సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు తాగునీటితో పాటు, సాగునీరందిస్తాను. చెరువులన్నింటినీ స్థిరీకరించి నీరు నిల్వ ఉండేలా చేస్తాను. నియోజకవర్గం కరువుపీడిత ప్రాంతంగా ఉంది. కరువును జయించి ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలంటే ఇటీవలి కాలంలో కురిసే అరకొర వర్షానికి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసుకునేందుకు రైతులకు తగిన సలహాలు, సూచనలు చేయిస్తాను. రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించాను.
వర్షపు నీటి నిల్వ కార్యక్రమాలకు తన స్వంత నిధులను ఖర్చు చేసేందుకు ప్రత్యేక మిషిన్ రూపొందించాను. తద్వారా రైతులకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా చేస్తూ భూగర్భ జలాలు పెరిగేలా చేస్తాను. ప్రజలకు తాగు నీటి అవసరాలతో పాటు, పంటల సాగుకు వినియోగించవచ్చు. మాజీ సైనికోద్యోగులు ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో వారి ఇబ్బందులను, సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కరిస్తాను. వీరికి ప్రధాన డిమాండ్ అయిన ఎన్‌సీసీ బెటాలియన్ కోసం కృషి చేస్తా. వ్యవస్థను కాపాడటం కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపులపై పోరాటం కొనసాగిస్తాను.
నియోజకవర్గంలోని పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు వెళ్లే యువకుల కోసం ప్రత్యేక అకాడమిని ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేందుకు చర్యలు తీసుకుంటాను. వీరికోసం ప్రభుత్వం లేదా వ్యక్తిగతంగా స్వంత నిధులతో అకాడమిని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను. నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో తన సొంతంగా రన్నింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకుంటాను. తన శక్తివంచన లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలతోనే ఉంటాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగుతుందన్న విశ్వాసంతో ఉన్నాను.
–వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అన్నా వెంకటరాంబాబు
పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా..
తాను ఎమ్మెల్యే అయితే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. గుండ్లమోటు ప్రాజెక్టు నుంచి గిద్దలూరు పట్టణానికి తాగునీటి వచ్చేందుకు కృషి. మా పెద్దాయన మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సాధించిన భైరేనిగుండాల ప్రాజెక్టును పూర్తి చేసి గిద్దలూరు పట్టణంతో పాటు, 14 గ్రామాలకు నేరుగా కుళాయిలకు నీటి సరఫరా చేస్తాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతుల రుణాలు మాఫీ చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాము. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను.
–పగడాల రంగస్వామి, కాంగ్రెస్ అభ్యర్థి, గిద్దలూరు
Comments
Please login to add a commentAdd a comment