గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పోస్టులకు సంబంధించి దరఖాస్తు రుసుమును తగ్గించామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పోస్టులకు సంబంధించి దరఖాస్తు రుసుమును తగ్గించామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతంలో ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు రుసుం ఓసీ, బీసీలకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300గా నిర్ణయించాం. నిరుద్యోగ యువతకు భారం కారాదనే ఉద్దేశంతో రుసుమును ఓసీలు, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150కి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆయా జిల్లాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు’ అని మంత్రి తెలిపారు. కాగా, వచ్చేనెల రెండో తేదీలోగా ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.