ప్రతిభ ఒక్కటే కొలమానం | The only measure of performance | Sakshi
Sakshi News home page

ప్రతిభ ఒక్కటే కొలమానం

Published Sun, Jan 26 2014 10:33 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ప్రతిభ ఒక్కటే కొలమానం - Sakshi

ప్రతిభ ఒక్కటే కొలమానం

వీఆర్‌వో, వీఆర్‌ఏ.. పచ్చని పల్లెలో ప్రభుత్వ కొలువు. సొంతూళ్లో గౌరవం, గుర్తింపు పొందే అవకాశం. అందుకే వేలల్లో ఉన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి.

వీఆర్‌వో, వీఆర్‌ఏ.. పచ్చని పల్లెలో ప్రభుత్వ కొలువు. సొంతూళ్లో గౌరవం, గుర్తింపు పొందే అవకాశం. అందుకే వేలల్లో ఉన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1657 వీఆర్‌వో, 4305 వీఆర్‌ఏ పోస్టులకు ఫిబ్రవరి 2న  పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా  లక్షల మంది హాజరుకానున్న వీఆర్‌వో/వీఆర్‌ఏ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు.. హాల్‌టిక్కెట్‌ల పంపిణీ.. నియామక ప్రక్రియ తదితర అంశాలపై  సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావుతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా?

గ్రామీణ ప్రాంతాల్లోనూ మీ-సేవా కేంద్రాలున్నాయి. టెక్నాలజీ వినియోగం వల్ల  జాప్యం జరగదు. దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టిక్కెట్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తవు. 2012లో, ఇప్పుడూ ఆన్‌లైన్ విధానం వల్ల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. చాలా విద్యా సంస్థలు కూడా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహి స్తున్నాయి. ఇప్పుడు ఇది చాలా సులువైన పద్ధతి  అని చెప్పొచ్చు.
 
వీఆర్‌వో/వీఆర్‌ఏ పరీక్షలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?హాల్‌టికెట్ల పంపిణీ ఎలా ఉంటుంది?
 
2012లో నిర్వహించిన వీఆర్‌వో/వీఆర్‌ఏ పరీక్షకు సుమారు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది వీఆర్‌వో, వీఆర్‌ఏలకు కలిపి మొత్తం 14,14,006 దరఖాస్తులందాయి. 1,657 వీఆర్‌వో ఉద్యోగాలకు 13,13,302 మంది, 4,305  వీఆర్‌ఏ ఉద్యోగాలకు 62,786 మంది దరఖాస్తు చేసుకు న్నారు. రెండు పోస్టులకు 37,918 మంది పోటీ పడుతున్నారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 2న పరీక్ష సమయానికి గంట ముందు వరకూ.. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యాక నకలు జవాబు పత్రం తీసుకెళ్లొచ్చు.
 
ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణను ఎవరికి అప్పగించారు?

పరీక్ష నిర్వహణ నుంచి ఫలితాల వరకూ ఏపీపీఎస్సీదే బాధ్యత. దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టిక్కెట్ల పంపిణీని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేపడుతోంది.
 
వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు అప్పుడే పైరవీలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది? ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మొద్దు. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే వీఆర్‌వో/వీఆర్‌ఏ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పైరవీకారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే.. వెంటనే హెల్ప్‌లైన్‌కు తెలియజేయొచ్చు. జిల్లా స్థాయిలో ఆర్డీవో, తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేయొచ్చు. అక్రమార్కులపై కేసు నమోదు చేస్తాం.
 
పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల గురించి చెప్పండి?
 
ఫిబ్రవరి 2వ తేదీన పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష నిర్వహణకు 4,012 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణపై అధికారులకు  ఈ నెల 29, 30, 31న శిక్షణ ఉంటుంది. ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్‌వో.. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడపాల్సిందిగా సంబంధిత అధికారు లను కోరాం. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తోడ్పాటు అందిస్తోంది.
 
నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?
 
పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు ఉండవు. ముందుగా పరీక్ష పూర్తి కాగానే ఫిబ్రవరి 4న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తాం. వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 10న తుది ‘కీ’ విడుదల చేస్తాం. ఫిబ్రవరి 26 నాటికి మెరిట్  జాబితాను రూపొందించి.. నెలాఖరుకల్లా ఉద్యోగాలు ఇస్తాం. వీఆర్‌వో ఎంపికకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. కమిటీలో జడ్పీ సీఈవో, డీఈవోలతోపాటు  జాయింట్ కలెక్టర్‌లు ఉంటారు.
 
అభ్యర్థులకు మీ సలహా?

ప్రతిభ ఒక్కటే కొలమానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీనిపై ఎలాంటి అపోహలకు గురికావద్దు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై పట్టు సాధించి.. ఉత్తమ స్కోరు సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించేందుకు.. ఫిర్యాదులు స్వీకరించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన 040-23201530 హెల్ప్‌లైన్ నెంబరును వినియోగించుకోవచ్చు. ccla.cgg.gov.inలో జిల్లాల వారీగా హెల్ప్‌డెస్కులకు ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement