హత్య జరిగిన ప్రదేశానికి తరలివచ్చిన జనం
వీఆర్‌ఏ ఓబులమ్మ అత్యాచారం, హత్య ఘటనతో యర్రబల్లి గ్రామం భీతిల్లుతోంది. ఏ నిమిషం ఏమి జరుగుతుందోనని కలవరపాటుకు గురవుతోంది. గురువారం పైరుకు నీరు కట్టడానికి వెళ్లిన ఓబులమ్మ కామాంధుల చేతిలో బలైన తీరు ప్రజల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. భర్త చనిపోయినా కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. విధులు నిర్వహిస్తూ.. పొలం పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన తాను కన్నీరుపెట్టించింది.
సాక్షి, అట్లూరు: యర్రబల్లి వీఆర్‌ఏ ఓబులమ్మ (47) గురువారం పొలంలో పత్తిపైరుకు నీరు కట్టడానికి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్యగావించారు. ఒంటిపై ఉన్న నగలను సైతం దోచుకెళ్లారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నా ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం కూడా మండల నలుమూలల నుంచి ప్రజలు ఓబులమ్మ హత్యకు గురైన ఘటనా స్థలాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.
15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయింది....
ఓబులమ్మ పదిహేనేళ్ల క్రితమే భర్తను కోల్పోయింది. భర్త మృతి చెందడంతో కారుణ్యనియామకం ద్వారా ఆమెకు గ్రామ రెవెన్యూ సహాయకురాలి పోస్టు ఇచ్చారు. విధులు నిర్వహిస్తూ మరోవైపు కుమారుడిని చదివిస్తూ ఉన్న పొలంలో పంటలు పండించుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలిచింది. ఈక్రమంలో గురువారం కామాంధుల చేతిలో తన ప్రాణలు కోల్పోయింది. కాగా డాగ్‌స్క్వాడ్ వస్తుందని తెలియడంతో వందలాది మంది హత్యజరిగిన ప్రదేశానికి తరలివచ్చారు. ప్రజలను నివారించేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంతపాపానికి ఒడిగట్టిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
డీఎస్పీ ఆరా...
మృతురాలి బంధువులను విచారిస్తున్న డీఎస్పీ, సీఐ
మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, బద్వేలు అర్బన్‌సీఐ రమేష్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి క్లూస్‌టీమ్ ద్వారా పరిశీలించగా డాగ్‌స్క్వాడ్ హత్యజరిగిన ప్రదేశం నుంచి మృతురాలి ఇంటి పరిసరాల్లో ఆగింది. అనుమానం రావడంతో మృతురాలి బంధువులను విచారించారు. కాగా వివరాలు సేకరించుకుని అనంతరం మృతురాలి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment