కలెక్టరేట్ ముట్టడించిన వీఆర్‌ఏలు | Collective Besieging VRAs | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ముట్టడించిన వీఆర్‌ఏలు

Published Wed, Jan 22 2014 3:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Collective Besieging VRAs

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌ను వీఆర్‌ఏలు ముట్టడించారు. కలెక్టరేట్ వద్ద మూడు రోజుల నుంచి వారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వీఆర్‌ఏలు భారీ ర్యాలీగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంవద్ద ఉద్యోగులను లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.వేతనం రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.  ముట్టడి నిలిపివేయాలని వీఆర్‌ఏలకు అక్కడ ఉన్న ఒకటో పట్టణ ఎస్సై, ఆర్మ్‌డ్ పోలీసులు కోరారు. దీనికి అంగీకరించకుండా ఆందోళన కొనసాగించడంతో  పోలీసులకు, వీఆర్‌ఏలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో 53 మంది వీఆర్‌ఏలకు పోలీసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
  అనంతరం వారిని పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకుముందు   వీఆర్‌ఏల నిరాహారదీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గోవిందరావు  సందర్శించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ, వీఆర్‌ఏల జీతం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం వీఆర్‌ఏల జీతాలు పెంచుతూ 77 జీవోను విడుదల చేయడంతో వీఆర్‌ఏలు నిరాహార దీక్షలు విరమించారు. 
 
 ఆర్డీవో కార్యాలయం ముట్టడి - 23 మంది వీఆర్‌ఏల అరెస్టు
 పాలకొండ రూరల్: పాలకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన ముట్టడి, ధర్నా ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కార్యాలయం వెలుపల గేటుకు తాళాలు వేసి ఉద్యోగులను అడ్డుకొని వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని, పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని  నినాదాలు చేశారు. ఎప్పటికీ అక్కడ నుంచి కదలకపోవడంతో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, వీఆర్‌ఏల సంఘ నేత జామి దుర్గారావు, బత్తిన రామయ్య, బి.రాజు, బి.రాము తదితర 23 మందిని అరెస్టు చేశారు. కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు.  తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని వీఆర్‌ఏలు స్పష్టం చేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement