విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో గ్రామస్థాయి పోస్టులైన వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల ను భర్తీ చేయకపోవడంతో ఈ పోస్టులకు పోటీ పెరిగింది. గ్రూప్-1కు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేశారు. దీంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 90 వీఆర్వో, 137 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే.
వీటికి సంబంధించి దరఖాస్తు చేసుకునే గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ రెండు పోస్టులకు కలిపి 45,581 దరఖాస్తులు వచ్చాయి. వీఆర్వోలు 90 పోస్టులకు సంబంధించి 43,575, వీఆర్‌ఏ 137కు 1,362 దరఖాస్తులు రాగా, ఈ రెండింటికీ 644 మంది దరఖాస్తు చేశారు. ఒక వీఆర్వో పోస్టుకు 513 మంది చొ ప్పున పోటీపడుతున్నారంటే జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఫిబ్రవరి 2న రాతపరీక్ష ఉంటుంది. ఉదయం వీఆర్‌ఓ, మధ్యాహ్నం వీ ఆర్‌ఏ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈనెల 19 నుంచి హాల్‌టిక్కెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ 4న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తుది ఫలితాలు ఫిబ్రవరి 20న ప్రకటిస్తారు. 26 నుంచి ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన, నియామక పత్రాలు అందజేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు ప్రకటించారు.
186 కేంద్రాల గుర్తింపు :
ఈ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న 186 కళాశాలలను, పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో విజయనగరం డివిజన్‌లో 118, పార్వతీపురం డివిజన్‌లో 68 ఉన్నాయి. కేంద్రాల వివరాలతో పాటు ఏ సెంటర్‌లో ఎంతమంది పరీక్షలు రాయడానికి అవకాశముంటుందన్న విషయాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
కేంద్రాలు ఖరారు చేసే విషయంలో ఉన్నతాధికారులదే తుది నిర్ణయం. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి కావడంతో వాటిని పరిశీలన చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వాటిలో లోపాలను గుర్తించనున్నారు. ప్రధానంగా ఫొటో, దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉన్నాయో లేవో గుర్తిస్తారు. అలా లేని వాటిని చూసి అభ్యర్థులను పరీక్షకు హాజరయ్యే సమయంలో ఏవిధంగా రావాలన్న విషయంపై సంబంధిత హాల్ టిక్కెట్‌పై సూచిస్తారు.
పల్లె పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
Published Tue, Jan 14 2014 1:24 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement