జగిత్యాల జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కారు కడిగే పనిలో వీఆర్‌ఏ
► వీఆర్‌ఏ ఏం చేయాలి..?: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామంలో రెవెన్యూ సంబంధ వ్యవహారాలు చూసే ఉద్యోగి. ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేయాలి. అధికారిక వ్యవహారాల్లో పైఅధికారులకు సహకరించాలి.
► మరి ఇప్పుడేం చేస్తున్నారు?: పైఅధికారుల ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, కూరగాయలు తేవడం, వంట చేయడం, అధికారి సొంత కారుకు డ్రైవర్‌గా పనిచేయడం.. ఇలాంటి పనులెన్నో చేస్తూ అనధికారిక ‘పాలేర్లు’గా మారిపోయారు.
► ఎందుకీ సమస్య?: రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వీఆర్‌ఏలకు సర్వీస్‌రూల్స్ రూపొందించకపోవడంతో.. జిల్లా కలెక్టర్లు మొదలుకొని డిప్యూటీ తహసీల్దార్ల దాకా వీఆర్‌ఏలను సొంత పనులకు వాడుకుంటూ.. కొత్త ‘ఆర్డర్లీ’వ్యవస్థకు తెరతీసిన తీరు వివాదస్పదంగా మారింది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్‌ఏలున్నారు. కొత్త రెవెన్యూ చట్టం–2020 ప్రకారం వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ గ్రామాల్లో వీఆర్‌ఏల(గ్రామ రెవెన్యూ సహాయకుల)ను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో వారు గ్రామాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల రక్షణ, పంటల విస్తీర్ణం వివరాల సేకరణ, కోర్టు సమన్లను అందచేయటం, పంచనామాల నిర్వహణ వంటి పనులు చేసేవారు.
ప్రస్తుతం వారికి కొత్త విధులు అప్పగించకపోవటం, వారి డ్యూటీ ఏమిటనేది తేల్చకపోవడంతో.. అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో అన్నిపనులకు వినియోగిస్తున్నారు. స్వీపర్లు మొదలుకుని డ్రైవర్లు, వంట మనుషులు, నైట్ వాచ్‌మన్ల దాకా పని చేయించుకుంటున్నారు. వాస్తవానికి అర్హతల మేరకు వీఆర్‌ఏలను ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు 2017 ఫిబ్రవరి 24న ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు.
కాదంటే భయం.. చేయలేక ఆగమాగం..: వీఆర్‌ఏలకు చాలా కాలంగా సర్వీస్ రూల్స్ అంటూ లేకపోవటంతో పైఅధికారులు ఏది చెప్తే అది చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మరీ ఇంట్లో పనిమనుషులుగా కూడా వాడుకుంటున్నారు. చేయబోమని ఎవరైనా అంటే.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్లకు సరెండెర్ చేయడం వంటి కక్షసాధింపు చర్యలకు కొందరు అధికారులు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెప్పిన పనులు చేయలేక ఓ వైపు.. కాదంటే ఏ ఇబ్బంది ఎదురవుతుందోననే ఆందోళనతో మరోవైపు వీఆర్‌ఏలు మానసిక క్షోభకు గురవుతున్నారు.
పోటీ పరీక్షలో గెలిచి వచ్చినా..
ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్‌ఏలలో 2,900 మంది రాతపరీక్ష ద్వారా నేరుగా ఎంపికయ్యారు. మిగతా వారు వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారు. వారికి ప్రతినెలా రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి, పోటీపరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు కూడా ఇప్పుడు అధికారుల ఇళ్లలో పనిచేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తగిన విధులు అప్పగించడంగానీ, ఇతర శాఖల్లో విలీనం చేయడంగానీ చేస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా డ్యూటీ చార్ట్, సర్వీసు రూల్స్ ప్రకటించాలని కోరుతున్నారు.
టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా..
ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంలో వీఆర్‌ఏలకు టెన్నిస్ కోర్టు బాల్ బాయ్స్‌గా డ్యూటీలు వేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రతిరోజు సాయంత్రం లాన్ టెన్నిస్ ఆడే సమయంలో.. అటూఇటూ వెళ్లిపోయిన బంతులను తెచ్చి ఇచ్చేందుకు రోజుకు ముగ్గురి చొప్పున వారానికి ఇరవై ఒక్క మంది వీఆర్‌ఏలకు అధికారికంగా డ్యూటీలు వేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
చస్తూ బతుకుతున్నం
ఎంకాం చదువుకుని, డీఎస్సీ ద్వారా పోటీ పరీక్ష రాసి వీఆర్‌ఏగా ఎంపికయ్యా. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ పని చెబితే ఆ పని చేయాల్సి ఉంటుంది.ఉన్నత చదువులు చదివిన వారంతా ఈ ఉద్యోగాన్ని ఎంచుకుని చస్తూ బతుకుతున్నరు. సర్వీస్ రూల్స్ కోసం ఎదురు చూస్తున్నం.
– ఎ.వెంకటేశ్‌యాదవ్, వీఆర్‌ఏ, జిన్నారం
బానిసల కంటే అధ్వానం
మాకు రెవెన్యూ విధులు మినహా ఇతర పనులేవీ చెప్పొద్దని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు (ఏ2–1635–2012) ఉన్నా వాటిని ఎవరూ పాటించడం లేదు. ఉన్నత ఆశయంతో పోటీపరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన మాకు.. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఆడ, మగ తేడా లేకుండా అధికారులు అప్పగించిన పనులన్నీ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బానిస కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి.
– రమేశ్‌బహదూర్, వీఆర్‌ఏ, తిమ్మాజిపేట
పనిఒత్తిడి, ఇతర సమస్యలకు బలి..
– మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో నైట్ వాచ్‌మన్ డ్యూటీలో ఉన్న వీఆర్‌ఏ దుర్గం బాపురావు హత్యకు గురయ్యాడు.
– యాదాద్రి జిల్లా పులిగిల్లలో నైట్ డ్యూటీకి వెళుతూ వీఆర్‌ఏలు పల్లెర్ల పురుషోత్తం, ఈదుల కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
– నిజామాబాద్ జిల్లా ఖండిగావ్‌లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గౌతమ్ హత్యకు గురయ్యాడు.
– మాచారెడ్డి, ఘనపూర్ తహసీల్దార్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ చల్లా రమేష్ పనిఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు.
– నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో పనిఒత్తిడితో హర్షవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment