assembly elections 2014
-
సెప్టెంబర్‌లోనే..అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్‌లో ప్రారంభించి, అక్టోబర్ మూడో వారంలోగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా విడుదలచేసి ఆగస్టు ఐదో తేదీలోగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని అమలులోకి తేవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల సమావేశంలో ఆమోద ముద్రవేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఆరా తీసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్లు వి.ఎస్.సంపత్, బ్రహ్మే, ఝులీ తదితరులు ముంబై పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎన్నికల అధికారులను ముంబైకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్గ చర్చలు జరిపారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తిచేయాలని ఇదివరకే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం 90 శాతానిపైగా డేటా ఎంట్రీ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు ఐదో తేదీలోపు ఎన్నికల కోడ్ జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆగస్టు 15-20వ తేదీలోపు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 15 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అదనంగా పోలీసు బలగాలను రప్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబై రీజియన్‌లో ఉన్న ముంబై, ఠాణే, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం వసయి, నాలాసొపార ప్రాంతాల్లో ఓటర్ల పేర్ల డాటా ఎంట్రీ పనులు మిగిలిపోయాయి. అవి కూడా త్వరలో పూర్తికానున్నాయి. త్వరలో జరగనున్న తుది సమావేశంలో ఎన్నికలు కచ్చితంగా ఎప్పుడు నిర్వహించాలి...? ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి అమలు చేయాలి..? అనే అంశాలపై ఆమోద ముద్రవేస్తారు. ఆ తర్వాత ఎన్నికల నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు తదితర విషయాలతో సమగ్ర షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు చెప్పారు. -
ఇక రొటీన్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్‌లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్‌డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ప్రస్తుతానికి విభజన లెక్కలు... ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాలి... విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది. అలా వెళ్లొద్దామా..! దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్‌గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్‌లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
ఏం చేద్దాం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది. ఇంతటి ఘోర పరాజయమా! సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్‌కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్‌అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రూపుల పోరూ కొంప ముంచింది. జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి. ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్‌బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్‌ల హాయాంలో లోక్‌సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్‌ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్‌ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్‌ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్‌ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్‌పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్‌సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్‌కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్‌కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్‌సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్‌రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్‌లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్‌లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు. -
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్‌బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు. మా దృష్టికి వచ్చింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. - సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ -
బదిలీల గుబులు
సాక్షి, రాజమండ్రి: అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. కాంగ్రెస్ పాలన పూర్తిగా అంతరించింది. పదేళ్ల విరామం తర్వాత జిల్లాలో సింహభాగం సీట్లు గెలిచిన తెలుగు తమ్ముళ్లు ఇక నుంచి రాజ్యమేలనున్నారు. ఈ నేపథ్యంలో నేతల కు ఓటమి దిగులు పట్టుకుంటే.. అధికారుల్లో బదిలీల గుబులు పుట్టుకొస్తోంది. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు అనుకూలంగా ఉండే అధికారులను తమ ప్రాంతాల్లో నియమించుకునేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధికారుల్లో బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. ‘ఎస్.. సర్’ అనేవారి కోసం అధికారులకు ప్రతినిధులే ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు కాదు. కానీ ఇంతవరకూ కాంగ్రెస్ పాలనలో పనిచేసిన అధికారులను మాత్రం కొత్తగా ఏర్పడుతున్న టీడీపీ ప్రతినిధులు సాగనంపాలని చూస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ దిశగా కొత్త ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా, 12 మంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్, ఒకరు బీజేపీ తరఫున స్థానం దక్కించుకున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మాత్రం ఉన్న అధికారులను సాగనంపి అనుకూలంగా పనిచేసేవారిని రప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు, ఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులపై కూడా నేతల వత్తిడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టాలంటే పోలీసు శాఖలో అనుయాయులు ఉండాల్సిందే. అందుకే ఎస్పీ నుంచి డీఎస్పీ, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారుల వరకూ తమ మాటకు ‘ఎస్.. సర్’ అనే వారిని రప్పించుకోవాలని కొత్త నేతలు ఉబలాటపడుతున్నారు. సీనియర్లే చక్రం తిప్పనున్నారు కొత్తవాళ్లకు పరిపాలనా పరమైన అనుభవం ఉండదు కాబట్టి వీరు అధికారుల జోలికి పోకపోవచ్చు. టీడీపీ ప్రభుత్వం కావడంతో ఇతర పార్టీలు అధికారుల జోలికి వెళ్లే అవకాశాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, సిట్టింగులు ప్రధానంగా అధికారులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1999 వరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఈయన కొన్ని శాఖల అధికారులపై గుర్రుగా ఉన్నారు. గత ఏడాది రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గృహ నిర్మాణ శాఖ అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీచేశారు. రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ రెండోసారి గెలిచారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు తన నియోజకవర్గంలో సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈయన గతం నుంచి జిల్లా యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా సిట్టింగ్ స్థానం నుంచి గెలిచారు. కాకినాడ సిటీ నుంచి గెలిచిన వనమాడి వెంకటేశ్వరరావు 1999లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పదవి వరించడంతో తన పనులు సవ్యంగా పూర్తవ్వాలంటే తమకు కావల్సిన అధికారులను నియమించుకోవాలనే భావనతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పనులవ్వాలంటే మనవారే ఉండాలి అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు తమ ఆదేశానుసారం జరిగేలా సహకరించే అధికారులు తమ వద్ద ఉంటే తమకు ఎదురు ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఐఏఎస్‌లను కూడా గతంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లాకు రప్పించుకునేందుకు సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. -
గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్‌లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్‌రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్‌నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
సిద్దిపేట జిల్లా ఏర్పాటు తథ్యం!
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: సిద్దిపేట ప్రాంత వాసుల దశాబ్దాల ఆకాంక్ష త్వరలో నెరవేరనుంది. ప్రత్యేక జిల్లా ఆవిర్భావానికి మార్గం సుగమం కానుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టనుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. మెదక్ జిల్లాలో సిద్దిపేట అతి పెద్ద పట్టణం. ఇది జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి145 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాం తంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. జిల్లాస్థాయి అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలోనే ఉండడంతో వివిధ పనులపై అక్కడికి వెళ్లడ ం అనివార్యం. కష్టనష్టాలను భరించి అక్కడికి వెళ్తే సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే మరింత వ్యధ. ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా పాదయాత్రలు, ఆందోళనలు, ప్రముఖులకు విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఈ నినాదం మార్మోగి ఆశలను రేపిం ది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కాగా ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ.. 2001 సంవత్సరం నుంచి ప్రతి ప్రధాన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ హమీలిస్తున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించడంతో చిరకాల స్వప్నం సాకారమయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. తెలంగాణలో రెండో స్థానంలో సిద్దిపేట ఉండడం, సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్‌రావు రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారడంతో సిద్దిపేట జిల్లా తథ్యమని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లా.. సిద్దిపేటతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రామాయంపేట, తుప్రాన్, గజ్వేల్, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్లా, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట, నల్గొండ జిల్లా రాజాపేట, వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతాలను కలిపి సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ప్రతిపాదనలను ఇప్పటికే రూపొందించారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనలు పరిశీలించి యథాతథంగా లేదా స్వల్ప మార్పులతో ఆమోదిస్తే దశాబ్దాల కల కొన్ని నెలల్లోనే నిజం కానుంది. -
అటు కారు.. ఇటు ఆటో...
సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు. 2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దొంతి దెబ్బ ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్‌గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్‌కు సంబంధించి బలరాంనాయక్‌కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్‌ఓటింగ్ జరిగి బలరాంనాయక్‌కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్‌కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది. చీలిన లంబాడ ఓట్లు గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్‌కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్‌కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్తోపా టు టీఆర్ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు. -
ఒకే ఒక్కడు: సీతారాం
వరంగల్, న్యూస్‌లైన్: జిల్లాలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మినహా... తొలి ఎన్నికల అనుభవం పలువురికి చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాత్మక తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు... కొత్త నేతలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నేతలకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నారుు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మంది ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారే. గత ఎన్నికల్లో పోటీచేసిన అనుభవంతోనే తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం వారికి సులువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ గాలి వీయడంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఆ పార్టీకి దక్కారుు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టి షాకిచ్చి మార్పును కోరుకున్నారు. తొలిసారి పోటీచేసిన వారికి అవకాశం కల్పించకుండా అనుభవానికి, పాతనేతలకే పట్టం కట్టారు. తొలి పోటీ చేదు జ్ఞాపకం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నేతలందరికీ చేదు అనుభవమే మిగిలింది. ఒకే ఒక్కరికి మాత్రం పదవీయోగం దక్కింది. మహబూబాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్‌ను విజయం వరించింది. ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇక జిల్లాలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ తరఫున ముద్దసాని సహోదర్‌రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు.గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించినప్పటికీ వరంగల్ పశ్చిమ నుంచి ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి పర్యాయం పోటీచేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ ఓటమి చవిచూశారు. భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావును జనం ఆదరించలేదు. నర్సంపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి, కత్తి వెంకటస్వామిలకు ఓటమి తప్పలేదు. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బానోతు మోహన్‌లాల్, మహబూబూబాద్, డోర్నకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తొలిసారి పోటీచేసిన బాలుచౌహాన్, రామచంద్రునాయక్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన రావు పద్మకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఓటమి నుంచి తొలి గెలుపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ గతంలో పోటీచేసి ఓడిపోయినవారే. జనగామ నుంచి గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. పరకాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గతంలో పరకాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి గతంలో ఇక్కడే ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి గెలిచిన బానోత్ శంకర్‌నాయక్ గతంలో ఇక్కడే పోటీచేసి ఓటమి చవిచూశారు. వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓడారు. పాతవారికే పట్టం జిల్లా ప్రజలు ఈ సారి సిట్టింగ్‌లకు కోలుకోలేని షాకిచ్చారు. ఇద్దరు టీఆర్ఎస్, ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప, కాంగ్రెస్‌కు చెం దిన సిట్టింగ్‌లందరూ ఓటమిబాటపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో డాక్టర్ రాజయ్య, వినయ్, ఎర్రబెల్లి మాత్రమే విజయం సాధించా రు. అరుుతే జిల్లా ఓటర్లు సిట్టింగ్‌ల మార్పు కోరుకున్నప్పటికీ... పా తవారికే పట్టం కట్టారు. భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మధుసూదనాచారి, చందూలాల్, రెడ్యానాయక్, కొండా సురేఖకు అవకాశం కల్పించా రు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి శ్రీహరిని గెలిపించారు. -
మా స్వయంకృతాపరాధమే
దేవరకొండ, న్యూస్‌లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పందిరి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో చాలా ఏళ్ల తరువాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. ఆ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహుల జాబితా కూడా పెద్దగా ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జోరందుకున్నాయి. అయితే సీనియర్లకే మంత్రి పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాల భోగట్టా. దీంతోపాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇద్దరిని తప్పకుండా మంత్రి పదువులు వరిస్తాయనే ఆశాభావంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండో సారి విజయం సాధించిన ఉండి ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు(శివ), నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాతకు అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉండి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేశారని, పా ర్టీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు కొట్టేశారని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెంది న బూరుగుపల్లి శేషారావుకు కూడా అవకాశం ఉందనే పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుందని వినిపిస్తోంది. ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గతంలో ఆచంట నుంచి విజయం సాధించారు. తాజాగా చింతలపూడి నుంచి అనూహ్యంగా గెలుపొందారు. ఈ సామాజిక వర్గం కోటా కింద ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు తర్వాత మంత్రి పదవుల విషయమై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. -
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్‌లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్‌ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్‌రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు.