Anna Rambabu
-
పవన్‌కు దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యకు తానే కారణమంటూ పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘జనసేన కార్యకర్త వెంగయ్య వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నా వల్లే, నా కార్యకర్తల వేధింపుల వల్లే అతను మరణించినట్టు జనసేన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరపల్లి వెళ్తే నాపై దౌర్జన్యానికి ఉసిగొల్పారు. తపంచాలు, నాటు బాంబులతో తిరిగిన వ్యక్తితో నా కార్యకర్తలకేం సంబంధం? ఈ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కూడా మా నియోజకవర్గానికి వచ్చి నాపై ఆరోపణలు చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన నేను.. రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవగలను. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ప్రజాతీర్పు కోరగలరా? ఆయన గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఓడిపోతే పవన్ పార్టీ మూసేసుకుని వెళ్లిపోతారా?’ అని ప్రశ్నించారు. -
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే సవాల్
సాక్షి, తాడేపల్లి: వెంగయ్య మృతికి తాను కారణం కాదని.. జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెంగయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి.. తనని అడ్డుకుని.. బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నా రాంబాబు గుర్తు చేశారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు ‘‘సింగరపల్లిలో 95 శాతం సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు.. వాగ్వాదం జరగలేదు. చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్‌కల్యాణ్‌లా శవ రాజకీయాలు చేయడం నాకు రాదు.వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని’’ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరారు. చదవండి: నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని -
తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక్షన్‌హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. తిరుమలకు పాదయాత్రలో భాగంగా నేడు రాంబాబు వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన తప్పిదాలను వచ్చే శాసనసభ సమావేశాల కల్లా ఒప్పుకోకపోతే బాబు ఇంటిముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని అన్నా రాంబాబు ప్రకటించారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానన్న ఆయన ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగానే 4వ తేదీన ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
నల్లకాల్వకు చేరిన ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, కంభం (ప్రకాశం): గిద్దలూరు ఎమ్మెల్యే అన్నావెంకట రాంబాబు తిరుమల పాదయాత్ర రెండో రోజు కంభం మండలం చిన్నకంభం గ్రామానికి చేరింది. చిన్నకంభం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పోరుమామిళ్ళపల్లి, చిన్నకంభం, దేవనగరం, జెబికె పురం గ్రామాల మీదుగా నల్లకాల్వ గ్రామం వరకు పాదయాత్ర సాగింది. చిన్నకంభం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు యేలం వెంకటేశ్వర్లు, చిన్నకంభం వైఎస్సార్ సీపీ నాయకులు రసూల్, సాగర్, గుండం, గజ్జల ఓంకారం, మాజీ ఎఎంసీ చైర్మన్ చెన్నారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జాకీర్, మాజీ ఎంపీపీలు రవికుమార్, ఓసురారెడ్డి, నాయకులు కొత్తపల్లిశ్రీను, శరబారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికిన నాయకులు బేస్తవారిపేట: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో పాటు, తాను అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకునేందుకు చేపట్టిన పాదయాత్ర గురువారం బేస్తవారిపేట మండలంలోకి చేరింది. వెంకటేశ్వరస్వామి భారీ ప్రతిమ, వెంకటేశ్వర స్వామి సంకీర్తనలతో కోళాట భజనల నడుమ కోటస త్యమాంబదేవి ఆలయం వద్ద నుంచి చింతలపాలెం, సోమవారిపేట, బేస్తవారిపేట, చిన్న కంభం రోడ్డు మీదుగా అశేష జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. పాదయాత్రను విజయవంతం చేయాలి రాచర్ల: తిరుమలకు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాచర్ల మీదుగా వెళుతున్నారని కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ మండల నాయకుడు యేలం మురళి గురువారం తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. -
అట్టహాసంగా అన్నా రాంబాబు పాదయాత్ర
సాక్షి, కాకర్ల (ప్రకాశం): వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పాటు, తాను అత్యధిక మెజారిటీతో గిద్దలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకొనేందుకు ఎమ్మెల్యే అన్నారాంబాబు తలపెట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని కాకర్ల గ్రామం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామంలోని నెమలిగుండ్ల రంగస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూజలు చేసి ప్రారంభించారు. రాంబాబు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల మధ్య పూజలు నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాళమ్మ, వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో తిరిగి ప్రజల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్నారాంబాబు పాదయాత్రకు సంఘీభావంగా అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్రకు గ్రామానికి వందలాది కార్లు, మోటార్‌బైక్‌లలో అభిమానులు తరలివచ్చారు. అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, ఎంపీపీలు నన్నెబోయిన రవికుమార్, వేగినాటి ఓసూరారెడ్డి, చేరెడ్డి వంశీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చేగిరెడ్డి సుబ్బారెడ్డి, ఆవులయ్య, పుల్లారెడ్డి, నాగిరెడ్డి పాండురంగారెడ్డి (సాగర్) ఎండేల వెంకటేశ్వరరెడ్డి, ఏరువ కృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వివిధ మండలాల నుంచి వైశ్య ప్రముఖులు, ³లు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మాగుటూరు గ్రామానికి చెందిన నాయక్ అనే వైఎస్సార్ సీపీ అభిమాని పార్టీ జెండా రంగుతో తన ఒంటిపై జగన్అన్న, రాంబాబు అన్న చలో తిరుమల పాదయాత్ర అనే నినాదాలు రాసుకొని తిరగడం ఆకట్టుకుంది. కాకర్ల నుంచి నడుచుకుంటూ నాగులవరం మీదుగా నరవ వద్దకు చేరుకున్న అన్నా రాంబాబుకు, ఆయన అనుచరులకు అక్కడ భోజనానికి ఏర్పాట్లు చేశారు. -
చంద్రబాబుపై గిద్దలూరు ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, గిద్దలూరు: అసెంబ్లీలో, పార్లమెంటులో సభ్యులు తయారు చేసే చట్టాలు చదువుకునేందుకేనా చట్టాల్ని ఆచరించేందుకు కాదా అని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో తీసుకోవాల్సిన మార్పులు, గత శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారనే విషయాలపై ఆయన మాట్లాడారు. మా నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రూ.600 కోట్లు పనులు రద్దు చేసి, రూ.1,600 కోట్లకు టెండర్లు పెంచారు. కాంట్రాక్టరును మార్చి మెషీన్లను వాటితోనే పనిచేస్తున్నారు. 2014లో రూ.10లక్షలు ఇచ్చేందుకు చేతగాని టీడీపీకి 23 మందిని కొట్ల రూపాయలు ఇచ్చి ఎలా కొన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేందుకు ఇలా ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేశారు. 2017లో తాను టీడీపీకి రాజీనామా చేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతతో ఉప రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్లకు వినతి పత్రాలు ఇచ్చాను. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను చనిపోయేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరానన్నారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి సభలో కూర్చునేందుకు అనర్హుడన్నారు. 40 సంవత్సరాల అనుభవం అంటున్న చంద్రబాబు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని, ఇలాంటి నీచ నాయకులు సభలో ఉండకూడదన్నదే నా ధ్యేయమన్నారు. 175 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రివా, కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకేనా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారికి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన నీతిమాలిన చర్యలు చేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారు. జన్మభూమి, సీఎంఆర్‌ఎఫ్‌లలోనూ దోచుకున్నారన్నారు. నాటి ప్రతిపక్షనేత అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగితే కోడి కత్తి అంటారు. తహసీల్దారు వనజాక్షిపై దాడి చేస్తే పట్టించుకోరన్నారు. కేవలం కక్షసాధింపు చేస్తున్నారు. తనపైనా కక్షసాధింపుగా వ్యవహరించారన్నారు. ఇంటి వద్ద చనిపోయిన విద్యార్థినిని కళాశాలలో చనిపోయిందంటూ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిని వేధించారన్నారు. టీడీపీ నాయకుల కళాశాలల్లో జరిగిన ఆత్మహత్యలపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. రాజధానిలో 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ రైతులు గేదెలను పట్టుకుని రోడ్ల వెంట తిరుగుతున్నారన్నారు. ఇదేనా మీరు చేసిన పాలన అన్నారు. 2014లో ఇలాంటి పార్టీలో నేను ఎందుకు పోటీ చేశానని చింతిస్తున్నానన్నారు. ఆధార్ కార్డులో వయస్సు మార్చేసి ముగ్గురు అన్నదమ్ముల్లు ఏడు నెలల్లో పుట్టారని ఆధార్‌కార్డులు తయారు చేశారు. భర్తలు ఉండగానే వితంతువులుగా, భర్తలతో సంసారం చేస్తున్న వారికి ఒంటరి మహిళలుగా పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదన్నారు. చేనేత అంటే తెలియని వారికి చేనేత పింఛన్లు ఇచ్చారన్నారు. నీరు–చెట్లులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ప్రవర్తనా నియమావళిని విస్మరించినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగాల్ని కాపాడాల్సిన వ్యవస్థల్ని పట్టించుకొనకపోతే ముందు రోజుల్లో చట్టాలకు విలువలేకుండా పోతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని దిగదార్చి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఈ సభలో కూర్చునేందుకు అర్హులు కాదని తన విశ్వాసం అన్నారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకుని చెంపలేసుకుని క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ఆ వెంటనే తాను రాజకీయాలకు గౌరవంగా వైదొలుగుతానన్నారు. చంద్రబాబు రాజీనామా చేయకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయించిన వారికి ఇచ్చిన వేతనాలు, సదుపాయాలు రద్దు చేయాలని, ఇప్పటికే ఇచ్చినవి రికవరీ చేయాలని ఆయన కోరారు. పార్టీలు మారాలంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టుకంటే స్పీకర్ సుప్రీం అని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం చెప్పినప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తున్న వ్యక్తులను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించేందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిచానని అన్నారు. శాసన సభలో పార్టీ ఫిరాయింపులపై తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపించి ఇలాంటి ఆగడాలకు స్వస్థి పలకాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
చంద్రబాబు అసెంబ్లీలోఅడుగుపెట్టడానికి అనర్హుడు..
-
నేను ఎమ్మెల్యే అయితే..
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు తాగునీటితో పాటు, సాగునీరందిస్తాను. చెరువులన్నింటినీ స్థిరీకరించి నీరు నిల్వ ఉండేలా చేస్తాను. నియోజకవర్గం కరువుపీడిత ప్రాంతంగా ఉంది. కరువును జయించి ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలంటే ఇటీవలి కాలంలో కురిసే అరకొర వర్షానికి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసుకునేందుకు రైతులకు తగిన సలహాలు, సూచనలు చేయిస్తాను. రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించాను. వర్షపు నీటి నిల్వ కార్యక్రమాలకు తన స్వంత నిధులను ఖర్చు చేసేందుకు ప్రత్యేక మిషిన్ రూపొందించాను. తద్వారా రైతులకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా చేస్తూ భూగర్భ జలాలు పెరిగేలా చేస్తాను. ప్రజలకు తాగు నీటి అవసరాలతో పాటు, పంటల సాగుకు వినియోగించవచ్చు. మాజీ సైనికోద్యోగులు ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో వారి ఇబ్బందులను, సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కరిస్తాను. వీరికి ప్రధాన డిమాండ్ అయిన ఎన్సీసీ బెటాలియన్ కోసం కృషి చేస్తా. వ్యవస్థను కాపాడటం కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపులపై పోరాటం కొనసాగిస్తాను. నియోజకవర్గంలోని పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు వెళ్లే యువకుల కోసం ప్రత్యేక అకాడమిని ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేందుకు చర్యలు తీసుకుంటాను. వీరికోసం ప్రభుత్వం లేదా వ్యక్తిగతంగా స్వంత నిధులతో అకాడమిని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను. నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో తన సొంతంగా రన్నింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకుంటాను. తన శక్తివంచన లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలతోనే ఉంటాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగుతుందన్న విశ్వాసంతో ఉన్నాను. –వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అన్నా వెంకటరాంబాబు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా.. తాను ఎమ్మెల్యే అయితే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. గుండ్లమోటు ప్రాజెక్టు నుంచి గిద్దలూరు పట్టణానికి తాగునీటి వచ్చేందుకు కృషి. మా పెద్దాయన మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సాధించిన భైరేనిగుండాల ప్రాజెక్టును పూర్తి చేసి గిద్దలూరు పట్టణంతో పాటు, 14 గ్రామాలకు నేరుగా కుళాయిలకు నీటి సరఫరా చేస్తాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతుల రుణాలు మాఫీ చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాము. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. –పగడాల రంగస్వామి, కాంగ్రెస్ అభ్యర్థి, గిద్దలూరు -
వైఎస్సార్ సీపీలో చేరిన గిద్దలూరు టీడీపీ నేతలు
-
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40మంది టీడీపీ నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్‌రెడ్డి, ఉడముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. కాగా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను అధిష్టానం పట్టించుకోలేదని అందుకే తాము వైఎస్సాఆర్ సీపీలో చేరామన్నారు. -
నెలాఖరులోగా వైఎస్సార్ సీపీలోకి
ఒంగోలు: ఈనెలాఖరులోగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనునున్నట్లు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. అన్నా రాంబాబు శనివారం సాయంత్రం ఒంగోలులోని బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం రాంబాబు బయట మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా గిద్దలూరులోని నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరతామన్నారు. ఆయన వెంట గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలు చెంగయ్య చౌదరి, నరసింహ నాయుడు, అక్కి పుల్లారెడ్డి, కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మౌలాలి, మారం రెడ్డి రామనారాయణరెడ్డి, చదుల్ల వెంకట రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, షేక్ సుభాని తదితరులు ఉన్నారు. విలువలు లేని పార్టీలో ఉండలేనంటూ.. అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడం పట్ల అన్నా రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకునికి రాజకీయ విలువలు ముఖ్యమని, ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడికి సూచించారు. అయినా ముత్తుముల అశోక్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలువలు లేని పార్టీలో తాను కొనసాగలేనంటూ టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకొని శనివారం బాలినేనిని కలుసుకుని చర్చించారు. ఈ విషయం తెలిసి జిల్లావ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు ఫోన్లు చేసి అన్నా రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. -
వైఎస్సార్ సీపీలోకి రాంబాబు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలులోని ఆయన స్వగృహంలో కలిశారు. ఇరువురు గంటపాటు చర్చలు జరిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల పై సుదీర్ఘ చర్చ సాగింది. రాంబాబుతోపాటు గిద్దలూరు నియోజకవర్గం కొమరోలుకు చెందిన పార్టీ నేతలు కామూరు రమణారెడ్డి, రామనారాయణరెడ్డి తదితరులు రాంబాబుతో పాటు బాలినేనిని కలిశారు. బాలినేని తో చర్చల అనంతరం రాంబాబు సాయంత్రం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఆ తరువాత వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లుఅన్నా రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. భేషరతుగానే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాంబాబు పార్టీలో చేరడమే తరువాయి. త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. 2009లో గిద్దలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున అన్నా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తుమల అశోక్‌రెడ్డి ఆ తరువాత టీడీపీలోకి పిరాయించారు.అశోక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని అన్నా రాంబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు వినలేదు. దీంతో రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబుకు గిద్దలూరు, మార్కాపురం, యర్రగొడంపాలెం నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. జిల్లా వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉంది. -
టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాలు
గిద్దలూరు: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాముఖ్యత ఇస్తుండటంతో నేతలతోపాటు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు పార్టీలో, అధినేత దగ్గర తగిన విలువ, ప్రాధాన్యత లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యక్రామాలకు పిలవకపోవడం, కావాలని దూరం పెట్టడం వంటివి స్థానిక నేతలకు నచ్చడంలేదు. ఈనేపథ్యంలోనే పలువురు నేతలు తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నారు. తాజా నంద్యాల ఉప ఎన్నికల కార్యక్రమాలకు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిని కాదని భూమా అఖిల ప్రియకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్సీగా గెలిచి 90రోజులు కూడా కాకముందే శిల్పా చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు తన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు సైతం ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. నియోజక వర్గంలో మొదటి నుంచి ఉంటున్న తనను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ప్రాముఖ్యత ఇస్తుండటంతో ఆయన కొంత కాలంగా తీవ్ర సంతృప్తితో ఉన్నారు. దీంతో అన్నా రాంబాబు ఈ నెల 5న పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటుగానే విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనకు మద్దతుగా నియోజక వర్గం నుంచి సుమారు 200మంది స్థానిక నేతలు, వందలాది మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా చదవండి: టీడీపీకి రాజీనామా చేస్తున్నా -
టీడీపీకి రాజీనామా చేస్తున్నా
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గిద్దలూరు: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. గిద్దలూరులో శుక్రవారం కార్యకర్తలు, అనుచ రులతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వలన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోలేదని, పైగా పార్టీ ఫిరాయించిన వారితోనే కలిసి పనిచేయాలని చెబుతున్నారని విమర్శించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజల సమస్యలపై పోరాడతానన్నారు. -
టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తొక్కేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నా రాంబాబును కోరారు. కార్యకర్తల ఒత్తిడితో అన్నా రాంబాబు.. అశోక్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. -
టీడీపీలో డిష్యుం..డిష్యుం..!
= గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా అన్నా వర్గీయుల నినాదాలు = 500 మందితో ఒంగోలుకు ర్యాలీ = మంత్రి శిద్దా, దామచర్ల, మాగుంటలకు ఫిర్యాదు టీడీపీ ఎత్తు: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బుట్టలో వేసుకుంటే.. ఇంకా తిరుగు ఉండదని.. అసెంబ్లీ మొత్తం చేతుల్లోకి వస్తుందని.. రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం సాధించవచ్చని. యాక్షన్ ప్లాన్: జిల్లాలో కొంతమంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఈ మధ్యనే టీడీపీ కండువా కప్పుకున్నారు. రియూక్షన్: ఇప్పటికే టీడీపీ గిద్దలూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అన్నారాంబాబు వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. అధిష్టానంతోనే ఢీ అంటే ఢీ అంది. బుధవారం 500 మంది అనుచరులతో అన్నా.. జిల్లా కేంద్రానికి చేరుకొని అమీతుమీకి సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిద్దలూరులో టీడీపీ రాజకీయాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి.. పాత టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, అభివృద్ధి పనులన్నీ తమ వర్గీయులకే కేటాయించాలని అధికారులను బెదిరిస్తున్నాడని, ఫీల్డు అసిస్టెంట్లను, జన్మభూమి కమిటీ సభ్యులను తమ వారినే నియమించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అన్నా రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్‌రెడ్డితో అమీతుమీకి సిద్ధమయ్యారు. 500 మందికిపైగా తన అనుచరులతో బుధవారం ఒం గోలుకు తరలివచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇళ్లను ముట్టడించారు. సీన్ - 1 ముందుగా అన్నా అనుచరులు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి వద్దకు చేరుకున్నారు. దామచర్ల జనార్దన్ సైతం అక్కడే ఉన్నారు. అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అన్యాయం చేసి నడివీధిలో నెట్టారంటూ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కేకలు, ఈలలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అన్నాను పిలిచి.. మంత్రి, జనార్దన్‌లు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం చేశారని, కొత్తగా పార్టీలో చేరిన వారు అంతా తామేనంటూ పెత్తనం చలాయిస్తున్నా.. తాము చేతగాని వాళ్లలా కూర్చోవలసి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ - 2 అనంతరం అన్నా అనుచరులు ర్యాలీగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికి చేరుకున్నారు. నినాదాలతో రచ్చ రచ్చ చేశారు. ఇంట్లో ఉన్న మాగుంట అన్నాతో పాటు ముఖ్యనేతలను పిలిచి చర్చలు జరిపారు. అశోక్‌రెడ్డి.. అన్నా అనుచరులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయకపోతే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. మాగుంట బయటకు వచ్చి అన్నా అనుచరులనుద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయంలో జిల్లా నేతల ప్రమేయం లేదన్నారు. దీనివల్ల పార్టీలో గందరగోళం వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అశోక్‌రెడ్డి దూకుడు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని వారంతా మాగుంటను కోరారు. -
గిద్దలూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీలో విభేదాలు బుధవారం భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేరికపై టీడీపీ నేత అన్నా రాంబాబు వర్గం నిప్పులు చెరుగుతోంది. తమ కార్యకర్తలను ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నా రాంబాబు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఫిర్యాదు చేసేందుకు దాదాపు 600 మంది కార్యకర్తలతో అన్నా రాంబాబు బుధవారం ఒంగోలు తరలివెళ్లారు. -
అర్ధరాత్రి.. కాళరాత్రి!
⇒పెళ్లి బృందం లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య ⇒వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న 31 మంది క్షతగాత్రులు ⇒సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తుముల, జేసీ ⇒మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఓదార్పు గిద్దలూరు : పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 31 మంది క్షతగాత్రులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం- కర్నాలు జిల్లా సరిహద్దులోని నలమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద పెళ్లి బృందం లారీ శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు, క్షతగాత్రుల స్వగ్రామం నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, అక్కడి ప్రైవేటు వైద్యశాలలో ఒకరు, నంద్యాలలో ముగ్గురు, ఒంగోలులో ఒకరు, నరసరావుపేటలో ముగ్గురు, గిద్దలూరులోని డీజీఆర్ వైద్యశాలలో ఏడుగురు, ఆరోగ్యశ్రీ, ఏరియా వైద్యశాలలో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కర్నూలు, నరసరావుపేటల్లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు వీరే.. చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు (55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ (45)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ముత్తుముల విషయం తెలుసుకుని వెంటనే కర్నూలు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న 12 మందిని పరామర్శించారు. అనంతరం నంద్యాలలో పలు వైద్యశాల్లో చికిత్సలు పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు. మృతదేహాలను త్వరగా బంధువులకు అప్పగించాలని వైద్యులను కోరారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి లారీని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల, డీజీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యం అందుతున్న తీరును డాక్టర్ సూరిబాబు, డాక్టర్ హరనాథరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారిని తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు మార్చాలని ఆర్డీఓ చంద్రశేఖరరావును జేసీ ఆదేశించారు. ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నాయకులు రెడ్డి కాశిరెడ్డి, సీవీఎన్ ప్రసాద్, దప్పిలి కాశిరెడ్డి, దమ్మాల జనార్దన్, వైజా కృష్ణారెడ్డి, బొర్రా కృష్ణారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సాయం రూ.లక్ష మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ శనివారం గిద్దలూరు వచ్చి ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రూ. 20 వేలు చొప్పున సాయం చేయనున్నట్లు చెప్పారు. రాచర్ల ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి కాశిరెడ్డిలు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. క్షతగాత్రులకూ ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి : ముత్తుముల లారీ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జేసీ చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచేలా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాననిహామీ ఇచ్చారు. ఒంగోలు టౌన్ : పెళ్లి బృందం లారీ బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో మంజూరు చేసినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు గిద్దలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అన్నన్నా..!
రక్తికట్టించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు ‘రాజీ’నామా నాటకం ఒక్క రోజుకే మనసు మార్చుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరు ఆయనది పదవీ వ్యామోహమంటున్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు గిద్దలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధించిందని, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని, ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని చెబుతూ రెండు రోజుల క్రితమే రాజీనామా చేసి.. తిరిగి మూడో రోజు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఘనత గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకే దక్కుతుంది. తనకున్న పదవీ వ్యామోహమే గురువారం నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేలా చేసిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలు.. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు మూజువాణి ఓటుతో ఈ నెల 18వ తేదీన గట్టెక్కిన విషయం తెలిసిందే. దీనికి ముందే అంటే అదే రోజు ఉదయం ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు మండలంలో హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సన్మాన కార్యక్రమాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాష్ట్ర విభజన జరిగిపోయిందని చెప్పి అప్పటికే షెడ్యూల్లో ఉన్న మిగిలిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను వాయిదా వేసుకుని విలేకరులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి తాను ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి వెళ్లిపోయారు. 19వ తేదీ ఒక్కరోజు ఆలోచించుకుని తిరిగి ఎమ్మెల్యేగా కొనసాగాలని అనుకున్నారో ఏమో వెంటనే అర్ధవీడు మండలంలోని మాగుటూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించారు. నాగులవరం, కాకర్ల, మాగుటూరు, రంగాపురం, వెలగలపాయ, బొమ్మిలింగం, బసిరెడ్డిపల్లె గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శిలాఫలకాలపై పేరు రాయించుకున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యే కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొనడం గమనార్హం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమేంటని నియోజకవర్గ ప్రజలు అన్నాను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ తనకెందుకన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి చేసిన వారికి ఓటెయ్యాలని చెప్పి ప్రచారం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేయడం.. తిరిగి ఎమ్మెల్యే హోదాలో ప్రారంభోత్సవాలు చేయడంపై ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాజీనామా డ్రామా అని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భయపడి విభజనకు ఒప్పుకుని, పైకి నటన చేస్తున్నారని ప్రజలు దుయ్యబడుతున్నారు. తన పదవీ కాలం పూర్తికాకముందే ఆవేశంలో తొందర పడి రాజీనామా చేసినందుకు ఎమ్మెల్యే బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారని జనం బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం.