VRA
-
‘తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పున:ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల పాలనకు...ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నాం.డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీకి అప్పగించాం. 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. గతంలో ధరణి 33 మాడ్యుల్స్‌తో ఇబ్బందిగా ఉండేది. మాడ్యుల్స్‌ను తగ్గిస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ మేం ఈ వ్యవస్థలను తీసుకు వస్తాం.గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయి. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తాం. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు.ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?.రేపటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి👉 : ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ -
వారసులకు ఉద్యోగాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేస్తూ 61 ఏళ్లు నిండిన వారి వారసులకు కారుణ్య నియామకాలిచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి, వీరికి ఉద్యోగాలివ్వాలంటూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల మేరకు అవసరమైన పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెవెన్యూ సేవల్లో ఉన్న 3,797 మంది వీఆర్ఏల వారసులకు అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా నియామక ఉత్తర్వులు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రకాలుగా ప్రభుత్వ వర్గాల అనుమతులున్నా తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం పట్ల వీఆర్ఏలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన ప్రజావాణికి పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి డి.దివ్యలకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల సమస్యలు విన్న ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 906 దరఖాస్తులు కాగా, మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణికి 906 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖ (306), రెవెన్యూ (138), విద్యుత్ (138), మైనార్టీ సంక్షేమ శాఖ (134), పంచాయతీరాజ్ (130)లతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 192 దరఖాస్తులు అందినట్టు ప్రజావాణి అధికారులు వెల్లడించారు. కాగా, యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ తమవద్ద పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిందంటూ బాధితులు ప్రజావాణికి రాగా, తక్షణమే స్పందించిన చిన్నారెడ్డి సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌కు లేఖరాసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్ టీడీపీ నేత బైరెటీస్ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా -
ఐడీ లేక.. వేతనం రాక..
సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి వీఆర్ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి -
అత్తా.. కోడళ్ల మధ్య గొడవ.. వీఆర్ఏ తీవ్ర నిర్ణయం!
హనమకొండ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన గురువారం మండలంలోని వెంకటాపూర్‌లో జరిగింది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఇజ్జగిరి సతీష్(36) దామెర తహసీల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సతీష్ భార్య లిఖితకు, తల్లి లక్ష్మికి గొడవ జరిగింది. దీంతో ఇద్దరిని సముదాయించి సతీష్ తన కూతురుతో ఒక గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. ఇంట్లో జరిగిన గొడవను తలుచుకుంటూ మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురు ఉదయం లేచి చూసి కేకలు వేయగా బంధువులు వచ్చి చూసేసరికి సతీష్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. ఇటీవలే ఉద్యోగ భద్రత పొందిన సతీష్.. సతీష్.. ఏపీపీఎస్సీ ద్వారా 2012లో వీఆర్ఏగా ఎంపికై ఉమ్మడి ఆత్మకూరు, దామెర మండలాల తహసీల్ కార్యాలయంలో 11 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10, 2023న వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించగా, సతీష్ దామెర తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోరాడి సాధించుకున్న ఉద్యోగంలో చేరి 2 నెలలు గడవకముందే సతీష్ మృతి చెందడం పలువురిని కలిచివేసింది. దామెర, గీసుకొండ, నడికూడ తహసీల్దార్లు జ్యోతివరలక్ష్మీదేవి, రియాజుద్దీన్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు.. సతీష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మనోవేదనకు గురై.. 'వీఆర్ఏ' మృతి!
ఆదిలాబాద్: వీఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే.. పెంబి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించిన ఇటిక్యాల్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆయిండ్ల బుచ్చన్న సర్దుబాటులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో రికార్డు అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన నాటి నుంచి దివ్యాంగుడైన బుచ్చన్న ఇంత దూరం బదిలీ చేశారని మనోవేదనకు గురికావడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో 15 రోజుల క్రితం నిజామాబాద్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బీపీ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. -
మేం 'తెలంగాణ బిడ్డలం' కాదా..? మరెందుకు మాపై ఇలా..
మెదక్: మేం తెలంగాణ బిడ్డలం కాదా? అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం కేసీఆర్ 15 నుంచి 20 ఏళ్లుగా రోగులకు సేవలందిస్తున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు తన్వీర్ మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ డిపార్ట్మెంట్లో కొందరిని, వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిన సీఎం తమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో ఉన్నామని, కొత్తగా నోటిఫికేషన్ వేసి తమ కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో తులసి, సంగీత, సులోచన, రమ్య, యాదమ్మ పాల్గొన్నారు. -
‘ఔట్ సోర్సింగ్’ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 2.5 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వ చ్చిన ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దికరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే–స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్విసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలు అన్యాయం చేస్తున్నాయి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు, నాలుగు నెలలకోసారి ఒకటి, రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. కొత్త ఏజెన్సీలు వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. వీఆర్ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు? వీఆర్ఏల క్రమబద్దికరణలో భాగంగా వారిని పెద్ద సంఖ్యలో తమ శాఖకు కేటాయించారని, దాంతో ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఈ సమావేశానికి హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్ చేశాము.. రేషన్‌డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు. రైతులే తేల్చుకోవాలి.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలో.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్స్టేషన్లలో క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. -
వీఆర్ఏల విలీనానికి నో
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)లను క్రమబద్ధీకరించి, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్ఏల నియామకం చట్టవిరుద్ధమని, అది చెల్లదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85లను సస్పెండ్ చేసింది. రెవెన్యూ శాఖలో జూలై 24న జీవో 81 జారీకి ముందున్న పరిస్థితినే కొనసాగించాలని స్పష్టం చేస్తూ.. స్టేటస్కో ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా వీఆర్ఏలు ఇప్పటికే కొత్త విధుల్లో చేరినా వారు తిరిగి వెనక్కి వెళ్లాలని తేల్చిచెప్పింది. ఇక పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు.. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను తొలగించింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆఫీస్ సబార్డినేట్లు.. వయసు ఎక్కువున్న వారికి పింఛన్ వంటి ప్రయోజనాలు లేకుండా చేశారని వీఆర్ఏలు ఇలా వివిధ అంశాలపై హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి.. ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. నవీన్ మిట్టల్ తీరు సరిగా లేదు.. సబార్డినేట్లకు అన్యాయం తొలుత పిటిషనర్ల తరఫున పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి వాదిస్తూ.. ‘‘చట్ట ప్రకారం ఉద్యోగాల నియామకానికి ఒక ప్రక్రియ ఉంటుంది. వీఆర్ఏల విషయంలో ఆ ప్రక్రియ చేపట్టలేదు. సర్వీస్ రూల్స్‌లోనూ ఎలాంటి మార్పు చేయలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంలో రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేసింది. సీనియర్లలో 19వ స్థానంలో ఉన్న నవీన్ మిట్టల్‌ను ఉద్దేశపూర్వకంగా సీసీఎల్ఏగా నియమించింది. దీనికి కృతజ్ఞతగా ఆయన చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోకుండానే ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తున్నారు. సీసీఎల్ఏగా మిట్టల్ నియామకం చెల్లదు. రాత్రి జీవోలు ఇచ్చి ఉదయానికల్లా విధుల్లో చేరాలని ఆదేశించడం ఇంత వరకు ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. పైగా అంతా ఇప్పటికే విధుల్లో చేరారని కోర్టుకు చెప్పడం హాస్యాస్పదం. రాజ్యాంగబద్ధమైన కోర్టుల ముందు ఇలాంటి చర్యలను సమర్ధించుకోజాలరు. ఓ వైపు సర్వీస్ నిబంధనలు అవసరం లేదంటూనే.. మరోవైపు అవసరమైతే జారీ చేస్తామనడం శోచనీయం. రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్లు ఏళ్లతరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాదని వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడం సరికాదు. వీఆర్ఏల సర్దుబాటు పేరిట ఆఫీస్ సబార్డినేట్లకు అన్యాయం చేయడం తగదు. అదేవిధంగా వీఆర్ఏలకు పదవీ విరమణ ఉండదు. దీన్ని అడ్డుపెట్టుకుని వారికి పింఛన్, గ్రాట్యుటీ వంటివి ఇవ్వకుండానే రిటైర్ అయ్యేలా చేయడం అన్యాయం. ఇది వయసు మీద పడిన వీఆర్ఏలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. దీనిపై పిటిషన్లు వేసిన వారిని ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది’’ అని కోర్టుకు విన్నవించారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం.. రాజకీయ విమర్శలు చేయడమేంటి? పిటిషనర్ల వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్లు ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సర్వీస్ నిబంధనల గురించి మాట్లాడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. సీసీఎల్ఏగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. సర్వీస్ నిబంధనలకు, ఎన్నికలకు, సీసీఎల్ఏకు ఏమిటి సంబంధం? వీఆర్ఏలను ఒక్క రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయడంలేదు. ఇతర శాఖలకూ పంపుతున్నాం. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినంత మాత్రాన ఆఫీస్ సబార్డినేట్లపై ప్రతికూల ప్రభావం ఉండదు. వీఆర్ఏల విలీనం కోసం ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించింది. అందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. కొత్త పోస్టుల కోసం సర్వీసు నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉండదు. వీఆర్ఏలకు పింఛను, గ్రాట్యూటీ వంటివి ఇతర ఉద్యోగులకు వర్తించినట్లే ఉంటాయి. పెద్ద వయసు వారికి తక్కువ సర్వీసు ఉందనే కారణంగా మొత్తం ప్రక్రియ అక్రమమని చెప్పలేం. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం విధానపర నిర్ణయం తీసుకుంది. అందులో జోక్యం కూడదు. వీఆర్ఏలను ఇప్పటికే సర్దుబాటు చేశాం.. మెజారిటీ విధుల్లో చేరారు. ఈ పిటిషన్లు సమర్థనీయం కాదు..కొట్టివేయాలి’’ అని కోర్టుకు వాదనలు వినిపించారు. నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలిస్తారా? ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. వారికి ఆ హోదా కల్పించి వేతనాలు ఇవ్వడం ఎలా సమర్థనీయమని నిలదీసింది. ‘‘వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వీఆర్ఏలను ఎందుకు కొనసాగించారు? పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారిని కేటగిరీలుగా ఎలా విభజిస్తారు? ఎలాంటి ఎంపిక ప్రక్రియ లేకుండా ఎలా నియమిస్తారు? జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వారి ఎంపిక ప్రక్రియ ఏంటి? జూనియర్ అసిస్టెంట్ సమాన స్థాయి కలిగిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)లను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోలేదు? అంటే మీకు నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలు ఇస్తారా? రెవెన్యూ శాఖలో ఖాళీలు లేవంటూనే 50శాతం మందిని ఎలా సర్దుబాటు చేశారు?’’ అని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే అంశంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆదేశాల ప్రతి కోసం ఎదురుచూడకుండా వెంటనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వివిధ చోట్ల పోస్టింగ్ పొందిన వీఆర్ఏలు తిరిగి వెనక్కి రానున్నారు. -
వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
-
Fact Check: వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదీ నిజం.. వీఆర్ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది. వీఆర్ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్ఏలకు గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారి పేస్కేల్ విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం సచివాలయంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. (మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్) కాగా నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా(వీఆర్ఏ) పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం పేర్కొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారికి పే స్కేలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం తమకు 'పే స్కేలు' నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏ జేఏసీ నేతలు. pic.twitter.com/19qJReFhdo — Telangana CMO (@TelanganaCMO) July 23, 2023 -
సచివాలయంలో సీఎం కేసీఆర్ తో వీఆర్ఏల జేఏసీ భేటీ
-
Telangana: వీఆర్ఏ వ్యవస్థ రద్దు
మానవీయ కోణంలో నిర్ణయం కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా.. 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్ఏ జేఏసీ మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్ వీఆర్ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై చర్చించిన అనంతరం... నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపు (సోమవారం) విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. చదవండి తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
సీఎం కేసీఆర్ నిర్ణయం.. వారంలోగా వీఆర్ఏల సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)ను వారి సేవలు విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వారిని నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ ఏల సర్దుబాటు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్‌కమిటీ వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. ఉప సంఘం సూచనల ప్రకారం వీఆర్ఏల సేవల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదే శించారు. ఉప సంఘం తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించారు. లక్ష్యాలు సాధిస్తే క్రమబద్ధీకరణ నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిబంధనల మేరకు పరిశీలించి క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, నిర్దేశిత లక్ష్యాల్లో మూడింట రెండో వంతు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతోపాటు పలు రకాల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును కేసీఆర్ ఆదేశించారు. వారి పాత్ర అభినందనీయం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెవె‘న్యూ’ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏ.. గ్రామ రెవెన్యూ సహాయకుడు.. పేరుకే రెవెన్యూ ఉద్యోగి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాల్లోనూ భాగస్వామ్యం ఉంటుంది. వీఆర్ఏలు అంటే గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి లాంటి వారనే అభిప్రాయమూ ఉందంటే వారిదెంతటి కీలక పాత్రో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేశాక.. వీఆర్ఏలే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఏకైక దిక్కుగా మిగిలారు. అలాంటి వీఆర్ఏల సేవలు గ్రామాల్లో అవసరం లేదని, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గందరగోళానికి దారితీస్తోంది. వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వారిని ఇతర శాఖలకు పంపితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఏల విధులెన్నో.. వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరి జాబ్‌చార్ట్ మాత్రం మిగతా ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లోని చెరువులు, కుంటల సంరక్షణతో పాటు ఏ చెరువు కట్ట తెగినా, వాగులు పొంగినా, అలుగులు పోసినా నీటిపారుదల శాఖ ఏఈ, డీఈలకు వీఆర్ఏలే ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. గతంలో అయితే నీటి పంపకం (తైబందీ) కూడా వీరి పర్యవేక్షణలోనే జరిగేది. ఇక, గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాట్లు చేసేది, గ్రామంలోకి ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా దగ్గరుండి గ్రామానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది వీఆర్ఏలే. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత కూడా వీరిదే. పదో తరగతి నుంచి అన్ని స్థాయిల్లోని పరీక్షలకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, పంట నష్టం, శాంతిభద్రతలు, అగ్నిప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం కోసం వీఆర్ఏలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల (పోలింగ్) ప్రక్రియలో సైతం తెరవెనుక పనిచేస్తుంటారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు నుంచి ఆయా స్టేషన్లలో వసతుల కల్పన, పోల్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ బాక్సుల పర్యవేక్షణ (స్ట్రాంగ్ రూంలకు తరలించేంతవరకు) చేసేది వీఆర్ఏలే. గ్రామాల్లో ‘ప్రభుత్వ ప్రతినిధి‘! ఇక గ్రామాల్లో హత్యలు జరిగినప్పుడు, గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినప్పుడు, దోపిడీలు, ఆత్మహత్యల్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీఆర్ఏలే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిస్తారు. గంజాయి రవాణా, స్మగ్లింగ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉండేలా పోలీసులు నిర్వహించే పంచనామాలో సాక్షులుగా (పంచ్) వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. వీటితో పాటు 56 రకాల రెవెన్యూ విధులను వీరు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉండే వ్యక్తి వీఆర్ఏ. అలాంటి వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపిస్తే రెవెన్యూ శాఖ పునాదులు కదలడం ఖాయమని, ఆ వ్యవస్థ మనుగడే కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర శాఖలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వీరి నిష్క్రమణ కారణంగా ఎదురయ్యే సమస్యలకు గ్రామస్థాయిలో పరిష్కారమే ఉండదని అంటున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిని.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై మౌనం పాటిస్తున్నారు. వారు వెళితే కష్టమే.. వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే వారికి పేస్కేల్ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలా కాకుండా వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసే వారుండరు. రెవెన్యూ పాలనే కాదు.. ఇతర శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు కూడా కష్టతరమవుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. – కె.గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఆర్ఏలకు సంబంధించిన గణాంకాలివీ.. రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు: 10,416 మొత్తం వీఆర్ఏ పోస్టుల సంఖ్య: 23,046 విధుల్లో ఉన్న వీఆర్ఏలు: 21,434 డిగ్రీ, ఆపైన చదువుకున్నవారు: 2,909 ఇంటర్ విద్యార్హతలున్నవారు: 2,343 పదో తరగతి చదివినవారు: 3,756 పదో తరగతిలోపు చదువుకున్నవారు: 7,200 నిరక్షరాస్యులు: 5,226 విద్యార్హతలపై కిరికిరి? ► ఇతర శాఖలకు పంపే మాట అటుంచితే కేబినెట్ ఆమోదించిన విధంగా వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిని క్రమబద్ధీకరించే విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు చాలామందిని పేస్కేల్ నుంచి దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలలో కేవలం 9,008 మందికి మాత్రమే 10వ తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్నాయి. మిగిలిన 12,426 మంది వీఆర్ఏలు పదో తరగతి కన్నా తక్కువ చదువుకోగా, వీరిలో 5వేల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఒకవేళ విద్యార్హతలే క్రమబద్ధీకరణకు ప్రామాణికమైతే తగిన విద్యార్హతలు లేని వీఆర్ఏల కుటుంబాల్లో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వాలని వీఆర్ఏల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేస్తున్నాయి. కానీ రెవెన్యూ వర్గాలు మాత్రం.. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న మెజారిటీ వీఆర్ఏల విషయంలో ఏం నిర్ణయం తీసుకునేదీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
హుస్సేన్ సాగర్‌లోకి ఇక గోదావరి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ సారాంశాన్ని మంత్రులు తలసాని, గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాకు వివరించారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ప్రధానంగా ఇచ్చిన హామీకి కట్టుబడి 111 జీవో రద్దుతో పాటు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. 👉 సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. 21 రోజుల పాటు విజయోత్సవాలు. రోజుకో రంగంలో ఉత్సవాలు. 👉 కుల వృత్తులను ఆర్దికంగా ఆదుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కో కులానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం. మంత్రి గంగుల నేతృత్వంలో ఈ కమిటీ. 👉 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం. 84 గ్రామాలకు మేలు చేసే నిర్ణయం ఇది. HMDA భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి. 👉 గోదావరి, కృష్ణ, మంజీర నది నుంచి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కు వస్తుంది. కాబట్టి ఉస్మాన్, గండి పేట్ చెరువులకు రింగ్ మెయిన్ చేయాలని కేబినెట్ నిర్ణయం 👉 హుసేన్ సాగర్‌ను గోదావరి నదితో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం. 👉 కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట అనుసంధానానికి కేబినెట్ ఆమోదం. 👉 హైదరాబాద్ జోన్ లో 6 జోన్లకు డీఎం అండ్ హెచ్‌వోలు, రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది డీఎం అండ్ హెచ్వోలను నియమించాలి. 👉 అర్బన్ హెల్త్ సెంటర్ లో పర్మినెంట్ ఉద్యోగుల నియామకం 👉 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం 👉 రైతుల సంక్షేమం కోసం మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ 👉 నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతం. రాష్ట్ర పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తారు. పీడీ యాక్ట్ పెట్టి అరెస్టులు ఉంటాయి. 👉 అలాగే.. మక్కలు, జొన్నలు కొనడానికి వ్యవసాయ, సివిల్ సప్లై శాఖకు కేబినెట్ అనుమతి 👉 వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టంతో.. పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక. ఈ ప్రణాళిక విధివిధానాలపై సబ్ కేబినెట్ దీనికి నివేదిక ఇస్తుంది. 👉 వీఆర్ఎ లకు శుభవార్త. వాళ్లను పర్మినెంట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు 👉 TSPSC లో 10 పోస్టుల మంజూరు. 👉 వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి 10 గుంటల భూమి 👉 ఖమ్మం లో జర్నలిస్టుల సంక్షేమానికి భవనం. జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు 👉 జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ లో చేరుస్తూ నిర్ణయం. కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం. 👉 అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయంరెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం -
పోలీసులపై నారా లోకేష్ బూతులు
-
Telangana: వీఆర్ఏల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: 83 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని వీఆర్ఏలు నిర్ణయించారు. వీఆర్ ఏల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల నియమావళి ఎత్తివేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలందరూ తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని వీఆర్ఏలు చెప్పారు. వీఆర్ఏల ప్రతినిధులు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులతో సోమేశ్‌కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ డిమాండ్లను సీఎస్‌కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం, కేసుల ఎత్తివేత, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించడం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను వివరించారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ దాదే మియా, కన్వీనర్ డి.సాయన్న తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు: ట్రెసా అధ్యక్షులు రవీందర్ రెడ్డి ‘వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్ఏలు గురువారం నుంచి విధులకు హాజరవుతారు’అని సీఎస్‌తో చర్చల అనంతరం ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు -
వీఆర్ఏలపై లాఠీచార్జ్.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ నిరసన వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌కు తరలి వచ్చిన వీఆర్ఏలపై పోలీ సులు లాఠీలు ఝళిపించారు. రాష్ట్రం నలుమూ లల నుంచి వీఆర్ఏలు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర నిరసన తెలిపేందుకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వస్తుండగా...అనుమతి లేదంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కొంత మంది వీఆర్ఏలు పోలీసులను దాటుకుని వెళ్లి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ధర్నాకు దిగారు. భారీగా ట్రాఫిక్ జాం కావడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, ఎట్టకేలకు నిరసనకారు లను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరో వైపు సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన వీఆర్ఏలను అదుపులోకి తీసుకోని పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా అదుపులోకి తీసుకున్న మహిళా వీఆర్ఏలను సైతం రాత్రి వరకు పోలీసులు విడుదల చేయలేదు. పలు పోలీస్స్టేషన్లు తిప్పి చివరకు ముషీరాబాద్‌కు తరలించారు. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు మహిళా వీఆర్ఏలు శాంతియుతంగా బతుకమ్మ ఆటతో నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడాన్ని వీఆర్ఓ జేఏసీ కో కన్వీనర్ ఎం.గోవిందు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు. రాత్రి వరకు మహిళా వీఆర్ఏలను వివిధ పోలీస్ స్టేషన్లో ఉంచడం విచారకరమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
వీఆర్ఏల నిరసన హోరు
సాక్షి హైదరాబాద్/హన్వాడ/మహమ్మదాబాద్: శాసనసభలో సీఎం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్లతో మొదలైన వీఆర్ఏల సమ్మె మరింత ఉధృతమైంది. సోమవారం 78వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ధర్నాలు, బైఠాయింపులు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మార్వో ఆఫీసులకు తాళాలు వేయడంతో లోపలున్న అధికారులు బయటకు రాలేక, బయట ఉన్నవారు లోపలికి వెళ్లలేక రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఇలావుండగా సమ్మె నేపథ్యంలో సోమవారం మరో వీఆర్ఏ మరణించగా, మరో వీఆర్ఏ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పండుగ రోజు కూడా పస్తులు: జేఏసీ 78 రోజులుగా సమ్మె చేస్తూ వీధుల పాలైన తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, మధ్యలోనే వదిలేయటం దారుణమని వీఆర్ఏల జేఏసీ నాయకులు మండిపడ్డారు. సమ్మె ప్రారంభమైన తర్వాత 65 మంది వీఆర్ఏలు మరణించారని తెలిపారు. దసరా రోజు కూడా తమ కుటుంబాలు పస్తులున్నాయని, పిల్లలకు బట్టలు కూడా కొనివ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మహిళా గర్జన: తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, పరిష్కారం చూపనందుకు నిరసనగా ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన వీఆర్ఏ జేఏసీ, మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా గర్జన నిర్వహించనుంది. 14వ తేదీన గ్రామాల్లో భిక్షాటన చేయాలని, 15వ తేదీన యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని, 17 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. కాగా తమ సంఘాలకు గౌరవ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీఎం, సీపీఐ నేతలు.. మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్ఎస్కు మద్దతిస్తూ, తమ ఆందోళనను ప ట్టించుకోకపోవటంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. వేతనం రాక.. వైద్యం అందక.. హన్వాడ మండలం యారోనిపల్లికి చెందిన బాలకిష్టయ్య (56) గ్రామ వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లింగమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు ముగ్గురూ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సమ్మె కారణంగా జీతం నిలిచిపోవడంతో బాలకిష్టయ్యకు కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. సోమవారం చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే బాలకిష్టయ్య మృత్యువాత పడ్డాడు. తండ్రి తరఫున ఆందోళనలో పాల్గొని.. సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ముట్టడికి జేఏసీ పిలుపునివ్వగా, అనారోగ్యంతో ఉన్న అన్నారెడ్డిపల్లి వీఆర్ఏ అన్నేమోని వెంకటయ్య తనకు బదులుగా కుమారుడు మారుతిని ఆందోళన కార్యక్రమానికి పంపించాడు. వీఆర్ఏలు మహమ్మదాబాద్ ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతుండగా.. మారుతి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన వీఆర్ఏలు వెంటనే అతని వద్ద ఉన్న పెట్రోల్ సీసాను లాగేసుకున్నారు. కళ్లలో ఇబ్బందిగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు తరలించి చికిత్స చేయించారు. -
అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెళ్లిన వీఆర్ఏల ముఖంపై వినతిపత్రాన్ని విసిరికొట్టడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వీఆర్ఏల స మ్మెపై శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘గత 75 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల పట్ల దున్నపోతుపై వాన పడిన చందంగా ప్ర భుత్వం వ్యవహరిస్తోంది. వారి డిమాండ్ల సాధ న కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది.’అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
వీఆర్ఏలపై కేసీఆర్ ఆగ్రహం.. సమస్యలు వినే ఓపికలేని సీఎం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినే ఓపికలేని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు వినతి పత్రం ఇస్తే.. దాన్ని వాళ్ల ముఖంపై పడేయడం సీఎం అహంకారానికి నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వీఆర్ఏలు.. సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు) రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం -
వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ సీరియస్.. వినతిపత్రం విసిరేసి..
సాక్షి, వరంగల్: వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) అక్కడికి వచ్చారు. తొలుత నలుగురు వీఆర్ఏలను లోపలికి తీసుకెళ్లారు. అందులో వీఆర్ఏల జేఏసీ హనుమకొండ జిల్లా కార్యదర్శి సతీశ్ ఒక్కడినే అనుమతించగా.. ఆయన సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించారు. సీఎం ఆ వినతిపత్రాన్ని చదువుతుండగా సతీశ్ తమ సమస్యలను వివరించారు. ఈ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వినతిపత్రాన్ని సతీశ్ వైపు విసిరేస్తూ.. సమ్మె విరమించాలని చెప్పినా వినడం లేదని, తరచూ కాన్వాయ్‌కు అడ్డుపడుతున్నారని మండిపడినట్టు సమాచారం. దీంతో వీఆర్ఏలతోపాటు అక్కడున్న నాయకులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. చదవండి: కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మరునాడే అవార్డులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్ లక్ష్మీకాంతరావును పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -
బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
నెక్కొండ: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలేదని ఓ వీఆర్ఏ మనస్తాపానికి గురై గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గుండ్రపల్లి వీఆర్ఏ మహ్మద్ ఖాసీం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఖాసీం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం నెక్కొండలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న ఖాసీం బ్లేడ్‌తో గొంతు కోసుకున్నారు. దీంతో తోటి వీఆర్ఏలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సీ మాఫర్హీన్ ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదీ చదవండి: అన్ని అనుకూలతలు ఉన్నా వెనుకబడే దుస్థితి ఎందుకు?: సీఎం కేసీఆర్ -
కేసీఆర్‌ది.. అబద్ధాలు, అవినీతి, మోసాల పాలన
చౌటుప్పల్ రూరల్: అబద్ధాలు, అవినీతి, మోసాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని.. 48 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. 30 మంది చనిపోయినా కనికరంలేని మనస్తత్వం ఆయనదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవా రం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మునుగోడు నియో జకవర్గంపై కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపాడని, డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటికే ప్రతి ఎకరాకు సాగు నీళ్లు అందేవన్నారు. కేసీఆర్ 3 జంతువుల కలయిక అని.. అవసరాన్ని బట్టి కుక్కలా, నక్కలా, తొడేలులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇచ్చిన పరిహారమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల రైతులకివ్వడానికి అక్కడ దేవుళ్లు, నల్లగొండను రాక్షసులేం పాలించడం లేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ కూడా మూడు నల్ల చట్టాలను తెచ్చారని, వాటిని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. నల్లధనం వెనక్కి తెస్తానని, ప్రతి పేదోడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ కూడా ఇంత వరకు 15పైసలు కూడా వేయలేదన్నారు. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని, కమ్యూనిస్టులు ఎక్కడున్నారన్న కేసీఆర్‌కు సీపీఐ, సీపీఎం ఎందుకు మద్దతు ఇస్తున్నాయో తెలియడం లేదన్నారు. కమ్యూనిస్టులంతా ఉప ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం పనిచేయాలని కోరారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ప్రజాస్వామ్యం బతుకుతదని, మేధావులు, నిరుద్యోగులు, యువత ఆలోచన చేయాలని రేవంత్ కోరారు. మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, గీతారెడ్డి, పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. -
వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టకి యత్నించాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏలు మూడు రోజుల ముందుగానే బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం, కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. ఇదిలా ఉంటే, వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ వారితో సమావేశమయ్యారు. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: (Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు) -
మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏల ప్రయత్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్): తమ సమస్యలపై సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సోమవారం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 60 మంది వీఆర్ఏలు సమస్యలపై గళమెత్తేందుకు మంత్రుల క్వార్టర్స్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొని గేటు దూకేందుకు యత్నించిన పలువురు వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా ఉభయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు దాదేమియా, వెంకటేష్, నర్సింహ్మ, హరినాథ్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం హామీ ప్రకారం పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వీఆర్ఏలకు పేస్కేల్ అమలు అంశం: కామారెడ్డి వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, కామారెడ్డి: తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు). ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈక్రమంలో వీఆర్ఏల పోరాటంలో చురుకుగా పాల్గొన్న నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ తనువుచాలించాడు. పేస్కేల్ అమలు చేస్తారో లేదోనని మనస్తాపానికి గురైన అశోక్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. గ్రామంలోని చెరువుకట్ట వద్ద వీఆర్ఏ అశోక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్ఏలు అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు) -
కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్య
-
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్): అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ ఎం.రాజయ్య డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ..వీఆర్ఏలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారమేనని, తమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వీఆర్ఏలు అన్ని జిల్లా కేంద్రాల్లో పే స్కేల్ జాతర (ధూం ధాం), భారీ ప్రదర్శనలు, ర్యాలీలు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 22న మండల కేంద్రాల్లో ఉద్యోగ సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి మానవహారాలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు వై.వెంకటేశ్ యాదవ్, వంగూరి రాములు, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, ఎస్కె.రఫీ, ఎన్.గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏల వివరాలు మరోసారి.. తహసీల్దార్లకు సీసీఎల్ఏ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 22 వేల మందికిపైగా వీఆర్ఏలు 19 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. వీఆర్ఏల ప్రధాన డిమాండ్ అయిన పేస్కేల్ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్ఏ నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే ఈ వివరాలను సేకరిస్తోందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీఆర్ఏలకు పేస్కేల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గౌరవ వేతనంపై నియమితులైన వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇవ్వడం సాధ్యం కాదని, డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే పేస్కేల్ ఇచ్చి వారిని రెవెన్యూలో కొనసాగించాలని, మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతోపాటు ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అంశాలివే..: వీఆర్ఏల వివరాలను పంపాలంటూ సీసీఎల్ఏ నుంచి వివిధ అంశాలతో కూడిన ఫార్మాట్ మళ్లీ తహసీల్దార్లకు అందింది. గతంలోనూ ఈ వివరాలను సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అందలేదని, ఈ నేపథ్యంలోనే మళ్లీ కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకుంటున్నారని తహసీల్దార్లు చెబుతున్నారు. వీఆర్ఏల పేరు, పనిచేస్తున్న గ్రామం, మండలం, తండ్రి పేరు, కులం, విద్యార్హత, అపాయింట్మెంట్ తేదీ, ఎలా నియమితులయ్యారు, పుట్టిన తేదీ, ప్రస్తుత వయసు, క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, వీఆర్ఏ మొబైల్ నంబర్ వివరాలను ప్రభుత్వం మళ్లీ తీసుకుంటోంది. చదవండి: (Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!) -
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి!
మహబూబాబాద్: నర్సింహులపేట మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు 2017, 2020, 2022లో నిండు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, అర్హత గల వారికి ప్రమోషన్స్, 55సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంకా అమలు చేయలేదు అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచి జీవో విడుదల చేయాలని కోరుతూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ యన్ శేకర్, జిల్లా ఉపాధ్యక్షడు ఎండీ మన్సూర్ అలీ, కొ వైర్‌మెన్ దర్మారపు ఉప్పలయ్య, కే.చైతన్య, యస్.సుధాకర్, లలిత, దివ్య, ఇర్ఫాన్, వెంకట నారాయణ, మోహన్, జనార్దన్, అబ్బాస్, రాములు, బిక్షం యకయ్య, మల్లయ్య, మనోజ్, తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
పెంచికల్పేట్: కొమురంభీం జిల్లా పెంచికల్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోయచిచ్చాల వీఆర్ఏ తిరుపతి శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తిరుపతి ఒంటిపై పెట్రోల్ పోసుకోగా అక్కడే ఉన్న నాయకులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, రిలే దీక్షలకు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి మద్దతు ప్రకటించారు. -
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం చాడ లేఖ రాశారు. ధరణిలో దొర్లిన తప్పులను సరిచేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏల అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యను ప్రత్యేక దృష్టితో చూసి సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేఖలో చాడ కోరారు. -
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం
Errabelli Dayakar Rao.. సాక్షి, జనగామ: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకునేందుకు వీఆర్ఏలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీఆర్ఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే, అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి.. గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇందుకు వ్యతిరేకంగానే నేడు మంత్రిని వీఆర్ఏలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కేటీఆర్ ట్వీట్‌కు బండి కౌంటర్ -
వీఆర్ఏల ‘చలో సీసీఎల్ఏ’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు తలపెట్టిన ‘చలో సీసీఎల్ఏ’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వివిధ మార్గాల్లో అబిడ్స్ వరకు చేరుకున్న వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం శాంతియుత ఆందోళన నిర్వహించేందుకోసం సీసీఎల్ఏకు ర్యాలీగా బయలుదేరిన వీఆర్ఏలను హైదరాబాద్ కలెక్టరేట్ సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వారు సీసీఎల్ఏ వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వీఆర్ఏలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలకు గాయాలయ్యాయి. వికారాబాద్‌కు చెందిన మహిళా వీఆర్ఏ సరోజకు చెయ్యి విరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు కొందరు సీసీఎల్ఏ కార్యాలయానికి చేరుకుని సీసీఎల్ఏ కార్యదర్శి హైమావతికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వీఆర్ఏల జేఏసీ చైర్మన్ జి. రాజయ్య, సెక్రెటరీ జనరల్ ఎస్.కె.దాదేమియాలు మాట్లాడుతూ.. గత 20 నెలలుగా సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్న తమకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు విని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆందోళనలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న వీఆర్ఏలను నిర్బంధించడం, ఆందోళనలో పాల్గొంటున్న వారిపై దాడి చేయడం తగదని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్‌లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల పట్ల పోలీసుల చర్యలను వీఆర్వోల సంఘం నేతలు వింజమూరి ఈశ్వర్, గోల్కొండ సతీశ్‌లు కూడా వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. -
Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫైల్‌పై సీఎం సంతకం పెట్టడమే తరువాయి అని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తుండగా.. అందులో 3–6 తరగతుల మధ్య, 7–9 తరగతుల మధ్య, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించింది. ఇదే సమయంలో 1 నుంచి 9వ తరగతి వరకు.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలనూ తీసుకుంది. ఈ కేటగిరీల మేరకు పదో తరగతి, ఆపై చదివినవారు 5 వేల మంది వరకు ఉంటారని, వారికి పేస్కేల్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. రెవెన్యూ సంఘాలు ఈ ప్రతిపాదనల విషయంగా ఉన్నతాధికారులను సంప్రదించినా.. విద్యార్హతల ఆధారంగా ప్రతిపాదనలు పంపుతున్నామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టింగ్ ఎక్కడెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలలో ఎంత మందిని ఏయే శాఖలకు పంపుతారనే దానిపై రెవెన్యూ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారని.. అయితే డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు పంపుతారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అలాకాకుండా పేస్కేల్ వర్తించేవారు, డైరెక్ట్ రిక్రూటీలను మాత్రమే రెవెన్యూలో కొనసాగించి.. మిగతా వారిని వివిధ శాఖలకు పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు డైరెక్ట్ రిక్రూటీలలో కొందరిని వ్యవసాయశాఖకు కూడా పంపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు అంటున్నారు. గౌరవ వేతనం కేటగిరీలోకి వచ్చే వీఆర్ఏలను ప్రభుత్వం తన అవసరాలను బట్టి వివిధ శాఖల్లో ఉపయోగించుకుంటుందని, ఈ మేరకు నీటిపారుదల శాఖలోకి లష్కర్లుగా వెళ్లేవారికి గౌరవ వేతనమే ఉంటుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అంతా గప్‌చుప్‌గా..! వీఆర్ఏలు, వీఆర్వోల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నోరు మెదిపేందుకు ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు. సీసీఎల్ఏ అధికారులను ఎప్పుడు అడిగినా.. తమకేం తెలియదంటూ దాటవేస్తున్నారని, కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదని వీఆర్ఏల సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు కొన్ని వీఆర్ఏ సంఘాలు ఈనెల 23న పేస్కేల్ కోసం సీసీఎల్ఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇప్పుడే వీఆర్ఏ పేస్కేల్ అంశం పరిష్కారం కావాలని.. లేకుంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన వీఆర్ఏలలో కనిపిస్తోంది. ఐదేళ్లుగా నాన్చుడే.. అర్హతల మేరకు సర్వీసు క్రమబద్ధీకరణ, డ్యూటీ చార్ట్, పేస్కేల్ ఇస్తామని సీఎం స్పష్టంగా మూడుసార్లు ప్రకటించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించ నట్టు.. అధికారులు మా సమస్యను ఐదేళ్లుగా నాన్చుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. – రమేశ్ బహదూర్, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన బాట వీడం న్యాయమైన మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వేల మంది వీఆర్ఏలకు సంబంధించిన అంశాన్ని వీలైనంత త్వరగా సానుకూలంగా పరిశీలించాలి. ఈనెల 23న సీసీఎల్ఏ వద్ద నిరసన చేపడతాం. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం. – వెంకటేశ్ యాదవ్, వీఆర్ఏ అసోసియేషన్ కార్యదర్శి -
వీఆర్ఏలు ఇక ఊళ్లకు
సాక్షి, నెట్వర్క్: ‘కారు కడుగుడు, బట్టలు ఉతుకుడు’శీర్షికన వీఆర్ఏల బానిస బతుకులపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం ఉన్నతస్థాయి యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక వీఆర్ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్ లేకపోవటంతో ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు ఆడ, మగ తేడా లేకుండా వీఆర్ఏలకు ఆర్డర్లీ పనులు చెబుతున్న తీరును ఫొటోలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో పలు జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీఆర్ఏలు ఎవరినీ రెవెన్యూయేతర పనుల్లో ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రా ల్లో అనధికార విధుల్లో కొనసాగుతున్న వీఆర్ఏలు శుక్రవారం నుండి తమ సొంత గ్రామాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల అధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వీఆర్ఏలకు అందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వీఆర్ఏ, వీఆర్వోలు సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం హాజరుకావాలని ఆదేశిస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. మాజీ వీఆర్వో, వీఆర్ఏలు కార్యాలయాల్లో సమయపాలన పాటించాలని, మాన్యువల్ రిజిస్టర్‌ను నిర్వహిం చాలని సూచించారు. మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఇసుక వాహనం, ఇసుక రీచుల వద్ద విధులు నిర్వర్తించేలా సమన్వయం చేసుకోవా లని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. తాజా ఆదేశాలతో జిల్లాలో ఇలా ఆర్డర్లీ పనులు చేస్తున్న వీఆర్ఏల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘సాక్షి’కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యలు చెప్పుకుంటాం.. సమయం ఇవ్వండి తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గానూ తమ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌లు ఈ మేరకు తాము పంపిన విజ్ఞాపన పత్రాన్ని పత్రికలకు విడుదల చేశారు. -
వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు
► వీఆర్ఏ ఏం చేయాలి..?: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామంలో రెవెన్యూ సంబంధ వ్యవహారాలు చూసే ఉద్యోగి. ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేయాలి. అధికారిక వ్యవహారాల్లో పైఅధికారులకు సహకరించాలి. ► మరి ఇప్పుడేం చేస్తున్నారు?: పైఅధికారుల ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, కూరగాయలు తేవడం, వంట చేయడం, అధికారి సొంత కారుకు డ్రైవర్‌గా పనిచేయడం.. ఇలాంటి పనులెన్నో చేస్తూ అనధికారిక ‘పాలేర్లు’గా మారిపోయారు. ► ఎందుకీ సమస్య?: రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వీఆర్ఏలకు సర్వీస్‌రూల్స్ రూపొందించకపోవడంతో.. జిల్లా కలెక్టర్లు మొదలుకొని డిప్యూటీ తహసీల్దార్ల దాకా వీఆర్ఏలను సొంత పనులకు వాడుకుంటూ.. కొత్త ‘ఆర్డర్లీ’వ్యవస్థకు తెరతీసిన తీరు వివాదస్పదంగా మారింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలున్నారు. కొత్త రెవెన్యూ చట్టం–2020 ప్రకారం వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ గ్రామాల్లో వీఆర్ఏల(గ్రామ రెవెన్యూ సహాయకుల)ను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో వారు గ్రామాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, కోర్టు సమన్లను అందచేయటం, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేసేవారు. ప్రస్తుతం వారికి కొత్త విధులు అప్పగించకపోవటం, వారి డ్యూటీ ఏమిటనేది తేల్చకపోవడంతో.. అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో అన్నిపనులకు వినియోగిస్తున్నారు. స్వీపర్లు మొదలుకుని డ్రైవర్లు, వంట మనుషులు, నైట్ వాచ్మన్ల దాకా పని చేయించుకుంటున్నారు. వాస్తవానికి అర్హతల మేరకు వీఆర్ఏలను ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు 2017 ఫిబ్రవరి 24న ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. కాదంటే భయం.. చేయలేక ఆగమాగం..: వీఆర్ఏలకు చాలా కాలంగా సర్వీస్ రూల్స్ అంటూ లేకపోవటంతో పైఅధికారులు ఏది చెప్తే అది చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మరీ ఇంట్లో పనిమనుషులుగా కూడా వాడుకుంటున్నారు. చేయబోమని ఎవరైనా అంటే.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్లకు సరెండెర్ చేయడం వంటి కక్షసాధింపు చర్యలకు కొందరు అధికారులు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెప్పిన పనులు చేయలేక ఓ వైపు.. కాదంటే ఏ ఇబ్బంది ఎదురవుతుందోననే ఆందోళనతో మరోవైపు వీఆర్ఏలు మానసిక క్షోభకు గురవుతున్నారు. పోటీ పరీక్షలో గెలిచి వచ్చినా.. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏలలో 2,900 మంది రాతపరీక్ష ద్వారా నేరుగా ఎంపికయ్యారు. మిగతా వారు వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారు. వారికి ప్రతినెలా రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి, పోటీపరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు కూడా ఇప్పుడు అధికారుల ఇళ్లలో పనిచేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తగిన విధులు అప్పగించడంగానీ, ఇతర శాఖల్లో విలీనం చేయడంగానీ చేస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా డ్యూటీ చార్ట్, సర్వీసు రూల్స్ ప్రకటించాలని కోరుతున్నారు. టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా.. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా డ్యూటీలు వేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రతిరోజు సాయంత్రం లాన్ టెన్నిస్ ఆడే సమయంలో.. అటూఇటూ వెళ్లిపోయిన బంతులను తెచ్చి ఇచ్చేందుకు రోజుకు ముగ్గురి చొప్పున వారానికి ఇరవై ఒక్క మంది వీఆర్ఏలకు అధికారికంగా డ్యూటీలు వేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చస్తూ బతుకుతున్నం ఎంకాం చదువుకుని, డీఎస్సీ ద్వారా పోటీ పరీక్ష రాసి వీఆర్ఏగా ఎంపికయ్యా. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ పని చెబితే ఆ పని చేయాల్సి ఉంటుంది.ఉన్నత చదువులు చదివిన వారంతా ఈ ఉద్యోగాన్ని ఎంచుకుని చస్తూ బతుకుతున్నరు. సర్వీస్ రూల్స్ కోసం ఎదురు చూస్తున్నం. – ఎ.వెంకటేశ్‌యాదవ్, వీఆర్ఏ, జిన్నారం బానిసల కంటే అధ్వానం మాకు రెవెన్యూ విధులు మినహా ఇతర పనులేవీ చెప్పొద్దని సీసీఎల్ఏ ఉత్తర్వులు (ఏ2–1635–2012) ఉన్నా వాటిని ఎవరూ పాటించడం లేదు. ఉన్నత ఆశయంతో పోటీపరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన మాకు.. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఆడ, మగ తేడా లేకుండా అధికారులు అప్పగించిన పనులన్నీ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బానిస కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. – రమేశ్బహదూర్, వీఆర్ఏ, తిమ్మాజిపేట పనిఒత్తిడి, ఇతర సమస్యలకు బలి.. – మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో నైట్ వాచ్‌మన్ డ్యూటీలో ఉన్న వీఆర్ఏ దుర్గం బాపురావు హత్యకు గురయ్యాడు. – యాదాద్రి జిల్లా పులిగిల్లలో నైట్ డ్యూటీకి వెళుతూ వీఆర్ఏలు పల్లెర్ల పురుషోత్తం, ఈదుల కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. – నిజామాబాద్ జిల్లా ఖండిగావ్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గౌతమ్ హత్యకు గురయ్యాడు. – మాచారెడ్డి, ఘనపూర్ తహసీల్దార్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ చల్లా రమేష్ పనిఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. – నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో పనిఒత్తిడితో హర్షవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. -
వివాదస్పదమవుతున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ తీరు
-
రైతు ఉద్యమంలా వీఆర్ఏలు పోరాడాలి
కవాడిగూడ: వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఇందుకు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ జీవో, ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో హైదరాబాద్’నిర్వహించారు. ఇందిపార్కు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేశారు. తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నాయకులు తీన్మార్ మల్లన్న తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వీరభద్రం మాట్లాడుతూ.. ‘వీఆర్ఏలు చేస్తున్న పోరాటం రాజ్యాంగబద్ధమైనది. వాళ్లకు ఇప్పటివరకు పే స్కేల్ ఇవ్వలేదు. సర్వీసును పర్మినెంట్ చేయలేదు’అన్నారు. వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడతా: సీతక్క సీఎం కేసీఆర్ హయాంలో రెవెన్యూ శాఖ వెలవెలబోతోందని ఈటల అన్నారు. ప్రజలతో దగ్గరి సంబంధం ఉండే రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఎంఆర్‌వోలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర దేశంలో తెలంగాణకే దక్కిందన్నారు. వీఆర్ఏలను తొలగించి రెండేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని సీతక్క హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారన్నారు. -
నిజామాబాద్: ఇసుక మాఫియా ముఠా దాడి.. వీఆర్ఏ మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుకు మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ముఠా.. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రయత్నించారు. (చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!) వీరిని అడ్డుకునేందుకు వీఆర్ఏ గౌతమ్ ప్రయత్నించగా.. ఇసుక మాఫియా ముఠా వీఆర్ఏను చితకబాదింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ గౌతమ్‌ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. దీంతో వీఆర్ఏ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
కటకటాల్లోకి కల్లాడ వీఆర్ఏ..
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్ఏని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.బాలరాజు బుధవారం తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్‌గౌడ్‌కు వీఆర్ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్‌గౌడ్‌కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేవారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు. ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్‌గౌడ్ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్‌కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్‌గౌడ్ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్‌జైల్‌కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
కొత్త రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అలాగే వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త చట్టం ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభవార్త అందించారు. ఉద్యోగులకు పే స్కేల్ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్సిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వీఆర్ఏలు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ హామీ ఇచ్చారు. కాగా శుక్రవారం నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసందే. (కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం). . వీఆర్ఏలకు పే స్కేల్‌తో పాటు వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ధన్యవాదాలు : ట్రెసా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ రెవెన్యూ ఉద్యోగుల పని తీరును మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంతోషం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్‌లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమపై పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏ లకు పూర్తి వేతనంతో పాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
తండ్రి పేరుతో తనయుడి దందా!
కుత్బుల్లాపూర్: తండ్రి పేరుతో తాత్కాలిక వీఆర్ఏగా పనిచేస్తూ అమాయకులను బెదిరించడమే కాకుండా ప్రభుత్వ ఆక్రమణల విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పరి వాసు కోసం జగద్గిరిగుట్ట పోలీసులు గాలింపు చేపట్టారు. గత నెల చివరి వారంలో వాసుపై కేసులు నమోదైనా పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సదరు వీఆర్ఏ ఆక్రమణలపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. ఖదిర్ అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేయడమే కాకుండా అతడి ఇంటిని కూల్చి వేసిన విషయంపై గత నెల 23న సీఐ గంగారెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వాసు జాడ కనుక్కోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎస్సై సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం వాసు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ వాసుపై పలు ఆరోపణలు రాగా సదరు ఎస్సై సెటిల్మెంట్ చేసినట్లు దేవేందర్‌నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. తండ్రి స్థానంలో తాత్కాలిక వీఆర్ఏగా కొనసాగుతూ ఓ డ్రైవర్, ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని ఖరీదైన కారులో తిరుగుతూ ఫోర్జరీ నోటరి డాక్యూమెంట్లను సృష్టిస్తూ ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న వీఆర్ఏ ఉప్పరి బాలయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక వీఆర్ఏ గా కొనసాగిన వాసు వ్యవహార శైలి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. -
వీఆర్ఏ దారుణ హత్య
తాండూర్(బెల్లంపల్లి): గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య కొనఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. ఎస్సై కె.శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం... రేచిని గ్రామానికి చెందిన గజ్జెల్లి పోశం(55) మండలంలోని గంపలపల్లి వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు)గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పోశం, అతని భార్య శంకరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎవరో తలుపు కొట్టిగా పోశం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే విద్యుత్ మీటర్ తీగ కట్ చేశారు. చీకట్లోనే తలుపు తీయడంతో ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు పోశం, శంకరమ్మలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. వారిని ప్రతిఘటించిన శంకరమ్మ తీవ్ర గాయాలతో అరుస్తూ రోడ్డుపైకి పరుగెత్తి కొద్ది దూరం వరకు వెళ్లి çస్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది, స్థానికులు ఇంటికి వెళ్లి చూసే సరికి పోశం రక్తపు మడుగులో మృతిచెంది కన్పించాడు. దీంతో శంకరమ్మను మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న సీఐ సామల ఉపేందర్, ఎస్సైతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్వా్కడ్‌లతో ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలం గ్రామంలో పలుచోట్ల వెళ్లినప్పటికీ స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశం కూతురు రాజేశ్వరి, అల్లుడు వెంకటేష్, బంధువుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ తగాదాలే కారణమా? పోశం దంపతులపై దాడికి భూ తగాదాలే కారణమై ఉండొచ్చని స్థానికంగా చర్చ సాగుతోంది. పోశం ఇంటి ఎదుట రోడ్డు విషయంలో కొంత కాలంగా పోశం అన్న కొడుకు తిరుపతి, పోశం తమ్ముడు రాజన్నలతో వివాదం నెలకొంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆ వివాదం చల్లారక హత్యకు దారితీసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదంతోనే ఆ ఘాతుకం చోటు చేసుకుందా, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. పోశం భార్య శంకరమ్మ ఫోన్లో చెప్పిన సమాచారంతో అల్లుడు కాటెపల్లి వెంకటేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనుమానితులైన గజ్జెల్లి తిరుపతి, గజ్జెల్లి రాజన్న, రాజన్న కుమారుడు గజ్జెల్లి సాయితేజలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వీఆర్ఏలకు గార్డు విధులు!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయోగం చేపట్టింది. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు కొత్త రూపు ఇచ్చింది. వారికి ‘రక్షణ’ విధులు అప్పగించింది. రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సందర్శకుల రాకపోకలపై కన్నేసి ఉంచేందుకు సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే ప్రజల్లో కొందరు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదనే ఆక్రోశంతో అధికారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 4న తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆమె కార్యాలయంలోనే ఓ రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన ఈ కోవలోనిదే. విజయారెడ్డి సజీవదహనంతో అవాక్కయిన రెవెన్యూ యంత్రాంగం... వారం పాటు విధులు బహిష్కరించింది. తమకు రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించడంతో రంగంలోకి దిగిన సర్కారు రెవెన్యూ ఉద్యోగుల విధుల నిర్వహణకు పోలీసు రక్షణ కల్పించింది. కానీ క్రమేణా కానిస్టేబుళ్లను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యానే నిర్మల్ జిల్లా అధికారులు వీఆర్ఏలకు సెక్యూరిటీ గార్డు విధులు అప్పగించాలని నిర్ణయించారు. డ్రెస్‌కోడ్‌తో కొత్త అవతారమెత్తిన వీఆర్ఏల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే మండల కార్యాలయాలు, అధికారుల వద్ద ఆర్డర్లీ సేవలందిస్తున్న వీఆర్ఏలను తాజాగా సెక్యూరిటీ గార్డులుగా నియమించడంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురు... నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో రెవెన్యూ అధికారుల రక్షణ కోసం సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతి మం డలం నుంచి ముగ్గురు వీఆర్ఏలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళా వీఆర్ఏకు స్థానం కల్పించారు. 19 మండలాల నుంచి సెక్యూరిటీ గార్డులుగా విధుల కోసం 57 మందిని ఎంపిక చేసి వారికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో అధికారులను కలిసేందుకు వచ్చే ఫిర్యాదుదారులను చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించడం, వారు వెంట తీసుకువచ్చిన చేతిసంచులు, ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ పనిపై వచ్చారనే విషయాన్ని ఆరా తీయడం, అనుమానస్పదంగా ఉంటే వారిని అడ్డుకోవడం.. తదితర అంశాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. డ్రెస్‌కోడ్‌పై గరంగరం! వాస్తవానికి వీఆర్ఏల ప్రధాన విధి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)కి సహాయకులుగా వ్యవహరించడం. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండటంతో దాదాపు అన్ని మండల కార్యాలయాల్లో వీఆర్ఏల సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విడతలవారీగా ఆయా గ్రామాల వీఆర్ఏలను మండల ఆఫీసుల్లో విధులకు నియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం, ఆ తర్వాత కొన్ని మండలాల్లోనూ పెట్రోల్ సీసాలు, భౌతికదాడులకు పాల్పడతామంటూ కొందరు ఫిర్యాదుదారులు హెచ్చరికలకు దిగడంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం వీఆర్ఏలను సెక్యూరిటీ గార్డులుగా మార్చేసింది. అయితే విధుల నిర్వహణపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా డ్రెస్‌కోడ్‌పై మాత్రం ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతవిద్య అభ్యసించి వీఆర్ఏలుగా పనిచేస్తున్న తమకు డ్రెస్‌కోడ్‌ను వర్తింపజేయడం అవమానపరచడమేనని మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, తక్షణమే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపరిపాలన శాఖ డైరెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. -
మాట తప్పని నేత
-
మరో హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నారు. వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా జగన్‌ను కలిసిన వీఆర్ఏలు తమకు పదోన్నతి కల్పించాలని పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. వారి వినతిపై స్పందించిన జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్లు కల్పిస్తామని అప్పట్లోనే వారికి హామీని ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎంగా ప్రమాణం చేసిన ఎనిమిది నెలల్లోనే వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించారు. దీని ద్వారా వీఆర్ఏలకు ఇచ్చిన మాటాను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలు ఎదురుచూస్తున్న పదోన్నతిని సీఎం చేసి చూపించారు. నాలుగు వేల మంది గ్రామ సహాయకుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్‌ను గ్రామ సహాయకులు దేవుడిలా భావిస్తున్నారని, సీఎం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. -
కోడి కూరతో పాటు నువ్వూ కావాలి
సాక్షి, కురిచేడు(దర్శి టౌన్): ఓ మహిళా వీఆర్ఏపై మండల మేజిస్ట్రేట్ అసభ్యంగా ప్రవర్తించడానే ఆరోపణలు కురిచేడులో సోమవారం చర్చనీయాంశమైంది. మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్ఏపై స్థానిక తహసీల్ధార్ డీవీబి వరకుమార్ లైగింక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వీఆర్ఏ ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా కురిచేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. సిబ్బంది అంతా హాజరు కాగా తహసీల్దార్ వరకుమార్ హాజరు కాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్ తన కార్యాలయంలో క్రిస్మస్ విందుకు తాను హాజరు కాలేదని, నాకు కోడి కూరతో పాటు నీవు కావాలంటూ తనతో అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు ఆరోపిస్తోంది. తండ్రి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదని వారించినా.. తనను వెనక నుంచి వచ్చి కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఛీఛీ.. బాలికపై పోలీస్ బాస్ లైంగిక దాడి ఈ సంఘటనపై సోమవారం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ను దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై తహసీల్దార్ వరకుమార్ మాట్లాడుతూ తనపై బాధితురాలు నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' -
నమ్మి..నట్టేట మునిగారు!
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం): తెలిసి చేశాడో..తెలియక చేశాడో తెలియదుగానీ ఓ ఇన్చార్జి తహసీల్దార్ నిర్వాకానికి 16 మంది వీఆర్ఏలకు అన్యాయం జరిగింది. ఈ సంఘటన గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు..వీఆర్ఏలుగా పనిచేస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారు తమ పిల్లలను నామినీ వీఆర్ఏలుగా నియమించాలనుకోవడం సహజం. గిద్దలూరులో గతంలో ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న వల్లీకుమార్ మాటలు నమ్మిన వీఆర్ఏలు ఇప్పుడు నిండా మునిగారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 12 మంది వీఆర్ఏలు వృద్ధాప్యంలో ఉండగా, మరో నలుగురు వీఆర్ఏలు చనిపోయారు. మొత్తం 16 మంది వీఆర్ఏల స్థానంలో వారి నామినీ (కుమారులు)లను వీఆర్ఏలుగా నియమిస్తానని వల్లీకుమార్ నమ్మబలికాడు. ఆయన చెప్పినట్లు 12 మంది వయస్సు పైబడిన వీఆర్ఏలు మెడికల్ సెలవులు పెట్టారు. అనంతరం ఆయన వారందరినీ నామినీ వీఆర్ఏలుగా భావించి వారితో ఎన్నికల విధులు చేయించుకున్నాడు. ఇక తాము వీఆర్ఏలుగా కొనసాగవచ్చని ఆశపడి వారు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఎన్నికలనంతరం కొత్త తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి బదిలీపై తన పాత స్థానావెళ్లగానే ఉత్తర్వులిచ్చి పూర్తి స్థాయి వీఆర్ఏలుగా ఉద్యోగాలు కల్పించి మొత్తం వేతనాలు ఒకేసారి చెల్లిస్తానని సదరు అధికారి వారికి ఆశ కల్పించాడు. 16 మంది నామినీ వీఆర్ఏలు నాలుగు నెలల పాటు విధులు నిర్వహించాక తమకు వేతనాలు ఇవ్వాలని ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ను నిలదీశారు. దీనికితోడు ఎన్నికల విధుల కోసం వచ్చిన తహసీల్దార్ సుబ్బారెడ్డి రెగ్యులర్‌గా ఇక్కడే ఉండిపోవడంతో వీఆర్ఏల వేతనాలు నిలిచిపోయాయి. ఇక తమకు ఉద్యోగాలు, వేతనాలు రెండూ రావని గ్రహించిన నామినీ వీఆర్ఏలు కనీసం వేతనాలైనా చెల్లించాలని తహసీల్దార్‌ను వేడుకున్నారు. మెడికల్ సెలవులో ఉన్నట్లు మీరు లెటర్ ఇచ్చారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి విధుల్లో చేరితే అప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తామని తహసీల్దార్ సుబ్బారెడ్డి వారితో తేల్చి చెప్పారు. వీఆర్ఏలు సీఐటీయూ నాయకులు, వీఆర్ఏల సంఘంతో కలిసి 20 రోజుల పాటు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ మోసాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు వేశారు. అయినా ప్రస్తుత తహసీల్దార్ సుబ్బారెడ్డి నామినీ వీఆర్ఏలకు పోస్టులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగం, వేతనాలు ఇవ్వక పోవడంతో నామినీలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు విరమించిన వీఆర్ఏలు తమకు వేతనాలివ్వాలని తహసీల్దార్‌కు డాక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఉద్యోగం మాట పక్కన పెడితే 8 నెలల పాటు శ్రమించిన వేతనం కోల్పోయామని 16 మంది వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీఓలో లేకుండానే తమకు నియామక ఉత్తర్వులిచ్చి మోసం చేసిన గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్పై చర్యలు తీసుకుని 16 మందికి రావాల్సిన 8 నెలల వేతనం రూ.12.80 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఆ అధికారం తహసీల్దార్లకు లేదు వీఆర్ఏల పిల్లలను వీఆర్ఏలుగా నియమించే అధికారం తహసీల్దార్లకు లేదు. 2012లో ఉద్యోగ కిరణాలు పేరుతో ప్రతి నియామకాన్ని ఏపీపీఎస్సీ ద్వారా చేపడుతున్నారు. వీఆర్ఏలను దాని ద్వారానే నియమిస్తున్నారు. వల్లికుమార్ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో నాకు తెలియదు. వీఆర్ఏలు అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి సెలవులు పెట్టారు. తిరిగి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి విధుల్లో చేరితే ఇప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తాం. జీవీ సుబ్బారెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు -
పెద్దబొంకూర్ వీఆర్ఏ సస్పెన్షన్
సాక్షి, పెద్దపల్లి: భూమిలేని నిరుపేదలకు పం చాల్సింది పోయి వీఆర్ఏగా పనిచేస్తున్న వ్యక్తే తన పేరిట ప్రభుత్వభూములను అక్రమ పద్ధతుల్లో పట్టా చేసుకున్న సంఘటన పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ ఎంపీటీసీ మిట్టపల్లి వసంత సమాచారహక్కు చట్టం ప్రకారం సద రు భూములకు సంబంధించిన వివరాలు కోరడంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీలేక సదరు వీఆర్ఏ పేరిట ఉన్న పట్టాదారు పాసుబు క్కులను రద్దు చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దబొంకూర్ గ్రామంలోని సర్వే నంబర్ 325/16/1లో ఎకరం, సర్వేనంబర్ 485/20/1లో 20గుంటలు, 590లో 19 గుం టలు, 592లో 12గుంటలు, 620లో 16గుంట లు, 622లో 11గుంటలు, 649లో 14గుంటల భూమిని అక్రమంగా తనపేరిట రాయించుకు ని పాసుబుక్కు నంబర్ టీ20100190237 పొందినట్టు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలను రద్దు పర్చినట్లు ప్రకటించారు. వీఆర్ఏ రాయమల్లును సస్పెం డ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజనరేందర్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న రైతుబంధు పథకం కింద పొందిన పె ట్టుబడి సాయాన్ని కూడ రికవరీ చేసేలా సం బంధిత అధికారులకు సూచించామని పేర్కొన్నారు. కాగా పెద్దబొంకూర్‌లో రెవెన్యూ సం బంధమైన అవకతవకలు అనేకంగా జరిగా యని, ఈ విషయమై జిల్లాకు సంబంధంలేని అధికారులతో బహిరంగ విచారణ జరిపితే అ నేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎంపీటీసీ వసంత కోరారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ భూములను భూముల్లేని పేదలకు పంచాలని ఆమె కోరారు. సుల్తాన్పూర్ పంచాయతీ కార్యదర్శి.. పెద్దపల్లిఅర్బన్: విధులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తు కలెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి డి.సంపత్ కృష్ణారెడ్డి విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం సంపత్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. -
తనను ప్రేమించట్లేదని వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇంటి యజమాని ఎడ్ల రాజు, స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ రాజిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవాపూర్‌కు చెందిన నరేందర్, అనిత దంపతుల కుమారుడైన సాయికృష్ణ(22)కు రెండేళ్ల క్రితం అతడి తాత ఉప్పలయ్యకు చెందిన వీఆర్ఏ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. వీఆర్ఏగా విధుల్లో చేరిన అతను ప్రస్తుతం ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో అతడి తల్లిదండ్రులు విడిపోగా తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సాయికృష్ణ తల్లి కరీంనగర్లో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ప్రస్తుతం సాయిక్రిష్ణ తనతో పాటు వీఆర్ఏగా పనిచేస్తున్న ఎం.వెంకటస్వామితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఉన్న కాలనీలో ఓ గదిలో ఆరునెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడ అద్దెకు ఉంటూ సెలవుల్లో కరీంనగర్‌లోని అమ్మ వద్దకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడినట్లు తెలిసింది. తరచూ ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం, సెల్లో చాట్ చేసేవాడు. గురువారం రాఖీ పౌర్ణమి పండుగ రావడంతో వెంకటస్వామి హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాడు. గదిలో ఒంటరిగా ఉన్న సాయికృష్ణ రాత్రి మద్యం ఫుల్‌బాటిల్ తెచ్చుకుని తాగాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో తన ప్రియురాలితో పాటు తల్లి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అర్థరాత్రి దాటాక అతడు గది పైకప్పుకు ఉన్న కొండికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హైదరాబాద్‌కు వెళ్లిన అతడి రూంమెట్, తోటి వీఆర్ఏ వెంకటస్వామి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఘన్‌పూర్‌కు వచ్చాడు. వారి గదికి వెళ్లేసరికి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సాయికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించగా ఇంటియజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కు టుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీఆర్ఏ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సీఐ తెలిపారు. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీఆర్ఏ మృతిపై రెవెన్యూ అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
విసిగి.. వేసారి.. వీఆర్ఏ ఆత్మహత్య
మంథని: వారసత్వం కింద రావాల్సిన ఉద్యోగం కోసం ఎనిమిదేళ్లు.. వేతనం కోసం మూడేళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వీఆర్ఏ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన గువ్వల రామక్క వారసత్వంగా వీఆర్ఏ ఉద్యోగాన్ని ఆమె మనువడు గువ్వల మహేందర్ (27)కు కేటాయిస్తూ మూడేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్ ప్రొసీడింగ్ జారీ చేశారు. అప్పటి నుంచి మహేందర్ మంథ ని తహసీల్దార్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం కోసం అతను ఎనిమిదేళ్లు కాళ్లరిగేలా తిరిగి సాధించాడు. వేతనం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఇవ్వకపోవడంతో ఓసారి పురుగుల మందు డబ్బాతో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవనం కోసం అప్పులు చేశాడు. మూడేళ్లుగా అధికారులు ఎటూ తేల్చకపోవడం.. రుణదాతల ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. -
యర్రబల్లి.. భీతిల్లి
వీఆర్ఏ ఓబులమ్మ అత్యాచారం, హత్య ఘటనతో యర్రబల్లి గ్రామం భీతిల్లుతోంది. ఏ నిమిషం ఏమి జరుగుతుందోనని కలవరపాటుకు గురవుతోంది. గురువారం పైరుకు నీరు కట్టడానికి వెళ్లిన ఓబులమ్మ కామాంధుల చేతిలో బలైన తీరు ప్రజల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. భర్త చనిపోయినా కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. విధులు నిర్వహిస్తూ.. పొలం పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన తాను కన్నీరుపెట్టించింది. సాక్షి, అట్లూరు: యర్రబల్లి వీఆర్ఏ ఓబులమ్మ (47) గురువారం పొలంలో పత్తిపైరుకు నీరు కట్టడానికి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్యగావించారు. ఒంటిపై ఉన్న నగలను సైతం దోచుకెళ్లారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నా ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం కూడా మండల నలుమూలల నుంచి ప్రజలు ఓబులమ్మ హత్యకు గురైన ఘటనా స్థలాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయింది.... ఓబులమ్మ పదిహేనేళ్ల క్రితమే భర్తను కోల్పోయింది. భర్త మృతి చెందడంతో కారుణ్యనియామకం ద్వారా ఆమెకు గ్రామ రెవెన్యూ సహాయకురాలి పోస్టు ఇచ్చారు. విధులు నిర్వహిస్తూ మరోవైపు కుమారుడిని చదివిస్తూ ఉన్న పొలంలో పంటలు పండించుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలిచింది. ఈక్రమంలో గురువారం కామాంధుల చేతిలో తన ప్రాణలు కోల్పోయింది. కాగా డాగ్‌స్క్వాడ్ వస్తుందని తెలియడంతో వందలాది మంది హత్యజరిగిన ప్రదేశానికి తరలివచ్చారు. ప్రజలను నివారించేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంతపాపానికి ఒడిగట్టిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. డీఎస్పీ ఆరా... మృతురాలి బంధువులను విచారిస్తున్న డీఎస్పీ, సీఐ మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, బద్వేలు అర్బన్‌సీఐ రమేష్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి క్లూస్‌టీమ్ ద్వారా పరిశీలించగా డాగ్‌స్క్వాడ్ హత్యజరిగిన ప్రదేశం నుంచి మృతురాలి ఇంటి పరిసరాల్లో ఆగింది. అనుమానం రావడంతో మృతురాలి బంధువులను విచారించారు. కాగా వివరాలు సేకరించుకుని అనంతరం మృతురాలి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. -
వీఆర్ఏపై అత్యాచారం, హత్య
అట్లూరు/గోకవరం (జగ్గంపేట)/అంబాజీపేట (పి.గన్నవరం)/అనంతపురం సెంట్రల్: మృగాళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల లైంగిక దాడులకు తెగబడ్డారు. ఒక మహిళా వీఆర్ఏపై ఘాతుకానికి పాల్పడి హతమార్చి.. అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికను బాధితురాలిని చేశారు. మరో రెండుచోట్ల మానసిక దివ్యాంగురాలు, మరో యువతి విధి వంచితులుగా మిగిలారు. ఈ ఘటనల్లో వీఆర్ఏ మరణించగా.. కామాంధుల అరాచకాలతో చుట్టుపక్కల వారు భీతిల్లారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం అప్పరాజుపేటలో నివాసం ఉంటున్న యర్రబల్లి వీఆర్ఏ పోలు ఓబులమ్మ (47)పై గురువారం గుర్తు తెలి యని వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టి.. అతిపాశవికంగా ప్రాణాలు తీశారు. ఆమె చెవి కమ్మలు, ముక్కు పుడక, రూ.20 వేలు దోచుకెళ్లారు. హతురాలు ఓబులమ్మ భర్త తంభళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి వీఆర్ఏగా పనిచేస్తూ మృతి చెందారు. కారుణ్య నియామకం కింద భర్త స్థానంలో ఓబులమ్మకు వీఆర్ఏగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. గురువారం ఉదయం బద్వేలుకు వెళ్లి బ్యాంకు నుంచి రూ.20 వేలు నగదు డ్రా చేసి ఓబులమ్మ 11 గంటల సమయంలో పత్తి పంటకు నీటి తడి ఇచ్చేందుకని పొలానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటలైనా ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారుడు రాము పొలంలోకి వెళ్లాడు. మోటారు పనిచేస్తూనే ఉంది. తల్లి కనిపించకపోవడంతో పత్తి పైరులో వెతకగా ఒంటిమీద నూ లు పోగు లేకుండా రక్తపు గాయాలతో మృతి చెంది ఉండటాన్ని గమనించా డు. పోలీసులకు సమాచారం అం దించగా.. ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో మండలం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చారు. ఐదేళ్ల బాలికపై దారుణం.. ఐదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలిక పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురంలోని కంబదూరు మండలం అండేపల్లికి చెందిన కరియన్న అలియాస్ కిరణ్ కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసి ఆ తర్వాత కుల సం ఘాల్లో తిరుగుతున్నాడు. ఇతని పొరుగింట్లో నాన మ్మ సంరక్షణలో ఉన్న ఐదేళ్ల బాలికపై కన్నేసిన కిరణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చిన తల్లిదండ్రులు బాలికను గమనించారు. ఏమైందోనని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగినట్టు నిర్థారించారు. అనంతరం బాలికను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. మానసిక దివ్యాంగురాలిపై దురాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరానికి చెందిన మానసిక దివ్యాంగురాలు (19)పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బుధవారం తల్లిదండ్రులు యువతిని స్థానికంగా ఉన్న ఎంపీయూపీ పాఠశాలకు పంపించి పొలానికి వెళ్లారు. పాఠశాల విడిచిపెట్టిన తరువాత 3.30 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన బొండు సుబ్బు అనే 24 యేళ్ల యువకుడు ‘మీ తల్లిదండ్రులు పొలంలో ఉన్నారని, వారి వద్దకు తీసుకువెళ’తానని నమ్మించి యువతిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువతిని ఇంటి ఆవరణలో విడిచి వెళ్లిపోయాడు. సాయంత్రం వచ్చిన తల్లికి జరిగిన విషయం విలపిస్తూ చెప్పడంతో గోకవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ విచారణ చేపట్టారు. బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నోట్లో గుడ్డలు కుక్కి.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం రాచపాలెంకు చెందిన ఒక యువతిపై అల్లవరానికి చెందిన కడలి శివ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివ ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ తాతయ్యకు చెప్పగా.. అప్పటికే శివ పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అంబాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అమలాపురం రూరల్ సీఐ ఆర్.భీమరాజు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
వీఆర్ఏపై మహిళా చెప్పుతో దాడి
సాక్షి, ఆసిఫాబాద్ : తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తమ బంధువులకు పట్టాచేశారని, తమకు న్యాయం చేయాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన మహిళా రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏపై చెప్పుతో దాడి చేసిన సంఘటన మంగళవారం కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన దుర్గం సాంబయ్య తండ్రికి సుమారు 42 ఎకరాలు భూమి ఉంది. వారసత్వంగా సాంబయ్యకు అందులో సగభాగం రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారుల అండదండలతో దుర్గం ప్రభాకర్, మల్లయ్య పట్టాలు చేయించుకున్నారని ఆరోపించింది. దీంతో తమకు న్యాయంగా రావాల్సిన భూమి తమకు అప్పగించాలని కోరుతూ సాంబయ్య కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎంతకీ తమకు న్యాయం జరగకపోవటంతో గత నెల 29న సాంబయ్య కుమారుడు దుర్గం శ్రీనివాస్ ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించాడు. దీంతో ఆర్డీవో సిడాం దత్తు వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేటికి పరిష్కారం లభించలేదు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సాంబయ్య కుటుంబ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మల్లయ్య, పోషయ్య, దుర్గం లక్ష్మి, దుర్గం జమున, దుర్గం అమృతలు వీఆర్వో ఉమ్‌లాల్‌తో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహానికిలోనైన దుర్గం లక్ష్మి వీఆర్ఏ జానయ్యపై చెప్పుతో దాడికి పాల్పడింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అకారణంగా దాడికి పాల్పడ్డారు: వీఆర్ఏ దుర్గం సాంబయ్య భూమి సమస్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అకారణంగా దుర్గం లక్ష్మి తహసీల్దార్ కార్యాలయంలోనే చెప్పుతో దాడి చేసింది. 1993లో మల్లయ్య, ప్రభాకర్‌కు పట్టాలు అయ్యాయి. నేనేమో 2008లో ఉద్యోగంలో చేరాను. నేనే పట్టాలు చేయించానని అకారణంగా నాపై దాడి చేసి అక్కడే ఉన్న వీఆర్వో ఉమ్‌లాల్‌పై సైతం దాడి చేసేందుకు ప్రయత్నించారు. -
తహసీల్దార్ లైంగిక వేధింపులు
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల తహసీల్దార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్ఏ ఒకరు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏర్గట్ల వీఆర్ఏగా పని చేస్తున్న రజిత కొన్ని రోజుల నుంచి తన భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఇది అవకాశంగా తీసుకున్న తహసీల్దార్ లక్ష్మణ్ కొన్ని రోజుల నుంచి తనతో అనైతికంగా వ్యవహరిస్తూ లోబరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని వీఆర్ఏ ఆరోపించారు. ఎన్నికల విధులను నిర్వహించే సమయంలోనూ తనతో అసభ్యకరంగా వ్యవహరించారని రజిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తోటి వీఆర్ఏలకు ఒక విధమైన విధులను అప్పగిస్తూ, తనకు మాత్రం మరో విధమైన డ్యూటీలను అప్పగిస్తు అవమానపరిచాడని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కుప్పంలో కీచకపర్వం..!
-
కుప్పంలో కీచకపర్వం..!
సాక్షి, కుప్పం: టీడీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో లైంగిక వేధింపుల ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు సీఎం పీఏ మనోహర్‌కు సన్నిహితుడైన ఓ వీఆర్ఏ.. మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్‌ను.. వీఆర్ఏ ఆనంద్ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితురాలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోగా వేధింపులు మరింత ఎక్కువవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారు కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వీఆర్ఏ ఆనంద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన సెల్‌ఫోన్‌ను దొంగతనం చేసి.. అందులోని తన ఫోటోలను మార్ఫింగ్ చేసి మరొకరితో సంబంధం ఉన్నట్లు సృష్టించాడని వాపోయింది. తాను లొంగకపోవడంతో ఆ మార్ఫింగ్ ఫొటోలను వాట్సాప్ రెవెన్యూ గ్రూప్‌లలో, సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్.. మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తిని విచారణ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దీనిపై విచారణ చేసిన కీర్తి.. శనివారం సాయంత్రం నివేదికను కలెక్టర్ ప్రద్యుమ్నకు అందజేశారు. దీని ఆధారంగా సదరు వీఆర్ఏను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్ఏ ఆనంద్‌కు ముఖ్యమంత్రి పీఏ మనోహర్ అండదండలున్నట్లు సమాచారం. గతంలో కూడా కుప్పం ఎండీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఆపరేటర్‌ను ఇలాగే వేధించినట్లు ఆరోపణలున్నాయి. కుప్పం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్థానిక టీడీపీ నాయకుల పరం చేయడమే ఆనంద్ పని అని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఒకేచోట తిష్ట వేసి అతని పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని అంటున్నారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలతో వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు
-
తహసీల్దార్కో న్యాయం.. వీఆర్ఏకో న్యాయమా?
తాడిపత్రి: భూ అవినీతికి సంబంధించి సీబీఐ చార్జ్‌షీట్‌లో పేరున్న తహసీల్దార్ ఎల్లమ్మకు ఒక న్యాయం.... వీఆర్ఏ కంబగిరికి ఒక న్యాయమా ? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైల నరసింహయ్య ప్రశ్నించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం నేతలు దళిత మహిళపై దాడి చేసిన ఆర్ఐ మల్లేష్ప్రసాద్ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పైలా నరసింహయ్య మాట్లాడుతూ గదరగుట్టపల్లిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వీఆర్ఏ కంబగిరిని విధుల్లో నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీఆర్ఏ కంబగిరిని విధుల నుండి ఎందుకు తొలగించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో యాడికి మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఎల్లమ్మ పెన్నా సిమెంటు పరిశ్రమకు కలెక్టర్ ఉత్తర్వులు లేకుండానే కొన్ని వందల ఎకరాల భూములను అక్రమంగా ధారాదత్తం చేశారన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ ఎల్లమ్మపై చార్జీషీట్ దాఖలు చేసి ముద్దాయిగా చేర్చిందని వివరించారు. సీబీఐ చార్జీషీట్లో పేరు ఉన్న తహసీల్దార్ ఎల్లమ్మ తిరిగి తాడిపత్రి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తోందని తహసీల్దార్ ఎల్లమ్మను విధుల నుండి తొలగించకపోగా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. మరోవైపు కేవలం మూడు ఎకరాల్లో సాగు చేసుకుంటున్న భూమిని తనకు ఇవ్వాలని అగ్రవర్ణాలతో పోరాటం చేస్తున్న వీఆర్ఏ కంబగిరిని విధుల నుండి తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వీఆర్ఏ కంబగిరి తప్పు చేసి ఉంటే తహసీల్దార్ ఎల్లమ్మ కూడా తప్పు చేసినట్లేనన్నారు. తాడిపత్రిలో గత 18 సంవత్సరాలుగా ఎలాంటి బదిలీలు లేకుండా అధికార పార్టీ అండదండలతో ఆర్ఐ మల్లేష్ తాడిపత్రిలోనే విధులు నిర్వహిస్తూ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. ఆర్ఐ మల్లేష్ ఆస్తులపై ఏసీబి అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళ అని చూడకుండా దళిత మహిళ లక్ష్మిదేవిని ఆర్ఐ మల్లేష్ వేధించి ఇబ్బందులకు గురిచేయడం దారుణమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత అన్నారు. దళితులకు టీడీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. దళిత మహిళ నాగలక్ష్మికి అన్ని విధాలుగా అండగా ఉండి పోరాడుతామని చెప్పారు. విధుల నుండి తొలగించిన వీఆర్ఏ కంబగిరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత నాగభూషణం హెచ్చరించారు. అనంతరం వారు డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, పట్టణాధ్యక్షుడు మనోజ్, ఎస్సీ సెల్ నాయకులు బాలరాజు, సంపత్, దూల రఘు, జీవయ్య, పుల్లయ్య, శివయ్య, కంచం రామ్మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, శిలార్వలి, ఓబుళరెడ్డి, మహిళా నాయకురాలు మావుళేశ్వరీ, లక్ష్మిదేవి, శీనా, రాజన్న, రాజగోపాల్, బాబు, వీరయ్య, దేవేంద్ర, అగ్గిరప్ప, తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏ పదోన్నతుల్లో గందరగోళం
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు వీఆర్వోలకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా గందరగోళం నెలకొంది. నిబంధనలకు పక్కన పెట్టి అనర్హులకు పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి నియామకాలే అడ్డదారిలో జరిగాయనే ఆరోపణలు ఉండగా.. అలాంటి వారికి ఇప్పుడు పదోన్నతుల్లో అవకాశం కల్పించడంతో పాటు అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ తర్వాతే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి చెబుతున్నా.. ఎంతో కాలంగా సీనియారిటీ జాబితా, పదోన్నతుల జాబితాలను తయారు చేస్తుండగా పలు తప్పులు దొర్లాయని సంఘాలు ఎత్తి చూపుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు బుధవారం 81 మంది వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తూ రూపొందించిన ఫైల్‌ను కలెక్టర్ ఆమోదించగా.. అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. పదోన్నతుల జాబితాలో 16 మంది బ్యాన్ పీరియడ్‌లో ఎంపికైన వారు ఉన్నారని వీఆర్ఎ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల సందర్భంగా కలెక్టర్‌ను సైతం కొందరు అధికారులు తప్పుదోవ పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదోన్నతుల జాబితాలో పేర్లు ఉన్న వీఆర్ఏల ఎంపిక, అర్హతలు, ఎంపికైన విధానంలో ఏ మాత్రం స్పష్టత లేదని చెబుతున్నారు. చక్రం తిప్పిన రిటైర్ట్ ఉద్యోగి వీఆర్ఏల పదోన్నతుల్లో కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఓ రిటైర్డు ఉద్యోగి చక్రం తిప్పినట్లు తెలిసింది. జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయనతో పాటు కలెక్టరేట్లో కీలక అధికారికి నమ్మిన వ్యక్తులుగా ఉన్న మరో ఇద్దరు.. పైరవీకారులకు కొమ్ము కాసి కలెక్టరేట్ ప్రతిష్టను దిగజార్చారని వీఆర్ఏ సంఘాల నాయకులు ఆరోపించారు. అప్పట్లో కావలికారులు పూర్వ కాలం నుండి గ్రామాల్లో కావలి కారులుగా చెప్పుకునే వీరు అప్పట్లో గ్రామాల్లో పట్టాదారుతో పాటు పాలేరులంతా వంతుల వారీగా విధులు నిర్వహించేవారు. రాను రాను పట్టాదారు చనిపోయిన స్థానాల్లో వారసత్వంగా వారి కుమారులు, కుమార్తెలు, భార్యకు కావలికారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇలా కాకుండా కొందరు చనిపోయిన వారి స్థానంలో అప్పటి తహసీల్దార్లను మచ్చిక చేసుకుని ఇతరులను సైతం నియమించారు. కొందరి వద్ద డబ్బులు తీసుకుని పైరవీకారులు నకిలీ ఎంపిక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణకు కొద్ది కాలం క్రితం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. బ్యాన్ పీరియడ్‌లో 96 మందికి ఉద్యోగాలు గతంలో ఉన్న కావలికారులతో పాటు జిల్లాలోని ఖాళీల ఆధారంగా 2012లో 434 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం జిల్లాలో నియమించింది. 2014లో మరోసారి 90 మంది వీఆర్ఏలను నేరుగా నియమించారు. ఫిబ్రవరి 1994 నుండి నవంబర్ 2011 వరకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదని సూచించినా అప్పటి తహసీల్దార్లు పని ఒత్తిడిని సాకుగా చెబుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో 96 మంది వీఆర్ఏలను నియమించుకున్నారు. ఆ తర్వాత 2016లో అడ్‌హక్ ప్రమోషన్ పేరుతో 30 మందికి పదోన్నతులు కల్పించారు. దీంతో మిగతా వీఆర్ఏలు కూడా ఒత్తిడి తీసుకురాగా కలెక్టరేట్ అధికారులు సీసీఎల్ఏకు నివేదిక పంపారు. అలాగే, బ్యాన్ పీరియడ్‌లో నియమితులైన వీఆర్ఏలు కోర్టులకు సైతం వెళ్లారు. కలెక్టర్‌ను కలసిన వీఆర్ఏలు వీఆర్ఏ సంఘాల నాయకులు, పలువురు వీఆర్ఏలు బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించగా ఎవరూ నష్టపోకుండా పదోన్నతులు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడిండారు. 81 మంది వీఆర్ఏలకు పదోన్నతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 81 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చాంబర్లో పదోన్నతులు పొందిన వీఆర్ఏలకు ఉత్తర్వులు ఆయన అందజేసి విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏఓ ప్రేమ్‌రాజ్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, మెప్మా పీడీ గోపాల్, వీఆర్ఏ సంఘాల నాయకులు గోవిందు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏల చేతివాటం..
చిలప్‌చెడ్(నర్సాపూర్)మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకంలో కొత్త రకం అక్రమాలు వెలుగచూశాయి. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలోని గౌతాపూర్ గ్రామంలో వీఆర్ఏలు చేతివాటం ప్రదర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న వీఆర్ఏలు రాజు, శంకరయ్య, కిరణ్ వారి పేర్లపై సుమారు నాలుగు ఎకరాల భూమిని పట్టాచేసుకున్నారు. దీంతో వారిపేర్లపై నూతనంగా పాస్‌పుస్తకాలు, చెక్కులు వచ్చాయి. దీంతో వారికి ఇక్కడ లేని భూమిపై ఏవిధంగా పాస్ బుక్కులు, చెక్కులు వస్తాయని గ్రామస్తులు సోమవారం జరిగిన చెక్కుల పంపిణీలో అధికారులను నిలదీశారు. గ్రామస్తులు మట్లాడుతూ ఈ విషయం తహసీల్దార్‌కు తెలియకుండానే జరిగందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వీఅర్‌ఏలపై తహసీల్దార్ సాదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించాగా వారు సమాధానం చెప్పకపోవడంతో వీఆర్ఏ రాజుపై చేయిచేసుకున్నాడు. అదే విధంగా మిగతా వీఅర్‌ఏలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్డీఓ వెంకటేశ్వర్లు గౌతాపూర్ గ్రామానికి వచ్చి అధికారులను ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని, ఇంత జరుగుతున్న తహసీల్దార్ ఏం చేస్తున్నారని ఆర్డీఓను ప్రశ్నించారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు వివరించారు. అలాగే ప్రజలు తీసుకున్న చెక్కులు, పాస్‌బుక్కుల్లో చాలా తప్పులున్నాయని వారు గుర్తించారు. దీంతో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో 315 వరకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాత్రి 8 గంటల వరకు ఆర్డీఓ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆ ఫిర్యాదులను పరిశీలించి ఇన్ని తప్పులుంటాయా? అన్ని వారిపై మండిపడ్డారు. త్వరలోనే గ్రామంలో జరిగిన అన్ని తప్పులుసరిచేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. -
వీఆర్ఏల వినతి వినరా..?
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2012లో ఉద్యోగాలు పొందిన దాదాపు 3 వేల మంది వీఆర్ఏలు ఉద్యోగ భద్రత లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ఆదేశించినా రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో హామీ నెరవేరడం లేదు. ఉద్యోగాలు వచ్చాయన్న మాటేగానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా తెలంగాణలో 4,100 మంది వీఆర్ఏలుగా ఉద్యోగాలు పొందారు. వీరిలో 2,500 మంది 2012లో.. 1,600 మంది 2014లో నియమితులయ్యారు. ఉద్యోగాలు వచ్చాయన్నమాటే గానీ ఇప్పటివరకు క్రమబద్ధీకరణ జరగలేదు. ప్రస్తుతం గౌరవ వేతనం కింద నెలకు రూ.10,500 పొందుతున్న వీరికి 010 పద్దు ద్వారా కాకుండా 280–286 పద్దు కింద వరద బాధితుల ఖాతాలో జీతాలు ఇస్తున్నారు. డీఏ, ప్రసూతి సెలవులూ లేకపోవడంతో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ‘రెగ్యులరైజ్’ ఫైలుకు గతేడాది ఫిబ్రవరి 24న సీఎం కేసీఆర్ మోక్షం కలిగించారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వీఆర్ఏలను టీఎస్పీఎస్సీ ద్వారా ఇతర శాఖల్లో విలీనం చేయాలని ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్, అటెండర్ పోస్టుల్లో వీరిని నియమించాలని, ఖాళీల వివరాల ప్రకారం 6 నెలల్లో నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వివరాలున్నా పంపడం లేదు చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేయలేక ఐదారేళ్లలో 1,000 మంది వరకు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, కొందరు ఎలాంటి ప్రయోజనాలు పొందలేక మరణించారని వీఆర్ఏలు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల వివరాలు టీఎస్పీఎస్సీకి ఇచ్చి రోస్టర్ పద్ధతిలో ఇతర శాఖల్లో విలీనం చేయాల్సిన సీసీఎల్ఏ అధికారులు ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలే చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలోని వీఆర్ఏల వివరాలు సేకరించిన సీసీఎల్ఏ.. ఆ వివరాలు టీఎస్పీఎస్సీకి పంపడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సీఎం ఆదేశాలను త్వరగా అమలు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాయి. ఈ సమావేశాల్లోనే తేల్చాలి ‘డైరెక్ట్ రిక్రూటీలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను గతేడాది ఫిబ్రవరిలో సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటికీ తేల్చలేదు. రాష్ట్రంలో వీఆర్ఏల సమాచారం కావాలం టూ కాలయాపన చేస్తున్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఉద్యోగాలు వదిలి వెళ్తున్న వారు పెరుగుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మా విషయం తేల్చాలి’ – వి.ఈశ్వర్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
జనగామ అర్బన్: మేనకోడలు వివాహ వేడుకకు వచ్చిన ఓ వీఆర్ఏ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట శివారు తూర్పుగుడెం వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న ఝెండ్రు కృçష్ణ(40) జనగామలోని తన మేనకోడలు వివాహానికి కూతురు సోనితో కలిసి హాజరయ్యాడు. పెళ్లి ముగిశాక పెళ్లింటికి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. జనగామ రైల్వే బిడ్జిపై సిద్ధిపేట వైపునకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎక్స్ఎల్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కృష్ణ తలకు తీవ్రగాయాలు కాగా కూతురు సోనికి సైతం గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా కృష్ణ మార్గమధ్యలో మృతిచెందాడు. సోని ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. కాగా వీఆర్ఏ కృష్ణ భార్య యాదలక్ష్మి, కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మృతిచెందారని బంధువులు తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న జనగామ ఎస్సై శ్రీనివాస్ వివరాలు తెలుసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెండ్లివారు ఆస్పత్రికి చేరుకొని చేసిన రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన బస్సు ఫ్లైఓవర్ బిడ్జిపై మరో ప్రమాదం.. జనగామ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు తృటిలో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లికి చెందిన బైరిగి రాము, అదే జిల్లా బస్వాపురానికి చెందిన గుండెగళ్ల నర్సింహులు బైక్‌పై జనగామ నుంచి సిద్ధిపేట వైపు వెళ్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్‌ను తాకి ఆగిపోయింది. ఈ ఘటనలో రాము, నర్సింహులకు గాయాలుకాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఈ సంఘటనలో బైక్ ధ్వంసం కాగా, కొద్దితేడాతో బొలెరో వాహనం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు వీఆర్ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్ఏలపై నివాస్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
సందేహాలెన్నో!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సాయిలు మృతి సంఘటనపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు హత్యగా పేర్కొంటుండగా.. అధికారులేమో ప్రమాదమంటున్నారు. సాయిలు మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి పలు వివరాలు సేకరించింది. అసలేం జరిగింది.. పిట్లం మండలం కారేగాం గ్రామ శివారులోని కాకివాగు సమీపంలో రోడ్డుపై గురువారం ఉదయం సాయిలు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. సాయిలు తలకు గాయమై ఉండడంతో ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు అనుమానించారు. సంఘటన స్థలంలో ట్రాక్టర్ తిరిగిన ఆనవాళ్లు, సమీపంలో ఇసుక కనిపించడంతో సాయిలును ఇసుక మాఫియా హతమార్చిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సాయిలు బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎర్ర అంబయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్‌ను నిలదీయగా.. తన ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే సాయిలు చనిపోయాడని పేర్కొన్నాడు. దీంతో గ్రామస్తులు అంబయ్యను చితకబాదారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి బంధువులను సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నర్సింహారావు తదితరులు శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కామారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సాయిలుది హత్య కాదని, ప్రమాదవశాత్తూ చనిపోయాడని ప్రకటించారు. పొంతనేదీ? సాయిలు వీఆర్ఏ కాదని, సాయిలు చిన్నాయన నారాయణ వీఆర్ఏగా పనిచేస్తున్నాడని అది కూడా మార్తాండ గ్రామంలోనని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అయితే గ్రామాల్లో వంతులవారీ పద్ధతిన వీఆర్ఏలు పనిచేసే ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీ ప్రకారం నారాయణ పేరుపై సాయిలు వీఆర్ఏగా పనిచేస్తున్నాడని, చనిపోయిన రోజు కూడా పిట్లంలో రెవెన్యూ రికార్డులు రాయడానికి సాయిలు వెళ్లాడని అతడి భార్య సాయవ్వ, తండ్రి శివయ్య పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి కూడా నైట్ డ్యూటీ కోసం పిట్లం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడంటున్నారు. ఇటుక లోడ్ దింపి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్.. రోడ్డుపై పడి ఉన్న సాయిలును గమనించలేదని, దీంతో అతడి తలకు టైర్ తగిలి మరణించాడని విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపారు. రోడ్డున వెళ్తున్న సాయిలు చొక్కా జేబుకు వీఆర్ఏ బిల్ల(గుర్తింపు బిల్ల) కనిపించడంతో అడ్డుకుంటాడని భావించి ఇసుక తరలిస్తున్నవాళ్లే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాకి వాగు ఇసుక రీచ్ కాదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాయిలు చనిపోయిన తరువాత వచ్చిన రెండో ట్రాక్ట ర్ ఇసుక లోడ్‌తో ఉందని అధికారులే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కాకివాగు ఇసుక రీచ్ కానపుడు రాత్రి వేళలో ఇసుకలోడుతో ట్రాక్టర్ ఎందుకు వెళ్తోందనేది ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డున పడ్డ కుటుంబం... సాయిలుకు పెద్దగా వ్యవసాయ భూమి లేదు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామ సేవకుడి (వీఆర్ఏ) ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు పిల్లలను పోశించేవాడు. ఆరు నెలల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిపించడానికి గ్రామస్తులు తెలిపారు. సాయిలు మరణంతో భార్య, ఒక కూతురు, ఒక కుమారుడితోపాటు వృద్ధులైన తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కారేగాం ఘటనపై పీసీసీ చీఫ్ ఆరా కారేగాంలో వీఆర్ఏ సాయిలు మరణంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌కు ఫోన్ చేసి సంఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొనడంతో ఆయన శుక్రవారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది బాన్సువాడ డివిజన్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆరోపించారు. శుక్రవారం కారేగాం గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక దందా నడుస్తోందన్నారు. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రకృతిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. సాయిలు కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని కారేగాం వీఆర్ఏ మృతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/పిట్లం (జుక్కల్): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం గ్రామ వీఆర్ఏ బోయిని సాయిలు (36) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదే గ్రామానికి చెందిన బ్యాగరి అంబయ్య ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే సాయిలును ఇసుక మాఫియానే హత్య చేసిందని, అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు, కారేగాం, మార్ధండ గ్రామస్తులు ఆరోపించారు. సాయిలు మృతి విషయం తెలిసి వారంతా గురువారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న వీఆర్ఏ సాయిలు.. అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని, దాంతో హత్య చేశారన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించబోమంటూ రోడ్డుపై బైఠాయించారు. ఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ అంబయ్యపై దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. సాయిలు భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సాయిలు ప్రమాదవశాత్తు మృతి చెందారని, అది హత్య కాదని ప్రాథమిక విచారణలో తేలిందని బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ అంబయ్య కారేగాం నుంచి ఇటుక లోడ్ తీసుకుని సంగారెడ్డి జిల్లా దామరగిద్దకు వెళ్లాడని చెప్పారు. తిరిగి వస్తుండగా గ్రామ శివార్లలో ప్రమాదం జరిగిందని, సాయిలుపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని వెల్లడించారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
జైనథ్ : వీఆర్ఏలకు వేతనాలను పెంచడాన్ని హర్షిస్తూ సోమవారం మండల కేంద్రంలోని తహాసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే హుస్సేన్, రమణలు మాట్లాడుతూ తాము ఏండ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి, తమ వేతనాలను పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీఆర్ఏలంతా కలిసి తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఎన్ ఫోర్స్మెంట్ డీటీ వనజారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. -
వేతనాల పెంపుపై వీఆర్ఏల సంఘం హర్షం
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలోని వీఆర్ఏల వేతనాలు పెంచడం అభినందనీయమని తెలంగాణ వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్కుడు ముత్యాలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మరువలేనిదన్నారు. ఇన్నాళ్లుగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీఆర్ఏలకు రూ.10,500కు పెంచడం శుభపరిణామమన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషించదగిన విషయమన్నారు. గత ప్రభుత్వాల హయాలంలో నియామకమైన వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. వారసత్వ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. విధుల్లో మరింత శ్రద్ధగా భాగస్వాములమవుతూ ప్రభుత్వాన్ని అగ్రభాగంలో నడిపేందుకు పాటుపడతామన్నారు. -
పోలీస్ జులుం నశించాలంటూ వీఆర్ఏల నిరసన
రాయచోటి : పోలీస్ జులుం నశించాలంటూ మంగళవారం రాయచోటి మండలంలోని వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి తగాదా విషయంలో అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకొని, తమపై దాడి చేస్తున్నారంటూ వాపోయారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి దూషిస్తున్నారని, దీన్ని వ్యతిరేకించి వాస్తవాలు మాట్లాడుతుంటే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు డిమాండ్ చేశారు. నిరసనలో వీఆర్ఏలు రామమోహన్, శ్రీనివాసులు, వెంకటేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోరుబాటలో వీఆర్ఏలు
–నేటి నుంచి జిల్లావ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు –డిమాండ్ల సాధనకు ఉద్యమబాట దెందులూరు : జిల్లా వ్యాప్తంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు(వీఆర్ఏ) పోరుబాటకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధనకు గురువారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సొంత రెవెన్యూశాఖతో పాటు అదనపు శాఖల విధులు సైతం నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం తమను నిర్లక్ష్యంగా చూస్తోందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెలకు రూ.6,500 జీతంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కనీస వేతనం రూ.18 వేలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగనున్నారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా వీఆర్ఏల అసోసియేషన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని48 మండలాల్లో 3 వేల మంది వీఆర్ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గురువారం మండల కార్యాలయాల ఎదుట, 24న ఆర్డీవో కార్యాలయాల ఎదుట, 31న కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యూనియన్ పిలుపునిచ్చింది. డిమాండ్లు నెరవేర్చాలి ప్రభుత్వం వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించాలి. నెలకు రూ.18 వేల జీతం చెల్లించాలి. పెన్షన్ సౌకర్యం, వారసత్వపు హక్కు, బీమా సదుపాయం లక్ష రూపాయలకు పెంచడం తదితర డిమాండ్లు నెరవేర్చాలి. తక్షణం ప్రభుత్వం స్పందించి కమిటీ నియమించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. –ఎ.జాన్, వీఆర్ఏల అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ ప్రభుత్వం స్పందించాలి వీఆర్ఏల న్యాయ పరమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. వేతనాలు పెంచి వేలాది మంది వీఆర్ఏల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి. –నరసింహరావు, మండల అధ్యక్షుడు వీఆర్ఏల అసోసియేషన్, దెందులూరు -
బైక్ ఢీకొని వీఆర్ఏ దుర్మరణం
– వీరంకిలాకులో ఘటన పమిడిముక్కల: వీరంకిలాకు సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ సిద్దెల సుబ్బారావు (54)కు తీవ్ర గాయాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సెంటర్లో రోడ్డుపై నడిచి వెళుతున్న సుబ్బారావును బండ్రపల్లి నాగేంద్రరావు అనే వ్యవసాయ కూలీ బైక్‌తో డీకొనడంతో తీవ్ర గాయాలైనాయి. సమాచారమందిన వెంటనే తహసీల్దార్ విక్టర్‌బాబు, వీఆర్వో చంటిబాబులు సంఘటనాస్థలికి వెళ్లారు. అపస్మారకంలో ఉన్న సుబ్బారావును పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 108 అంబులెన్సు ఆలస్యం 108 అంబులెన్సుకు సమాచారమందించగా వారు గంట వరకు రాకపోవడంతో కారులో విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. పైడికొండలపాలెంకు చెందిన సుబ్బారావుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. సుబ్బారావు మృతిపట్ల తహశీల్దార్ విక్టర్‌బాబు, వీఆర్వో చంటిబాబు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. నాగేంద్రరావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
వీఆర్ఏల వేతనాలకు రూ.49 కోట్లు
జగిత్యాల రూరల్: తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏల రెండో త్రై మాసిక పెండింగ్ వేతనాల కోసం రూ.49.93 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్‌కు భూమి శిస్తు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వీఆర్ఏల కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.శివశంకర్ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రికి, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.