వీఆర్‌ఓ వీజీ.. వీఆర్‌ఏ గజిబిజి
Published Mon, Feb 3 2014 2:40 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
సాక్షి, కాకినాడ :జిల్లావ్యాప్తంగా ఆదివారం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ రెండు పరీక్షలకు మొత్తం 73,653 మంది మంది హాజరు కాగా 10,156 మంది గైర్హాజరయ్యారు. వీఆర్‌ఓ పరీక్ష సులభంగా ఉండగా, వీఆర్‌ఏ పరీక్ష గందరగోళ పరిచిందని అభ్యర్థులు చెపుతున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసిన వీఆర్‌ఓ పరీక్ష జిల్లాలో 210 సెంటర్లలో జరిగింది. 74,369 మంది దరఖాస్తుదారులకు గాను 65,215 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగిసిన వీఆర్‌ఏ పరీక్ష కాకినాడలో ఏర్పాటు చేసిన పదహారు కేంద్రాల్లో జరిగింది. 9,440 మంది దరఖాస్తుదారులకు గాను 8,438 మంది హాజరయ్యారు. కలెక్టర్ నీతూప్రసాద్ కాకినాడలోని ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్, కాకినాడ జేఎన్‌టీయూ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
పరీక్షల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా నమోదుకాక పోవడం విశేషం. అన్ని పరీక్షా కేంద్రాలవద్దా 144వ సెక్షన్ విధించడంతో పాటు సాధారణ పోలీస్, ఏపీఎస్పీ బలగాలు పహరా కాశాయి. వివిధస్థాయిల్లో దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని నియోగించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో ఈసారి ప్రత్యేకించి అభ్యర్థుల వేలి ముద్రలు సేకరించడం, వారిని వీడియోగ్రఫీ తీయించడం చేశామన్నారు. తప్పులు జరగకుండానే ఈ విధానం అవలంబించామన్నారు. డీఆర్‌ఓ బి.యాదగిరి నగరంలో ఉండి, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి రాత్రికి జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ఆన్సర్‌షీట్లను హైదరాబాద్ పంపే ఏర్పాట్లు చే శారు.ఉదయం జరిగిన వీఆర్‌ఓ పరీక్ష చాలా సులువుగా ఉందని దాదాపుగా అభ్యర్థులందరూ సంతోషం వ్యక్తం చేశారు.
మల్లేపల్లికి చెందిన కామేశ్వరి భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ రీత్యా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంటూ పరీక్ష కోసం ప్రత్యేకంగా వచ్చానన్నారు. వీఆర్‌ఏ పరీక్ష రాసిన రాజమండ్రికి చెందిన వెంకటేష్ ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు ఇచ్చారని వాపోయారు. చాలామంది వీఆర్‌ఏ పరీక్ష కష్టంగా ఉందన్నారు. పదో తరగతి అర్హతతో రాసిన ఈ పరీక్షలో 79వ ప్రశ్నగా 2015లో రిపబ్లిక్‌డే ఏ వారం అవుతుందని ఇవ్వడాన్ని పలువురు తప్పుపట్టారు.అలాగే పూర్వం ఇంటర్మీడియట్, టెన్త్ చదివిన అభ్యర్థులు బార్ కోడింగ్ విధానంపై అవగాహన లేక అవస్థలు పడ్డామన్నారు. కాగా పరీక్షలకు కొద్దిరోజుల ముందు ‘సాక్షి’ దినపత్రిక తక్కువ ధరకు విడుదల చేసిన బుక్‌లెట్లు ఎంతగానో ఉపకరించాయని పలువురు చెప్పారు.
Advertisement