సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్‌లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్‌డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు.
ప్రస్తుతానికి విభజన లెక్కలు...
ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి.
ఇంకా కొన్ని పూర్తి కావాలి...
విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది.
అలా వెళ్లొద్దామా..!
దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు.
ఇక రొటీన్ !
Published Wed, May 21 2014 3:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement