పరీక్ష ప్రశాంతం
Published Mon, Feb 3 2014 2:38 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
సాక్షి, గుంటూరు:జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అధికార యంత్రాంగం చేపట్టిన పకడ్బందీ చర్యలవల్ల ఎటువంటి అవరోధం ఎదురుకాలేదు. వేలాదిమంది అభ్యర్థులు ఒకేసారి పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు యత్నించడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పదే పదే ప్రకటించడంతో ఇతర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆందోళన చెందారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో ఉదయం 9.30 గంటలకల్లా పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అయినా వందలాది అభ్యర్థులు వెనుదిరగక తప్పలేదు.
ఉపయుక్తమైన ముందస్తు ఏర్పాట్లు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్ళలో హెల్ప్ డెస్క్‌లు
ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గందరగోళ పడకుండా పరీక్ష కేంద్రాలు, ఆయా కేం ద్రాలకు కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఎం తో ఉపకరించింది. ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులన్నీ అభ్యర్ధులతో కిటకిటలాడాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి నాగబాబు కో ఆర్డినేటర్‌గా వ్యవహరించగా, అదనపు కోఆర్డినేటర్లుగా 15 మంది జిల్లా స్థాయి అధికారుల్ని నియమించారు. 50 మంది పరిశీలకులు, 58 మంది రూట్ ఆఫీసర్లు, లైజన్ అధికారులు, 200 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, 3,200 మంది ఇన్విజిలేటర్లు, 240 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల విధుల్లో పాలు పంచుకున్నారు.
వీఆర్వో పరీక్షకు 89 శాతం.. వీఆర్‌ఏకు 86.8 శాతం హాజరు
జిల్లాలో వీఆర్వో పోస్టులు 83 ఖాళీలకు గాను 76,578 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 49 రూట్లలో మొత్తం 17 మండలాల్లో 193 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో వీఆర్వో పరీక్షకు 68,072(89శాతం) మంది హాజరయ్యారు. వీఆర్‌ఏ పరీక్షకు 12,305 మంది దరఖాస్తు చేసుకోగా, 10,699 మంది(86శాతం) హాజరయ్యారు. మొత్తం ఐదు మండలాల పరిధిలో తొమ్మిది రూట్లలో 26 సెంటర్లలో వీఆర్‌ఏ పరీక్ష జరిగింది. జిల్లాలో వీఆర్‌ఏ పోస్టులు 425 ఖాళీలున్నాయి. పరీక్ష కేంద్రాల్లో మొత్తం వీడియో చిత్రీకరణ చేశారు. ఆదివారం సాయంత్రానికి పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలు పటిష్ట బందోబస్తు నడుమ కలెక్టరేట్‌కు చేరాయి. ఆదివారం రాత్రికి వాటిని ఏపీపీఎస్సీకి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement