జీతాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలు (ఫైల్)
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం): తెలిసి చేశాడో..తెలియక చేశాడో తెలియదుగానీ ఓ ఇన్‌చార్జి తహసీల్దార్ నిర్వాకానికి 16 మంది వీఆర్‌ఏలకు అన్యాయం జరిగింది. ఈ సంఘటన గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు..వీఆర్‌ఏలుగా పనిచేస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారు తమ పిల్లలను నామినీ వీఆర్‌ఏలుగా నియమించాలనుకోవడం సహజం. గిద్దలూరులో గతంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్న వల్లీకుమార్ మాటలు నమ్మిన వీఆర్‌ఏలు ఇప్పుడు నిండా మునిగారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 12 మంది వీఆర్‌ఏలు వృద్ధాప్యంలో ఉండగా, మరో నలుగురు వీఆర్‌ఏలు చనిపోయారు. మొత్తం 16 మంది వీఆర్‌ఏల స్థానంలో వారి నామినీ (కుమారులు)లను వీఆర్‌ఏలుగా నియమిస్తానని వల్లీకుమార్ నమ్మబలికాడు. ఆయన చెప్పినట్లు 12 మంది వయస్సు పైబడిన వీఆర్‌ఏలు మెడికల్ సెలవులు పెట్టారు. అనంతరం ఆయన వారందరినీ నామినీ వీఆర్‌ఏలుగా భావించి వారితో ఎన్నికల విధులు చేయించుకున్నాడు. ఇక తాము వీఆర్‌ఏలుగా కొనసాగవచ్చని ఆశపడి వారు ఉత్సాహంగా విధులు నిర్వహించారు.
ఎన్నికలనంతరం కొత్త తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి బదిలీపై తన పాత స్థానావెళ్లగానే ఉత్తర్వులిచ్చి పూర్తి స్థాయి వీఆర్‌ఏలుగా ఉద్యోగాలు కల్పించి మొత్తం వేతనాలు ఒకేసారి చెల్లిస్తానని సదరు అధికారి వారికి ఆశ కల్పించాడు. 16 మంది నామినీ వీఆర్‌ఏలు నాలుగు నెలల పాటు విధులు నిర్వహించాక తమకు వేతనాలు ఇవ్వాలని ఇన్‌చార్జి తహసీల్దార్ వల్లికుమార్‌ను నిలదీశారు. దీనికితోడు ఎన్నికల విధుల కోసం వచ్చిన తహసీల్దార్ సుబ్బారెడ్డి రెగ్యులర్‌గా ఇక్కడే ఉండిపోవడంతో వీఆర్‌ఏల వేతనాలు నిలిచిపోయాయి. ఇక తమకు ఉద్యోగాలు, వేతనాలు రెండూ రావని గ్రహించిన నామినీ వీఆర్‌ఏలు కనీసం వేతనాలైనా చెల్లించాలని తహసీల్దార్‌ను వేడుకున్నారు. మెడికల్ సెలవులో ఉన్నట్లు మీరు లెటర్ ఇచ్చారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి విధుల్లో చేరితే అప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తామని తహసీల్దార్ సుబ్బారెడ్డి వారితో తేల్చి చెప్పారు. వీఆర్‌ఏలు సీఐటీయూ నాయకులు, వీఆర్‌ఏల సంఘంతో కలిసి 20 రోజుల పాటు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు.
గత ఇన్‌చార్జి తహసీల్దార్ వల్లికుమార్ మోసాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు వేశారు. అయినా ప్రస్తుత తహసీల్దార్ సుబ్బారెడ్డి నామినీ వీఆర్‌ఏలకు పోస్టులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగం, వేతనాలు ఇవ్వక పోవడంతో నామినీలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు విరమించిన వీఆర్‌ఏలు తమకు వేతనాలివ్వాలని తహసీల్దార్‌కు డాక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఉద్యోగం మాట పక్కన పెడితే 8 నెలల పాటు శ్రమించిన వేతనం కోల్పోయామని 16 మంది వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీఓలో లేకుండానే తమకు నియామక ఉత్తర్వులిచ్చి మోసం చేసిన గత ఇన్‌చార్జి తహసీల్దార్ వల్లికుమార్‌పై చర్యలు తీసుకుని 16 మందికి రావాల్సిన 8 నెలల వేతనం రూ.12.80 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
ఆ అధికారం తహసీల్దార్లకు లేదు
వీఆర్‌ఏల పిల్లలను వీఆర్‌ఏలుగా నియమించే అధికారం తహసీల్దార్లకు లేదు. 2012లో ఉద్యోగ కిరణాలు పేరుతో ప్రతి నియామకాన్ని ఏపీపీఎస్సీ ద్వారా చేపడుతున్నారు. వీఆర్‌ఏలను దాని ద్వారానే నియమిస్తున్నారు. వల్లికుమార్ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో నాకు తెలియదు. వీఆర్‌ఏలు అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి సెలవులు పెట్టారు. తిరిగి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి విధుల్లో చేరితే ఇప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తాం.
జీవీ సుబ్బారెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు
Comments
Please login to add a commentAdd a comment