
సాక్షి, నెట్‌వర్క్: ‘కారు కడుగుడు, బట్టలు ఉతుకుడు’శీర్షికన వీఆర్‌ఏల బానిస బతుకులపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం ఉన్నతస్థాయి యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక వీఆర్‌ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్ లేకపోవటంతో ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు ఆడ, మగ తేడా లేకుండా వీఆర్‌ఏలకు ఆర్డర్లీ పనులు చెబుతున్న తీరును ఫొటోలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో పలు జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీఆర్‌ఏలు ఎవరినీ రెవెన్యూయేతర పనుల్లో ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
సుదీర్ఘ కాలంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రా ల్లో అనధికార విధుల్లో కొనసాగుతున్న వీఆర్‌ఏలు శుక్రవారం నుండి తమ సొంత గ్రామాల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల అధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వీఆర్‌ఏలకు అందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వీఆర్‌ఏ, వీఆర్వోలు సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం హాజరుకావాలని ఆదేశిస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. మాజీ వీఆర్వో, వీఆర్‌ఏలు కార్యాలయాల్లో సమయపాలన పాటించాలని, మాన్యువల్ రిజిస్టర్‌ను నిర్వహిం చాలని సూచించారు.
మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఇసుక వాహనం, ఇసుక రీచుల వద్ద విధులు నిర్వర్తించేలా సమన్వయం చేసుకోవా లని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. తాజా ఆదేశాలతో జిల్లాలో ఇలా ఆర్డర్లీ పనులు చేస్తున్న వీఆర్‌ఏల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘సాక్షి’కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
సమస్యలు చెప్పుకుంటాం.. సమయం ఇవ్వండి
తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గానూ తమ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏ అసోసియేషన్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌లు ఈ మేరకు తాము పంపిన విజ్ఞాపన పత్రాన్ని పత్రికలకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment