టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.
తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు.
అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు...
రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్‌లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి.
తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది.
హాస్యాస్పదంగా రాంబాబు మాటలు...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.