గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ) పోస్టు లు ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగారు.
రంగంలోకి దిగిన దళారులు
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ అభ్యర్థులను
ప్రలోభపెడుతూ..
మోర్తాడ్, న్యూస్‌లైన్ :
గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ) పోస్టు లు ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నాయకుల కనుసన్న ల్లో నియామకాలు జరుగుతాయని, పోస్టు ఇప్పిస్తామని అభ్యర్థులను నమ్మిస్తూ అంది నకాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 65 వీఆర్‌ఓ, 94 వీఆర్‌ఏ పోస్టుల భర్తీ కోసం ఈనెల రెండో తేదీన రాత పరీక్ష నిర్వహించారు. వీఆర్‌ఓ పోస్టులకు 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది పరీక్ష రాశారు. వీఆర్‌ఏ పోస్టులకు 2,823 మంది దరఖాస్తు చేసుకోగా 2,518 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు ఇంకా వెలువడలేదు. పోస్టులు తక్కువగా ఉండడం, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో దళారులు రంగ ప్రవేశం చేశారు. రూ. 3 లక్షలు ఇస్తే వీఆర్‌ఓ, లక్ష రూపాయలు ఇస్తే వీఆర్‌ఏ పోస్టు ఇప్పిస్తామని అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారు. అధికార పార్టీ నాయకులతో మాట్లాడతామని, వారు చెప్పినవారికి పోస్టు లు ఇస్తారని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పోస్టుల భర్తీలో దళారుల ప్రమేయం ఏమీ ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవాళ్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.