు సెగ్మెంట్లకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సెగ్మెంట్లలో ఇన్ని రోజులు ప్రచారం చేసిన స్థానికేతర నేతలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్థానికేతర నేతలు సెగ్మెంట్లలో ఉంటే అభ్యర్థులదే పూర్తి బాధ్యత అని, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికల నోటీసులు జారీ చేశారు.
ఓటర్లకు వల..
ఎన్నికలు దగ్గర పడడంతో అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ఓట్లు రాబట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకున్న నేతలు... ఇప్పుడు గంపగుత్త ఓట్ల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాత్రిపూట గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాలనీలు, గ్రామ పెద్దలతో సమావేశమై తమకు పడే ఓట్లు ఎన్ని.. వాటికి ఎంత ఖర్చు చేయాలనే విషయంపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అయితే ఒప్పందం కుదిరిన తర్వాత ప్రలోభాల మూటలను పంపిస్తూ హామీలను లిఖిత పూర్వకంగా రాసిస్తూ ఓట్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎన్నికల అధికారులకు చిక్కకుండా అభ్యర్థులు ప్రలోభాల పాట్లు పాట్లు పడుతున్నారు.
ఎన్నికల పరిశీలకులు డేగకళ్లతో నిఘా పెట్టినా... ప్రలోభాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి క్రీడా సామగ్రి, చీరెలు, వస్తువులను కాకుండా... నగదు రూపంలోనే ఓటర్లకు ఎక్కువ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కాగా, కొన్ని ప్రాంతాల్లో కుల, యువజన సంఘాలకు లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. వారి సంఘం పేరిట నగదును మధ్యవర్తుల వద్ద పెడుతున్నారు.
పోలింగ్ తర్వాత వారికి పడిన ఓట్లను అంచనా వేసుకుని వాటిని వారికి అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఈసారి ఒక్కో సెగ్మెంట్‌లో అదనంగా 40 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుం దని పార్టీల అభ్యర్థులే బాహాటంగా చెబుతుండడం గమనార్హం.