వీఆర్వో, వీఆర్‌ఏలకు అందని గౌరవ వేతనాలు
హైదరాబాద్: గ్రామాల్లో పాలనకు కళ్లు, చెవులైన వీఆర్వోలు, వీఆర్‌ఏలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి రోజు కూడా పస్తులు ఉంచుతోంది. ఏకంగా 32 వేల మంది వీఆర్వోలు, వీఆర్‌ఏలకు డిసెంబర్ నెల గౌరవ వేతనాలు చెల్లించలేదు. వీరికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువగానే ఉంటుంది. వీరి గురించి రెవెన్యూ, ఆర్థిక శాఖలు పట్టించుకోవటం లేదు. వీరికి వేతనాలు రాకపోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయం ఓ కారణం కాగా ప్రస్తుతం నాల్గో త్రైమాసిక నిధుల విడుదలను నిలుపుదల చేయడం మరో కారణం.
ఆర్థికశాఖకు అందని ప్రతిపాదనలు: వీఆర్వోలకు నెలకు రూ.13 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీఆర్‌ఏలకు నెలకు రూ.3,000 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో వీరికి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను చెల్లించారు. అయితే వీఆర్వోలు, వీఆర్ ఏలు రెగ్యులర్ ఉద్యోగులు కానందున వారికి 010 పద్దు నుంచి వేతనాలు ఇవ్వరాదంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. 010 పద్దు నుంచి వేతనాలు రద్దు చేయడంతో డిసెంబర్ నెల వేతనం జనవరి 1వ తేదీన అందలేదు. రెవెన్యూ శాఖకు కేటాయించిన 284 పద్దు నుంచి వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసిక నిధులపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది.
గత మూడు త్రైమాసికాలకు చెందిన నిధుల వ్యయం ఆధారంగానే నాల్గో త్రైమాసిక నిధుల విడుదల విషయాన్ని ఆర్థికశాఖ నిర్ధారిస్తుంది. నిధుల విడుదలకు సీసీఎల్‌ఏ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంటుంది. జనవరి నెల సగం కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రతిపాదనలు వెళ్లలేదు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులను వివరణ కోరగా నిధులు విడుదల కోసం సంబంధిత శాఖ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని, వస్తే పరిశీలిస్తామని తెలిపారు.
32,000 కుటుంబాలకు పస్తులే
Published Wed, Jan 14 2015 1:47 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement