రెవెన్యూలో మాయగాళ్లు  | Fraud In Revenue Department In Prakasam | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో మాయగాళ్లు 

Published Sat, Apr 21 2018 12:14 PM | Last Updated on Sat, Apr 21 2018 12:14 PM

Fraud In Revenue Department In Prakasam - Sakshi

అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటాయి. కానీ ప్రైవేటు భూములను కూడా ఆక్రమించేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేయించి ఆ భూములు తమవే నంటూ ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. అసలు హక్కుదారులు విషయం తెలుసుకుని వచ్చి అదేంటని అడిగినా ఆ భూములు తమవేనంటూ బుకాయిస్తున్నారు. ఇలా ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే వేలాది ఎకరాల భూములు పరులపాలయ్యాయి. ఈ అక్రమాల్లో రెవెన్యూ సిబ్బందిదే కీలకపాత్ర.

గిద్దలూరు : తమకు భూమి ఉంది...పాసు పుస్తకం కూడా ఉంది. నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరబడినట్టే. గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్‌ఏలకు పలానా ప్రాంతంలో భూమి బీడుగా ఉందని గుర్తించారంటే ఆ భూమి వారి ఖాతాలోకి చేరుతుంది. రెవెన్యూ శాఖలో కొందరు అధికారులతో జతకట్టి ప్రభుత్వ, ప్రైవేటు భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు. రికార్డులను సైతం మార్చేసి వారి పేర్లు, వారి బంధువుల పేర్లను ఎక్కించేసుకుంటున్నారు. కొందరు వీఆర్‌వోలు వారికి సహకరిస్తూ పాత అడంగళ్లు, వన్‌ బీ రికార్డుల్లోనూ పదేళ్ల ముందు నుంచి అనుభవంలో ఉన్నట్లు నమోదు చేసేస్తున్నారు. ఇలా తమ అనుభవంలో ఉన్న భూమిని  తహశీల్దారు 

ద్వారా వారి పేరుతో ఆన్‌లైన్‌ చేసేసుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక రికార్డుల్లో తమ పేరు ఉందంటూ భూమిని దున్నేసి పంటలు సాగు చేసుకుంటారు. పంటలు సాగుచేసే సమయంలో గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే ఈ పొలం మాదనుకున్నాము. ఈ ఏడాది పంట వేసుకుంటాం. వచ్చే ఏడాది మీరే తీసుకోండని నమ్మబలికిస్తారు. వచ్చే ఏడాది భూమి నాదే, గతేడాది నేనే పంట సాగు చేసుకున్నాను. రికార్డుల్లో పేర్లు నావే ఉన్నాయంటూ ఘర్షణకు దిగుతారు. వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రికార్డులను మార్చింది వారే కాబట్టి. ఇలా రెవెన్యూ అధికారులు పేద రైతులకు ఇచ్చిన అసైన్‌మెంట్‌ భూములను, అమాయకంగా ఉండే రైతుల స్వంత భూములను సైతం కాజేస్తున్నారు.

మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన తల్లపురెడ్డి వెంకటరెడ్డికి చెందిన 1481వ సర్వే నంబర్‌లోని భూమిని ఇదే విధంగా గ్రామానికి చెందిన వీఆర్‌ఏ తన బంధువుల పేర్లతో ఆక్రమించేశారు. వీఆర్‌ఏకు మద్దతునిస్తూ వీఆర్వో 8 సంవత్సరాల అడంగళ్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లు స్వయంగా ఆర్‌ఐ విచారణలో తేలింది. ఆయన తహశీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వీఆర్‌ఓస్పందించడంలేదనిరైతువాపోతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మోడి పుల్లయ్య స్వంత భూమిని ఇతరుల పేరుతో ఆన్‌లైన్‌ చేసేశారు. ముండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వీఆర్‌ఓ గ్రామ రికార్డులను తన వద్ద పెట్టుకుని ఒకరి పేరును మరొకరికి రాస్తూ తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

20 వేల ఎకరాలకు పైగా అనర్హులకు చేరిన ప్రభుత్వ భూములు:
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 20 వేల ఎకరాలకు పైగా అసైన్‌మెంట్‌ భూములు అనర్హులకు అప్పగించి రెవెన్యూ అధికారులు కోట్లు సంపాదించారు. అధికారులకు డబ్బు ఆశచూపి ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగా భూములను కొల్లగొట్టేశారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, పేదలు పెంచుకునే పశువులు, గొర్రెలు మేసేందుకు అవసరమైన గ్రాసం కనిపించకుండా మేత బీడు భూములను సైతం అన్యాక్రాంతం చేసేశారు.  

ప్రభుత్వ భూములు అక్రమంగా పొందిన కొన్ని సంఘటనలు...


  • కొమరోలు మండలంలోని దద్దవాడ రెవెన్యూలో అధికార పార్టీకి చెందిన ఓ డీలర్‌ 130 ఎకరాలు ఆక్రమించేశాడు. రాజుపాలెంలో 34 ఎకరాలకు ముగ్గురు పాసు పుస్తకాలు పొందారు. అనంతరం రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం పొందారు. ఇప్పుడు ఆ భూమిని ఆన్‌లైన్‌లో రస్తా పోరంబోకు భూమిగా చూపిస్తున్నారు.

  • రాచర్ల మండలంలోని యడవల్లి రెవెన్యూలో గిద్దలూరుకు చెందిన టీడీపీ నాయకులకు అసైన్డ్‌ భూములు ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ లేకుండానే ప్రైవేటు భూములను సైతం ఆన్‌లైన్‌ చేసి ఈ–పాసు పుస్తకాలు ఇచ్చారు. సత్యవోలుకు చెందిన ఓ ఉద్యోగి తన భార్య పేరుతో అసైన్డ్‌ భూములను పొందాడు. యడవల్లికి చెందిన ఆలయ భూములను ఉద్యోగులు ఆక్రమించుకున్నా రెవెన్యూ, దేవాదాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 
  • గిద్దలూరు మండలంలోని వెల్లుపల్లెలో 1015 సర్వే నంబరులో ఆరు ఎకరాలు ఉన్న నాలుగుపాటి కుంటను క్రిష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు ఆక్రమించి కట్టను తొలగించి చదును చేసుకున్నాడు. ముండ్లపాడు రెవెన్యూలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములను సైతం అన్యాక్రాంతం చేస్తూ ఆన్‌లైన్‌లో ఒకరి భూమిని మరొకరికి పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఖాతాలను కేటాయించి ఆన్‌లైన్‌లో ఇతరులుగా నమోదు కాబడిన ప్రభుత్వ భూమిని బినామీదార్ల పేర్లతో నమోదు చేస్తూ బ్యాంకుల్లో భారీ గా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నా భూమిని ఇంకొకరికి రాసిచ్చారు
తన పూర్వీకులకు చెందిన 4.16 ఎకరాల భూమిని నేను అనుభవిస్తున్నాను. పాసు పుస్తకం ఇచ్చారు. రెండేళ్లుగా వర్షాలు కురవలేదని బీడు పెట్టడంతో వీఆర్‌ఏ బంధువులు ఆక్రమించుకున్నారు. తహశీల్దారుకు, ఆర్డీఓకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా వీఆర్వో పలకడం లేదు. ఆర్‌ఐ వచ్చి పరిశీలించి రికార్డుల్లో పేర్లు మార్చారని చెబుతున్నారు. 
– టి.వెంకటరెడ్డి, బాధితుడు, ముండ్లపాడు గ్రామం.

మా భూమిని పక్కనున్న వారికి ఆన్‌లైన్‌ చేశారు
మానాన్న యల్లా రాజేంద్రప్రసాద్‌ పేరుతో 702–2 సర్వే నంబర్‌లో ఉన్న 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న వారికి ఆన్‌లైన్‌ చేశారు. 1978 సంవత్సరం నుంచి మా అనుభవంలో ఉన్న 99 సెంట్ల భూమిని మానాన్న పేరున ఆన్‌లైన్‌ చేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న యల్లా సరస్వతి పేరున ఆన్‌లైన్‌ చేశారు.  
– యల్లా వెంకటమణికంఠ, గిద్దలూరు.

ఫిర్యాదు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం
రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్‌ జరిగినట్లు మాకు ఫిర్యాదులు అందలేదు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. భూమిపై ఎవరికి హక్కు ఉందో విచారించి వారి భూములను వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ట్యాంపరింగ్‌ జరిగిందో చెబితే సంబంధిత అధికారులను విచారించి చర్యలు చేపడతాం

 – పెంచల కిషోర్, ఆర్డీఓ, మార్కాపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement