ఇంకా 48 గంటలే..
Published Fri, Jan 31 2014 1:43 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
వీఆర్‌ఓ పరీక్ష:
ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.
వీఆర్‌ఏ పరీక్ష:
మధ్యాహ్నం 3నుంచి 5 గంటల వరకు.
వీఆర్‌ఓ పోస్టులు 77, దరఖాస్తుదారులు 50,730
వీఆర్‌ఏ పోస్టులు 176, దరఖాస్తుదారులు 2,630
పరీక్ష కేంద్రాలు: 148
వీఆర్‌ఏ, వీఆర్వో పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం దరఖాస్తుల సంఖ్యను చూసి ఆందోళన వద్దు:నిపుణలు
ఒత్తిడిని దూరం చేసుకోవాలి
అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి బాగా చదివేందుకు ప్రయత్నిస్తారు. అలా చేస్తే మెదడుపై ఒత్తిడి తీవ్రం అవుతుంది. మరుసటి రోజు పరీక్ష సక్రమంగా రాయలేరు. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం చదవాలి. ఒత్తిడిని అధిగమించాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు తాను బాగా రాస్తాననే ఆశావాహ దృక్పథంతో ఉండాలి. పరీక్ష కేంద్రంలో కేటాయించిన స్థానంలో కూర్చున్న తరువాత రెండు నిమిషాలు రిలాక్సు కావాలి. పరీక్ష పూర్తయ్యే వరకూ టీవీ చూడటం, చాటింగ్‌లు, సినిమా, షికార్లు మానుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉంటూ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఏకాగ్రతను పెంపొందించుటకు ధ్యానం చేయడం మంచిది.
కరెంటు కొత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి.
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు ఇంకా 48 గంటలే సమయం ఉంది. ఫిబ్రవరి రెండో తేదీన జరగనున్న పరీక్ష కోసం నిరుద్యోగలు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. పోటీ కూడా తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్‌ఓ పోస్టులు 77 ఉండగా 50,730 మంది, వీఆర్‌ఏ పోస్టులు 176 ఉండగా 2,630 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష కోసం జిల్లా వాప్తంగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో 148 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను చూసి ఆందోళన చెందవద్దని వైద్య, విద్యా నిపుణులు సూచిస్తున్నారు. సంఖ్యాపరంగా అధిక పోటీ ఉన్నా పరీక్షలకు నిబద్ధతతో సిద్ధమయ్యే వారు 50 శాతానికి మించరంటున్నారు. పరీక్షకు కేవలం శుక్ర, శనివారాలే సమయం ఉంది. ఈ రెండు రోజులు పక్కా ప్రణాళికతో..సిలబస్ ప్రకారం చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటే విజయం మీదే. పోటీ పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులు ఈ కింది విషయాలను కచ్చితంగా పాటించాలి. - న్యూస్‌లైన్, నరసన్నపేట రూరల్
తప్పనిసరిగా పాటించాల్సినవి..
ఒక రోజు ముందుగానే నెట్‌లో హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోని ఏవైనా పొరపాట్లు జరిగాయాని సరి చూసుకోవాలి. ఫొటో సరిగా ఉందోలేదో గమనించాలి. సరిగా కన్పించకపోతే దానిపై ఒక ఫొటో అతికించి గజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి.
రెండు బాల్‌పెన్నులు, ప్యాడ్ వెంట తీసుకెళ్లాలి. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంది, అక్కడకి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. దూరప్రాంతాల్లో ఉంటే ఆ రూట్ బస్సులు ఏ సమయానికి ఉన్నాయి, చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని సమయపాలన పాటించాలి.
పరీక్షకు చాలా మంది హజరువుతున్న దృష్ట్యా ముందుగానే వెళ్లాలి. సమయానికి బస్సు, ఆటో దొరకపోతే ఇబ్బంది పడతారు.
ఇప్పటి వరకూ ఓఎంఆర్ పత్రంలో సమాధానం రాయని వారు ఉండొచ్చు. వారు నమూనా పత్రాన్ని పరిశీలించాలి.
తెలుగు, ఆంగ్లం,ఉర్దూ మాద్యమాల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఇప్పటి వరకూ ఆంగ్ల మాద్యం చదవిన వారు ఆంగ్లం ప్రశ్నలనే చదివి సమాధానాలు గుర్తించాలి. తెలుగు వచ్చు కదా అని కొందరు తెలుగు మాద్యమాల్లో ఉన్న ప్రశ్నలను చదువుతారు. దీంతో పరీక్షల్లో కీలకమైన సమయం వృథా అవుతుంది. అర్థంకాని గందరగోళంగా ఉన్నప్పుడే మరో భాషలోని ప్రశ్నలను చదవటం మంచిది. ఒక్కోసారి తెలుగు అనువాదంలో తేడా కన్పిస్తే ఆంగ్ల వాక్యాన్ని చదవడం అవసరం.
పొరపాట్లు జరిగితే అంతే...
ఓఎంఆర్ షీట్‌లో బాల్‌పెన్‌తో బబ్లింగ్ (వృత్తంలో ఉన్న నంబరుతో దిద్దటం)చేయాల్సి ఉంటుంది.ఒక్కో అభ్యర్థికి ఒక్కో ఓఎంఆర్ షీట్ మాత్రమే ఇస్తారు. హల్‌టిక్కెట్ నంబరు చూసుకొని వృత్తంలో గళ్లపై బబ్లింగ్ చేయాలి. మిగిలిన వాటిని ఖాళీగా ఉంచాలి. ఒకే వరుసలో ఉన్న నంబర్లు బబ్లింగ్ చేస్తే ఆ షీట్ చెల్లదు. ఒక గడిలో ఒక అంకెకు మాత్రమే బబ్లింగ్ చేయాలి.
కచ్చితంగా తెలియని ప్రశ్నలకు చాలా మంది ఓఎంఆర్ పత్రంలో కొంత సందేహంతో చుక్కలు పెడతారు. తర్వాత ఆలోచించుకొని పూర్తిగా దిద్దుదామని అనుకుంటారు. చివరిలో మరో జవాబు సరైందని భావించి వేరే గడిని నింపుతారు. మొదట పెట్టిన చుక్కలు అలానే ఉంటాయి. దీంతో మూల్యాంకన సమయంలో స్కానర్లు వాటిని ఐదో నంబరులో వేస్తాయి. అంటే జవాబు గుర్తించ లేదని సున్నా మార్కులు వేస్తారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సమాధానం రాసేటప్పుడే ఏ ప్రశ్నకు అనేది గమనించాలి. పెన్నుతో బబ్లింగ్ చేయడం వలన వాటిని మళ్లీ సరిదిద్ద లేం.
వరుస క్రమంలో బబ్లింగ్ చేస్తే బాగుంటుంది. ప్రశ్నలను మద్య మద్యలో వదిలేయటం వల్ల చివరిలో సమయం లేనట్లయితే ఖాళీగా వదిలేయాల్సి వస్తుంది.
సమయం..సద్వినియోగం...
కీలకమైన ఈ రెండు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్లు చూసుకోవాలి. అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించి ఫార్ములాలను పునశ్చరణ చేసుకోవాలి. జనరల్ స్టడీస్‌కు సంబంధించి ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్లు ఒకసారి పరిశీలించటం మంచిది.
కరెంట్ ఎఫైర్సు గత ఎనిమిది నెలలకు సంబంధించిన వాటిని చదవాలి. రోజుకు కనీసం ఆరు గంటలు విశ్రాంతి తప్పనిసరి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.
గణితంలో ప్రావీణ్యం ఉన్నవారు మొదట అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ పూర్తి చేసి ఆతర్వాత జనరల్ స్టడీస్ పూర్తి చేస్తే సమయం సరిపోతుంది.
సైన్సు ఆర్ట్సు విద్యార్థులు మొదటి జనరల్ సైన్సు పూర్తి చేసి ఆ తర్వాత గణితానికి సమాధానాలు రాయడం మంచిది. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాకపోతే అక్కడే సమయం వృథా చేయకుండా మరో ప్రశ్నకు సమాధానం రాయడం మంచిది.
Advertisement
Advertisement