Giddaluru
-
దూసుకొచ్చిన మృత్యువు
గిద్దలూరు: రోడ్డు ప్రమాదంలో పడిపోయిన వారిపైకి మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ముగ్గురు యువకుల జీవితాలను బలితీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని మోడంపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన మేరుగ హనోక్ (25), క్రిష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన కొమ్మునూరి ప్రసన్న (24), పెద్దపీరయ్య (24) దుర్మరణం పాలయ్యారు. హనోక్ నంద్యాల సమీపంలోని బిల్లలాపురంలో ఉన్న భార్య దగ్గరకు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా.. ప్రసన్న, పెద్దపీరయ్య మరో మోటారు సైకిల్‌పై ఎదురుగా వచ్చారు. రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో కర్నూలు జిల్లా అవుకు నుంచి గుంటూరుకు నాపరాళ్లపై మిర్చి బస్తాలు వేసుకుని వెళుతున్న లారీ.. రోడ్డు మీద పడిపోయిన ముగ్గురి పైనుంచి వెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హనోక్‌కు ఒక కుమార్తె ఉండగా, భార్య గర్భిణి. ప్రేమ వివాహం చేసుకున్న ప్రసన్నకు భార్య, కుమారుడు ఉన్నారు. పెద్దపీరయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
‘వైఎస్సార్ చేయూత’లో టీడీపీ నేత మోసాలు
గిద్దలూరు రూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకాన్ని అభాసుపాల్జేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు. అధికారులు రూపొందించిన జాబితాలో అర్హుల పేర్లను తారుమారు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాలని పథక రచన చేసి అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని సంజీవరాయునిపేట పంచాయతీ పరిధి చేయూత యాప్‌లో 96 మంది అర్హుల పేర్ల స్థానంలో అనర్హుల పేర్లను దొంగచాటుగా చేర్చి గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇలా ఎందుకు జరిగిందో అర్థంగాక.. ఓ టీడీపీ నేత కుట్రను తొలుత కనిపెట్టలేక తలలు పట్టుకున్నారు. ఇదీ..జరిగింది గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలో 105 మంది లబి్ధదారులు ఉన్నారు. అందులో ఒకరి వేలిముద్ర పడని కారణంతో, మరొకరు టైలర్ కావడంతో నగదు పడలేదు. మిగిలిన 103 మందిలో కేవలం ఏడుగురు అర్హులకు మాత్రమే పథకం వర్తించింది. మిగిలిన 96 మందిలో 24 మందికి బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు కావడంతో నగదు పడలేదు. 72 మంది అనర్హులకు బ్యాంకులో నగదు జమ కావడంతో వెంటనే విత్‌డ్రా చేసుకున్నారు. అర్హులకు అందాల్సిన రూ.18 లక్షల నగదు అనర్హులకు చేరడంతో అర్హులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల జాబితాను ఓ టీడీపీ నేత ఆన్లైన్లో తారుమారు చేశాడు. ఓసీలు, మగవారు, చిన్న పిల్లల పేర్లు నమోదు చేశాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిపై అర్హులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులకు నగదు మంజూరైంది. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎక్కడ అవినీతి జరిగిందో బయటకు తీయాలని అర్హులు కోరుతున్నారు. అవును..నిజమే గ్రామ సచివాలయం నుంచి మేము పంపిన జాబితా తారుమారైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. అనర్హులకు నగదు వచ్చినట్లు గుర్తించి నగదు విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంకులకు నోటీసులు పంపించాం. అప్పటికే అంతా నగదు విత్‌డ్రా చేసుకున్నారు. పూర్తి విచారణ చేసి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. - రంగనాయకులు, ఇన్చార్జి ఎంపీడీఓ, గిద్దలూరు -
‘నేనుండగానే నా బిడ్డ కన్నుమూయాలి’
సాక్షి, ప్రకాశం: కడుపున పుట్టిన బిడ్డలు అందరిలా అల్లరి చేస్తూ చదువుకొని ప్రయోజకులైతే కన్నవారికి ఆనందం. అలా కాకుండా తమ కళ్లముందే కదల్లేకుండా ఉంటే వారి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దుస్థితే ఓ తల్లికి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 ఏళ్లుగా దివ్యాంగుడైన తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ కుమిలిపోతోంది. ఇతనికి రెండు కాళ్లు, చేతులు వంకరగా పుట్టడమే కాకుండా మెడ సక్రమంగా నిలబడదు. దీంతో పుట్టింది మొదలు సపర్యలు చేసుకుంటూ ఆవేదన చెందుతోంది. మండలంలోని పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన దామెర్ల మునీశ్వరమ్మ స్వగ్రామం మార్కాపురం మండలం పిడుదునరవ. 19 ఏళ్ల క్రితం పొదలకుంటపల్లె గ్రామాని చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రంగయ్యకు ఇచ్చి వివాహాం చేశారు. అయితే తొలి కాన్పులోనే దివ్యాంగుడైన చిన్నరంగయ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన బిడ్డ మృతి చెందాడు. తదనంతరం మరో ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం తన భర్త రంగయ్య నెమ్ము, షుగరు వంటి వ్యాధులతో మంచం పట్టాడు. అసలే పుట్టెడు దుఃఖంతో ఉన్న మునీశ్వరమ్మకు భర్త అనారోగ్య పరిస్థితి గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. కుటుంబ పోషణతో పాటు భర్త, కుమారుడి భారం కూడా పడటంతో గిద్దలూరు పట్టణంలో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా టీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తోందీమె. (పట్టుదలే ఐపీఎస్‌ను చేసింది: ప్రతాప్ శివకిషోర్) ‘ఎంతో కష్టపడి టీ అమ్ముకుంటే రోజుకు రూ.200 వస్తాయయ్యా. నేనేజన్మలో పాపం చేశానో ఏమో కష్టాలన్నీ నాకే వచ్చాయి. నేను బతికున్నప్పుడే నా బిడ్డ కన్నుమూయాలి. నేను ముందుగా చనిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? నేనున్నంత కాలం నా కొడుకును బాగా చూసుకుంటాను. అయితే మా పిల్లాడికి పింఛను రావడంలేదు. అధికారులకు మొరపెట్టుకుంటే ఒంగోలు వెళ్లి సదరన్ క్యాంప్ నుంచి సర్టిఫికేటు తెమ్మంటున్నారు. మా పిల్లోడు మంచం దిగలేడు. అట్టాగే తినిపిస్తూ.. నీళ్లు పోస్తూ.. బట్టలు మార్చుకుంటూ చూసుకుంటున్నా. ఒంగోలుకెళ్లాలంటే ఆటో మాట్లాడుకోని బస్టాండుకెళ్లాలి. అయితే వాడు బస్సెక్కలేడు. ఏదైనా కారు మాట్లాడుకోవాలంటే డబ్బులు తేలేము. అధికారులే మనస్సు చేసుకుని నాబిడ్డకు పింఛన్ వచ్చేలా చూడాలి’ అని వేడుకుంది. ఈ విషయమై ఎంపీడీఓ ఆకుల రంగనాయకులుని వివరణ కోరగా కరోనా ప్రభావం వల్ల నియోజకవర్గం కేంద్రంలో సదరన్ క్యాంప్ నిర్వహించలేకపోతున్నామన్నారు. క్యాంప్ నిర్వహించిన సమయంలో గ్రామ కార్యదర్శి, వలంటీర్ ద్వారా వికలాంగుడైన చిన్నరంగయ్యను తీసుకువచ్చి సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
ఆ కోడి ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
తెల్లటి రంగు.. 7 కిలోల బరువు.. 28 అంగుళాల ఎత్తు.. చిలుక ముక్కు.. డేగ లాంటి శరీర సౌష్టవంతో చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది ఆ కోడి పుంజు! దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! పెద్దపర్ల జాతికి చెందిన ఈ కోడి పుంజు ధర అక్షరాలా లక్ష రూపాయలు. గిద్దలూరు రూరల్ (ప్రకాశం జిల్లా): గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకంలో ఆరితేరాడు. నాలుగేళ్ల నుంచి అరుదైన జాతి కోళ్లను పెంచుతూ కోళ్ల పెంపకంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో తాపీమేస్త్రీగా జీవనం సాగించే పెద్దపుల్లయ్య తన ఇంట్లో వివిధ రకాల నాటు, బెడస తదితర జాతి కోళ్లను పెంచేవాడు. నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రీ పని చాలించుకుని గ్రామంలోనే 2 ఎకరాల పొలం కొని సాగు చేస్తున్నాడు. అరుదైన జాతి కోళ్లను పెంచాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎన్నో ఊర్లు తిరిగాడు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. అరుదైన జాతి కోళ్లను జల్లెడ పట్టేందుకు ఊర్లన్నీ తిరిగేందుకు రూ.24 వేలు ఖర్చు చేశాడు. మొత్తం మీద తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తీసుకొచ్చేందుకు రూ.1.24 లక్షలు అయింది. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాల్లో ఇటువంటి అరుదైన జాతి పుంజు లేదని పుల్లయ్య గర్వంగా చెబుతున్నాడు. తన వద్ద ఉన్న కోళ్లలో ఒక్కటి కూడా రూ.30 వేలకు తక్కువ ధరలో లేకపోవడం గమనార్హం. చాలా మంది ఎగతాళి చేశారు ఒక్కో కోడికి దాణా కోసం నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతుంది. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరుశనగలు, రాగులు, సజ్జలను దాణాగా పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు తినిపించినట్లు తినిపించాల్సి వస్తుంది. కోళ్ల పెంపకం ద్వారా నెలకు రూ.30 వేలకు వరకు ఆదాయం పొందుతున్నా. పది రోజుల పిల్ల రూ.5 వేలు, కోడి గుడ్డు రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తుంటా. దిష్టి తగులుతుందని బయటకు ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్తుంటా. దీని విలువ తెలియని కొంత మంది కోడి లక్ష రూపాయాలా అని ఎగతాళి చేశారు. మా గేదె కూడా అంత విలువ చేయదు, నీ కోడి చేస్తుందా అంటుంటారు. అందుకోసమే కోడిని ఎవరికీ చూపించకుండా జాగ్రత్తగా పెంచుతున్నా. – పెద్ద పుల్లయ్య, కోళ్ల పెంపకందారుడు -
చిరుతపులి చర్మం.. ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్
సాక్షి, గిద్దలూరు: పులి చర్మం విక్రయిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠా అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిందితుల సెల్ ఫోన్లను ట్రాక్ చేసి, వీరి ఆటకట్టించారు. వాహనంలో తరలిస్తున్న చిరుత పులి చర్మం, పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు అటవీశాఖ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అటవీశాఖ డివిజనల్ అధికారి జి.సతీష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చిరుతపులి చర్మం విక్రయించేందుకు కొందరు ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ చేస్తున్నారనే సమాచారంతో అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ముఠా సభ్యుల ఫోన్ నంబర్లను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వారి సెల్ఫోన్ల ద్వారా వెళ్లే సందేశాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గిద్దలూరు మండలంలోని అంబవరం నుంచి రాచర్ల మండలంలోని రంగస్వామి ఆలయం వైపునకు వెళ్తున్న బొలెరో వాహనంలో పులి చర్మాన్ని తరలిస్తున్నారని తెలుసుకొని అడ్డుకున్నారు. ఆ వాహనానంతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ దోనంపూడి శ్రీనివాసరావు, డ్రైవర్ చీమకుర్తి మండలం పల్లాపల్లికి చెందిన కుంచాల శ్రీనును అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి ఫోన్ మెసేజ్‌లు, కాల్ డేటా ఆధారంగా మరో ఏడుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో గిద్దలూరు మండలంలోని జయరాంపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మోడి రంగస్వామి పేరు గల ఇద్దరు, ఎండూరి ఆనంద్, రాచర్ల మండల కేంద్రానికి చెందిన మాజీ సైనికుడు షేక్ సుభాని, గిద్దలూరుకు చెందిన డ్రైవర్ తోట వేణుమాధవ్, వెలిగండ్లకు చెందిన జి.భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన పసుపులేటి గోపాలకృష్ణలు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న చిరుత పులి చర్మం అధికారులు స్వాధీనం చేసుకున్న పులి గోర్లు మార్కెట్ విలువ రూ.70 లక్షలు.. నిందితులను నుంచి చిరుత చర్మం, మూడు గోర్లు స్వాధీనం చేసుకోగా మిగిలినవి చర్మానికే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ చర్మం విలువ మార్కెట్లో రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుందని, అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందని డీఎఫ్ఓ చెప్పారు. చిరుత వయస్సు సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందని, ఏడాదిన్నర క్రితమే చంపి చర్మం తీసినట్లు తెలుస్తోందన్నారు. చర్మాన్ని సంబంధిత టీసీఎంబీ ల్యాబ్‌కు పంపించి పరీక్షించిన తర్వాత చిరుత వయస్సు, ఎప్పుడు తీశారనేది తెలుస్తుందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను బుధవారం మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు... వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ సతీష్ హెచ్చరించారు. ఎక్కడైనా వన్యప్రాణులను వేటాడటం, చంపడం, చర్మం తీయడం, మాంసం విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. వన్యప్రాణులు ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టవని, అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లి వాటికి ఇబ్బంది కలిగిస్తే దాడులు చేస్తాయన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గిద్దలూరు ప్రాంతంలో 48 వరకు పులులు ఉన్నాయని ఇప్పటికే వాటి సంఖ్య తగ్గిపోయిందని, వన్యప్రాణులను కాపాడుకోవాలి్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణులు ఎక్కడైనా ప్రజలకు నష్టం కలిగిస్తే అందుకు తగిన పరిహారం అందిస్తున్నామన్నారు. గత నాలుగైదు సంవత్సరాల్లో రూ.10 లక్షల వరకు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఐదుగురికి రూ.1.60 లక్షలు ఇచ్చేందుకు నిధులు వచ్చాయని, త్వరలో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల రేంజి అధికారులు కుమారరాజ, నాగేంద్రరావు, జీవన్‌కుమార్, డిప్యూటీ రేంజి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నమ్మి..నట్టేట మునిగారు!
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం): తెలిసి చేశాడో..తెలియక చేశాడో తెలియదుగానీ ఓ ఇన్చార్జి తహసీల్దార్ నిర్వాకానికి 16 మంది వీఆర్ఏలకు అన్యాయం జరిగింది. ఈ సంఘటన గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు..వీఆర్ఏలుగా పనిచేస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారు తమ పిల్లలను నామినీ వీఆర్ఏలుగా నియమించాలనుకోవడం సహజం. గిద్దలూరులో గతంలో ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న వల్లీకుమార్ మాటలు నమ్మిన వీఆర్ఏలు ఇప్పుడు నిండా మునిగారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 12 మంది వీఆర్ఏలు వృద్ధాప్యంలో ఉండగా, మరో నలుగురు వీఆర్ఏలు చనిపోయారు. మొత్తం 16 మంది వీఆర్ఏల స్థానంలో వారి నామినీ (కుమారులు)లను వీఆర్ఏలుగా నియమిస్తానని వల్లీకుమార్ నమ్మబలికాడు. ఆయన చెప్పినట్లు 12 మంది వయస్సు పైబడిన వీఆర్ఏలు మెడికల్ సెలవులు పెట్టారు. అనంతరం ఆయన వారందరినీ నామినీ వీఆర్ఏలుగా భావించి వారితో ఎన్నికల విధులు చేయించుకున్నాడు. ఇక తాము వీఆర్ఏలుగా కొనసాగవచ్చని ఆశపడి వారు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఎన్నికలనంతరం కొత్త తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి బదిలీపై తన పాత స్థానావెళ్లగానే ఉత్తర్వులిచ్చి పూర్తి స్థాయి వీఆర్ఏలుగా ఉద్యోగాలు కల్పించి మొత్తం వేతనాలు ఒకేసారి చెల్లిస్తానని సదరు అధికారి వారికి ఆశ కల్పించాడు. 16 మంది నామినీ వీఆర్ఏలు నాలుగు నెలల పాటు విధులు నిర్వహించాక తమకు వేతనాలు ఇవ్వాలని ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ను నిలదీశారు. దీనికితోడు ఎన్నికల విధుల కోసం వచ్చిన తహసీల్దార్ సుబ్బారెడ్డి రెగ్యులర్‌గా ఇక్కడే ఉండిపోవడంతో వీఆర్ఏల వేతనాలు నిలిచిపోయాయి. ఇక తమకు ఉద్యోగాలు, వేతనాలు రెండూ రావని గ్రహించిన నామినీ వీఆర్ఏలు కనీసం వేతనాలైనా చెల్లించాలని తహసీల్దార్‌ను వేడుకున్నారు. మెడికల్ సెలవులో ఉన్నట్లు మీరు లెటర్ ఇచ్చారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి విధుల్లో చేరితే అప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తామని తహసీల్దార్ సుబ్బారెడ్డి వారితో తేల్చి చెప్పారు. వీఆర్ఏలు సీఐటీయూ నాయకులు, వీఆర్ఏల సంఘంతో కలిసి 20 రోజుల పాటు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ మోసాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు వేశారు. అయినా ప్రస్తుత తహసీల్దార్ సుబ్బారెడ్డి నామినీ వీఆర్ఏలకు పోస్టులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగం, వేతనాలు ఇవ్వక పోవడంతో నామినీలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు విరమించిన వీఆర్ఏలు తమకు వేతనాలివ్వాలని తహసీల్దార్‌కు డాక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఉద్యోగం మాట పక్కన పెడితే 8 నెలల పాటు శ్రమించిన వేతనం కోల్పోయామని 16 మంది వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీఓలో లేకుండానే తమకు నియామక ఉత్తర్వులిచ్చి మోసం చేసిన గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్పై చర్యలు తీసుకుని 16 మందికి రావాల్సిన 8 నెలల వేతనం రూ.12.80 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఆ అధికారం తహసీల్దార్లకు లేదు వీఆర్ఏల పిల్లలను వీఆర్ఏలుగా నియమించే అధికారం తహసీల్దార్లకు లేదు. 2012లో ఉద్యోగ కిరణాలు పేరుతో ప్రతి నియామకాన్ని ఏపీపీఎస్సీ ద్వారా చేపడుతున్నారు. వీఆర్ఏలను దాని ద్వారానే నియమిస్తున్నారు. వల్లికుమార్ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో నాకు తెలియదు. వీఆర్ఏలు అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి సెలవులు పెట్టారు. తిరిగి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి విధుల్లో చేరితే ఇప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తాం. జీవీ సుబ్బారెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు -
హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కర్నూలు నుంచి విజయవాడ వెళ్తూ మార్గంమధ్యలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పిడతల సరస్వతి నివాసానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చామన్నారు. ఆ నిధులను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ భయంగా బతుకుతోందన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉంటూ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించి 2024లో వైఎస్సార్సీపీకి ప్రధాన పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, రాచర్ల గేటులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పిడతల సరస్వతి కన్నాను కోరారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, జిల్లా ఇన్చార్జి శశిభూషణ్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. -
వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?
సాక్షి, గిద్దలూరు: పండ్ల వ్యాపారి అనుమానాస్పద స్థితిలో.. కాలిన గాయాలతో మృతి చెందిన సంఘటన గిద్దలూరు–ఒంగోలు రోడ్డులోని రంగారెడ్డిపల్లె సమీపంలో గల జాతీయరహదారి చప్టా వద్ద ఆదివారం జరిగింది. ఈ సంఘటనలో పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి జోగి వేణుగోపాల్ (20) మరణించాడు. అందిన సమాచారం ప్రకారం రంగారెడ్డిపల్లె సమీపంలో గల చప్టా కింద పొగలు వస్తుండటాన్ని గుర్తించిన కొందరు 108కు సమాచారం అందించారు. అప్పటికే కాలిన గాయాలతో కేకలు వేసుకుంటూ చప్టా కింద నుంచి రోడ్డుపైకి వచ్చిన వేణుగోపాల్ వాహనాలను ఆపండంటూ ప్రాధేయపడుతున్నాడు. శరీరంపై అధికంగా కాలిన గాయాలతో ఉన్న అతన్ని వాహనం ఎక్కించుకునేందుకు ఇష్టపడని వాహనదారులు వాహనాల్ని నిలపలేదని తెలిసింది. రోడ్డుపై వెళ్లే వారు గుంపులుగా చేరి ఎలా జరిగిందని ప్రశ్నించగా తనను ముగ్గురు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారని చెప్పినట్లు సమాచారం. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనం అక్కడ నిలబడగానే వేణుగోపాల్ చేరుగా వచ్చి వాహనం ఎక్కాడు. 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా వైద్యులు చికిత్సలందిస్తుండగా అతను మృతి చెందాడు. వైద్యశాలకు వచ్చినప్పుడు ఎలా జరిగిందని వేణుగోపాల్‌ను అడగ్గా కొద్ది సేపు ఉంటే అన్ని విషయాలు చెబుతానని చెప్పాడని, వైద్యం అందిస్తుండగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు వేణుగోపాల్‌ది కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని కేకే కొట్టాల గ్రామం. అతనికి అన్న కృష్ణ, తల్లి పార్వతిలు ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితం క్రిష్ణంశెట్టిపల్లె గ్రామంలో ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏడాదిన్నర క్రితం గిద్దలూరు పట్టణానికి చేరుకుని పండ్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు తాను వ్యాపారంలో సంపాదిస్తున్నామని అప్పులేమీ లేవని మృతుడి తల్లి పార్వతి తెలిపారు. వేణుగోపాల్ తాజా పండ్లను మిగిలిన వ్యాపారులకంటే తక్కువ ధరలకే విక్రయించడం వల్ల ఎక్కువ వ్యాపారం చేసేవాడని, కొందరు వ్యాపారులు ఇతనిపై గుర్రుగా ఉండేవారని సమాచారం. ఆదివారం కావడంతో వ్యాపారానికి వెళ్లని వేణుగోపాల్ తాను సినిమాకు వెళ్తున్నానని చెప్పగా రూ. 200 ఇచ్చి పంపించినట్లు తల్లి పార్వతి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని ఆమె చెబుతోంది. కూరగాయల వ్యాపారం చేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఇటీవల ఆమె భర్త గొడవపడినట్లు సమాచారం. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ సుధాకర్‌రావు అరికాళ్లు కాలలేదంటే ఇది ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మోటారు సైకిల్ అక్కడే పార్క్ చేసి ఉందని, అతనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడా, ఇంకేమైనా జరిగిందా అనేది తేలాల్సి ఉందని సీఐ తెలిపారు. -
గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య
సాక్షి, గిద్దలూరు: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బిజ్జం నాగేశ్వరరెడ్డి (47) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. పట్టణానికి చెందిన నాగేశ్వరరెడ్డి కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా వేతనాలు అందక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పులు చేశాడు. వేతనాలు రాకపోవడంతో పాటు కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో రైలెక్కి కర్ణాటక వెళ్లినట్లు బంధువులు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, ఏజెన్సీ నిర్వాహకులకు తమ సమస్యను వివరించినా వారు స్పందించకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పెళ్లయిన రెండు నెలలకే కాటికి
సాక్షి, గిద్దలూరు: పెళ్లి బాజాలు చప్పుడు ఇంకా చెవుల్లో రింగుమంటూ ఉండగానే.. ఆ ఇళ్లలో చావు డప్పు మోగింది.. కనీసం రెండు నెలలైనా కలిసి కాపురం చేయక ముందే నవ దంపతులు కాటికి పయనమయ్యారు.. ఆనందం నిండాల్సిన లోగిళ్ళలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కళకళలాడుతూ తిరగాల్సిన కొత్త జంట విగత జీవులుగా మారారు. ముళ్ల పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను చూసి, వారి కన్నపేగులు తల్లడిల్లిపోయాయి. ఆషాడ మాసమని దూరంగా ఉన్న కొత్త జంట ఒకే చోట శవాలుగా దర్శమివ్వడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారి రోధనలు తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు. కట్టుకున్న భార్యను బండరాయితో మోది చంపిన భర్త ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం గిద్దలూరు మండలంలో కలకలం రేపింది. పెళ్లయి రెండు నెలలు కాకముందే నూతన జంట పరలోకాలకు పయనం కావడం రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. సేకరించిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిక్కిలి కాశయ్య అంకాలమ్మ దంపతుల కుమారుడు రామయ్య (22) ప్రొక్లెయిన్ డ్రైవరుగా పని చేస్తుంటాడు. అతడికి ఈ ఏడాది మే 19న అదే మండలం ఆదిమూర్తిపల్లెకు చెందిన మండ్ల శ్రీనివాసులు, రమాదేవి దంపతుల కుమార్తె చంద్రకళ (19)తో వివాహమైంది. ఆషాఢం ప్రారంభం కావడంతో చంద్రకళ వారం రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఈనెల 9వ తేదీ ఉదయం రామయ్య అత్తింటికి వెళ్లాడు. కంభంలో తన సోదరి ఇంటికి వెళ్లి ఫొటోలు దిగాలని చెప్పి చంద్రకలను బైక్‌పై తీసుకువచ్చాడు. కానీ, కంభం వైపు వెళ్లకుండా బోదివాగు సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు వారు రామయ్య, చంద్రకళలు పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉండటం చూసి, పోలీసులకు సమాచారం అందించారు. చంద్రకళ మృతదేహంపై ఉన్న గాయాలు, ఘటనా స్థలంలో గుర్తించిన రక్తపు మరకలు ఉన్న బండరాయి, పురుగుల మందు డబ్బాను పోలీసులు పరిశీలించారు. రామయ్యే బండరాయితో తలపై మోది చంద్రకళను హతమార్చాడని, ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. ఎస్సై సమందర్‌వలి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం సీఐ మారుతికృష్ణ గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఘటనకు గల కారణాల పై విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాలే కారణమా..? ఆస్తి తగాదాల వల్ల నా బిడ్డను చంపి ఉంటారని చంద్రకళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడు రామయ్యకు అతడి తండ్రి కాశయ్యతో ఆస్తి పంపకాల విషయంలో ఘర్షణలు జరిగాయని, ఆ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురైన రామయ్య తన కుమార్తెను చంపి ఉంటారని వారు పేర్కొంటున్నారు. తమ కుమార్తె జీవితంపై ఎన్నో కలలు కన్న మండ్ల శ్రీను, రమాదేవి దంపతులు తమ కూతురు సుఖంగా ఉంటుందని నమ్మి పక్కనే ఉన్న గ్రామంలో వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఊరికి దగ్గరే కుమార్తె ఉంటే కళ్ల ముందే ఉంటుందని భావించారు. అయితే తమ కుమార్తె ఇలా కట్టుకున్న భర్త చేతిలోనే హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేక హత్య జరిగిన ప్రదేశంలో కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యేలా విలపించారు. వారి ఆర్తనాదాలను చూసిన బందుమిత్రులతో పాటుగా, గ్రామస్తుల హృదయాలు చలించిపోయాయి. చుట్టు పక్క గ్రామాలల్లోని ప్రజలు సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. -
గిద్దలూరులో చాలెంజ్ ఓటు
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా గిద్దలూరులో ఓ యువతి గురువారం చాలెంజ్ ఓటు వేసింది. పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన అనిత తన మొదటి ఓటునే చాలెంజ్ ఓటుగా వేయాల్సి వచ్చింది. స్థానిక యాదవ బజారులోని 202 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు పొందిన అనిత.. ఓటు వేసేందుకు అక్కడికి వెళ్లింది. అప్పటికే ఆమె ఓటును గుర్తు తెలియని వారు వేయడంతో అనిత ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించారు. అయితే, తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని అనిత గట్టిగా చెప్పడంతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా చాలెంజ్ ఓటు గురించి తెలుసుకుని ఉన్న ఆమె.. తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని కోరింది. దీంతో పోలింగ్ అధికారి ఆమెకు చాలెంజ్ ఓటు ఇచ్చారు. చాలెంజ్ ఓటు వినియోగించుకున్న అనితను పలువురు అభినందించారు. -
నేను ఎమ్మెల్యే అయితే..
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు తాగునీటితో పాటు, సాగునీరందిస్తాను. చెరువులన్నింటినీ స్థిరీకరించి నీరు నిల్వ ఉండేలా చేస్తాను. నియోజకవర్గం కరువుపీడిత ప్రాంతంగా ఉంది. కరువును జయించి ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలంటే ఇటీవలి కాలంలో కురిసే అరకొర వర్షానికి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసుకునేందుకు రైతులకు తగిన సలహాలు, సూచనలు చేయిస్తాను. రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించాను. వర్షపు నీటి నిల్వ కార్యక్రమాలకు తన స్వంత నిధులను ఖర్చు చేసేందుకు ప్రత్యేక మిషిన్ రూపొందించాను. తద్వారా రైతులకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా చేస్తూ భూగర్భ జలాలు పెరిగేలా చేస్తాను. ప్రజలకు తాగు నీటి అవసరాలతో పాటు, పంటల సాగుకు వినియోగించవచ్చు. మాజీ సైనికోద్యోగులు ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో వారి ఇబ్బందులను, సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కరిస్తాను. వీరికి ప్రధాన డిమాండ్ అయిన ఎన్సీసీ బెటాలియన్ కోసం కృషి చేస్తా. వ్యవస్థను కాపాడటం కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపులపై పోరాటం కొనసాగిస్తాను. నియోజకవర్గంలోని పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు వెళ్లే యువకుల కోసం ప్రత్యేక అకాడమిని ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేందుకు చర్యలు తీసుకుంటాను. వీరికోసం ప్రభుత్వం లేదా వ్యక్తిగతంగా స్వంత నిధులతో అకాడమిని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను. నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో తన సొంతంగా రన్నింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకుంటాను. తన శక్తివంచన లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలతోనే ఉంటాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగుతుందన్న విశ్వాసంతో ఉన్నాను. –వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అన్నా వెంకటరాంబాబు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా.. తాను ఎమ్మెల్యే అయితే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. గుండ్లమోటు ప్రాజెక్టు నుంచి గిద్దలూరు పట్టణానికి తాగునీటి వచ్చేందుకు కృషి. మా పెద్దాయన మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సాధించిన భైరేనిగుండాల ప్రాజెక్టును పూర్తి చేసి గిద్దలూరు పట్టణంతో పాటు, 14 గ్రామాలకు నేరుగా కుళాయిలకు నీటి సరఫరా చేస్తాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతుల రుణాలు మాఫీ చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాము. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. –పగడాల రంగస్వామి, కాంగ్రెస్ అభ్యర్థి, గిద్దలూరు -
గిద్దలూరులో గెలిచేదెవరు..?
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): గిద్దలూరు నియోజకవర్గ ప్రజలది విలక్షణ తీర్పుగా ప్రచారం ఉంది. పిడతల రంగారెడ్డి మినహా.. ఏ నాయకుడినీ ఎమ్మెల్యేగా రెండో పర్యాయం ఎన్నుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో 1951తో పాటు 1955 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు, తిరిగి 1972తో పాటు 1978 ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేను ఓటర్లు మారుస్తూనే వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే విధమైన మార్పును నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పిడతల రంగారెడ్డి తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయ్యే రికార్డును మాత్రం అన్నా రాంబాబు బ్రేక్ చేస్తారని, నియోజకవర్గాన్ని రెండోసారి వైఎస్సార్ సీపీ ఖాతాలో వేస్తారని అంటున్నారు. నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు... మొత్తం ఓట్లు 2,24,592 పురుషులు 1,11,858 స్త్రీలు 1,12,441 ఇతరులు 19 పట్టుసాధించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు... ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు నియోజకవర్గంపై పట్టుసాధించారు. ఈయన 2009లో పీఆర్పీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. తన సామాజికవర్గమైన ఆర్యవైశ్యులతో పాటు యాదవ, కాపు సామాజికవర్గాల్లో రాంబాబుకు మంచి పట్టుంది. దీనికితోడు వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటింగ్ అయిన ముస్లిం, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతో ఎదురులేని నాయకునిగా ఆయన మారారు. నియోజకవర్గం నుంచి ఏటా వందమందికి పైగా విద్యార్థులను ఇంజినీర్లుగా అన్నా రాంబాబు తీర్చిదిద్దుతున్నారు. నిరుద్యోగులకు తన శక్తిమేర ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరు పేద విద్యార్థులు ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. దీంతో పాటు పేదలు ఎక్కడైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిస్తే నేరుగా సహాయం అందిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వెలిగొండ ప్రాజెక్టు నీటిని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పోరాటం చేసి సాధించారు. అప్పట్లో తిరుపతి వరకు పాదయాత్ర చేసిన ధీరత్వం కలిగిన నాయకుడు. రాజకీయ చరిత్ర... 1951వ సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2009లో కంభం నియోజకవర్గాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు. కంభం నియోజకవర్గంలో ఉన్న తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలు మార్కాపురం నియోజకవర్గంలో కలవగా, అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిసాయి. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ 5 పర్యాయాలు గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఇలా... టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్తుముల అశోక్‌రెడ్డి 2014లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేసి గెలిచి అనంతరం టీడీపీలోకి మారడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కోసమే మారానని చెప్పి.. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమైంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసి రోడ్లు, భవనాలు, చెక్ డ్యామ్‌లు నిర్మించామని ప్రచారం చేసుకోవడం మినహా.. వాటి దాఖలాలు, వాటితో ప్రజలకు ఒరిగిన ప్రయోజనాలు శూన్యం. కేవలం నాయకుల జేబులు నింపుకునేందుకే ఆ పనులు చేశారన్న వాదన ప్రజల్లో వినిపిస్తోంది. అధిక ఆదాయం వచ్చే పనులను తన బినామీలతో చేయించి కోట్ల రూపాయలు సంపాదించారని, పెట్టుబడి ఎక్కువ అయ్యే పనులను కార్యకర్తలకు ఇవ్వడం వలన చాలా మంది నాయకులు నష్టపోయారని సమాచారం. టీడీపీ నాయకులే ఆయనను వ్యతిరేకించిన సందర్భాలు అనేకం. వీటన్నింటింతో నియోజకవర్గంలో అశోక్‌రెడ్డితో పాటు టీడీపీ కూడా పూర్తిగా బలహీనపడింది. -
త్వరపడండి.. అమ్మకానికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): ఎన్నికల నియమావళి వస్తోందని పనులు పూర్తికాక ముందే ప్రారంభించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఖాళీగా ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టును రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు సొమ్ము చేసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడూ ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నినాదంతో అధికార టీడీపీ నాయకులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మళ్లీ అధికారం వస్తుందో లేదో అన్న అనుమానంతో అర్హత కలిగిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను డబ్బులిచ్చిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా తిరగలేక కనీసం డబ్బులు కడితేనైనా తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో నాయకులు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు లేవని పెళ్లి కూడా చేసుకోకుండానే అలాగే ఉండిపోతుఆన్నరు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ వంటి ఉపాధి కోర్సులు చదువుకున్నా సొంతంగా దుకాణాలు పెట్టుకున్నా పోటీ ఎక్కువ కావడంతో కనీసం ఇల్లు గడవడానికి సంపాదించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగమైనా ఏదో ఒక రోజు మనసున్న ముఖ్యమంత్రి రాకపోతాడా..తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోతాడా.. అన్న ఆశతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించి షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరుతున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఐదు పోస్టులు ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసేందుకు ఐదుగు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తారు. ఇందులో ఒకరు వాచ్‌మన్ కాగా మిగిలిన నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉంటారు. ఇందులో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతకు ఒక పోస్టు ఇవ్వగా మిగిలిన పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న అధికార టీడీపీ నాయకులు డిమాండ్ సృష్టించి నిరుద్యోగుల నుంచి అందిన కాడికి పిండుకుంటున్నారు. తమ గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో పోస్టుల్లో తనకు వాటా ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు ముందుగానే అడ్వాన్సులు పుచ్చుకున్నారు. తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తోందని నగదు ఇచ్చిన వారు నాయకుల వెంట తిరుగుతున్నారు. టీడీపీలో చేరితే పోస్టులంటూ ఎర గిద్దలూరు నియోజకవర్గంలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులిస్తాం..తమ పార్టీలో చేరండని మాజీ సర్పంచ్‌లు, కుల సంఘాల నాయకులను బతిమిలాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముండ్లపాడులో ఓ నాయకునికి రెండు పోస్టులు ఇస్తామని కండువా కప్పారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచికి రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇస్తానంటూ ఎరవేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఆరు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పొదలకుంటపల్లెలో ఉన్న సబ్‌స్టేషన్ ఇటీవల పూర్తయింది. మిగిలిన కొత్తపల్లె, బురుజుపల్లె, అనుములపల్లె, చిన్నకంభం, నల్లగుంట్ల గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణాలు పూర్తికాక ముందే పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో సబ్ స్టేషన్లో నాలుగు పోస్టుల చొప్పున మొత్తం 24 పోస్టులు విక్రయానికి పెట్టారు. ఎన్నికల నియమావళి రావడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాత తేదీలతో నియామకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పొదలకుంటపల్లె గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నేటికీ కొత్త ఉద్యోగులు విధుల్లో చేరలేదు. అయినా ఈ నెల 5వ తేదీనే నియామకాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలానే అన్ని సబ్స్టేషన్లలోని పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.1.60 కోట్లు నిరుద్యోగుల నుంచి లాగేసుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నియామకాలు చేపడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ మార్కాపురం డీఈఈ టి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
వైఎస్సార్ సీపీలో చేరిన గిద్దలూరు టీడీపీ నేతలు
-
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40మంది టీడీపీ నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎదురు శ్రీనివాస్‌రెడ్డి, ఉడముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. కాగా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను అధిష్టానం పట్టించుకోలేదని అందుకే తాము వైఎస్సాఆర్ సీపీలో చేరామన్నారు. -
ప్రజలు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు
ప్రకాశం, గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక కాశిరెడ్డినగర్లోని శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, సాయిటెక్నో స్కూల్లలో వైవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ అందులో వైద్యులు, సిబ్బంది కొరత, మందుల కొరతతో ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలు ఉచిత వైద్య శిబిరాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు పరిస్తే ప్రజలు ఉచిత వైద్య శిబిరాల వైపు చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జిల్లాలో 555 ఆరోగ్య కేంద్రాలు, 90 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీలు ఉన్నా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రజలకు తగిన వైద్యం అందడం లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను అన్ని నియోజకవర్గాల్లో మెగా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరులో నిర్వహించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వేలాది మంది ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులతో శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 6,500 మంది వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి మందులు, భోజన వసతి కల్పించారు. మంచినీటి సరఫరాలో లోపం వలనే ప్రజలకు అనారోగ్యం:ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయకపోవడం వలనే అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ ద్వారా తాగునీరందిస్తామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి అడుగుల లోతులో బోరుబావులు తవ్వితే కానీ నీరు లభించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నీటిని తాగిన ప్రజలు కీళ్లనొప్పులు, కిడ్నీ, ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో అవి ప్రజలకు చేరువకావడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ఫలితంగా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లమోటు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. కంభం చెరువుకు నీరు నింపి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు మరుగున పడటం వలన సాగులో ఉన్న ఖరీఫ్, రబీ రెండు పంటలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన అరకొర పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలన్న దురుద్దేశంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనే 5,227 ఓట్లను తొలగించేందుకు ఫారం–7 పెట్టారని, వారి కుట్రలను భగ్నం చేస్తూ సమన్వయకర్త ఐవీ రెడ్డి, నాయకులతో కలిసి 4,463 ఓట్లను పునరుద్ధరించేలా చేశారన్నారు. ప్రజలకు సేవచేసి వారి మన్ననలను పొందలేని అధికార పార్టీ నాయకులు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారు. ప్రజల కోసం సేవచేస్తున్న వారికి మద్దతు పలికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, యాళ్లూరి వెంకటరెడ్డి, కే.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు కామూరి రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సీహెచ్.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కే.వి.రమణారెడ్డి, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి పొదిలి: సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించటంలో విఫలం కావటంతో వరి ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైవి.సుబ్బారెడ్డి అన్నారు.మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వగృహంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ వాటిని ప్రణాళిక బద్ధంగా రైతులకు అందించటంలో విఫలమయ్యారన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పొదిలి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య గురించి ఢిల్లీ స్థాయిలో గళం వినిపించామని, ఫలితంగా కేంద్ర అధికారులు వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారన్నారు. మంచినీటి ప్రాజక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, అయితే చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. పశ్చిమ ప్రాంతం వారికి కరవు లేకుండా చేసే వెలుగొండ ప్రాజక్టు నిర్మాణం చంద్రబాబుతో కాదన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపు ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు, పొదిలి ప్రాంత ప్రజల తాగునీటి ఇబ్బందులు తీరుస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
టీడీపీ బీజేపీ కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు: ఐవీ రెడ్డి
-
రెవెన్యూలో మాయగాళ్లు
అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటాయి. కానీ ప్రైవేటు భూములను కూడా ఆక్రమించేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయించి ఆ భూములు తమవే నంటూ ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. అసలు హక్కుదారులు విషయం తెలుసుకుని వచ్చి అదేంటని అడిగినా ఆ భూములు తమవేనంటూ బుకాయిస్తున్నారు. ఇలా ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే వేలాది ఎకరాల భూములు పరులపాలయ్యాయి. ఈ అక్రమాల్లో రెవెన్యూ సిబ్బందిదే కీలకపాత్ర. గిద్దలూరు : తమకు భూమి ఉంది...పాసు పుస్తకం కూడా ఉంది. నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరబడినట్టే. గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలకు పలానా ప్రాంతంలో భూమి బీడుగా ఉందని గుర్తించారంటే ఆ భూమి వారి ఖాతాలోకి చేరుతుంది. రెవెన్యూ శాఖలో కొందరు అధికారులతో జతకట్టి ప్రభుత్వ, ప్రైవేటు భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు. రికార్డులను సైతం మార్చేసి వారి పేర్లు, వారి బంధువుల పేర్లను ఎక్కించేసుకుంటున్నారు. కొందరు వీఆర్వోలు వారికి సహకరిస్తూ పాత అడంగళ్లు, వన్ బీ రికార్డుల్లోనూ పదేళ్ల ముందు నుంచి అనుభవంలో ఉన్నట్లు నమోదు చేసేస్తున్నారు. ఇలా తమ అనుభవంలో ఉన్న భూమిని తహశీల్దారు ద్వారా వారి పేరుతో ఆన్లైన్ చేసేసుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక రికార్డుల్లో తమ పేరు ఉందంటూ భూమిని దున్నేసి పంటలు సాగు చేసుకుంటారు. పంటలు సాగుచేసే సమయంలో గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే ఈ పొలం మాదనుకున్నాము. ఈ ఏడాది పంట వేసుకుంటాం. వచ్చే ఏడాది మీరే తీసుకోండని నమ్మబలికిస్తారు. వచ్చే ఏడాది భూమి నాదే, గతేడాది నేనే పంట సాగు చేసుకున్నాను. రికార్డుల్లో పేర్లు నావే ఉన్నాయంటూ ఘర్షణకు దిగుతారు. వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రికార్డులను మార్చింది వారే కాబట్టి. ఇలా రెవెన్యూ అధికారులు పేద రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను, అమాయకంగా ఉండే రైతుల స్వంత భూములను సైతం కాజేస్తున్నారు. మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన తల్లపురెడ్డి వెంకటరెడ్డికి చెందిన 1481వ సర్వే నంబర్లోని భూమిని ఇదే విధంగా గ్రామానికి చెందిన వీఆర్ఏ తన బంధువుల పేర్లతో ఆక్రమించేశారు. వీఆర్ఏకు మద్దతునిస్తూ వీఆర్వో 8 సంవత్సరాల అడంగళ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు స్వయంగా ఆర్ఐ విచారణలో తేలింది. ఆయన తహశీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వీఆర్ఓస్పందించడంలేదనిరైతువాపోతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మోడి పుల్లయ్య స్వంత భూమిని ఇతరుల పేరుతో ఆన్లైన్ చేసేశారు. ముండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వీఆర్ఓ గ్రామ రికార్డులను తన వద్ద పెట్టుకుని ఒకరి పేరును మరొకరికి రాస్తూ తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 20 వేల ఎకరాలకు పైగా అనర్హులకు చేరిన ప్రభుత్వ భూములు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 20 వేల ఎకరాలకు పైగా అసైన్మెంట్ భూములు అనర్హులకు అప్పగించి రెవెన్యూ అధికారులు కోట్లు సంపాదించారు. అధికారులకు డబ్బు ఆశచూపి ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగా భూములను కొల్లగొట్టేశారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, పేదలు పెంచుకునే పశువులు, గొర్రెలు మేసేందుకు అవసరమైన గ్రాసం కనిపించకుండా మేత బీడు భూములను సైతం అన్యాక్రాంతం చేసేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా పొందిన కొన్ని సంఘటనలు... కొమరోలు మండలంలోని దద్దవాడ రెవెన్యూలో అధికార పార్టీకి చెందిన ఓ డీలర్ 130 ఎకరాలు ఆక్రమించేశాడు. రాజుపాలెంలో 34 ఎకరాలకు ముగ్గురు పాసు పుస్తకాలు పొందారు. అనంతరం రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం పొందారు. ఇప్పుడు ఆ భూమిని ఆన్లైన్లో రస్తా పోరంబోకు భూమిగా చూపిస్తున్నారు. రాచర్ల మండలంలోని యడవల్లి రెవెన్యూలో గిద్దలూరుకు చెందిన టీడీపీ నాయకులకు అసైన్డ్ భూములు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రైవేటు భూములను సైతం ఆన్లైన్ చేసి ఈ–పాసు పుస్తకాలు ఇచ్చారు. సత్యవోలుకు చెందిన ఓ ఉద్యోగి తన భార్య పేరుతో అసైన్డ్ భూములను పొందాడు. యడవల్లికి చెందిన ఆలయ భూములను ఉద్యోగులు ఆక్రమించుకున్నా రెవెన్యూ, దేవాదాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గిద్దలూరు మండలంలోని వెల్లుపల్లెలో 1015 సర్వే నంబరులో ఆరు ఎకరాలు ఉన్న నాలుగుపాటి కుంటను క్రిష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు ఆక్రమించి కట్టను తొలగించి చదును చేసుకున్నాడు. ముండ్లపాడు రెవెన్యూలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములను సైతం అన్యాక్రాంతం చేస్తూ ఆన్లైన్లో ఒకరి భూమిని మరొకరికి పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఖాతాలను కేటాయించి ఆన్లైన్లో ఇతరులుగా నమోదు కాబడిన ప్రభుత్వ భూమిని బినామీదార్ల పేర్లతో నమోదు చేస్తూ బ్యాంకుల్లో భారీ గా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా భూమిని ఇంకొకరికి రాసిచ్చారు తన పూర్వీకులకు చెందిన 4.16 ఎకరాల భూమిని నేను అనుభవిస్తున్నాను. పాసు పుస్తకం ఇచ్చారు. రెండేళ్లుగా వర్షాలు కురవలేదని బీడు పెట్టడంతో వీఆర్ఏ బంధువులు ఆక్రమించుకున్నారు. తహశీల్దారుకు, ఆర్డీఓకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా వీఆర్వో పలకడం లేదు. ఆర్ఐ వచ్చి పరిశీలించి రికార్డుల్లో పేర్లు మార్చారని చెబుతున్నారు. – టి.వెంకటరెడ్డి, బాధితుడు, ముండ్లపాడు గ్రామం. మా భూమిని పక్కనున్న వారికి ఆన్లైన్ చేశారు మానాన్న యల్లా రాజేంద్రప్రసాద్ పేరుతో 702–2 సర్వే నంబర్లో ఉన్న 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న వారికి ఆన్లైన్ చేశారు. 1978 సంవత్సరం నుంచి మా అనుభవంలో ఉన్న 99 సెంట్ల భూమిని మానాన్న పేరున ఆన్లైన్ చేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న యల్లా సరస్వతి పేరున ఆన్లైన్ చేశారు. – యల్లా వెంకటమణికంఠ, గిద్దలూరు. ఫిర్యాదు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు మాకు ఫిర్యాదులు అందలేదు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. భూమిపై ఎవరికి హక్కు ఉందో విచారించి వారి భూములను వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చెబితే సంబంధిత అధికారులను విచారించి చర్యలు చేపడతాం – పెంచల కిషోర్, ఆర్డీఓ, మార్కాపురం -
పోలీసు తుపాకీతో యువకుడి పోజులు.. ఫొటోలు హల్చల్!
సాక్షి, ప్రకాశం : గిద్దలూరుకు చెందిన ఓ యువకుడు ఏకంగా పోలీసు తుపాకీతో పోజులిస్తూ.. ఫొటోలు దిగాడు. అతని ఫొటోలు తాజాగా ఫేస్బుక్లో వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ యువకుడి వద్దకు పోలీసు తుపాకీ ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోజులిచ్చిన దిగిన తుపాకీ నిజమైనదేనా? లేక ఫొటోల కోసం నకిలీ తుపాకీతో పోజులిచ్చాడా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
అర్ధరాత్రి హాహాకారాలు.. నలుగురి మృతి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 10 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని చికమంగుళూరు జిల్లా సరిలి మండలానికి చెందిన 45 మంది భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం లారీలో బయల్దేరారు. కొమరోలు మండలం తంబళ్లపల్లి క్రాస్ వద్దకు వచ్చేసరికి లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నారాయణమ్మ, ఆదిమ్మ, మారెప్ప, వెంకటనర్సప్ప ఘటనాస్థలిలోనే మృతిచెందారు. గాయాలపాలైన çసుమారు 10 మందిని వెంటనే గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ, గిద్దలూరు సీఐ, ఎస్ఐలు ఘటనాస్థలికి చేరుకున్నారు. -
‘చంద్రబాబు చేతుల్లో ప్రజాస్వామ్యం హతం’
సాక్షి, ఒంగోలు : ‘అనునిత్యం విలువలతో కూడి రాజకీయం చేస్తాను, విలువలతో కూడిన రాజకీయం చేస్తాను అని.. చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. మరి ఆ విలువలతో కూడిన రాజకీయం అంటే.. ఎమ్మెల్యేలకు వెల కట్టి కొనుక్కోవడమేనా? ఒక్క ఎమ్మెల్యేను పాతిక కోట్ల రూపాయలకు కొనడమా? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు అలాంటి చీప్ పొలిటీషియన్ చేతిలో భారత ప్రజాస్వామ్యం హతం అవుతోంది. అనునిత్యం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యంగ స్ఫూర్తికి తూట్లు పొడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు...’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఇన్చార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఐవీ రెడ్డి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కొనుగోలు రాజకీయాలు చేస్తున్నరు, ఆయనకు దమ్మూ ధైర్యం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ‘ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపు ఫిరాయిస్తున్న వాళ్లు రాజకీయ నీచులు. అధికారం, ధనకాంక్షలతో అనైతిక చర్యకు పాల్పడుతున్నారు. అంతగా అధికార పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి వారు రాజీనామా చేయాలి. దమ్మూధైర్యం ఉంటే.. మళ్లీ పోటీకి సిద్ధం కావాలి. దారుణం ఏమిటంటే.. అలాంటి దమ్మూ, ధైర్యం, సిగ్గూ శరం అటు.. చంద్రబాబు నాయుడికీ లేవు.. ఇటు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలకూ లేవు. ఇలాంటి హీనులనా మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది అని వీరికి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి ఫిరాయింపు నీచ రాజకీయానికి పాల్పడిన వారికి అయినా, వీళ్ల చేత ఇలాంటి పని చేయిస్తున్న చంద్రబాబుకు అయినా రేపటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యవిలువలను ఎంతగా పాతరేసినా.. ఈ పాపానికంతటికీ తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల రూపంలో ప్రజాతీర్పును ఎదుర్కొనడానికి మరెంతో దూరం లేదు. అలాంటి సమయంలో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనూ.. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికీ అభివృద్ధి ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ తేడా.. నక్కకూ నాకలోకానికి ఉన్నం తేడా ఉంది. చంద్రబాబువి గుంట నక్క రాజకీయాలు. ఫిరాయింపుదారులు, వీళ్ల ట్రూపుకు పెద్ద చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేయవచ్చు. ఇదంతా తాత్కాలికమే. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోలేని చేతగాని రాజ్యాంగ వ్యవస్థ ఉండవచ్చు. కానీ.. ఈ మోసం కలకాలం సాగదని గుర్తుంచుకోవాలి. ఇంత చేసినా మరో ఏడాది మాత్రమే.. తర్వాత అంతిమ తీర్పు వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నట్టుగా ఉన్నాడు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే అది జరుగుతుందని బాబు అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. అది కేవలం పగటి కల మాత్రమే అని ఆయన గుర్తుంచుకోవాలి...’ అని ఐవి రెడ్డి హెచ్చరించారు. -
దేశ సరిహద్దుల్లో.. గిద్దలూరు ‘యుద్ధ’వీరులు
చుట్టూ నల్లమల అడవులు.. నిరంతరం తాగునీటి కష్టాలు.. నిత్యం కరువు విలయతాండవం.. ఇదీ గిద్దలూరు నియోజకవర్గం పరిస్థితి.. అయితేనేం.. అక్కడి వారి గుండె గుండెలో దేశభక్తి నినాదం ధ్వనిస్తుంది. నరనరాల్లో తెగింపు అగ్నికణిక జ్వలిస్తుంది. దేశం కోసం నిలబడాల్సి వస్తే.. రణక్షేత్రంలో రక్తపుటేరులవుతారు. ప్రజలకోసం ప్రాణాలు పెట్టాల్సి వస్తే.. ఆనందంగా అమరులవుతారు. అందుకే అక్కడి నుంచి యువత సైన్యంలోకి క్యూ కడుతున్నారు. శత్రువుకు ఎదురొడ్డి దేశరక్షణ కోసం ధైర్యంగా పోరాడుతున్నారు. యుద్ధంలో.. ఉగ్రదాడుల్లో ఇప్పటి వరకూ నియోజకవర్గానికి చెందిన 150 మందికిపైగా అశువులుబాశారు. గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం సైనికుల ఖిల్లాగా మారింది. ఇంటికో యువకుడు సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. జిల్లాలో12 నియోజకవర్గాలు, 56 మండలాలున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో ఉన్న సైనికోద్యోగుల మొత్తంలో.. ఒక్క గిద్దలూరు నియోజకవర్గం నుంచే సగానికి పైగా ఉన్నారు. 50 ఏళ్ల కిందట తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయంలో కేవలం ఉపాధి కోసం ఇక్కడి యువత ఆర్మీలో చేరారు. ప్రస్తుతం ఉపాధికి దేశభక్తి తోడవడంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోంచి దాదాపు 25 వేల మందికి పైగా ఆర్మీ ఉద్యోగులున్నారు. దేశ సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి శత్రుమూకలతో పోరాడుతున్నారు. అమరుల పిల్లలూ ఆర్మీలోకే.. ఉగ్రవాదులతో జరిగిన పోరాటాల్లో, శత్రు దేశాలతో జరిగిన యుద్ధాల్లో నియోజకవర్గంలోని సైనికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారి కుమారులు, సోదరులు తిరిగి ఆర్మీలో చేరిన సందర్భాలున్నాయి. దీనికి కారణం వారికున్న అమితమైన దేశభక్తి, తమ ప్రజలను కాపాడాలన్న దృఢసంకల్పమే. మగవారంతా సైన్యంలోనే.. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుంచి ఎక్కువ మంది యువకులు సైన్యంలో చేరారు. అందులో ప్రధానంగా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె గ్రామం. గ్రామంలో 84 గృహాలుండగా 490 మంది జనాభా. వీరిలో 180 మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కో ఇంట్లో మగవారంతా ఆర్మీ ఉద్యోగం చేస్తున్నారు. అర్థవీడు మండలంలోని అంకభూపాలెం, అర్థవీడు, పాపినేనిపల్లె, కందుకూరు, కాకర్ల, రాచర్ల మండలంలోని జేపీ చెరువు, సోమిదేవిపల్లె, ఒద్దులవాగుపల్లె, గౌతవరం గ్రామాలు, కంభం మండలంలోని తురిమెళ్ల, మదార్పల్లె, బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు, పీవీ పురం, శింగరపల్లె, గిద్దలూరు మండలంలోని గడికోట, ఉయ్యాలవాడ గ్రామాల్లో 60 శాతానికి పైగా ఆర్మీ ఉద్యోగులున్నారు. 150 మందికిపైగా వీరమరణం యుద్ధంలో.. లేదా ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన వారు నియోజకవర్గంలో 150 మందికి పైగా ఉన్నారు. అంగ వైకల్యం పొందిన వారు దాదాపు 25 మంది వరకూ ఉన్నారు. వైకల్యం పొందిన వారు కొందరు తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులుగా చేరారు. సైన్యంలోచేరితే ఉపాధికి తోడు దేశానికి సేవ చేసే అవకాశం ఉన్నందున ఎక్కువమంది యువకులు ఇక్కడి నుంచి సైన్యంలో చేరుతున్నారు. నా బిడ్డ బతికుంటే సైన్యంలో చేర్పించే వాడిని నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నా. ఎదురు కాల్పుల్లో గుండెకు ఆనుకుని, భుజంపై బుల్లెట్ గాయాలయ్యాయి. అప్పటికే ముగ్గురు అధికారులు చనిపోయారు. నేను పోరాడి గాయం కావడంతో బయటకు వచ్చేశాను. దేశం కోసం యుద్ధంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు మరణించాడు. నా కుమారుడు బతికుంటే ఆర్మీలో చేర్పించేవాడిని. -నీలి రామకృష్ణుడు, మాజీ సైనికుడు, ఆకవీడు, రాచర్ల మండలం నా కుమార్తెకూ ఆర్మీ జవానుతోనే వివాహం చేశా.. నేను 1989లో జరిగిన శ్రీలంక యుద్ధంలో పాల్గొన్నా. నా కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ గాయం కావడంతో వార్ ఇంజురీ కింద పంపించారు. 20 ఏళ్ల పాటు ఆర్మీకి సేవలందించా. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తెను ఆర్మీ జవానుకే ఇచ్చి వివాహం చేశా. - పీవీ నారాయణ, మాజీ సైనికుడు, రాచర్ల -
టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాలు
గిద్దలూరు: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాముఖ్యత ఇస్తుండటంతో నేతలతోపాటు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు పార్టీలో, అధినేత దగ్గర తగిన విలువ, ప్రాధాన్యత లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యక్రామాలకు పిలవకపోవడం, కావాలని దూరం పెట్టడం వంటివి స్థానిక నేతలకు నచ్చడంలేదు. ఈనేపథ్యంలోనే పలువురు నేతలు తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నారు. తాజా నంద్యాల ఉప ఎన్నికల కార్యక్రమాలకు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిని కాదని భూమా అఖిల ప్రియకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్సీగా గెలిచి 90రోజులు కూడా కాకముందే శిల్పా చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు తన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు సైతం ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. నియోజక వర్గంలో మొదటి నుంచి ఉంటున్న తనను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ప్రాముఖ్యత ఇస్తుండటంతో ఆయన కొంత కాలంగా తీవ్ర సంతృప్తితో ఉన్నారు. దీంతో అన్నా రాంబాబు ఈ నెల 5న పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటుగానే విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనకు మద్దతుగా నియోజక వర్గం నుంచి సుమారు 200మంది స్థానిక నేతలు, వందలాది మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా చదవండి: టీడీపీకి రాజీనామా చేస్తున్నా -
టీడీపీకి రాజీనామా చేస్తున్నా
-
టీడీపీకి రాజీనామా చేస్తున్నా
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గిద్దలూరు: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. గిద్దలూరులో శుక్రవారం కార్యకర్తలు, అనుచ రులతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వలన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోలేదని, పైగా పార్టీ ఫిరాయించిన వారితోనే కలిసి పనిచేయాలని చెబుతున్నారని విమర్శించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజల సమస్యలపై పోరాడతానన్నారు. -
టీడీపీకి అన్నా రాంబాబు రాజీనామా
-
డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం
గిద్దలూరు : డప్పుల్లో పెట్టి రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గిద్దలూరు రైల్వే పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మూడు డప్పుల్లో గంజాయిని కుక్కి రైలులోని సీటు కింద ఉంచి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక ఆర్పీఎఫ్ ఏఎస్సై నాగభూషణం తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు డప్పుల్లో ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయి తరలించేందుకు కొత్త పంధాను ఎన్నుకున్నారు. గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో స్టెప్నీ టైర్లలో గంజాయి ఉంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటుండటంతో స్మగ్లర్లు సరికొత్త విధానంలో డప్పుల్లో గంజాయి ఉంచి రైలులో తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా సీట్ల కింద ఉన్న డప్పులను గమనించిన ప్రయాణికులు.. ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ గుట్టురట్టయింది. ఆ డప్పులు ఎవరివని పోలీసులు ప్రశ్నించినా.. అందరూ తమవి కావని చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వాటిలో నాసిరకం గంజాయి ఉందని, ఇది కిలో రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర పలకదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
హత్యా రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారు: ఐవీ రెడ్డి
కళకళలాడాల్సిన రాష్ట్రాన్ని టీడీపీ నేతలు, వారి అనుచరులు హత్యారాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యను ఆయన ఖండించారు. రాజకీయంగా ఎదుగుతూ పట్టు సాధిస్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను ఓర్వలేక.. నిరాయుధుడిగా ఉన్న సమయంలో ఇలా హత్యకు తెగబడటం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసుల సాక్షిగా బాబు, లోకేష్ సమాధి చేసినట్టు మరోసారి రుజువయ్యిందని, ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోను చూసి ఉండరని ఆయన మండిపడ్డారు. బాబు సర్కార్ ప్రోత్సహిస్తున్న హత్యా రాజకీయాలకు ప్రజలు చెల్లుచీటీ పలికే తరుణం దగ్గరలోనే ఉందని చెప్పారు. చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఐవీ రెడ్డి గుర్తు చేసుకున్నారు. -
పిడుగుపాటుకు రెండు గుడిసెలు దగ్ధం
► రూ. 3 లక్షల ఆస్తి నష్టం కొత్తకోట (గిద్దలూరు రూరల్): పిడుగు పాటుకు రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొత్తకోట ఎస్సీ పాలెంలో ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో జరిగింది. ఉరుములు మెరుపులు వచ్చిన సమయంలో ఓ పిడుగు కొమ్మునూరి సరోజమ్మ, కొమ్మునూరి ఓబులేసుల పూరి గుడిసెలపై పడటంతో నిప్పు అంటుకుంది. ఆరుబయట పడుకున్న యజమానులు మంటలను గమనించి కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ వారికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే గుడిసెలు రెండు పూర్తిగా కాలిపోయాయి. వంట పాత్రలు, బీరువా, బియ్యం బస్తాలతో పాటు రూ.4,500 నగదు, ఒక జత బంగారు కమ్మలు, వెండి పట్టీలు, వంటివి కాలిపోయాయి. తమకు నిలువ నీడలేకుండాపోయిందని బాధితులు ఆవేదన చెందారు. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితులకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5 వేలను అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ పి.ఖాదర్‌వలి, సీనియర్ అసిస్టెంట్ సాయి, వీఆర్ఓ రమణ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలోకి గిద్దలూరు కౌన్సిలర్లు
గిద్దలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ప్రజానేతగా జనం గుండెల్లో చిరకాలం అమరుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తన భుజ స్కందాలపై మోస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకుని పలువురు గిద్దలూరు నియోజకవర్గ ప్రముఖులు బుధవారం వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కౌన్సిలర్లు బిల్ జయలక్ష్మి, షేక్ జమ్రుతి, ఇప్పాల వెంకటేశ్వరులు, గవురమ్మ, మాజీ కౌన్సిలర్లు బిల్ల రమేష్ యాదవ్,వెంకట్ రావు, అల్తాఫ్తో పాటు టిడిపి కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఐ.వీ.రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఐటి ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలిసారు. కాగా గిద్దలూరులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఐవీ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టిడిపిలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండే అవకాశం లేదని, అందరు మంచి భవిష్యత్ కోసం వైఎస్ఆర్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. -
తల్లి వద్దకు చేరిన కుమారుడు
గిద్దలూరు : పట్టణంలోని పాములపల్లె రోడ్డులో ఉంటున్న దార్ల నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్ ఎట్టకేలకు తల్లి వద్దకు చేరాడు. ‘అందరు ఉన్నా అనాథ!’ శీర్షికతో ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనాన్ని చదివిన నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్ శుక్రవారం ఇంటికి చేరాడు. తన తల్లి అనారోగ్యంతో పడుతున్న కష్టాలు పత్రిక ద్వారా తెలుసుకుని తల్లి చెంతకు చేరాడు. భార్య, ఇద్దరు కుమారులతో వచ్చి రెండు రోజులుగా తల్లి ఆలనాపాలన చూసుకుంటున్నాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లికి స్థానికంగా వైద్యం చేయిస్తున్నాడు. కన్న కుమారుడు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన కుమారుడిని దగ్గరకు చేర్చేందుకు ‘సాక్షి’ చేసిన కృషిని నిర్మాలాదేవి, ఆమె బంధువులు అభినందించారు. దాతలు సహకరించాలని విజ్ఞప్తి: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తల్లికి వైద్యం అందించి మామూలు మనిషిని చేసుకోవాలని కుమారుడు శివశక్తి కుమార్ ఆరాటపడుతున్నాడు. నెల్లూరు తీసుకెళ్లి పూర్తిస్థాయి వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేవని, అప్పు ఇవ్వాలని బంధువులను కోరుతున్నాడు. బంధువులు వాయిదాలు వేస్తుండటంతో చేసేది లేక తల్లికి సపర్యలు చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాక శివిశక్తికుమార్ తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం నెల్లూరులో ఓ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇంతలో తల్లికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని ఉండలేక ఉన్నఫళంగా వచ్చేశాడు. తల్లి వైద్యానికి అవసరమైన డబ్బు కోసం శివశక్తికుమార్ ఉన్న దారులన్నీ వెతుకుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ రావడంతో బంధువులు సహకరించడం లేదని తెలుస్తోంది. దాతలు సహకారం అందించి తన తల్లిని కాపాడాలని శివశక్తికుమార్ కోరుతున్నాడు. సత్యసాయి సేవా సమితి, గిద్దలూరు జర్నలిస్టులు కొంతమేర ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని శివశక్తికుమార్ కోరుతున్నాడు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు 99495 97381, 99516 07043 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశాడు. -
దాహం కేక!
► తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు ► బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన ► రెండు గంటలపాటు నిలచిన వాహనాల రాకపోకలు ► అడ్డుకోబోయిన పోలీసులతో స్థానికుల వాగ్వాదం ► ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు ► సమస్య పరిష్కరించాలని డిమాండ్ ► ఆర్డబ్ల్యూఎస్ డీఈ హామీతో ఆందోళన విరమణ ఎన్నికల వేళ ఇంటింటికీ తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించే ప్రజాప్రతి నిధులు.. అవసరం తీరాక ఓట్లేసి గెలిపించిన జనం గోడు పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడ్డారు. వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నా తమ సమస్య పట్టించుకున్న నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం రాచర్లకు చెందిన మహిళలు స్థానిక బస్టాండ్ సెంటర్లో శనివారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యే వచ్చి, నీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాచర్ల : తమ గ్రామానికి గడచిన ఆరు రోజులుగా తాగునీటి ట్యాంకర్ రాక, ఇబ్బందులు పడుతున్న రాచర్ల వాసులు శనివారం పెద్ద సంఖ్యలో స్థానిక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా చేస్తున్నప్పటికీ ఆర్డబ్ల్యూఎస్, మండల పరిషత్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడ చూడలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు ధర్నాను మరింత ఉద్ధృతం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ధర్నా చేస్తున్న మహిళలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. తాగునీటి సమస్య పరిష్కారం చేసే వరకూ ధర్నాను కొనసాగిస్తామని మహిళలు ఆందోళనకు అడ్డుకుంటున్న పోలీసులకు తేల్చిచెప్పారు. ఆందోళన కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చే ట్యాంకర్లను ఆపేశారు..: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బందం శకుంతల మాట్లాడుతూ రాచర్ల పంచాయతీతో 5,200 మంది జనాభా ఉండగా అధికారులు 16 వాటర్ ట్యాంకులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అవి సరిపోక తాము మరో 15 ట్యాంకులు సరఫరా చేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వర్గీయులకు ఏజెన్సీ ఇచ్చేందుకు ఆ 15 ట్యాంకుల నీటి సరఫరా నిలిపివేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష చెప్పడంతో సరఫరా ఆపేశామన్నారు. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారి, మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చిందని సర్పంచ్ పేర్కొన్నారు. నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా చేసిన బిల్లులు ఇంత వరకూ మంజూరు చేయలేదని, రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉందని సర్పంచ్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..: డీఈ రాచర్ల గ్రామానికి అదనంగా 16 వాటర్ ట్యాంకులు మంజూరు చేసి తాగునీటి సమస్య పరిష్కారిస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకుని బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, యూఆర్డీ షేక్ మస్తాన్‌వలి, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో పర్యటిస్తారని, వాటర్ ట్యాంకులు నిలిపేందుకు స్థలాలను కేటాయించి ఆ స్థలంలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని డీఈ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తొక్కేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నా రాంబాబును కోరారు. కార్యకర్తల ఒత్తిడితో అన్నా రాంబాబు.. అశోక్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. -
టీడీపీలో డిష్యుం..డిష్యుం..!
= గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా అన్నా వర్గీయుల నినాదాలు = 500 మందితో ఒంగోలుకు ర్యాలీ = మంత్రి శిద్దా, దామచర్ల, మాగుంటలకు ఫిర్యాదు టీడీపీ ఎత్తు: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బుట్టలో వేసుకుంటే.. ఇంకా తిరుగు ఉండదని.. అసెంబ్లీ మొత్తం చేతుల్లోకి వస్తుందని.. రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం సాధించవచ్చని. యాక్షన్ ప్లాన్: జిల్లాలో కొంతమంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఈ మధ్యనే టీడీపీ కండువా కప్పుకున్నారు. రియూక్షన్: ఇప్పటికే టీడీపీ గిద్దలూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అన్నారాంబాబు వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. అధిష్టానంతోనే ఢీ అంటే ఢీ అంది. బుధవారం 500 మంది అనుచరులతో అన్నా.. జిల్లా కేంద్రానికి చేరుకొని అమీతుమీకి సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిద్దలూరులో టీడీపీ రాజకీయాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి.. పాత టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, అభివృద్ధి పనులన్నీ తమ వర్గీయులకే కేటాయించాలని అధికారులను బెదిరిస్తున్నాడని, ఫీల్డు అసిస్టెంట్లను, జన్మభూమి కమిటీ సభ్యులను తమ వారినే నియమించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అన్నా రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్‌రెడ్డితో అమీతుమీకి సిద్ధమయ్యారు. 500 మందికిపైగా తన అనుచరులతో బుధవారం ఒం గోలుకు తరలివచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇళ్లను ముట్టడించారు. సీన్ - 1 ముందుగా అన్నా అనుచరులు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి వద్దకు చేరుకున్నారు. దామచర్ల జనార్దన్ సైతం అక్కడే ఉన్నారు. అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అన్యాయం చేసి నడివీధిలో నెట్టారంటూ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కేకలు, ఈలలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అన్నాను పిలిచి.. మంత్రి, జనార్దన్‌లు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం చేశారని, కొత్తగా పార్టీలో చేరిన వారు అంతా తామేనంటూ పెత్తనం చలాయిస్తున్నా.. తాము చేతగాని వాళ్లలా కూర్చోవలసి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ - 2 అనంతరం అన్నా అనుచరులు ర్యాలీగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికి చేరుకున్నారు. నినాదాలతో రచ్చ రచ్చ చేశారు. ఇంట్లో ఉన్న మాగుంట అన్నాతో పాటు ముఖ్యనేతలను పిలిచి చర్చలు జరిపారు. అశోక్‌రెడ్డి.. అన్నా అనుచరులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయకపోతే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. మాగుంట బయటకు వచ్చి అన్నా అనుచరులనుద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయంలో జిల్లా నేతల ప్రమేయం లేదన్నారు. దీనివల్ల పార్టీలో గందరగోళం వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అశోక్‌రెడ్డి దూకుడు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని వారంతా మాగుంటను కోరారు. -
కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య
గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : గిద్దలూరు మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జడల కల్యాణి(14) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసివేసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
గిద్దలూరు: ఏపీలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (భువనేశ్వర్- బెంగళూరు బౌండ్) రైలులో బీభత్సం సృష్టించిన దొంగలు.. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని, చైన్ లాగి రైలు ఆపి దర్జాగా పారిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీలసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే దొంగలు అడవుల్లోకి పారిపోయారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచూ రైలు దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ రైల్వే అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 ఏళ్లు ఉంటాయి. మృతదేహం పట్టాలపై కొంత దూరం లాక్కెళ్లినట్టుగా ఉండడంతో.. ఆత్మహత్యా లేక ప్రమాదంలో మృతి చెందాడా అన్నది తెలియడం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
గిద్దలూరు (ప్రకాశం) : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారినిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను పక్కింట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఎస్పీజీ పాలెంలో గురువారం వెలుగుచూసింది. స్థానిక కాలనీకి చెందిన బాలిక(8)ను వరుసకు బాబాయి అయ్యే రంగస్వామి(25) పక్కింట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి దిగాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
జామాయిల్ దుంగలు స్వాధీనం
గిద్దలూరు : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సెల్లూరు సమీపంలో జామాయిల్ కలప మొద్దులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు ప్రాంతం నుంచి అనుమతి లేకుండా జామాయిల్ చెట్లను నరికి దుంగలుగా చేసి భారీ వాహనంలో గుంటూరు జిల్లా రేపల్లెకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గిద్దలూరు డీఎఫ్‌వో ఆధ్వర్యంలో అటవీ అధికారులు జామాయిల్ దుంగలను, లారీని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.1.60 లక్షలు ఉంటుందని సమాచారం. -
మహిళ అనుమానాస్పద మృతి
గిద్దలూరు (ప్రకాశం) : పొలం పనులకు వెళ్తున్నానని.. ఇంట్లో చెప్పిన మహిళ శవమై కనిపించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భార్య ఇస్లావత్ మంత్రీబాయి(42) సోమవారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అయితే కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లేసరికి ఆమె శవమై పడి ఉండటం గమనించి పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాప గొంతు నులిమిన కన్నతల్లి
గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : కళ్లు తెరచిన 20 రోజులకే ఓ పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. సుభాషిణి అనే వివాహితకు మానసికస్థితి సరిగా లేదు. ఆమె 20 రోజుల క్రితం పాపను ప్రసవించింది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. దీంతో నాగులవరంలో ఉన్న సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఏమైందో ఏమో గానీ.. సోమవారం సుభాషిణి తన చిన్నారిని గొంతునులిమి హత్య చేసింది. కుటుంబ సభ్యులు గుర్తించేలోపే దారుణం జరిగిపోయింది. దీంతో వారు సుభాషిణిని ఆస్పత్రికి తరలించారు. -
భార్యను హతమార్చిన జవాన్
-
భార్యను హతమార్చిన జవాన్
-
భార్యను హతమార్చిన జవాన్
గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ఆర్మీ జవాన్ భార్యను ఉరివేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లో వెళితే...ఖమ్మంకు చెందిన శివశంకర్‌కు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రశాంతినగర్‌కు చెందిన ప్రవీణ(21)తో వివాహమైంది. శివశంకర్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సెలవుపై ఖమ్మం వచ్చిన శివశంకర్ భార్యతో కలిసి రెండు రోజుల క్రితం గిద్దలూరుకు వచ్చాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన శివశంకర్ తాడుతో ఉరివేసి ప్రవీణను హతమార్చాడు. దాంతో ప్రవీణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు శివశంకర్ ను అదుపులోకి తీసుకుని... పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా అతడిని విచారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
లెక్చరర్‌పై దాడి
కళాశాలకు వెళ్తున్న లెక్చరర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగింది. కళాశాలలో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ చిట్టెం విజయరాజు ఈరోజు ఉదయం కళాశాలకు వస్తున్న తరుణంలో ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు యువకులు ఇనుప రాడ్లతో ఆయన మీద దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గ మనించిన కొందరు విద్యార్థులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించే లోపే పరారయ్యారు. లెక్చరర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు. -
పిడుగుపాటుకు రైతు బలి
గిద్దలూరు : పిడుగుపాటుకు రైతుతో పాటు అతనికి చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వేములపాడుకు చెందిన మోక్షగుండం అంకయ్య (37) తన రెండు ఎద్దులను గ్రామ సమీపంలోని పొలాల్లో మేపుకుంటుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో ఎద్దులను తోలుకుని పొలం నుంచి ఇంటికి బయలుదేరాడు. ముందువైపు ఒక ఎద్దు, వెనుకవైపు ఒక ఎద్దు నడుస్తుండగా మధ్యలో అంకయ్య నడుస్తున్నాడు. పొలంలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన కొద్దిసేపటికే అంకయ్య కాళ్లవద్ద పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక ఉన్న ఎద్దు కూడా పిడుగుపాటుకు మృతిచెందగా, ముందువైపున్న ఎద్దు భయపడి వేగంగా పరిగెడుతూ గ్రామానికి చేరుకుంది. పిడుగుపడిన ప్రదేశంలో తారురోడ్డుపై రంధ్రం ఏర్పడింది. అటుగా వెళ్తున్న వారు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అంకయ్య స్వగ్రామం బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం కాగా, అతని అక్క అంకమ్మను వేములపాడుకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అంకమ్మ కుమార్తె లింగమ్మను వివాహం చేసుకున్న అంకయ్య.. 12 సంవత్సరాలుగా వేములపాడులోనే నివాసముంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని చూసి వారంతా కన్నీరుమున్నీరయ్యారు. అంకయ్యతో పాటు మృతిచెందిన ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుంది. గ్రామ వీఆర్వో శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గిద్దలూరులోనూ పిడుగు... గిద్దలూరు పట్టణంలోని పాండురంగారెడ్డినగర్లో ఉన్న బాలరంగారెడ్డి ఇంటిపై కూడా మంగళవారం పిడుగుపడింది. దీంతో మిద్దెపై ఉన్న గోడ దెబ్బతింది. పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న చిన్నారెడ్డి గృహంలోని టీవీ, విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. -
కలకలం సృష్టించిన కిడ్నాప్
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వివేకానంద కాలనీలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. దర్శి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతనిని బంధించి రైల్వే ట్రాక్‌పై పడవేశారు. రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న మనిషిని స్థానికులు చూసి రక్షించారు. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. ** -
టీడీపీలో విశ్వసనీయత లేదు
గిద్దలూరు, న్యూస్‌లైన్ : ‘టీడీపీకి విశ్వసనీయత లేదు, అక్కడ సామాన్యులకు పదవులు దక్కవు, కేవలం డబ్బున్న వారికే టికెట్లిస్తున్నారు. తెలుగుదేశం కార్పొరేట్ పార్టీగా మారిపోమయింద’ని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వసనీయత లేని చోట ఉండలేక పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సాయికల్పనారెడ్డి ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను సోమవారం గిద్దలూరులోని తన నివాసంలో విలేకరులకు వివరించారు. ‘2009 ఎన్నికల సమయంలో పాతాలంలో కలిసిన టీడీపీకి గిద్దలూరులో సార థి లేరు. తనను బతిమిలాడితే పార్టీలో చేరా. నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన నన్ను చంద్రబాబు మోసం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. టికెట్ మీకే ఇస్తున్నామంటూ సుజనాచౌదరి మార్చి 15వ తేదీ నుంచి చెబుతూ వచ్చారు. చివరి నిమిషం వరకు నమ్మించారు. కానీ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమ’ని ఆమె దుయ్యబట్టారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసి అభ్యర్థుల గెలుపునకు పోరాడిన తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు. కార్యకర్తలు, నాయకుల నిర్ణయం మేరకు పార్టీకి, పదవికి, తన కుమారుడు అభిషేక్‌రెడ్డి, తన అనుచరులతో సహా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటి మోసానికి పాల్పడిన టీడీపీలో తాను బతికుండగా చేరబోనని తెగేసి చెప్పారు. వైఎస్సార్ సీపీకే మా మద్దతు పార్టీ కోసం కష్టపడిన నాయకుణ్ని గుర్తించి టికెట్ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే వెయ్యి రెట్లు మేలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అని జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేశారని, ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పార్టీలో చేరతామరి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పిడతల కుటుంబానికి ప్యాకేజీలా.. ‘గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పిడతల కుటుంబం రాజకీయంగా ముందుంది. అలాంటి కుంటుంబానికి ప్యాకేజీలు తీసుకునే అవసరం లేద’ని సాయికల్పన తనయుడు పిడతల అభిషేక్‌రెడ్డి అన్నారు. ఒక సామాజికవర్గం పనికట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మేము ప్యాకేజీ తీసుకున్నామని రుజువు చేస్తే అంతకు రెండింతలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రుజువు చేయలేకపోతే ఏం చేస్తారో ఆరోపణలు చేస్తున్న వారు చెప్పాలని అభిషేక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తమకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారుకు చెందిన బొంతా లక్ష్మీదేవి, నాయకులు ముత్తుముల మధుసూదన్‌రెడ్డి, పాలుగుళ్ల హనుమంతారెడ్డిలు సాయికల్పనకు మద్దతు తెలిపారు. టీడీపీకి పలువురు నేతల గుడ్‌బై టీడీపీకి సాయికల్పన, అభిషేక్‌రెడ్డిలతో పాటు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొండెపోగు దేవప్రభాకర్, జిల్లా టీడీపీ కార్యదర్శి కుసుమాల మహానందియాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తోట శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి చెరుకుపల్లె లక్ష్మయ్య, గిద్దలూరు, కొమరోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మునూరి బాబూరావు, గౌరి జయరావు, నాయకులు పసుపుల చిన్న ఓబయ్యయాదవ్, కొమరోలు మండల యూత్ ప్రధాన కార్యదర్శి బిజ్జం చిన్ననరసయ్య, తిమ్మాపురం గౌడ సంఘం అధ్యక్షుడు చిలక కాశీరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దండూరి సోమయ్య, రాచర్ల మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్, రాచర్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ షేక్షావలి, రాచర్ల మండల టీడీపీ సమన్వయకర్త గోపవరపు పాండురంగారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను పంపినట్లు వారు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నాయకునిపై ఎస్సై దాష్టీకం
గిద్దలూరు, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అక్రమాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతపై ఓ ఎస్సై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా పోలీసుస్టేషన్లో నిర్బంధించాడు. వివరాలు.. గిద్దలూరు యాదవ బజారులోని ఐదో వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్‌రెడ్డి అక్కడికి వెళ్లి కాంగ్రెఉపార్టీ నాయకుల అక్రమాన్ని ప్రశ్నించడమే తప్పుగా భావించిన ఎస్సై వై.శ్రీనివాసరావు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచాడు. ఎడమ వైపు చెంప, వీపు, తొడలపై గాయాలయ్యాయి. రక్తమోడుతున్న కృష్ణకిషోర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించకుండా ఎస్సై తన వాహనంలో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వేడుకున్నా ఖాకీలు పట్టించుకోలేదు. రెండు గంటల అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సీఐ నిమ్మగడ్డ రామారావు జోక్యంతో బైండోవర్ కేసు నమోదు చేసుకుని ఆయన్ను బయటకు పంపారు. గాయపడిన కృష్ణకిషోర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఎస్సైతో పాటు మరో ఏడుగురు కానిస్టేబుళ్లు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. కాళ్లతో కూడా తన్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులకు కొమ్ముకాస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని కృష్ణకిషోర్‌రెడ్డి ఆరోపించారు. ఒక వర్గానికి కొమ్ముకాసిన ఎస్సై : ముత్తుముల ఎస్సై వై.శ్రీనివాసరావు తన తమ్ముడు కృష్ణకిషోర్రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కేవీవీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని ముత్తుములకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు హామీ ఇచ్చారు. కృష్ణకిషోర్‌రెడ్డిని పరామర్శించిన నాయకులు ఎస్సై వై.శ్రీనివాసరావు దాడిలో గాయపడిన ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా ఆయన్ను నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, యువజన విభాగం నాయకులు రవీంద్రారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అవును.. ఎస్సై ఓవరాక్షన్ చేశారు : ఆర్ఓ సత్యం అవును నిజమే. ఐదో వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఎస్సై వై.శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్రెడ్డిపై దాడికి పాల్పడటం సరైంది కాదు. ఐదో వార్డులో 78శాతం ఓటింగ్ నమోదైంది. ఓటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయలేదు. -
వయోజన విద్యపై నిర్లక్ష్య నీడ
గిద్దలూరు, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సాక్షర భారత్ కార్యక్రమం ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. జిల్లాలోని 2082 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 56 మంది మండల కోఆర్డినేటర్లు నెలల తరబడి వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలపై అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదిగో..ఈవారం వస్తున్నాయని చెబుతున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదని కోఆర్డినేటర్లు వాపోతున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో ఉన్న కోఆర్డినేటర్లు ఎవరికీ వేతనాలు అందకపోవడంతో వీటి ప్రభావం వయోజన విద్యా కేంద్రాలపై పడుతోంది. వివిధ స్థాయిల్లో... వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు 2009 లో సాక్షరభారత్ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని వయోజన విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సాక్షర భారత్ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు వారి పరిధిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టి పథకాన్ని నడిపిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇద్దరు గ్రామ కోర్డినేటర్లను నియమించారు. వీరు వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసి వయోజనులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంది. గ్రామ కోఆర్డినేటరుకు నెలకు రూ.2 వేలు, మండల కోఆర్డినేటరుకు రూ.6 వేలుగా వేతనాన్ని నిర్ణయించారు. అక్షరాలు నేర్పడమే లక్ష్యంగా... 4 సాక్షర భారత్ కోఆర్డినేటర్లు స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని ఎంపిక చేసి కనీసం 30 మందికి తగ్గకుండా సమీకరించి వారికి అక్షరాలు నేర్పించాలి. 4 పుస్తకాలు, పత్రికలు చదివేలా వారిని తీర్చిదిద్దాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ వారు దశలవారీగా వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ... ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2,082 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. వీటిలో 62,460 మంది వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇలా జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా వయోజనులు అక్షరాస్యులుగా మారుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 188 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తుండగా, వీరికి వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలలుగా అందని వేతనాలు: సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో అందించడం లేదు. 2012 సెప్టెంబర్ వరకు సజావుగా వేతనాలందాయి. ఆ తరువాత ఆ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేతనాలు విడుదల చేసినా..వాటిని కోఆర్డినేటర్లకు ఇవ్వలేదు. ఆ మూడు నెలల వేతనాలకు తోడు 2013 ఏడాది మొత్తం జీతాన్ని కూడా విడుదల చేయలేదు. మొత్తం మీద 15 నెలలుగా వేతనాలందక కోఆర్డినేటర్లు అవస్థపడుతున్నారు. జీతం లేకపోవడంతో వారు కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడగా..మరికొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. వేతనాల చెల్లింపులపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వేతనాల్లో జాప్యం వాస్తవమే.. సి.వీరభద్రరావు, డిప్యూటీ డెరైక్టర్ కోఆర్డినేటర్లకు వేతనాలు జాప్యమైన మాట వాస్తవమే. 2012 డిసెంబరు నెల వరకు నిధులు విడుదలయ్యాయి. 2013 సంవత్సరానికి రావాల్సిన వేతనాల నిధులు మరో 10 రోజుల్లో అన్ని మండలాలకు విడుదల చేస్తాం. గతంలో మూడు నెలలకు విడుదలైన వేతనాలు ఆయా మండలాల అధికారులు ఇవ్వాల్సి ఉంది. వాటిని త్వరలో ఇస్తారు. -
చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్‌బాబు
గిద్దలూరు(ప్రకాశం జిల్లా): రాష్ట్ర సమైక్యత విషయంలో కలికట్టుగా ఉంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అందుకే తనపై పోటీ చేసిన బషీర్ సొంతూరులో భోగి మంటల్లో విభజన బిల్లు తగులబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. విభజనను అడ్డుకోవల్సిన బాధ్యత తమ కంటే ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఉందన్నారు. చివరి బంతి కొట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పారు. ఈ బాధ్యతను గుర్తు చేయడానికే మరోసారి ఆందోళలు చేపట్టామన్నారు. చట్టసభల్లో విభజన బిల్లును అడ్డుకుంటామని నేతలు హామీయివ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అశోక్‌బాబు పిలుపిచ్చారు. -
‘మైత్రీ’..ముంచింది!
గిద్దలూరు, న్యూస్‌లైన్ : మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టింది. జిల్లా ప్రజలను ఇది వరకు మోసం చేసిన సంస్థల్లాగే మైత్రి కూడా అధిక వడ్డీ ఆశ చూసి కోట్ల రూపాయలు దండుకుని ఆ జాబితాలో చేరింది. మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన కార్యాలయాన్ని స్థానిక కొమరోలు బస్టాండ్‌లో ఏర్పాటు చేసింది. ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో సంస్థలో డబ్బులు కట్టిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై సుమారు 50 మంది సోమవారం కార్యాలయానికి వచ్చారు. మేనేజర్ గరటయ్య రెండు నెలల నుంచి కార్యాలయానికి రావడం లేదని తెలిసి సిబ్బందిని నిలదీశారు. రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో వెయ్యి మంది మైత్రి ఏజెంట్లు ఉన్నారు. వీరు దాదాపు 10 వేల మంది నుంచి డిపాజిట్లు, ఆర్డీల రూపంలో రూ3 కోట్ల 34 లక్షలు వసూలు చేసి మైత్రిలో జమ చేశారు. 2007లో ఒంగోలులో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మైత్రి సంస్థ ఆరు రాష్ట్రాల్లో 52 శాఖలు నెలకొల్పి 60 వేల మంది క్షేత్రస్థాయి ఏజెంట్లను నియమించుకుంది. ఇందులో మన రాష్ట్రంలోనే 36 బ్రాంచిలున్నాయి. వీటి ద్వారా వందల కోట్లు రూపాయలు వరకు డిపాజిట్లు సేకరించారు. ఏజెంట్లకు అధిక కమీషన్ ఆశ చూపించడం, కస్టమర్లకు నాలుగున్నర సంవత్సరాలకే రెట్టింపు.. మాయ మాటలు చెప్పారు. దీంతో ఏజెంట్లతో పాటు ఖాతాదారులు తమ ఆస్తులు అమ్మి మైత్రిలో నగదు చెల్లించారు. సంస్థ ఏర్పడిన ఏడేళ్లకే బోర్డు తిప్పేయడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. హసనాపురానికి చెందిన బి.వెంకటేశ్వర్లు రూ11 లక్షలు డిపాజిట్ చేశాడు. నెల రోజుల్లో ఇస్తామని చెప్పి అడ్రస్ లేకుండా పోయారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. గిద్దలూరుకు చెందిన ఓ మహిళ రూ80 లక్షలు, కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన సీహెచ్ పుల్లారెడ్డి రూ2.43 కోట్లు కస్టమర్ల నుంచి వసూలు చేసి మైత్రిలో జమ చేశారు. వీరు కస్టమర్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
గిద్దలూరు, న్యూస్‌లైన్ : ఆపరేషన్ వికటించి స్థానిక నల్లబండ బజారులో నివాసం ఉంటున్న మహానంది కళావతి(25) అనే బాలింత శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి చంద్రయ్య, బంధువుల కథనం ప్రకారం.. కళావతి రెండో కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆపరేషన్ గది నుంచి వార్డులోకి తీసుకొచ్చారు. గంట తర్వాత కళావతికి తీవ్ర కడుపునొప్పి వచ్చి విలవిల్లాడిపోయింది. గమనించిన బంధువులు వైద్యులకు సమాచారం అందించడంతో పరీక్షించి ఏవో మందులు రాశారు. అప్పటికి పడుకున్న కళావతి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి కడుపునొప్పంటూ బాధపడింది. పరీక్షించిన అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులు ఓ ప్రైవేటు వాహనంలో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలోని చిన్నారికట్ల వద్ద కళావతి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని మృతురాలి తండ్రి చంద్రయ్య ఆరోపించారు. వైద్యశాలలో ఆపరేషన్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. మృతురాలికి భర్త చంద్ర, నాలుగేళ్ల కుమారుడు, పురుటి బిడ్డ ఉన్నారు. -
ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థిని హత్య
చదువుకు పేదరికం అడ్డుకాలేదు.. ఎంబీఏలోనూ మెరిట్ స్టూడెంట్. ప్రేమించానన్న యువకుడిని నమ్మింది..పెళ్లి చేసుకుంటానన్న కల్లబొల్లి మాటలకు మురిసిపోయింది. తీరా.. ప్రేమించినవాడు కాదన్నాడు.. పెద్దలు సర్దిచెప్పడంతో మనసు మార్చుకుని మరో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలోనే ప్రేమించిన యువకుడు మళ్లీ వచ్చాడు. నీతో మాట్లాడాలంటూ పిలిస్తే వెళ్లింది. కానీ.. ఇక తిరిగిరాలేదు. ఆ మృగాడి చేతిలో క్రూరంగా హత్యకు గురైంది. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా కాసారం గుట్టల్లో వెలుగుచూసింది. దేవరకొండకు చెందిన గోలి రాములు కుమార్తె కవిత(22) స్థానిక ఖాదర్ మెమోరియల్ కళాశాలలో గత నెలలోనే ఎంబీఏ పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సోమిదేవిపల్లి బాలకృష్ణ దేవరకొండలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ ఇదే కళాశాలలో గతేడాది ఎంబీఏ పూర్తి చేశాడు. వీరిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కవిత ప్రైవేట్‌గా ట్యూషన్లు చెబుతోంది. కాగా, ఇటీవల తాను ప్రేమించిన బాలకృష్ణ కాదనడంతో కవిత వేదనకు గురైందని, కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పడంతో వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించగా నిశ్చితార్థం జరిపారని, ఈనెలలో పెళ్లి జరగాల్సి ఉందని సమాచారం. ఈ క్రమంలో సోమవారం దేవరకొండకు వచ్చిన బాలకృష్ణ కవితకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలంటూ పిలిచాడు. ఇద్దరూ కలిసి కాసారం గుట్టల్లోకి వెళ్లారు. కలిసి ఉండటం వీలుకాలేని మనం కలిసైనా ఆత్మహత్య చేసుకుందామంటూ ఆమెను ప్రేరేపించాడు. తమ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును ఆమెకు తాగించి, తాను కూడా కొంచెం సేవించాడు. ఆమె ప్రాణం పోకపోవడంతో తనవెంట తీసుకెళ్లిన కత్తితో దారుణంగా కవిత గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం దేవరకొండకు చేరుకున్న బాలకృష్ణ పురుగుల మందు ప్రభావంతో తాను చదువుకున్న కళాశాల అధ్యాపకుడు శ్రవ ణ్ ఇంటిఎదుట పడిపోయాడు. గమనించిన శ్రవణ్ చికిత్స అతడిని దేవరకొండ ఆస్పత్రికి, అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాడు. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి 9గంటలు దాటినా కవిత ఇంటికి చేరలేదు. రోజూ ట్యూషన్ చెప్పే ఇంటికి వెళ్లి కవిత గురించి తండ్రి రాములు వాకబు చేశాడు. అక్కడకు రాలేదని వారు చెప్పారు. దీంతో కళాశాలకు చెందిన అధ్యాపకుడి ఫోన్ చేసి, ఆ తర్వాత శ్రవణ్ ఇంటికి వెళ్లాడు. అతను అక్కడ లేకపోవడం, ఫోన్ చేసినా ఏ సమాచారం లేదు. దీంతో కవిత తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. బాలకృష్ణపై అనుమానం వ్యక్తం చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. స్నేహితులు, అధ్యాపకులను విచారించడంతో బాలకృష్ణ విషయం బయటపడింది. దీంతో వారు వెంటనే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా, కవితను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, వీరి ప్రేమ విషయం కళాశాల అధ్యాపకుడు శ్రవణ్‌కు ముందే తెలుసని కవిత తండ్రి రాములు ఆరోపిస్తుండగా, ప్రాణాపాయ స్థితిలో తన ఇంటిముందు విద్యార్థి పడిఉండటంతో ఆస్పత్రిలో చేర్చాడని ఆయన బంధువులంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ సీఐ భాస్కర్ తెలిపారు. -
కాసులిస్తేనే..కాన్పు
గిద్దలూరు, న్యూస్‌లైన్: నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. గిద్దలూరు ఏరియా వైద్యశాలలో ఈ దందా మరీ ఎక్కువైంది. కాన్పు కోసం వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తే రూ. 3 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని వేధిస్తున్నారు. గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు వైద్యశాలకు వస్తే వారి వద్ద నుంచి వైద్యశాల మరమ్మతులంటూ డొనేషన్ల రూపంలో నగదు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రాచర్ల మండలం చినగానిపల్లెకు చెందిన నర్ల వెంకటేశ్వరరెడ్డి తన భార్య సుజాతను ఈనెల 6న కాన్పు చేయించేందుకు గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడ సాధారణ కాన్పు కాకపోవడంతో వైద్యుడు సూరిబాబు ఆపరేషన్ చేశారు. ఆ వెంటనే డాక్టర్ సాయి ప్రశాంతి కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేశారు. బుధవారం సుజాతను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇంటికెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ కోసం వైద్యుల వద్దకు వెళ్లగా, అందుకు వారు రూ. 3 వేలు ఇవ్వాలని చెప్పడంతో కంగుతింది. ఎందుకివ్వాలని ఆమె బంధువులు ప్రశ్నిస్తే డాక్టర్ గారికి స్టెతస్కోప్ కొనుగోలు చేయాలని సిబ్బంది చెప్పడం విశేషం. ఆపరేషన్ చేసే ముందు సిబ్బందికి ఎగ్‌పఫ్, స్ప్రైట్, 5 లీటర్ల డీజల్ తీసుకురావాలని వైద్యులు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇచ్చామని బాధితుడు వెంకటేశ్వరరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. నగదు ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని చెప్పడంతో స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మధ్యాహ్నం వరకు ఉంచుకుని వారం తర్వాత రావాలని చెప్పి పంపారని బాధితులు తెలిపారు. ఈ సమస్య ఒక్క వెంకటేశ్వరరెడ్డి దంపతులదే కాదు..ఇక్కడికి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. వైద్యశాలలో రోజూ తమ నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకుంది. ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఒకరు రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఆమెకు లేని రోగం ఉందని అందరికీ చెప్పింది. దీంతో ఆ మహిళ నాలుగు రోజులుగా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. పేదల కోసం నిర్మించిన వైద్యశాలలో ఇలా నగదు దండుకోవడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసరం కోసం డీజిల్ తెప్పించాం... స్థానిక వైద్యశాల సూపరింటెండెంట్ సూరిబాబును నగదు వసూళ్ల గురించి ప్రశ్నించగా వైద్యశాలకు నిధుల కొరత ఉండటంతో అత్యవసరం కోసం డీజిల్ తెప్పించుకుంటున్నామని, నగదు తీసుకోవడం లేదని చెప్పారు. వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా లేని రోగం ఉన్నట్లు చెప్పిన స్వీపర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు నగదు వసూలు గురించి తెలుపగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందితే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.